10, ఫిబ్రవరి 2015, మంగళవారం

కల్పవృక్షం నీడలో ఉంటే?

చిన్నప్పుడు చదువుకున్న కథ. బహుశః శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి చెప్పినది అనుకుంటా. ముందుగా ఆ కథ చెప్పుకొని, అది నా అనుభవంలోకి ఎలా వచ్చిందో చూద్దాం.

ఒక బాటసారి అడవిలో ఎంతో దూరం నడచి అలసిపోయి ఒక చెట్టు నీడకు చేరాడు. అయితే ఆ చెట్టు కల్పవృక్షమని అతనికి తెలియదు. చాలా ఆకలితో ఉన్నాడేమో, తినడానికి ఏమైనా దొరికితే బాగుండును అనుకున్నాడు. వెంటనే అతని ముందు పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ప్రత్యక్షమయ్యింది. ఆవురావురుమంటూ విందారగించిన అతనికి ఆపుకోలేనంత నిద్ర ముంచుకొచ్చింది. ఇప్పుడు పడుకోవటానికి ఒక మంచం ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. వెంటనే హంసతూలికా తల్పం ప్రత్యక్షమయింది. దానిమీద విశ్రమించిన అతనికి తన భార్య ప్రక్కన ఉండి కాళ్ళు వత్తుతూ తాంబూలం తినిపిస్తుంటే భలేగా ఉంటుంది కదా అన్న కోరిక కలిగింది. వెంటనే తాంబూలం పళ్ళెంతో అతని భార్య ప్రత్యక్షమయ్యింది. ఇక మన వాడికి ఆలోచన మొదలయ్యింది. ఉన్నట్టుండి ఇంత కారడవిలో ఈ విందు భోజనం, ఈ తల్పం, తన భార్య ప్రత్యక్షమవటం ఏమిటి? కొంపదీసి ఇది ఏదో భూతం కాదు కదా? అనుకున్నాడు. వెంటనే ఆ భార్య భూతంలా మారిపోయింది. అమ్మో ఇది నన్ను మ్రింగేస్తుందేమో అని భయపడ్డాడు. వెంటనే ఆ భూతం అతనిని మ్రింగివేసింది.

నేను కూడా ఎన్నో జన్మలనుంచి ఈ సంసారమనే అరణ్యంలో పరిభ్రమిస్తూ చివరికి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ అనే కల్పవృక్షం నీడకు చేరాను. 2003లో మా ఆశ్రమంలో సహస్ర చండీ యాగం జరుగుతున్న రోజులలో, అమెరికానుండి వచ్చి, కర్తలుగా యాగంలో సేవ చేసుకుంటున్న భక్తులను చూసి, "ఆహా! నేను కూడా అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తే ఇలాగే సేవ చేసుకోవచ్చు కదా" అన్న ఆలోచన నాకు కలిగింది. (చాలా డబ్బులు కావాలని తపస్సు చేసినవాడు తీరా శివుడు ప్రత్యక్షమైతే మా మేనమామ చెవులనిండా వెంట్రుకలు మొలిపించమని వరం కోరుకున్నట్లే ఉంటాయి మన తెలివితేటలు. మనకు ఏది కావాలో అది డైరెక్టుగా కోరుకోకుండా ఇలా డొంకతిరుగుడు వ్యవహారాలన్నీ చేస్తాం.) ఆ మర్నాడే "అమెరికా వెళ్ళాలి, వెంటనే బయలుదేరి రమ్మని" మా ఆఫీసునుండి ఫోను వచ్చింది. హాయిగా ఇంత మహత్తర యాగాన్ని దర్శించి ఆనందిస్తూ ఉంటే మధ్యలో ఈ విఘ్నం ఏమిటని తిట్టుకున్నాను కానీ, అది నా కోరిక వల్లనే వచ్చినదని అప్పుడు గుర్తించలేకపోయాను. ఈ డొంకతిరుగుడు వ్యవహారంతో కొసరు కోరిక వెంటనే తీరినా, అసలు కోరిక తీరటానికి మరో పదేళ్ళు పట్టింది.

అలాగే 2005లో ఒకసారి ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణిస్తూ, "మన దేశపు విమానంలో ప్రయాణం బాగానే ఉంది కాని, మనం రెండు వందల ఏళ్ళపాటు బ్రిటీషువారికి దాశ్యం చేశాము కదా, ఒకసారి ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఎక్కి వాళ్లతో సేవలు చేయించుకుంటే ఎలా ఉంటుంది?" అన్న ఆలోచన కలిగింది. నెల తిరక్కుండా మా ఆఫీసువాళ్ళు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో నన్ను అమెరికా పంపించారు. అప్పుడు మొదటిసారి నాకు భయం వేసింది. "అమ్మో! ఇలా అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే చాలా ప్రమాదం సుమా! ఇకనుంచి కోరికలను అదుపులో పెట్టుకోవాలి" అనుకున్నాను.

అయితే పైన చెప్పుకున్న కథలో మనం చూస్తే, కల్పవృక్షం నీడలో ఉన్నవారు తమ కోరికలనే కాక ఆలోచనలను, భయాలను, సందేహాలను అన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి. అలాంటి కనువిప్పు కలిగించే సంఘటన 2013 సెప్టెంబర్లో జరిగింది. మన దేశంలోని హోటళ్ళలో "ప్లేటులో చేతులు కడుగరాదు" అన్న బోర్డులు ఎంత సహజమో, అమెరికాలోని హోటళ్ళలో తినే పదార్థాలు గొంతుకు అడ్డం పడితే ఏమి చెయ్యాలో సూచించే బోర్డులు అంత సహజంగా ఉంటాయి. ఒకరోజు ఆఫీసునుండి ఇంటికి వస్తూ బస్సులో ఉండగా ఈ బోర్డు గుర్తుకు వచ్చి, "ఈ అమెరికా వాళ్ళు అన్నింటికీ అతిగా భయపడతారు. మన దేశంలో ఆహారం గొంతుకు అడ్డంపడి చనిపోయినవాడ్నిఒక్కడ్ని కూడా చూడలేదు. అంత చిన్న విషయాన్ని వీళ్ళు ఇంత పెద్దదిగా చేస్తున్నారు" అని నవ్వుకున్నాను. రెండు మూడు రోజుల తరువాత, ఒక రాత్రి అలవాటు ప్రకారం విటమిన్ మాత్ర వేసుకొని, నీళ్ళు త్రాగేలోపు ఆ మాత్ర గొంతులో అడ్డం తిరిగింది. అసలు నీళ్ళు మ్రింగటానికి కూడా అవకాశం లేదు. క్షణాలలో శ్వాస అందటం ఆగిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ మాత్ర లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. శ్వాస ఆడకపోవటంతో మెల్లగా స్పృహ తప్పుతోంది. "ఈ జీవితానికి అంతం ఇలా నిర్ణయించారా ప్రభూ" అని ఒక్కసారి శ్రీగురుదేవులను తలచుకొని ఇక అన్ని ప్రయత్నాలను విరమించి ప్రశాంతంగా మరణించటానికి సిద్ధపడ్డాను. అప్పుడు, "అంత తేలిగ్గా చేతులెత్తేస్తే ఎలా? బ్రతకడానికి ప్రయత్నించు" అన్న అంతర్వాణి వినిపించడం, ఇందాక చెప్పుకున్న హోటల్లోని బోర్డుపై ఉండే సూచనలు గుర్తుకురావడం ఒకేసారి జరిగాయి. వెంటనే మళ్ళీ స్పృహ వచ్చింది. అప్పుడు బాగా ముందుకు వంగి పొట్టమీద చేతులతో నొక్కుకుంటే ఆ మాత్ర బయటపడింది.

ఇలా పైన చెప్పుకున్న కధలోని కల్పవృక్షం వలె శ్రీగురుదేవులు సాక్షీమాత్రంగా ఉంటూ మా అందరి జీవితాలను నడిపిస్తున్నారు. అయితే, తాను కల్పవృక్షం నీడలో ఉన్నానన్న విషయాన్ని గ్రహించని ఆ బాటసారి మొదట్లో ఆనందాన్ని పొందినా, తరువాత నాశనం అయిపోయాడు. కానీ ఆ విషయాన్ని గుర్తించినవారు సదా మంచినే కోరుకుంటూ, మంచి ఆలోచనలే చేస్తూ, మంచినే చూస్తూ తమ జీవితాన్ని సరిదిద్దుకో గలుగుతారు. మా ఆశ్రమ ప్రార్థనలోని సారాంశం ఇదే. ఈ విషయాన్ని ఎప్పుడైనా మరచిపోయి తప్పుడు ఆలోచనలు చేసినా, శ్రీగురుదేవులు దయామయులై మనకు బుద్ధి తెప్పించి మళ్ళీ మంచి మార్గానికి మరలుస్తారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి