14, ఆగస్టు 2016, ఆదివారం

పల్లమెఱుగని నీరు

ఈ రోజు నేను కారు నడుపుతూ ఉండగా ఒక వంతెన పైనుండి యిన్ని నీళ్ళు ముందు ఉండే అద్దం మీద పడ్డాయి. ఏటవాలుగా ఉండే అద్దం మీద మామూలుగా నీళ్ళు పడితే అవి భూమ్యాకర్షణకు లోబడి క్రిందికి జారిపోవాలి కదా? కానీ కారు వేగానికి ఉత్పన్నమైన యెదురు గాలికి ఒక్క చుక్క నీరు కూడా క్రిందికి జారకుండా, మొత్తం పైకి ప్రవహించింది. 

మన మనస్సు కూడా ఆ నీరులాంటిదే. ఎప్పుడూ ప్రాపంచిక ఆకర్షణలకు లోబడి నీచ భావాల దిశగా జారిపోతూ ఉంటుంది. కానీ అదే మనస్సుకు వేగంగా మరియు నిరంతరంగా జరిగే భగవన్నామ జపాన్ని తోడు చేసినపుడు, అది ఆ ఆకర్షణకు వ్యతిరేక దిశలో, పరమాత్మకు అభిముఖంగా, ఆథ్యాత్మిక ఉన్నతి దిశగా ప్రయాణం చేయగల శక్తిని సంతరించుకుంటుంది. 

ఇక్కడ వేగంగా జపం చేయడమంటే మనం పలికే నామం మనకే అర్థమవనంత హడావిడిగా చేయడమని కాదు. నామానికి నామానికి మధ్య సంకల్పాలు దూరే సందు యివ్వకుండా అని అర్థం. మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ వారు దీనికి రెండు ఉదాహరణలు చెప్పేవారు. 

ఫ్యాను వేగంగా తిరిగినప్పుడు దాని మూడు ఱెక్కలూ కలిసిపోయి ఒక్కటిగా ఎలా గోచరిస్తాయో, అలాగే భగవన్నామం వేగంగా జపించినప్పుడు మన మూడు గుణాలూ లయమైపోయి శుద్ధసత్వ గుణంగా భాసిస్తాయి. జనరేటర్ వేగంగా తిరిగినప్పుడు విద్యుచ్ఛక్తి ఎలా ఉత్పన్నమవుతుందో, అలాగే నామజపం వలన మనలో ఆథ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది.