9, జులై 2023, ఆదివారం

తొందరపాటు

    సుబ్బారావు రిటైరై ఇంటిపట్టునే ఉంటున్నాడు. పిల్లలు పెద్దవారై తల్లిదండ్రులతోనే ఉంటున్నా ఎవరి సంసారాన్ని వారు గడుపుకుంటున్నారు. అయితే ఈ మధ్యన ఒక విషయం సుబ్బారావుని తొలిచేస్తోంది. ఉద్యోగం చేసి తాను కూడబెట్టింది పెద్దగా ఏమీ లేకపోయినా, ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ తనకు ఇంట్లో ఎంతో గౌరవం దక్కేది. ఎవరు ఎన్ని మాట్లాడినా చివరికి తన మాటే నెగ్గేది. అలాంటిది ఈ మధ్య పిల్లలు తనను లక్ష్యపెట్టడం లేదు. కాలానికి తగ్గట్లు తాను మారలేడు. అలాగని తన మాట నెగ్గాలనే పంతాన్ని వదులుకోలేడు. దీంతో రోజూ ఇంట్లో తగవులే.

    'ఈ సంసారాన్ని నేను భరించలేను. ఇప్పుడే అన్నీ వదిలేస్తున్నా' అని రోజుకు నాలుగైదుసార్లు అంటూ ఉంటాడు కానీ దేనినీ అంత తేలికగా వదలలేడు. ఇంకా తన తాతలనాటి ఆస్తి తన చేతిలో ఉండటంవల్లే ఈమాత్రం మర్యాద అయినా దక్కుతోందని, అది కాస్తా పిల్లల పేరుమీద పెడితే తన బ్రతుకు బస్టాండేనని సుబ్బారావుకు గట్టి నమ్మకం. దాంతో రోజూ అన్నిసార్లు మాటల్లో వదిలేస్తున్నా మనసులో మాత్రం సన్యసించలేకపోతున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏదో కారణంమీద ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. అలిగిన సుబ్బారావు తట్టాబుట్టా సర్దుకుని రైలెక్కాడు. ఆ రైలు కొన్ని స్టేషన్లు దాటాక అనుకోకుండా తన బాల్యమిత్రుడు వెంకట్రావు తారసిల్లాడు.

    కుశలప్రశ్నల అనంతరం విషయం తెలుసుకున్న వెంకట్రావు పెద్దగా నవ్వుతూ 'ఒరేయ్ సుబ్బారావూ! ఇంత వయసొచ్చినా నీకింకా చిన్నతనం పోలేదురా. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ చేటే చేస్తాయి కానీ మంచి చెయ్యవు. కొడుకో కోడలో తిట్టారనో, తనను సరిగా గౌరవించలేదనో వృద్ధాశ్రమాలలో చేరి అక్కడ రెండుమూడు రోజులు కూడా ఇమడలేక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నవాళ్ళని ఎంతమందిని చూడటం లేదు? అయినా తమకు పెళ్ళి అవగానే తల్లిదండ్రుల్ని బలవంతంగా వృద్ధాశ్రమాలలో చేర్పించే పిల్లలున్న ఈ కాలంలో మీకు ఇంత వయసొచ్చినా, వారివారి సంసారాలు, పిల్లలు వాళ్ళకి వచ్చినా నీ పిల్లలు ఇంకా మీ దగ్గరే ఉంటూ మిమ్మల్ని చూసుకుంటుంటే అది అదృష్టంగా భావించక ఇదేం పనిరా?

    అయినా నీకు సంపాదన లేదనో, ఆస్తి పంచి ఇవ్వలేదనో నీ పిల్లలు నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకనుకుంటున్నావు? నీకు జరిగే అవమానాలు ఎప్పటికీ నామాటే నెగ్గాలనే నీ మొండితనం వల్లనో, ఇంట్లో ఎవరినీ నమ్మక ప్రతి విషయం గోప్యంగా ఉంచుకొనే నీ అభద్రతా భావం వల్లనో, లేక కాలం నిత్యం మారుతూ ఉంటుందనే నిజాన్ని గుర్తించక ఎప్పటికీ మా కాలంలో జరిగినట్లే జరగాలనే నీ చాదస్తం వల్లనో అని ఎందుకు ఆలోచించవు? చిన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నా పెద్దల మాట విని తీరాలి. అలాగే కొంచెం పెద్దవాళ్ళమయి మన సంసారాలు మనకు వచ్చాక ఇంట్లో వాళ్ళందరూ మన మాట వింటారు. కానీ మనకు వయసుడిగిన తరువాత మళ్ళీ మనం పిల్లల మాట వినక తప్పదు. 

    అలసు ఎంతసేపూ మన సంప్రదాయం, సంస్కారం, ధర్మం అంటూ కబుర్లు చెబుతావు కానీ మన సనాతన ధర్మంలో కొడుకుకి వివాహమై ఒక సంతానం కలిగిన వెంటనే ఆ తండ్రి తన బాధ్యతలన్నీ కొడుకుకు అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని చెప్పారు కదా! అలాగే కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు తన బాధ్యతలు కోడలికి అప్పగించాల్సిందే. లేకపోతే వారు ఎదిగేదెప్పుడు? వీరికి సంసార బంధం తీరేదెప్పుడు? "నేను చిన్నప్పుడే బాధ్యతలని స్వీకరించి ఎన్నో కష్టాలు పడ్డాను. నా పిల్లలు అలా కష్టపడకూడదు" అని అతిగా ఆలోచించి బాధ్యతలు అప్పజెప్పకపోతే ఆ పిల్లల పతనానికి నీవే బాధ్యుడవు అవుతావు.

    అయినా ఎంతసేపూ "నేనేదో కుటుంబం కోసం త్యాగం చేశాను. అయినా నాకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు అనుకుంటున్నావు" కానీ నీకోసం నీ పిల్లలు ఎంత త్యాగం చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఇంట్లో ఒక పనికిరాని పాత వస్తువునే వదులుకోలేని నువ్వు, వాళ్ళు ఎన్ని వదులుకుంటే ఇవాళ ఇలా నీతో కలిసి ఉంటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? ఏ ఆలోచనా లేకుండా తొందరపడి ఇలా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయం ఎంతటి అవివేకం? సన్యాసమనేది ఈ ప్రపంచంయొక్క అశాశ్వతత్వాన్ని, నిస్సారతను క్షుణ్ణంగా గ్రహించి ఒక పరిపక్వతతో కూడిన నిశ్చయ మనస్సుతో తీసుకోవలసిన నిర్ణయం. అంతేకానీ ఇలా ఆవేశంతో, అనాలోచితంగా తీసుకోవటం సరికాదు. 

    నేనేదో మన సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నానని ప్రగల్భాలు పలుకుతావు కానీ అసలు మన సనాతన ధర్మంలో బ్రహ్మచారి అయినవాడు తల్లి అనుమతి లేకుండా, గృహస్తు అయినవాడు భార్య అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవడం నిషేధం, తెలుసా? అయినా ఈ వైరాగ్యం పెళ్ళి చేసుకోకముందు ఉండాలి కానీ పెళ్ళయి ఒక కుటుంబం ఏర్పడ్డాక, చెప్పాపెట్టకుండా వదిలేసి పోయేవాడిని పిరికివాడు అంటారు కానీ సన్యాసి అనరు. వైరాగ్యం అంటే రాగద్వేషాలకతీతంగా అన్నిటినీ సమానంగా చూడటం, అంతేకానీ కుటుంబం మీద ద్వేషం పెంచుకొని వదిలేసి పోవడం కాదు. ఆ మధ్య నేనిలాగే సన్యాసం పుచ్చుకుందామని హృషీకేశ్ వెళ్లిపోయాను. 

    అక్కడ కనిపించిన ఒక మహాత్ముడు భార్య అనుమతి లేనందున నేను సన్యాసానికి పనికిరానని వివరించి వారి ఆశ్రమంలో కొంతకాలం ఉండటానికి మాత్రం అనుమతించారు. అయితే అక్కడ రోజుకి ఒక్కసారి మాత్రమే రొట్టెలు, పాలు అందించేవారు. మూడుపూటలా కడుపునిండా తినడం అలవాటు పడిన నా ప్రాణానికి అది సరిపోయేది కాదు. ఆకలి బాధను తట్టుకోలేక చివరికి ప్రక్క గదిలో రోజంతా ధ్యానం చేసుకుంటున్న మహాత్ముని ఆహారాన్ని దొంగిలించడానికి కూడా పూనుకున్నాను. అప్పుడు నాకు కనువిప్పు కలిగి ఆ మహాత్ముని పాదాలపై పడి మార్గదర్శనం చేయమని ప్రార్ధించాను. 

    ఆయన "నాయనా! సాధనకు సంసారం అడ్డు కాదు. పైగా అది నీకొక పెట్టని కోటవంటిది. నీకు ఎటువంటి కోరిక కలిగినా అది ధర్మబద్ధంగా తీర్చుకొని, ఆ తరువాత ఆ కోరిక వలన కలిగిన సుఖం ఎంత అశాశ్వతమో విచారణ ద్వారా గ్రహించి దానిని అధిగమించడానికి అవకాశం కల్పిస్తుంది. అదే సన్యాసి జీవితం బహు ప్రమాదకరమైనది. అది కోట బయట నిలిచి శత్రువుతో యుద్ధం చేయడంలాంటిది. ఎటువంటి రక్షణ లేకపోవడంతో ఏ క్షణంలోనైనా అంతఃశ్శత్రువుల చేతిలో పరాజయం పాలు కావచ్చు. సంసారులై కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన నీలాంటి వారికోసం మీ ఆంధ్రదేశంలోనే శ్రీ కాళీగార్డెన్స్ ఆశ్రమాన్ని శ్రీ బాబూజీ మహరాజ్ వారు స్థాపించారు. అక్కడకు వెళ్ళి చక్కగా సాధన చేసుకొని తరించు" అని మార్గదర్శనం చేసి నన్ను పంపించారు' అని సుబ్బారావుని సమాధానపరచి తిరిగి ఇంటికి పంపించాడు.


గయ్యాళి పెండ్లాము యల్లరి పిల్లలు
భరియించలేక సన్యాసమందువు
కోటలోనుండి పోరు మేటిది గాదె
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి