2, డిసెంబర్ 2016, శుక్రవారం

అవ్యభిచార భక్తి

మనకి మనం గొప్ప భక్తులమని భ్రమపడుతూ ఉంటాం. పూజలూ, వ్రతాలూ, దీక్షలూ ఎంతో శ్రద్ధగా చేస్తాం. కాని అవి పూర్తవగానే "హమ్మయ్య ఓ పనైపోయింది" అనుకొని మళ్ళీ విషయాల వెంట పరుగులు పెడతాం. దీనినే వ్యభిచార భక్తి అంటారు. ఒక వ్యభిచారణియైన స్త్రీ తన భర్తకు ఎన్ని సేవలు చేసినా ఆమె మనసు ఎప్పుడూ "భర్త ఎప్పుడు బయటకు పోతాడా, ఎప్పుడెప్పుడు ప్రియుడ్ని కలుసుకుందామా" అని ఆరాటపడుతూ ఉంటుంది. మన భక్తి కూడా అలాంటిదే.

మరి మనం పనులన్నీ మానుకొని ఎప్పుడూ పూజలూ, భజనలూ చేస్తూ కూర్చోవాలా? అనే ప్రశ్న ఇక్కడ సహజంగా వస్తుంది. అవసరం లేదు. ఒక పతివ్రతయైన స్త్రీ తన భర్త ఊరిలో లేకపోయినా ఇంట్లో పనులన్నీ మామూలుగానే చేసుకుంటుంది. కానీ ఏ పని చేస్తున్నా తన భర్త ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, సరిగ్గా తిన్నాడో లేదో అని ఆలోచిస్తూనే ఉంటుంది. అలా మనం ఏంచేస్తున్నా నిరంతరం భగవంతుని గూర్చి ఆలోచిస్తూ ఉండటమే అవ్యభిచార భక్తి.

తల్లికి ఎప్పుడూ తన పిల్లల సంక్షేమాన్ని గురించే చింత కదా. అందుకే హిరణ్యక్షుని వంటి ఘోర రాక్షసుని బారినుండి తనను రక్షించడానికి వరాహమూర్తిగా వచ్చిన జగన్నాధుని ఆ తల్లి భూమాత అడిగిన ప్రశ్న: "ప్రారబ్ధాన్ని అనుభవించడానికై జన్మించిన మానవులకు అవ్యభిచార భక్తి ఏ విధంగా అలవడుతుంది స్వామీ?" అని. అందుకు స్వామి ఒక చక్కని పరిష్కారాన్ని సూచించారు. "ఎవరైతే తమ జీవితంలో భగవద్గీతను అభ్యాసం చేస్తారో వారు అవ్యభిచార భక్తిని కలిగి, ముక్తులై, కర్మలు అంటక సుఖంగా జీవిస్తారు" అని. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం కేవలం గీతాధ్యయనం సరిపోదు. గీతాభ్యాసం కావాలి. అంటే కేవలం థియరీని అర్ధం చేసుకొని, బట్టీకొడితే సరిపోదు. దానిని ప్రాక్టికల్‌గా నిత్యజీవితంలో ఆచరించాలి.

11, అక్టోబర్ 2016, మంగళవారం

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా

జగన్మాతను ఎక్కడ వెదకాలి? ఎలా తెలుసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ జంట నామాలు. మనం ఆ తల్లిని పూజించటం కోసం ఎన్నెన్నో క్షేత్రాలు, దేవాలయాలు తిరుగుతాం. ఎక్కడెక్కడికో వెళతాం. కానీ బయట ఎంతగా వెదకినా ఆ తల్లిని అందుకోలేము. అందుకు మనం చెయ్యవలసినది మన లోపల వెదుక్కోవడం. ఆ తల్లి నిరంతరం మనలోనే ఉండి మనలను నడిపిస్తోంది. ఈ కనపడే శరీరానికి, లోపలి మనస్సుకి, వాటికి ఆధారమైన ప్రాణానికి, వీటన్నింటినీ నడిపించే విజ్ఞానానికీ, మన సహజ స్థితియైన ఆనందానికీ కూడా లోపల ఉండి నడిపించేది ఆ తల్లే. అందుకే ఆవిడ "పంచకోశాంతర స్థితా".

ముందుగా మనం మనలోనే "చేతనారూపంలో" ఉండి మనలను నడిపిస్తున్న ఆ "చిచ్ఛక్తిని" గుర్తిస్తే అప్పుడు మనం బయట ఉన్న "జడాత్మికమైన" ప్రకృతి అంతటా "జడశక్తి" రూపంలో భాసిస్తున్న ఆ తల్లిని గుర్తించగలుగుతాం. నిజానికి సత్యమైన పరమాత్మ, అసత్యమైన జగత్తు రెండూ ఆ తల్లి స్వరూపాలే. అందుకే ఆవిడ "సదసద్రూపధారిణి". అలాగే నశించిపోయే జగత్తు, నాశనం లేని చైతన్యం ఆ తల్లి రూపాలే - "క్షరాక్షరాత్మికా". వ్యక్తంగా మనకు కనపడే ఈ జగత్తు, అవ్యక్తంగా అంతటా నిండియుండి కనపడకుండా దీనిని నడిపిస్తున్న పరమాత్మ శక్తి, రెండూ అమ్మ రూపాలే - "వ్యక్తావ్యక్తాా".

ఆ అమ్మ నిజ తత్వాన్ని ఈ విధంగా భావిస్తూ ఎవరైతే తమ ధ్యానాన్ని, సాధనను పరిపూర్ణం చేసుకుంటారో వారు ఆ అమ్మ స్వరూపాన్నే పొందుతారు. ఎందుకంటే ఆ తల్లి "ధ్యానధ్యాతృధ్యేయరూపా" - అంటే ధ్యాన ప్రక్రియ, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయబడే వస్తువు మూడూ ఆ అమ్మ రూపాలే.

10, అక్టోబర్ 2016, సోమవారం

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా

ముందుగా తాపత్రయం అంటే ఏమిటో చూద్దాం. ప్రతి మనిషికీ మూడు రకాల తాపాలు ఉంటాయని వేదాంతంలో చెప్పబడింది. అందులో మొదటిది ఆదిభౌతిక తాపం - అంటే ఇతర మనుష్యుల వలనగాని, జంతువుల వలనగాని, లేదా మరే ఇతర భౌతిక పదార్ధాల వలనగాని కలిగే బాధలు. రెండవది ఆదిదైవిక తాపం - అంటే దైవికంగా సంభవించే వరదలు, భూకంపాలు మొదలైన వాటి వలన కలిగే బాధలు. ఇక మూడవది ఆధ్యాత్మిక తాపం - అంటే మన మనస్సు మనను పెట్టే బాధలు - భయాలు, సంకోచాలు, మానసిక రోగాలు, దుస్స్వప్నాలు మొదలైనవి.

ఇటువంటి మూడు తాపాలతోను బాధపడే మనుష్యుల హృదయాలకు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని ఇచ్చి స్వస్థత కలిగించే చంద్రునివంటిది జగన్మాత. ఆ జగన్మాతను హృదయంలో నింపుకున్న భక్తులకు ఇతర జీవులుగాని మనవులుగానీ ఎటువంటి కష్టాన్ని కలిగించలేరని మనకు అనేక భక్తుల చరిత్రలలో నిరూపితమైనదే కదా! ఇక నిత్యం ఆత్మానందంలో ఓలలాడే అటువంటి భక్తులు ప్రకృతి వైపరీత్యాలను అసలు గుర్తించనే గుర్తించరు. మరి మనస్సంతా జగన్మాత నిండిపోయాక ఇంక మానసిక రోగాలకుగానీ, భయ సంకోచాలకుగానీ చోటెక్కడ ఉంటుంది?

హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః

నిత్యం మన ఆధ్యాత్మిక సాధనలో మనలను ముందుకు వెళ్ళకుండా ప్రధానంగా అడ్డుపడేది కామం. ఈ అంతఃశ్శత్రువు ఉన్నంత కాలం మనం ఆ పరమేశ్వరుని చేరుకోలేం. మరి ఆ కామాన్ని మనకు అడ్డు పడకుండా పూర్తిగా దగ్ధం చేయగలది ఆ పరమేశ్వరుని మూడవ నేత్రమొక్కటే. అంటే మనలోనే ఉన్న ఆ పరమేశ్వరుడు మన జ్ఞాన నేత్రాన్ని తెరచినప్పుడు మన కామం పూర్తిగా దగ్ధమైపోతుంది. అప్పుడు మనం సాధనలో పురోగమించి ఆ పరమేశ్వరుని పొందగలం.

అయితే అలా పరమేశ్వరునితో ఏకత్వాన్ని పొందిన మహాత్ములందరూ ఏ కోరికా లేకుండా తమలో తాము రమిస్తూ ఉండిపోతే మరి ఈ లోకం ఉద్ధరించబడేదెలా? వారిలో మళ్ళీ గురువులుగా మారి తాము పొందిన పరమగతిని సమస్త మానవాళిచేతా పొందించాలనే సంకల్పం కలగాలి కదా. ఇక్కడే ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత తన అపార కరుణను కురిపిస్తూ ఆ కామాన్ని మళ్ళీ జీవింపచేస్తుంది. అయితే అది ఆత్మజ్ఞానాన్ని పొందిన మహాత్ముల హృదయంలో కావడంతో ఆ కామం ప్రాపంచిక కామంగా కాక ప్రపంచాన్ని ఉద్ధరించటానికి ఉపయోగపడుతుంది.

8, అక్టోబర్ 2016, శనివారం

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః

మనం మన ఈ అల్ప జీవితంలో సాధించే చిన్న చిన్న విజయాలకే గర్వంతో పొంగిపోతూ ఉంటాం. కానీ ఈ పద్నాలుగు లోకాలనూ పరిపాలిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ అధర్మం జరిగినా దానిని సరిదిద్ది ధర్మాన్ని ఉద్ధరిస్తానని తానే స్వయంగా చెప్పుకున్న శ్రీమన్నారాయణుడు మనకు తెలిసి ప్రముఖంగా పది అవతారాలు ధరించి ధర్మ సంస్థాపన చేసాడు కదా. మరి ఆ పది అవతారాలూ జగన్మాతయొక్క చేతి వ్రేళ్ళకు ఉన్న పది గోర్లనుండి ఉత్పన్నమైనవేనని ఈ నామం మనకు చెబుతోంది.

దీనినిబట్టి అంతటి నారాయణుడు కూడా ఆ జగన్మాత ఎలా ఆడిస్తే అలా ఆడే తోలుబొమ్మే అని తెలుస్తోంది కదా! మరి అల్ప జీవులమైన మనమెంత? మన బ్రతుకెంత? మనం సాధించే విజయాాలెంత? మనందరం ఆ అమ్మ ఆడించే తోలుబొమ్మలమేనని స్ఫష్టంగా తెలుసుకొని నిత్యం ఆ స్పృహతో నడుచుకొన్ననాడు మనం ఎటువంటి తప్పులూ చేయం. అలాకాక అంతా మన ప్రజ్ఞే అని విర్రవీగితే ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలు వేయడం, జారి పడటం ఖాయమే.

7, అక్టోబర్ 2016, శుక్రవారం

శృతి సీమంత సిందూరీకృత పాదాబ్జ ధూళికా

మనం చదువుకొన్న ఈ కొద్దిపాటి చదువులకే మనకు ఎంతో తెలుసని మిడిసిపడుతూ ఉంటాం. కానీ ఈ సృష్టిలోని చదువులన్నింటికీ మకుటాయమానమైన వేదాలకే అధినేత్రి అయిన ఆ వేదమాత ప్రతిరోజూ జగన్మాత పాదాలకు నమస్కరించి ఎర్రటి ఆ పాదధూళిని తన పాపిటలో సిందూరంలా అలంకరించుకుంటుందిట. మరి మన చదువులు ఆ జగన్మాత ముందు ఏ పాటివి? ఏ చదువులు చదవకపోయినా ఆ జగన్మాతను తన హృదయంలో నింపుకున్న వారికి సర్వ విద్యలూ కరతలామలకములే.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మా గురుదేవులే. వారు ప్రాపంచికమైన ఏ చదువులూ చదువుకోలేదు. ఎవ్వరి దగ్గరా ఒక్క అక్షరం ముక్క కూడా నేర్చుకోలేదు. కానీ ఎంతటి పండితులనైనా ఒప్పించి మెప్పించగల సామర్థ్యం వారి సొంతం. ఒకసారి వారి వద్దకు ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చారు. శ్రీగురుదేవులు వారిని "అయ్యా తమరు ఏం చేస్తూ ఉంటారు?" అని ప్రశ్నించగా వారు, 'చదువుకోని ఈయనకు ఏం తెలుస్తుందిలే' అనే చులకన భావంతో, "న్యూక్లియర్ ఫిజిక్స్, అంటే పరమాణు భౌతిక శాస్త్రమని ఒకటి ఉందిలెండి. అందులో రీసెర్చ్, అంటే పరిశోధన చేస్తున్నాను" అన్నారు. అప్పుడు మా గురుదేవులు, "చాలా సంతోషం బాబూ!కానీ మీకు అందులో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం లభించక తమరి పరిశోధన ఆగిపోయినట్లుంది? జెర్మనీకి చెందిన ఫలానా శాస్త్రవేత్త అదే విషయంపై ఒక పెద్ద గ్రంధమే వ్రాసారు. ఆ గ్రంధం ఢిల్లీలోని గ్రంధాలయంలో లభిస్తుంది. అది చదివారంటే తమ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది, పరిశోధనా ముందుకు సాగుతుంది." అనగానే ఆ శాస్త్రజ్ఞుడు తన అహంకారాన్ని వదలి శ్రీగురుదేవులకు పాదాక్రాంతుడైనాడు.

6, అక్టోబర్ 2016, గురువారం

జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయినీ

మనం ఒక చిన్న పిల్లవాడిని బొమ్మల కొట్టులోకి తీసుకుని వెళ్ళామనుకోండి, వాడు ఒక్కసారిగా అన్ని బొమ్మలను చూసేసరికి ఆనందం పట్టలేక వాటితో ఆడుకోవటం మొదలుపెడతాడు. అలా కొన్ని బొమ్మలతో ఆడి, వాటిని వదలి మరికొన్ని బొమ్మల వెంటపడతాడు. ఇలా పూటంతా రకరకాల బొమ్మలతో మళ్ళీ మళ్ళీ ఆడి అలసిపోతాడు. అప్పుడు వాడికి అమ్మ ఒడి లభించిందనుకోండి ఇంక ప్రపంచాన్నంతా మరచిపోయి ఆదమరచి నిద్రపోతాడు. దానిని మించిన సుఖం వాడికి ఇంకేదైనా ఉంటుందా? ఎంత అల్లరి పిల్లవాడైనా, చిచ్చరపిడుగైనా తల్లి ఒడిలో చేరితే ప్రశాంతంగా నిద్రపోవలసిందే కదా?

మరి అలాగే మన తల్లియైన జగన్మాత మనలను ఈ బొమ్మల లోకంలో విడిచిపెట్టింది. ఈ బొమ్మల మధ్యలో మళ్ళీ మళ్ళీ పుడుతూ, చస్తూ, ముసలివాళ్ళం అవుతూ ఇలా ఎంతకాలమని ఆడుతాం? ఎప్పటికైనా మనకి కూడా ఈ పరుగులనుండి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది కదా? మరి అలాంటప్పుడు మనకి ఉన్న ఏకైక మార్గం ఆ తల్లి ఒడి చేరుకోవటమే. అదే మోక్షమంటే. అందుకే ఆవిడ ముకుందా, ముక్తి నిలయ కూడా.

5, అక్టోబర్ 2016, బుధవారం

భక్త చిత్త కేకి ఘనాఘనా

భక్తుల చిత్తములనే నెమళ్ళకు పరవశాన్ని కలిగించి పురి విప్పి నర్తించేలా చేసే కారుమబ్బు వంటిదని జగన్మాతను కీర్తించే నామమిది. నల్లని కారు మేఘాన్ని చూడగానే మగ నెమలి పరవశించి ఆనందంగా పురి విప్పి నాట్యం చేస్తుంది. అలా అది ఆనంద పరవశయై ఉండగా దాని నేత్రాలనుండి వీర్యస్ఖలనం జరుగుతుంది. ఆడ నెమలి ఆ వీర్యాన్ని గ్రహించి సంతానానికి జన్మనిస్తుంది. ఇలా స్త్రీపురుష సంయోగం లేకుండానే సంతానాన్ని కనే ఏకైక జీవి నెమలి అని పెద్దలు చెబుతారు. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకు చిహ్నంగా నెమలి పింఛాన్ని తన శిరస్సుపై ధరించేవాడు.

అలాగే ఆ జగన్మాత అనే కారుమేఘం దర్శనం కాగానే భక్తుని చిత్తం పరవశించి ఆనంద తాండవం చేస్తుంది. అప్పుడు ఆ చిత్తం కార్చే ఆనందభాష్పాలను ఆ భక్తుని బుద్ధి గ్రహించి భక్తిగర్భాన్ని దాల్చి జ్ఞానపుత్రుని ప్రసవిస్తుంది. అట్టి జ్ఞానపుత్రుడే నిజంగా పున్నామనరకాన్నుంచి రక్షించి మోక్షానికి కారణమవుతాడు కానీ దేహ కర్మల వలన జనించే కర్మపుత్రులు కాదు. ఈ భక్తిగర్భాన్ని ధరించటానికి స్త్రీపురుష వ్యత్యాసం కానీ, జాతి నీతి భేదాలు కానీ లేవు. జగన్మాత బిడ్డలైన సకల జీవకోటికి అందుకు అర్హత ఉంది.

చిదగ్ని కుండ సంభూతా

చిత్ అంటే జ్ఞానం. జగన్మాత జ్ఞానాగ్ని కుండంలోనుండి ఆవిర్భవించింది అని ఈ నామం చెబుతోంది. అయితే ఈ అగ్నికుండం/యజ్ఞకుండం ఎప్పుడో ఎక్కడో చరిత్రలో లేదు. మన మనస్సనే యజ్ఞకుండంలో ధ్యానాగ్నిని రగిల్చి అందులో నిరంతర సాధన ద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ తన్మాత్రలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, పంచ వాయువులను, అంతఃకరణ చతుష్టయాన్ని, మూడు గుణాలను, మూడు అవస్థలను, మూడు మలాలను, మూడు వాసనలను, మూడు ఈషణలను, మూడు తాపాలను, మూడు దేహాలను, అహంకార మమకారాలను, సుఖదుఃఖాలను, రాగద్వేషాలను హవిస్సులుగా అర్పిస్తూ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ ధ్యానాగ్నియే జ్ఞానాగ్నిగా పరివర్తన చెందుతుంది.

అప్పుడు మనలోనే ఆ చిదగ్ని కుండంనుండి అష్టాదశ భుజాలతో, సర్వాభరణ భూషితయై కోటి సూర్యుల కాంతిని కూడా తలదన్నే కాంతితో జగన్మాత ఆవిర్భావం జరుగుతుంది. ఇది సాధించిన మహాత్ములు నిరంతర ఆత్మజ్యోతితో ప్రకాశిస్తూ నలుదిశల తమ ప్రసన్న రోచస్సులను వెదజల్లుతూ ఉంటారు. అట్టి మహాత్ముల దర్శనమాత్రం చేతనే మన సకల తాపాలు నశించి అంతులేని ప్రశాంతతతో మన హృదయం నిండిపోతుంది.

ఇక అలా జగన్మాతను తమలోనే సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ములు మనలో ఉన్న అజ్ఞానమనే మహిషాసురుని సమూలంగా నాశనం చేయగలరనటంలో సందేహమేముంది? అందుకే గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది. సర్వ దేవతామూర్తుల శక్తులన్నీ కలిసి జగన్మాతగా ఎలా అయితే రూపు దాల్చాయో అలాగే గురువు కూడా సర్వదేవతా స్వరూపుడు. గురువుకి జగన్మాతకి భేదం లేదు.

3, అక్టోబర్ 2016, సోమవారం

సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా

సాధారణంగా మనకు ఏదైనా ప్రభుత్వ శాఖలో పని కావాలంటే ఆ శాఖలోని క్రింది స్థాయి ఉద్యోగస్థులతో మొదలుపెట్టి కార్యదర్శిదాకానో మంత్రిదాకానో బ్రతిమాలుతూ తిరుగుతాం. అదే ప్రధానమంత్రితో మనకు గాఢమైన స్నేహం ఉందనుకోండి, ఆ మంత్రులే మనకు ఎదురువచ్చి మనకు కావలసిన పనులన్నీ చిటికెలో చేసిపెడతారు. 

ఈ రోజులలో ప్రతివారూ ముఖ్యంగా కోరుకునేవి రెండు - తమకు అంతులేని సంపద, తమ బిడ్డలకు అపార విద్య. మరి ఈ ఆర్థిక శాఖకు, విద్యాశాఖకు అధిపతులైనవారు ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి కదా? వారిద్దరూ ఏం చేస్తూ ఉంటారో ఈ నామం చెప్తోంది. వారిద్దరూ ఎల్లప్పుడూ జగన్మాతకు కుడి ఎడమలలో నిల్చొని సేవికలవలే ఆ తల్లికి వింజామరలు వీస్తూ ఉంటారు.

మరి ఆ జగన్మాతను హృదయంలో నింపుకొని ఆ తల్లియందు గాఢమైన భక్తి ప్రపత్తులను కలిగినవారికి అటు సంపదలో కానీ ఇటు విద్యలో కానీ లోటు ఏం ఉంటుంది? దీనికి మనకు అటు మహాకవి కాళిదాసు, ఇటు తెనాలి రామలింగకవుల జీవితాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇంత స్పష్టంగా మన కోరికలు తీరటానికి సుళువైన మార్గం కనిపిస్తూ ఉంటే, దానిని వదిలివేసి లోకంలో వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకొనేవారు ఎంతటి అవివేకవంతులు?

2, అక్టోబర్ 2016, ఆదివారం

ఆబ్రహ్మ కీట జననీ

ఈ సృష్టిలో ఒక చిన్న చీమ మొదలు బ్రహ్మదేవుని వరకు మనందరం ఒక తల్లి బిడ్డలమే. ఆ తల్లే జగన్మాత. సృష్టిలోని ప్రతి జీవజాతిలోనూ మాతృమూర్తులు తమ పిల్లలు సొంత కాళ్ళపై నిలబడే వరకు ఎప్పుడు ఏది కావాలో క్రమం తప్పకుండా అందజేస్తూ అనుక్షణం కంటికి రెప్పలా తమ సంతానాన్ని కాపాడుకుంటూ ఉంటాయి.

అయితే ఈ తల్లులకు ఎప్పుడైనా నిద్ర, ఏమరుపాటు కలుగుతాయేమో కానీ ఆ జగన్మాత మాత్రం ఎప్పటికీ ఏ ఒక్క ప్రాణినీ నిర్లక్ష్యం చేయదు. అయితే తల్లి చిన్నపిల్లల సంరక్షణలో తనకు చేదోడుగా ఉండటానికి పెద్దపిల్లలకు శిక్షణనిచ్చినట్లుగా ఆ జగన్మాత మానవులకు మిగిలిన జీవులకు లేని బుద్ధిని ప్రసాదించింది.

కానీ మనం మాత్రం ఆ బుద్ధిని సృష్టి పోషణలో ఆ తల్లికి సహకరించటానికి ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? మిగిలిన జీవరాశులను మన తోబుట్టువులలా సాకటం మాట అటుంచి, మనలో మనమే జాతి నీతి కుల గోత్రాలనీ నామ రూప గుణ దోషాలనీ అడ్డుగోడలు కట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నాం. మన అంతులేని ఆశకు ప్రకృతి సమతౌల్యాన్ని బలి చేస్తున్నాం.

మరి తన సంతానమంతా ఇలా పరస్పరం కలహించుకుంటూ, కాపాడవలసిన అగ్రజులే తమ అనుజులను కాటేస్తూ ఉంటే ఆ అమ్మలగన్నయమ్మ మనస్సు ఎంతగా క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుంటే మనలో తప్పకుండా మార్పు వస్తుంది.

26, సెప్టెంబర్ 2016, సోమవారం

కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ

మనం ప్రతిరోజూ ఎన్నో మంచిపనులు చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ అవి చేసే సమయం వచ్చేసరికి మాత్రం వేరే వ్యాపకాలలో పడి వాయిదా వేసేస్తూ ఉంటాం. పిల్లలు ఏడుస్తున్నారనో, టీవీలో మంచి సినిమా వస్తోందనో, రాత్రి సరిగ్గా నిద్రపోలేదనో ఇలా ఏదో ఒక వంక వెతుక్కుంటూ ఉంటాం.

వెనకటికి ఒకడు యిలాగే పర్వదినాన సముద్ర స్నానం చేద్దామని వెళ్ళాడుట. తీరా అక్కడిదాకా వెళ్ళేసరికి ఒక పెద్ద కెరటం ఎదురైంది. అమ్మో! ఇది పోయాక దిగుదాం అనుకున్నాడు. అది పోతే ఇంకో చిన్న కెరటం. ఇది చిన్నదే కదా, దీనిని కూడా పోనీ అనుకున్నాడు. అలా ఎంతసేపు కూర్చుంటే మటుకు సముద్రంలో కెరటాలు ఆగుతాయా? వీడు స్నానం చేయగలుగుతాడా?
మన సంసారంలో కూడా యిలా ఒకదాని తరువాత ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ మనం చేరుకోవలసిన అంతిమ గమ్యాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకొని మన ఆథ్యాత్మిక సాథనను పట్టుదలతో కొనసాగించాలి. అప్పుడే, ఈ జన్మలో కాకుంటే మరికొన్ని జన్మలకైనా మోక్షపథాన్ని అందుకోగలుగుతాం.

ఈ కెరటాల గురించి మాగురుదేవులు ఒక కిటుకు చెప్పేవారు. ఏదైనా పెద్ద కెరటం వచ్చినప్పుడు దానినుంచి తప్పించుకోవటానికి రెండు ఉపాయాలు - ఒకటి పూర్తిగా నీళ్ళలోకి వంగిపోవడం. యిలా చేస్తే కెరటం మన పైనుంచి వెళ్ళిపోతుంది. రెండోది కెరటంతోపాటుగా మనం కూడా అంత ఎత్తుకి లేవడం. అప్పుడది మన క్రిందనుంచి వెళ్ళిపోతుంది. ఈ రెండూ చేయకుండా అలాగే మొండిగా నుంచుంటే ఆ కెరటం మనను పడదోసి లోపలకు లాక్కుపోతుంది.
ఇందులో మొదటిది భక్తిమార్గం - భగవంతునికి సర్వసమర్పణ చేసి అంతా నీదే భారమని వంగి ఉండటం. ఇక రెండవది జ్ఞానమార్గం. ఈ కష్టసుఖాల అశాశ్వతత్వాన్ని గుర్తెరిగి వాటికి అతీతంగా మెలగగలగటం.

24, ఆగస్టు 2016, బుధవారం

పుట్టు భోగులము మేము

మా గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ తరచుగా చెప్పేవారు - లక్ష్మీదేవి మహా పతివ్రత. ఎప్పుడూ తన పతిదేవుడైన శ్రీమన్నారాయణుడిని అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మీరు ఆ నారాయణున్ని మనస్సులో నింపుకుంటే మీకు ఇహంలో కావలసినవన్నీ ఆ తల్లి చూసుకుంటుంది. ఇక పరం సంగతి నారాయణుడు చూసుకుంటాడు - అని.

ఇదే విషయాన్ని అన్నమయ్య మరింత వివరంగా పుట్టుభోగులము మేము అనే కీర్తనలో వివరించారు. మనం సాధారణంగా ఏ మహారాజునో ఆశ్రయిస్తే వారు పల్లకీలు, అందలాలు, నిత్యం మనని పొగుడుతూ తిరిగే భట్రాజులూ ఇవ్వవచ్చు. కానీ ఇవన్నీ మహాలక్ష్మీ విలాసాలే కదా? మరి ఆ తల్లి భర్తకు దాసులమైన మనకు నడమంత్రపు సిరిగల రాజులనుండి ఇవి ఆశించాల్సిన అవసరమేముంది?

పోనీ, ఆ రాజులు గ్రామాలనో, రత్నాలనో, ఏనుగులు, గుఱ్ఱాలనో ఇస్తారనుకుందాం. మరి ఇవన్నీ ప్రకృతి స్వరూపిణయైన భూమాత శరీరంలో భాగాలే కదా! ఆ తల్లికి నాధుడైన వాడిని ఆశ్రయించిన మనకి ఇవి వేరేవాళ్ళు ఇచ్చేదేమిటి?

అసలు ఈ సృష్టిలోని విశేష వస్తువులన్నీ బ్రహ్మదేవుడు తయారు చేసినవే కదా! మరి ఆ బ్రహ్మకే తండ్రియైన వేంకటేశ్వరుడు మనవాడై, మనకు ఏ సమయానికి ఏది కావాలో ప్రేమతో అందిస్తున్నప్పుడు ఇక మనం అన్యులనుండి పొందాల్సింది ఏముంటుంది? అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు.

14, ఆగస్టు 2016, ఆదివారం

పల్లమెఱుగని నీరు

ఈ రోజు నేను కారు నడుపుతూ ఉండగా ఒక వంతెన పైనుండి యిన్ని నీళ్ళు ముందు ఉండే అద్దం మీద పడ్డాయి. ఏటవాలుగా ఉండే అద్దం మీద మామూలుగా నీళ్ళు పడితే అవి భూమ్యాకర్షణకు లోబడి క్రిందికి జారిపోవాలి కదా? కానీ కారు వేగానికి ఉత్పన్నమైన యెదురు గాలికి ఒక్క చుక్క నీరు కూడా క్రిందికి జారకుండా, మొత్తం పైకి ప్రవహించింది. 

మన మనస్సు కూడా ఆ నీరులాంటిదే. ఎప్పుడూ ప్రాపంచిక ఆకర్షణలకు లోబడి నీచ భావాల దిశగా జారిపోతూ ఉంటుంది. కానీ అదే మనస్సుకు వేగంగా మరియు నిరంతరంగా జరిగే భగవన్నామ జపాన్ని తోడు చేసినపుడు, అది ఆ ఆకర్షణకు వ్యతిరేక దిశలో, పరమాత్మకు అభిముఖంగా, ఆథ్యాత్మిక ఉన్నతి దిశగా ప్రయాణం చేయగల శక్తిని సంతరించుకుంటుంది. 

ఇక్కడ వేగంగా జపం చేయడమంటే మనం పలికే నామం మనకే అర్థమవనంత హడావిడిగా చేయడమని కాదు. నామానికి నామానికి మధ్య సంకల్పాలు దూరే సందు యివ్వకుండా అని అర్థం. మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ వారు దీనికి రెండు ఉదాహరణలు చెప్పేవారు. 

ఫ్యాను వేగంగా తిరిగినప్పుడు దాని మూడు ఱెక్కలూ కలిసిపోయి ఒక్కటిగా ఎలా గోచరిస్తాయో, అలాగే భగవన్నామం వేగంగా జపించినప్పుడు మన మూడు గుణాలూ లయమైపోయి శుద్ధసత్వ గుణంగా భాసిస్తాయి. జనరేటర్ వేగంగా తిరిగినప్పుడు విద్యుచ్ఛక్తి ఎలా ఉత్పన్నమవుతుందో, అలాగే నామజపం వలన మనలో ఆథ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. 

22, మే 2016, ఆదివారం

అహల్య

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా ||
నిన్నటిదాకా శిలనైనా నీపదము సోకి నే గౌతమినైనా ||
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట, నా నావమీద కాలు పెడితె ఏమౌతాదో తంటా ||

రామావతారంలో ఎన్నో రాళ్ళు ఆయన పాదాలు తాకి ఉంటాయి. అలాగే అప్పటికీ, ఇప్పటికీ ఎందరో జనులు ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించి తమ జీవితాలను గడుపుకుంటున్నారు. కానీ వారందరూ అహల్యలా ఎందుకు తరించలేకపోతున్నారు? ఒక్కసారి విశ్లేషించుకుందాం.

మనం మన హృదయ క్షేత్రాలను అహంకార మమకారాలనే జోడెడ్లు కట్టిన మాయయనే నాగలితో దున్నుకొని అందులో కర్మ బీజాలను నాటుకొని మళ్ళీ మళ్ళీ పునర్జన్మలనే పంటలను పండించుకుంటున్నాం. నాగలిని హలం అంటాం కదా. మరి ఆ మాయ అనే హలం పేరుకైనా తగలని మనో క్షేత్రం కలది కనుకనే ఆ తల్లి అహల్యామాత అయింది. పూర్వజన్మ సంచిత కర్మబీజాలు ఏమీ లేకుండా నేరుగా బ్రహ్మలోకంలో ఆ విధాత ద్వారానే సృష్టించబడింది. ఎందరు నవమన్మధులైన దేవతలు తనను కోరుకున్నా, పందెంలో గెలిచిన గౌతమమహర్షినే వివాహమాడింది.

నాగలి తగలని బంజరు భూములలో వర్షం కురిపించి సేద్యానికి అనుకూలంగా చేయటం ఇంద్రునికి ఇష్టమైన వ్యాపకం. అందుకే ఆయనకు అహల్యాప్రియుడని పేరు. ఆ అలవాటుతోనే తమ మనోక్షేత్రాలలో జన్మపరంపరల సేద్యాన్ని విరమించాలని తపస్సు చేసే వారందరినీ ఎలాగైనా ఆ తపస్సునుండి విరమింపచేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల వర్షానికి లొంగిపోయిన మనస్సులు, మళ్ళీ మళ్ళీ జన్మలకు దారితీస్తూ ఉంటాయి. లొంగక దృఢంగా నిలచినవారు తరిస్తారు.

ఆ మాయను గుర్తించలేని అహల్య తన భర్తే అనుకొని లొంగిపోయింది. మన సనాతన భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తల బంధం కేవలం సంసారానికే పరిమితం కాదు. అది ఒక గురు-శిష్య సంబంధం. వారిరువురూ కలిసి ధర్మమార్గంలో మోక్షాన్ని పొందేందుకు ఏర్పరచినది. గురువుకి తమ శిష్యులమీద అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. వారు ఎప్పుడు ఏ అంతశ్శత్రువుకు లొంగిపోయి మయామోహంలో పడిపోతారో అని నిరంతరం కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటారు.

తాబేలు ప్రమాదం ఎదురుకాగానే తన అవయవాలన్నింటిని ఎలా ఐతే లోపలకు ముడుచుకొని రాయిలా మారిపోతుందో సాధకుడు విషయాలు ఎదురుకాగానే అలాగే తన ఇంద్రియాలను లోనికి ముడుచుకొని మనస్సును రాయిలా మార్చివేసుకోవాలి. లేదంటే మాయలో పడి నాశనం అయిపోతాడు. తన శిష్యురాలైన అహల్య అలా ప్రమాదంలో పడిందని గ్రహించగానే గౌతమమహర్షి పరుగు పరుగున వచ్చి ఆమెను రాయిలా మార్చివేసారు.

అలా తనను తాను విషయాసక్తినుండి గురుదేవుని అనుగ్రహం వలన రక్షించుకోగలిగింది కనుకనే ఆ తల్లి పరమాత్ముని పాదం తాకి ముక్తిని పొందగలిగింది. మనం కూడా మన మనోక్షేత్రాలలోని సంకల్పాలనే మొక్కలన్నింటినీ పీకివేసి గురుదేవుల అనుగ్రహంతో ఇంద్రియాలను నిగ్రహించుకొని మాయాహలం ఛేదించలేనంత గట్టిగా మార్చుకోగలిగితే ఆ అహల్యామాతలాగే తరించగలుగుతాం.

23, ఏప్రిల్ 2016, శనివారం

చావులేని చదువు

చదివి చదివి చావంగనేటికి
చావులేని చదువు చదువవలయు
చదివి చదివి జనులు చచ్చిరిగదా
విశ్వదాభిరామ వినుర వేమా।।

మనం చదువుకునే ఈ ప్రాపంచిక చదువులన్నీ పొట్టకూటి కోసమో, లేక పేరు ప్రతిష్టలు సంపాదించటానికో మాత్రమే ఉపయోగపడతాయి. చక్కగా చదువుకోవటం అవసరమే. కానీ చదువే జీవిత పరమార్థం కారాదు. ఏది ఎంతవరకో దాని పరిమితి తెలుసుకొని మసలుకోవాలి. 

చిన్నప్పుడు చదువుకోవటం, వయసులో ఉండగా సంపాదించడం సహజమే. కానీ మానవులమై పుట్టినందుకు మన జీవిత పరమార్థం ఆత్మజ్ఞానాన్ని సంపాదించి జనన మరణ విషవలయం నుండి విముక్తులమవటం. 

ప్రాపంచిక చదువులు ఆ విషయంలో ఏమీ ఉపయోగపడవు. దానికి ఆథ్యాత్మిక విద్య కావాలి. కానీ కొందరు ఎంత వయసు వచ్చినా, చివరికి కాటికి కాలుజాపుకున్నా ఇంకా బిరుదులకోసమో, పేరు చివర తోకలకోసమో అలా అంతు లేకుండా చదువుతూనే ఉంటారు.

ఎంత చదివినా ఏదో ఒకరోజు అందరూ పోవలసిందే. ఆ చావునుంచి ఈ చదువులేవీ కాపాడలేవు. అందుకే ఇక ఈ వేలంవెర్రి వదిలించుకొని చావులేకుండా చేసే ఆథ్యాత్మ విద్య నేర్వమని వేమన యోగి హెచ్చరిస్తున్నాడు. 

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే

14, ఏప్రిల్ 2016, గురువారం

మృగతృష్ణ

రాము ట్రైన్ దిగి ఇంటివైపుగా నడుస్తున్నాడు. "ఈ అమ్మ ఎప్పుడూ ఇంతే. చాదస్తం! రోజూ ఫోన్ చేసి పూజ చేసుకున్నావా? గుడికి వెళ్ళావా? అని విసిగిస్తూ ఉంటుంది. ఇంత బిజీ జీవితంలో వాటన్నిటికీ టైమెక్కడిది?" అసలే చీకటి పడుతుండటంతో వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఒక సందు మలుపు తిరగగానే ప్రత్యక్షమైంది ఆ మెరుపుతీగ. "అబ్బ వెనకనుంచే ఇంత అందంగా ఉందంటే ముందునుంచి ఇంకెంత అందంగా ఉంటుందో? ఈ మసక చీకటిలో సరిగ్గా కనిపించటం లేదు. స్ట్రీట్ లైట్లు ఉంటే బాగుండేది," అనుకుంటూ ఆమె ముఖాన్ని చూడాలనే ఆత్రుతతో దాదాపుగా పరుగు మొదలెట్టాడు. అది గమనించిన ఆమె ఇంకా వేగంగా నడవసాగింది.

"ఈ ఒంటరి జీవితం దుర్భరంగా ఉంది. త్వరగా ఈమెతో పరిచయం పెంచుకుని పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుంటుందో! మాకు తనలాగే అందమైన పిల్లలు పుడతారు. తన బట్టలూ, నగలూ చూస్తూ ఉంటే మా మామగారికి బాగానే ఆస్తి ఉన్నట్లుంది. మనం కూడా లైఫులో సెటిల్ అయిపోవచ్చు. ఒక పెద్ద ఇల్లు కట్టుకుని పిల్లాపాపలతో ఆనందంగా గడపవచ్చు," అని ఉహల్లో తేలిపోతూ ఆమెను అనుసరిస్తున్నాడు. 

ఇంతలో ఒక వీధి దీపం వెలుగులో ఆమె హటాత్తుగా ఎందుకో వెనక్కు తిరిగింది. అంతే ఆత్రుతగా ఆమె ముఖంవంక చూసిన రామూ ఆశాసౌధలన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. తనమీద తనకే విరక్తి కలిగింది. అక్కడికక్కడే కూలబడిపోయాడు. దూరంగా బడ్డీకొట్టులోని రేడియోలో పాట వినిపిస్తోంది.

మరులుగొలిపే సిరులూ మేలూ నిలువబోవే మనసా
స్థిరముగానీ ఇహభోగముల పరము మరువకే మనసా |
శేషశాయిని మోక్షదాయిని - సన్నుతి సేయవే మనసా
ఆపన్న శరణ్యుని హరినీ - సన్నుతి సేయవే మనసా ||

22, మార్చి 2016, మంగళవారం

వాత్సల్యం


ఆవు దూడని వత్సం అంటారు. సాధారణంగా ఆవు తాజాగా ఉండే పచ్చగడ్డినే తింటుంది కానీ కనీసం ఎవరైనా తొక్కిన గడ్డిని కూడా తినడానికి ఇష్టపడదు. కానీ అదే ఆవు తనకు బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ శరీరాన్నంతా నాకి ఆ మావిని రక్తాన్ని శుభ్రంగా తొలగించివేస్తుంది. అలాగే తన బిడ్డకు ఎటువంటి గాయమైనా నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది, స్వస్థత కలిగిస్తుంది. అందుకే నిష్కల్మషమైన, నిస్వార్థమైన ఆ తల్లి ప్రేమను వాత్సల్యం అని పిలుస్తారు.

అలాగే మహాత్ములు, గురువులు, బ్రహ్మజ్ఞానులు సదా ఆత్మానంద సుఖాన్ని అనుభావించడాన్నేఇష్టపడతారు కానీ తుచ్ఛమైన ప్రాపంచిక విషయాల మీద ఎంతమాత్రం ఆసక్తి చూపడానికి ఇష్టపడరు. కానీ తమ పుత్రసమానులైన ప్రజలు మాయలో పడి నానా రకాల కష్టాలు అనుభవించడాన్నిచూసినప్పుడు మాత్రం వారి హృదయం వాత్సల్యంతో ద్రవిస్తుంది. కేవలం నిర్హేతుకమైన, నిస్వార్థమైన ఆ వాత్సల్యం కారణంగానే వారు తమ స్వస్వరూప ఆనంద స్థితినుండి క్రిందకు దిగి వచ్చి జీవకోటిని ఉద్ధరించటానికి ఇంతగా పాటు పడుతున్నారు. ఏమిచ్చి మనం వారి ఋణం తీర్చుకోగలం?

6, మార్చి 2016, ఆదివారం

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

పేడ ఎంతో తడిగా చేతికి అంటుకుంటూ, పురుగులతో కులకులలాడుతూ, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. అదే పేడను ఎండబెట్టి అగ్నిలో దగ్ధం చేస్తే విభూతిగా మారుతుంది. అది సువాసనలను వెదజల్లుతూ అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి అంటుకునే స్వభావం పోయి ఉఫ్ అని ఊదగానే ఎగిరిపోతుంది. అసలే తెల్లగా ప్రకాశించే పరమేశ్వరుడు ఎంతో ప్రీతితో ఆ భస్మాన్ని తన దేహమంతా అలదుకొని మరింతగా ప్రకాశిస్తాడు. మలిన స్థితిలో మన మనస్సు కూడా అలాగే అన్నింటికీ అంటుకుంటూ, సంకల్పాలతో కోరికలతో నీచభావాలతో కులకులలాడుతూ, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. ఆ మనస్సును వైరాగ్యంతో ఎండబెట్టి, ధ్యానాగ్నిలో దగ్ధం చేస్తే అది పవిత్రమైన విభూతివలె శుద్ధమనస్సుగా మారుతుంది. అది తన అంటుకొనే స్వభావాన్ని కూడా కోల్పోతుంది. విభూతిని శరీరమంతా పూసుకోవటం అంటే ఎంతో ఇష్టపడే పరమేశ్వరుడు అటువంటి మనస్సు అంతా తానే నిండిపోతాడు. అంతకు మించిన పరమ శాంతి ఎక్కడ ఉంటుంది? అటువంటి పరమ శాంతిని ఆ భస్మోద్ధూళిత విగ్రహుడైన పరమేశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ శ్రీమహాశివరాత్రి శుభాకాంక్షలు.