3, నవంబర్ 2011, గురువారం

చిట్టి డైరక్టర్

ఆ మధ్యన ఒక రోజు మా అమ్మాయిని బయట లాన్లో ఆడిస్తున్నాను. ఉన్నట్టుండి నాన్నా నీకో కథ చెప్పనా అంది. సరే చెప్పమంటే ఇలా చెప్పింది:

"అనగనగా ఒక చిన్న జిరాఫీ పిల్ల ఉంది. దానికి ఒకసారి చాలా ఆకలి వేసి చెట్టు నుంచి చాలా పళ్ళు కోసుకుని తినేసింది. అప్పుడు దాని పొట్ట పెద్దగా అయిపోయింది. అది ఇంటికి  వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకి నమస్కారం పెడదామంటే పొట్ట పెద్దదవటం వల్ల కుదరటం లేదు. చాలా కష్టపడి పెట్టింది కానీ ఇంతలో దాని పొట్ట పగిలిపోయి అందులోంచి పళ్లన్నీ కింద దొర్లిపోయాయి. అప్పుడు వాళ్ళ నాన్న జిరాఫీ ఒక పాముని తెచ్చి దాని పొట్టకి బెల్టు లాగా పెట్టి కుట్టేసాడు."

ఎప్పుడో ఆరు నెలల క్రితం చెప్పిన వినాయకుడి కథను అది అంత బాగా గుర్తు పెట్టుకున్నందుకు సంతోషించాలో లేక దేవుళ్ళ పాత్రలను జిరాఫీలుగా మార్చేసినందుకు ఏడవాలో తెలియలేదు. బహుశా ఇలాంటివాళ్ళే పెద్దయ్యాక తెలుగు సినిమా దర్శకులు అవుతారేమో.

2, నవంబర్ 2011, బుధవారం

యక్ష ప్రశ్నలు

ఇటీవల మా ఆవిడ కాన్పు కోసమై వైద్యశాలకు వెళ్ళాం. అది మరీ ప్రొద్దున్నే కావడంతో ఎమర్జెన్సి అని పిలువబడే అతి నెమ్మదిగా పని జరిగే విభాగం ద్వారా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ షరా మాములుగా నీ పేరేమిటి? వయసెంత? ఇన్స్యురెన్స్ ఉందా? వంటి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పి, వాళ్ళు ఇచ్చిన ఒక కట్ట కాగితాలపై నొప్పులు పడుతూనే సంతకాలు పెట్టి (ఇక్కడ మనం ఎందుకూ పనికి రాము. అన్నీ ఆడవాళ్లు చేయవలసిందే.) ప్రసూతి వార్డుకి చేరుకునేసరికి ఒక గంట పట్టింది.

ఇక అక్కడి నర్సు ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ కాన్పు నీ భర్తకి ఇష్టమేనా? మీరిద్దరూ అన్యోన్యంగానే ఉంటారా? లేక కొట్టుకుంటారా? మీ మొదటి పాపను మీ అయన సరిగ్గానే చూస్తాడా? పుట్టబోయే బిడ్డకి తండ్రెవరు? ఇలా సవాలక్ష అసందర్భ ప్రశ్నలతో నొప్పులు పడుతున్న మా ఆవిడను వేధించి చివరికి మంచం మీద పడుకోపెట్టింది.

ఇక కాన్పు అయ్యి వేరే గది లోకి మారిన తరువాత అరగంటకొక కొత్త నర్సు రావటం, ప్రశ్నలతో ముంచెత్తటం. మీ బాబు పాలు త్రాగాడా? ఎన్ని నిముషాలకి ఒకసారి త్రాగుతున్నాడు? ఎంత త్రాగుతున్నాడు? ఎన్ని సార్లు విరేచనం అయ్యింది? ఎన్ని గంటలకు ఏ ఏ రంగులో అవుతోంది? గంటకు ఎన్ని సార్లు ఏడుస్తున్నాడు? ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు?

ఇవి కాక వచ్చిన ప్రతివాళ్ళు, ఎలా ఉన్నారు? మీ పేరేమిటి? ఎంతమంది పిల్లలు? ఇవాళ వాతావరణం బాగుంది కదా. మీకు కంగ్రాట్స్, మాకు థాంక్స్ లాంటి రొటీన్ పలకరింపులు సరే సరి. మొత్తానికి అక్కడినుంచి బయటపడే సరికి వాగి వాగి మా ఆవిడకి శోష, నాకు తలనొప్పి వచ్చి, బ్రతుకు జీవుడా అని ఇంటికి చేరాం.