4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

కరోనా బోధించే పాఠం

    ఈ రోజుల్లో కరోనా ప్రతివారినీ భయపెడుతోంది. అయితే మనకు నేర్చుకోవాలనే కోరిక ఉండాలి కానీ ఈ కరోనా మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా నేర్పుతుంది. ఈ కరోనా అన్నది కంటితో చూడలేని చాలా సూక్ష్మ కణం. దానంతట దానికి స్వయంసత్తా లేదు. అయితే అది మన శరీరంలోని జీవకణాలతో కలిసిందంటే ఎన్నో లక్షల కోట్ల రెట్లుగా వృద్ధి చెంది మన జీవవ్యవస్థనే నిర్వీర్యం చేసేంత శక్తిని పొందుతుంది. మన మనస్సులో జనించే సంకల్పాలు, బయటి ప్రపంచం నుండి మనం పోగుచేసుకొనే విషయాదుల వాసనలు కూడా ఇలాంటివే. వాటికి విడిగా ఉనికి లేదు. కానీ ఒక్కసారి మన మనసులో చోటిచ్చామంటే ఇక అవి తామరతంపరగా వృద్ధిచెంది చివరికి మనలను మానసికంగా నిర్వీర్యం చేసేంత శక్తిని కూడా పొందుతాయి.

          మరి ఈ కరోనా బారినుంచి తప్పించుకోవాలంటే మూడు ముఖ్యమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. అందులో మొదటిది భౌతిక దూరం. అంటే సమాజంలోని ఇతర వ్యక్తులనుంచి వీలైనంత దూరంగా ఉండటం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అరతిర్జన సంసది – జన సమూహంలో ఉండాలనే ఆసక్తి లేకపోవడం, ఇంకా లోతుగా వెళితే ప్రాపంచిక విషయాలయందు ఆసక్తి లేకపోవటం - జ్ఞానం యొక్క లక్షణాలలో ఒకటిగా నిర్వచించారు. ఊరికే పదిమందితో కలవాలనుకోవటం, పోసుకోలు కబుర్లు చెప్పటం, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చేరవేయటం – ఇవి అజ్ఞానుల లక్షణాలు. జ్ఞాని ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు కానీ ఈ బయటి విషయాలేవీ ఆయనకు ఆసక్తిని కలిగించవు. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యస్సుఖం – యోగి బాహ్య స్పర్శలయందు నిరాసక్తుడై తనలో తాను నిత్యం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడని భగవద్గీత మనకు బోధిస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు మనకు కరోనా ఆచరణ పూర్వకంగా చూపిస్తోంది.

               ఇక రెండవ నియమం జనసంపర్కం తప్పనప్పుడు మాస్కు ధరించడం. అంటే ఆ జనులనుండి వెలువడిన వైరస్ మనలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారాలైన ముక్కు, మూతి మూసుకుని ఉండటం అన్నమాట. అలాగే ఆధ్యాత్మికంలో కూడా బయటి విషయాదులు మనలోకి ప్రవేశించే మార్గాలైన మన అయిదు జ్ఞానేంద్రియాలను ఆయా విషయాలకు వ్యతిరేక దిశలో లోపలికి ముడుచుకోవటం చాలా ముఖ్య కర్తవ్యం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీమ్ద్రియార్థేషు తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా – తాబేలు ఎలా అయితే శత్రువు అలికిడి వినపడగానే తన ఇంద్రియాలన్నింటినీ తనలోనికి లాక్కుంటుందో అలా తన జ్ఞానేంద్రియాలను వాటి వాటి ఇంద్రియార్థాలైన విషయాదులనుండి వెనుకకు ఉపసంహరిచుకో గలిగినవాడే స్థితప్రజ్ఞుడు అని గీతావాక్యం.

               ఇక ఈ రెండు నియమాలను ఎంత జాగ్రత్తగా పాటించినా ఏదో ఒక సందర్భంలో ఆ వైరస్ మన చేతులకు అంటుకునే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది కనుకనే మూడవ నియమంగా తరచూ చేతులను శుభ్రం చేసుకోమన్నారు. అలాగే ఈ ప్రపంచంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఆయా విషయాదులు మన కంటపడక మానవు. ఇక్కడ కన్ను అంటే కన్ను ఒక్కటే కాదు, ఇది అయిదు జ్ఞానేంద్రియాలకూ వర్తిస్తుంది. అయితే ఆ విషయాలు మన మనసులో వాసనలలాగా అంటుకు పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన బుద్ధిని ఉపయోగించి విచారణ ద్వారా వాటిని కడిగివేస్తూ ఉండాలి. కరోనాలాగే విషయాదులు కూడా చాలా జిడ్డువి. ఒకసారి పట్టుకున్నాయంటే అంత తేలికగా వదిలిపెట్టవు. అందుకే మాటిమాటికి ఎక్కువసేపు వాటిని విచారణ అనే సబ్బుతోనూ, ధ్యానాగ్ని అనే తీక్షణమైన సానిటైజర్ తోనూ క్షాళన చేసుకుంటూ ఉండవలసిందే.

          కరోనా వచ్చిన క్రొత్తలో దాని గురించి జనాలలో అవగాహన పెంచటానికి, దాని నుండి రక్షణ కొరకు వారు సామగ్రిని సమకూర్చుకోవటానికి తగిన సమయం పొందటం కొరకు lockdown కొంతవరకు ఉపయోగపడింది. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు. మానవుడు సంఘజీవి. సమాజానికి దూరంగా ఒంటరిగా బ్రతకటం ఎక్కువకాలం సాధ్యం కాదు. అందుకే ఒక అవగాహన, సాధన సామగ్రి ఏర్పడిన తరువాత ఇప్పుడు ఆ lockdown ఎత్తివేసి ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తూ సాధారణ జీవితం గడపమంటున్నారు. శ్రీ కాళీ వనాశ్రమం ఏర్పడిన క్రొత్తలో ఇలాగే ఇంచుమించు lockdown పరిస్థితే ఉండేది. ఒకసారి ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకున్న తరువాత ఎవరు ఏ పనిమీద బయటకు వెళ్ళాలన్నా శ్రీ గురుదేవుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి. తీరా వారి వద్దకు వెళితే ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా? నువ్వు వెళ్ళకపోతే అక్కడ పనులు ఆగిపోతాయా? నువ్వు వెళ్ళి నీ బంధువులనూ, బిడ్డలనూ ఆపదలనుండి, రోగాలనుండి రక్షించగలవా? అదే నువ్వు ఇక్కడ ఉండి చక్కగా సాధన చేసుకుంటే వారి రక్షణ భారం భగవంతుడు తప్పక వహిస్తాడు అంటూ శ్రీ గురుబోధ వారిలో సరియైన విచారణను మేల్కొలిపేది. అలా కొంతకాలం ఆశ్రమవాసులందరికీ శిక్షణ ఇచ్చిన తరువాత ఇక నిర్ణయాన్ని వారి వారి విచక్షణకే వదిలివేశారు. వరి పంట కోసిన తరువాత ఆ ధాన్యాన్ని రైతు తూర్పారబడతాడు. అందులో గట్టి గింజలు రైతు పాదాల దగ్గరే పడి ఉంటాయి. తాలు గింజలు గాలికి కొట్టుకుపోతాయి. అలాగే సాధనలో గట్టి గింజలైనవారు ఎన్ని అవాంతరాలు, ఆకర్షణలు వచ్చినా లొంగక ఆశ్రమాన్నే ఆశ్రయించుకొని గురుపాద సన్నిధిలో తమ జన్మలను చరితార్థం చేసుకున్నారు.

               కరోనా ఇతరులనుండి మనకు అంటుకోకుండా చూసుకోవటం ఎంత ముఖ్యమో మననుండి ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవటమూ అంతే ముఖ్యం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్ వచ్చినా అది వారిపై ఎటువంటి ప్రభావమూ చూపదు. కానీ అది వారినుండి ఇతరులకు వ్యాపించే అవకాశాలు తప్పక ఉంటాయి. ఇది వారికి తెలియకుండానే జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉన్నవారిపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపకపోవచ్చు. కానీ వారు కూడా తాము మాట్లాడే ప్రతి మాటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అవి ఇతరులపై దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మార్కెట్లో క్రొత్త ఐఫోన్ వచ్చిందనే విషయం మీరు విని దానిని చాలా తేలికగా తీసుకుని ఉండవచ్చు, కానీ అదే వార్తను మీరు నలుగురితో పంచుకున్నప్పుడు అందులో ఒకరికి ఆ వార్త ఆ ఫోనును పొందాలనే తీవ్రమైన వాంఛను కలిగించి మానసిక అశాంతతకు దారి తీయవచ్చు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎంతవరకు అవసరమో, అది అవతలివారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో గమనించుకుంటూ ఉండాలి. రోగం వచ్చినా రాకున్నా ప్రతివారూ మాస్కులు ధరించాలనే నియమంతో కరోనా మనకు బోధించే పాఠం ఇదే.

21, జూన్ 2020, ఆదివారం

బ్రాహ్మణుడు

వారి వారి గుణాలకు, కర్మలకు అనుగుణంగా నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని భగవానుడు స్వయంగా సెలవిచ్చాడు. "జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ భవేత్ ద్విజః" అని పెద్దలు చెబుతారు. అంటే జన్మతః అందరూ శూద్రులే. ఆ తరువాత వారి వారి కర్మలు, సంస్కారాలను బట్టి వివిధ వర్ణాలుగా పరిణామం చెందుతారు. సత్వగుణాన్ని అవలంబించి ఇంద్రియ నిగ్రహము, శౌచము, ఓర్పు, నిజాయితీలను కలిగి ఉండి, జ్ఞాన విజ్ఞానాలను సముపార్జించి, తాను చేసే ప్రతి కర్మలో 'భగవంతుడున్నాడు, అన్నీ చూస్తున్నాడు' అనే విశ్వాసాన్ని ప్రదర్శించే వారు బ్రాహ్మణులు అనబడతారు. అలాగే రాజస గుణాన్ని అవలంబించి శౌర్యం, తేజస్సు, ధైర్యం, పరిపాలనా దక్షత కలిగి ఉండి, యుద్ధంలో పలాయనం చిత్తగించకుండా ఉండటం, దానగుణం కలిగి ఉండటం, తాను ప్రభువుననే భావం కలిగి ఉన్నవారు క్షత్రియులనబడతారు. అలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమ, వర్తక వాణిజ్యాది వృత్తులు చేసేవారు వైశ్యులని, మిగిలిన సమాజానికంతటికి పరిచర్యలు, సేవలు చేసేవారు శూద్రులని పిలువబడతారు.

ఇలా వారి వారి వృత్తులు, ప్రవృత్తులను బట్టి ఆయా వర్ణాలు నిర్ణయించబడ్డాయి. శరీరం పనిచేయడానికి ఇంద్రియాలన్నీ ఎలా అవసరమో సమాజం పనిచేయడానికి ఈ వర్ణాల వారందరూ అలాగే అవసరం. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ప్రశ్నే లేదు. అయితే ఈ సత్యాన్ని గుర్తించకుండా కేవలం ఒక వంశంలో పుట్టినంత మాత్రం చేతనే తామేదో అధికులమని, అగ్రవర్ణం వారమని, మిగిలిన వారు అంటరాని వారని తమ చుట్టూ గిరి గీసుకొని కొందరు తమను తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో నిమ్న వర్ణాలని పిలువబడేవారు అవమానాల పాలవుతూ ఉంటారు. అంతెందుకు, శ్రీ గురుదేవుల బాల్యంలో ఒక ప్రక్క వారి మహిమను గుర్తిస్తూనే మరొక ప్రక్క వారి తల్లిదండ్రులెవరో వారిదే కులమో తెలియదనే వంకతో వారిని దూరం పెట్టి, వారు భుజించిన విస్తరిని వారితోనే తీయించి శుద్ధి చేయించినవారు కొందరున్నారు. 

అయితే నిజమైన బ్రాహ్మణుడు ఎవరో యోగి వేమనవారు ఇలా వివరిస్తున్నారు - 

బమ్మ గుడ్డు యనెడు పట్నంబు లోపల
బమ్మనెరుగలేని బాపడేల?
తన మనంబు దెలియ దానే పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

బ్రహ్మాండం అని పిలువబడే ఈ ప్రపంచంలో బ్రహ్మవస్తువును తెలుసుకోలేనివాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? నిజంగా వెదికి చూస్తే, తనలోనూ, సర్వసృష్టిలోనూ నిండియున్నది ఆ బ్రహ్మమే. అట్టి బ్రహ్మవస్తువును తెలుసుకున్నవాడు తానే బ్రహ్మమవుతాడు - "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి". నిజంగా అలా సకల చరాచర విశ్వమంతా నిండి ఉండి అన్నింటినీ ప్రకాశింపచేస్తున్న పరబ్రహ్మ వస్తువును గుర్తించిననాడు ఇక ఈ కులమత భేదాలు ఎక్కడనుంచి వస్తాయి?

అచల సిద్ధాంతంలో నిష్ణాతురాలైన మా మామ్మగారు శ్రీమతి శేషమ్మగారు ఇలాంటిదే ఒక పద్యం చదివేవారు -

ఆకారము శూన్యంబై రాకడ
పోకడలు లేక రంజిలుచుండే
లోకాతీతుని గానక చీకాకు పడేటి
వారు బ్రాహ్మలే చెప్పుమా!

బ్రహ్మ పదార్థమంటే అది కంటికి కనిపించేది కాదు. "యదృశ్యం తన్నశ్యం" అన్నారు. కంటికి కనిపించేవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే. ఈ ఆకారాలన్నీ ఒకప్పటికి వికారాలుగా మారిపోవలసిందే. మరి దేనిని చూసుకొని మనకింత అహంభావం? నేను అగ్రవర్ణం వాడినని విర్రవీగే నీ శరీరమైనా, నీవు అంటరానివాడని చీదరించుకొనే వాని శరీరమైనా చివరికి ఒక చోటికే చేరవలసిందే కదా? ఇక "నేను వేదవేదాంగాలూ చదువుకొని చాలా జ్ఞానం సంపాదించాను, వాడు వట్టి అజ్ఞాని" అంటావా? పిపీలికాది బ్రహ్మపర్యంతం నిండివున్న అసలు తత్వాన్ని తెలిపే వేదాంత సారాన్ని వంటబట్టించుకోకుండా కేవలం శ్లోకాలు, మంత్రాలు వల్లెవేయగలగటం జ్ఞానం ఎలా అవుతుంది? అది కేవలం పాండిత్యమే అవుతుంది.

మనం ఎటువంటి వారమైనా, ఎంతటి అజ్ఞానంలో ఉన్నా, భగవంతుడు ప్రతివారికి వారి వారి జీవితాలలో తమ తప్పును గుర్తించి సరిదిద్దుకునే అవకాశాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందివచ్చిన ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగ పరచుకోకుండా జారవిడుచుకుంటే ఇంక నీవు సంపాదించిన పాండిత్యానికి సార్థకత ఏమున్నది? అయితే అట్టి అవకాశాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నది వారి వారి సంస్కారాన్ని బట్టి, వాసనా పరంపరను బట్టి ఉంటుంది.

శ్రీగురుదేవుల దివ్య చరిత్రలో ఇలా ఒకే పరిస్థితులలో ఒకే రకమైన అవకాశాన్ని పొందిన ఇద్దరిలో ఒకరు దానిని చక్కగా అందిపుచ్చుకొని తమ జన్మను చరితార్థం చేసుకొంటే, ఇంకొకరు దానిని వ్యర్థం చేసుకొని భంగపడ్డారు. అదేమిటో కొంచెం చూద్దాం. కులమతాల పేరుతో తోటి మానవులను నీచంగా చూడడాన్ని శ్రీగురుదేవులు ఎన్నడూ హర్షించేవారు కాదు. వారి సన్నిధిలో అందరూ సమానులే. శ్రీగురుదేవుల భక్తకోటి అంతా అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒకే కుటుంబం. కేవలం తోటి భక్తులనే కాక సృష్టిలోని సకల జీవరాశులను సోదరభావంతో చూడటం వారు నేర్పిన సంస్కారం. ఇక మన రెండు ఉదాహరణలకు వస్తే, ముందుగా శ్రీ లలితానంద సరస్వతీ స్వామినివారు మొదటిసారి శ్రీగురుదేవుల దర్శనార్థం రాజమహేంద్రవరం వచ్చినపుడు అక్కడ భక్తులంతా జాతినీతి కులగోత్రాలకతీతంగా సహపంక్తి భోజనం చేయటం చూడగానే వారికి ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ వెంటనే తమలోని వివేకాన్ని మేల్కొలిపి, ఇదే అసలైన వేదాంత విజ్ఞాన సారానికి ఆచరణాత్మక రూపమని గ్రహించి సర్వభూతాత్మకుడైన పరబ్రహ్మను దర్శించే సాధన చేసి, ఆ తరువాత కాలంలో కూడా తమ విజ్ఞాన సర్వస్వాన్నీ స్త్రీపురుష, వర్ణాశ్రమ భేదాలకతీతంగా సర్వులకు సమానంగా పంచిపెట్టి చరితార్థ జన్ములైనారు.

ఇక రెండవవారు కోనసీమకు చెందిన పెద్ద పండితుడు. శ్రీకాళీ వనాశ్రమం స్థాపించిన తొలినాళ్ళలో ఒకసారి ఆయన శ్రీగురుదేవుల దర్శనార్ధమై వచ్చారు. వారికి ఆశ్రమంలో వాతావరణం, భక్తులు చేసే సాధన అన్నీ నచ్చాయి కానీ అందరూ వర్ణాశ్రమాలకతీతంగా సహపంక్తి భోజనం చేయడం మాత్రం ఆయన తట్టుకోలేకపోయారు. ఆనాటి సత్సంగ సభలో శ్రీగురుదేవులు తమ దివ్య బోధామృతాన్ని ముగిస్తూ ఆ పండితునితో "అయ్యా! ఈ నాడు తమవంటి గొప్ప పండితులు మా ఆశ్రమానికి విచ్చేయటం మా అదృష్టం. మీరిక్కడి వ్యవస్థనంతా క్షుణ్ణంగా పరిశీలించారు కదా! మేము ఆచరించే పద్ధతులలో ఏవైనా లోపాలుంటే తమరు దయతో సెలవిస్తే దిద్దుకునే ప్రయత్నం చేస్తాం" అన్నారు. ఆ పండితుడు మంచి అవకాశం దొరికిందనే ఉత్సాహంతో "స్వామీ! ఇక్కడ ఆచరించే సాధనా పద్ధతులన్నీ నాకెంతగానో నచ్చాయి. అయితే ఒక్కటే లోపం. ఇలా నానా వర్ణాల వారందరూ సహపంక్తి భోజనం చేయటం శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి తమరు బ్రాహ్మణులకు విడిగా భోజనం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది" అన్నారు.

శ్రీగురుదేవులు తమలో తాము నవ్వుకుని "అయ్యా! తమరు మా మీద దయతో అనుగ్రహించిన ఈ సూచన తప్పక ఆచరించవలసిందే. అయితే మా అమ్మ అయిన జగజ్జనని నాకు కలిగిన సందేహాన్ని తమతో విన్నవించుకోమని సూచిస్తోంది. తమరు రోజూ చీకటి పడ్డాక తమ ఇంటికి ఎడమవైపు సందు చివర్లో ఉన్న ఇంటికి వెడతారు కదూ? ఆ ఇంటిలో ఉన్నామెతో తమరు సరస సల్లాపాలు ఆడటం, మీరిద్దరూ ఒకే గ్లాసులోని పాలు త్రాగటం, ఒకే తాంబూలాన్ని కలిసి సేవించటం ఇంకా ఎన్నెన్నో లీలలు తమరి ముఖారవిందంలో నాకు దర్శనమిస్తున్నాయి. 'ఒరేయ్! ఆ ధన్యురాలి కులమేమిటో, గోత్రమేమిటో ఈ మహాత్ములను అడిగి తెలుసుకోరా!' అంటున్నది మా జగన్మాత. దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారా?" అన్నారు.

శ్రీగురుదేవులు మరిన్ని వివరాలు బయట పెడుతుండగానే ఆ పండితుడు క్షమించమని వేడుకుంటూ వారి పాదాలపై పడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో అసలైన బ్రాహ్మణులెవరు? నిత్యం వేదమాతను సేవిస్తూ కూడా కేవలం శబ్దజ్ఞానంతోనే సరిపెట్టుకొని ఆ వేద సారాన్ని గ్రహించక తాము ఆరాధించే పరమాత్మకు ప్రతిరూపాలైన తోటి జీవరాశిని కించపరుస్తూ 'సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగఛ్చతి' అని తెలుసుకోలేక ఆ పరమాత్మనుండి దూరమైపోయే వారిని చూసి జాలిపడటం తప్ప మనమేమి చేయగలం? శ్రీమద్భాగవతంలో కూడా ఇటువంటి సంఘటనలు మనకు గోచరిస్తాయి. ఒకనాడు శ్రీకృష్ణుని సఖులందరూ ఎంతో ఆకలిగా ఉన్నదంటే ఆయన వారిని ఆ దగ్గరలో యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుల వద్దకు పంపుతాడు. అయితే వారు వీరిని గొల్లపిల్లలని అవమానించి తరిమివేస్తారు. ఈ సారి పరమాత్మ వారిని వెనుకగా వంట ఇంటివైపు వెళ్ళి ఆ బ్రాహ్మణ స్త్రీలను అర్థించమని పంపుతాడు. వారందరూ తమ మహద్భాగ్యానికి ఎంతో సంతోషించి వండిన వంటలన్నీ తెచ్చి పరమాత్మను, ఆయన సఖులను చక్కగా సేవించుకుంటారు. అసలు విషయం ఆలస్యంగా గ్రహించిన ఆ పండితులు తాము కోల్పోయిన భాగ్యానికి తలలు పట్టుకుంటారు. వారి పాండిత్యం దేనికి అక్కరకు వచ్చినట్లు?

శ్రీగురుదేవులు మరొక తమాషా అయిన ఘటన చెప్పేవారు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు మానవావతారంలో యశోదమ్మ ఇంట అవతరించాడని విన్న ఒక పండితుడు ఆయనను దర్శించుకోవాలనే కోరికతో వ్రేపల్లెకు వస్తాడు. తీరా అక్కడకు వచ్చాక వారు యాదవులనే సంకోచంతో యశోదమ్మ ఇచ్చిన సంభారాలతో స్వయంపాకం మొదలుపెడతాడు. ఆయన అన్నీ వండుకొని, వడ్డించుకొని 'ఓం కేశవాయ స్వాహా' అనగానే కృష్ణయ్య ఎదురుగా ప్రత్యక్షమౌతాడు. 'అయ్యయ్యో! యశోదమ్మా! ఈ గోపబాలుడెవరో వచ్చి నన్ను మైలపరిచేసాడు' అని ఆక్రోశిస్తాడు. ఆ తల్లి వచ్చి పిల్లవానిని మందలించి మళ్ళీ సంభారాలు సమకూరుస్తుంది. ఈసారి 'ఓం నారాయణాయ స్వాహా' అనేసరికి మళ్ళీ చిన్నారి కన్నయ్య ప్రత్యక్షం. ఇంక లాభంలేదని ఈసారి యశోదమ్మ కృష్ణుని ఒక గదిలో బంధించింది. ఆ పండితుడు కూడా తన గది తలుపుకు తాళంమీద తాళం వేసుకుని భోజనానికి కూర్చున్నాడు.

'ఓం మాధవాయ స్వాహా' అనగానే మళ్ళీ స్వామి ప్రత్యక్షం. ఆ పండితుడు నెత్తీనోరూ బాదుకుని మొత్తుకుంటుంటే యశోదమ్మ వచ్చి కృష్ణుని మందలిస్తుంది. అప్పుడాయన "అయ్యో! అమ్మా! ఈ పండితుని వద్దకు రావటం వలన నేను మైలపడిపోయానా? ఇంతకీ మైల అంటే ఏమిటమ్మా? అసలు ఆయన వద్దకు రావలసిన అవసరం నాకేముంది? ఆయనే కేశవా, నారాయణా, మాధవా అని మాటిమాటికీ నన్ను పిలుస్తున్నాడు" అంటాడు. తన కళ్ళను కప్పిన జాత్యహంకారమనే పొర తొలగిన ఆ పండితుడు "అయ్యో! నేను వచ్చినదే తమరి దర్శనార్థం స్వామీ! తీరా తమను చూసేసరికి అసలు విషయం మరచిపోయి, కేవలం కులగోత్రాలనే పట్టించుకొని అహంకారంతో ప్రవర్తించాను. నన్ను క్షమించండి" అని ఆ చిన్నారి కన్నయ్య పాదాలపై వ్రాలిపోతాడు.

18, మే 2020, సోమవారం

శార్వరి

శార్వరి అంటే రాత్రి. అది మాములు రాత్రి కాదు. మృత్యుఘోష ప్రతిధ్వనించే కాళరాత్రి. ఆ కాళరాత్రి ప్రభావం ఎలా ఉంటుందో గత రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం కదా! రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతోందో మనకు ముందుగా వికారిలోనే చూపించేసింది. రాత్రికి ముందు వచ్చేది సాయంత్రం కదా. మరి ఆ సాయంత్రానికి పేరు శర్వరి. శర్వరి తరువాత శార్వరి వస్తుందన్నమాట. ఈ శర్వరియే మనకు వికారిగా కనిపించింది. ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తే దానిని ఆకారం అంటారు. ఉన్నది దానిలా కాక మరొకదానిలాగానో, లేక లేనిది ఉన్నట్లుగానో కనిపిస్తే దానినే వికారం అన్నారు. ఉదాహరణకు ఒక త్రాడు ఉన్నదనుకోండి. అది మనకు త్రాడులాగానే కనిపిస్తే అది ఆకారం. కానీ అదే త్రాడు మనకు పాములాగా కనిపించి మనలను భయపెడితే అది వికారమయ్యింది. 

అయితే ఈ వికారం పూర్తి వెలుగులోనూ కలుగదు, పూర్తి చీకటిలోనూ కలుగదు. అది కేవలం సాయంత్రం పూట వచ్చే చీకటివెలుగుల దోబూచులాటలో, అంటే సంజెచీకటిలో కలుగుతుంది. ఏదైతే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుందో దానినే 'మాయ' అన్నారు. ఈ మాయ ఎవరిది? 'మమ మాయా' - ఇది నా మాయ అని గీతాచార్యుడు స్పష్టంగా చెప్పాడు. అంటే ఇది విష్ణుమాయ. శర్వరీ కాలంలో కలిగే మాయ. అందుకే విష్ణు సహస్రనామాలలో 'శర్వరీకరః' అని ఒక నామం ఉంది.  అయితే మనని తన మాయతో భయపెట్టేదీ ఆయనే, గీతామృత బోధతో ఆ భయాన్ని పోగొట్టేదీ ఆయనే. 'భయకృత్ భయనాశనః'  - ఇవి కూడా ఆయన నామాలే. 

మాములుగా లోకంలో పగలూ రాత్రీ ఎక్కువ కాలం ఉంటాయి. ఈ సంధ్యాసమయం రోజులో అతి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనం జ్ఞానం అనే వెలుగులో ఎంతసేపు గడిపామో తెలియదు కానీ అనేక జన్మలనుండి ఈ సాయంసంధ్యలోనే గడుపుతున్నాం. దానిని మాయ అనండి, లేదా అజ్ఞానం అనండి. అందులోనే నిరంతరంగా ఉండి, లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా భావిస్తూ అనేకమైన భావోద్వేగాలకు, సుఖదుఃఖాలకు గురవుతూ, పుడుతూ చస్తూ బ్రతుకుతున్నాం. 

రోజంతా జీవనపోరాటంలో అలసిపోయిన  మానవుడికి విశ్రాంతిని కలిగించేది రాత్రి. అలాగే జననమరణ చక్రభ్రమణంలో అలసిపోయిన ఆత్మకు విశ్రాంతి ప్రసాదించేది జగన్మాత. 'జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ' అని లలితా సహస్రనామం చెబుతోంది. అందుకే ఈ రాత్రికి ప్రతిరూపమైన శార్వరి కూడా ఆ అమ్మ స్వరూపమే. శార్వరి అనేది లక్ష్మీదేవి సహస్రనామాలలో ఒక నామం. రోజంతా పనిచేసి అలసిపోయిన వాడు రాత్రి చక్కగా నిద్రపోతే మర్నాడు మళ్ళీ ఉరకలేసే ఉత్సాహంతో లేస్తాడు. అదే రాత్రి సరిగా నిద్ర పట్టనివాడు లేచాక కూడా నీరసంగానే ఉంటాడు. మనో వికారాలతో, మహమ్మారి రోగాలతో అలసిపోయిన జనులు ఈ శార్వరిలో కాస్త విశ్రాంతిని పొందితే ఆ తరువాత ఒక్క గెంతుతో లేస్తారు. అందుకే తరువాత వచ్చేది 'ప్లవ' నామ సంవత్సరం. ప్లవ అంటే గెంతడం. హనుమంతుని ప్లవగోత్తముడు, ప్లవగాధిపతి అనే నామాలతో సంబోధన మనకు సుందరకాండలో చాలాసార్లు కనిపిస్తుంది. మనం గెంతబోయేది 'శుభకృత్, శోభకృత్' అనే వినసొంపైన సంవత్సరాలలోకే.

గ్రహాల కూటమి వలనో, నక్షత్రాల గతులు సరిగా లేకనో ఇప్పుడు మనం చూస్తున్నలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయని కొందరు చెబుతుంటారు. అయితే ఈ గ్రహాలు, నక్షత్రాలు, దిక్పాలకులు, దేవతలు వీరంతా ఎవరి అధీనంలో ఉన్నారు? ఎవరి ఆజ్ఞమేరకు పని చేస్తున్నారు? 'నమ్ర దిక్పాల సీమన్తినీ కుంతల స్నిగ్ధ నీలప్రభా పుంజ సంజాత దూర్వాంకురా శంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్వలే' అంటుంది శ్యామలా దండకం. దిక్పాలుర భార్యలందరూ ఎంతో వినయ విధేయతలతో ఆ జగన్మాత పాదాలపై తమ శిరస్సులనుంచి నమస్కరిస్తూ ఉంటే సహజ ప్రకాశవంతులైన ఆ దేవతల శిరోజాలు నల్లగా మెరుస్తూ అప్పుడే చిగురించిన గడ్డి పరకలలాగా కనిపిస్తూ ఉంటే ఆ అమ్మ కాలిగోళ్లు తెల్లటి వెన్నెల కాంతులను వెదజల్లుతూ ఆ పచ్చికను మేయడానికి వచ్చిన లేళ్ళలాగా కనిపిస్తున్నాయట. 

తల్లి వద్ద పిల్లలలాగా వారందరూ శిరోజాలు కనిపించేలా ఉత్త శిరస్సులతో ముందుగా నమస్కరించిన  తరువాత వారి భర్తలు తమ తమ అధిపత్యాలను, అధికారాలను ఆ తల్లి పాదాలవద్ద అర్పిస్తున్నారా అన్నట్లుగా ఈ సారి కిరీటాలతో సహా ఎలా నమస్కరిస్తున్నారో చూడండి. 'దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని కోటీర మాణిక్య సంఘ్రుష్ట బాలా తపోద్దామ లాక్షా రసారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే' - దేవతలు, దేవేంద్రుడు, రాక్షస ముఖ్యులు, యక్ష భూత గణాధిపతులు, బ్రహ్మదేవుడు, దిక్పాలురు, వాయువు, అగ్ని మొదలైన దేవతలందరూ తమతమ కిరీటాలను ఆ తల్లి పాదాలకు తాకించి నమస్కరిస్తూ ఉంటే ఆ కిరీటాలలో ఉన్న దివ్య మణిమాణిక్యాల కాంతులతో అరుణిమను సంతరించుకున్న జగన్మాత పాదాలు ఎఱ్ఱటి పద్మద్వయం లాగా ప్రకాశిస్తున్నాయట.

మరి అంతటి తల్లిని ఆశ్రయించుకున్న మనకి ఈ ప్రాపంచిక విషయాలవల్ల భయమేముంది? కాదు, మాకు ప్రాపంచిక సౌఖ్యాలే కావాలి అంటారా? అవి అందివ్వటానికి ఆ బోళా శంకరుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. భగవంతుని ఆరాధించే వారు నాలుగు రకాలని 'చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ' అని గీతాచార్యుడు చెప్పాడు. ఇందులో మొదటి రెండు రకాల వారికి ప్రతి పదానికి 'నమో నమో' అంటూ సాగే 'రుద్ర నమకం' సరిపోతుంది. తన కష్టాలను తొలగించమని ఆర్తితో దరిచేరిన వానికి ఆ ప్రభువు మహాత్మ్యం ఎంతటిదో, ఆయన తన ఆర్తిని ఎంత తేలికగా పోగొట్టగల శక్తివంతుడో ఈ నమకం చూపెడుతుంది. అలాగే భగవంతుని దివ్య వైభవాన్ని తెలుసుకోవాలని వచ్చిన జిజ్ఞాసువుకు కూడా ఈ నమకం సమాధానాన్ని ప్రసాదిస్తుంది.

ఇక ప్రతి పదానికి 'చ మే' అంటూ సాగే 'చమకం' మిగిలిన రెండు రకాల వారికి సరిపోతుంది. ఈ లోకంలోని రకరకాల సంపదలన్నీ నాకే కావాలని కోరుకునే అర్థార్థికి ఆయా సంపదలన్నీ స్వామిని ఆశ్రయిస్తే తప్పక లభిస్తాయని ఈ చమకం చూపెడుతుంది. అయితే 'మే' అనే షష్టీ విభక్తిలో 'కిన్ కున్'లే కాకుండా 'యొక్క లోన్ లోపలన్' కూడా ఉన్నాయి. అంటే 'నాకున్న సంపద యావత్తూ నీ ప్రసాదమే తప్ప నాదేమీ లేదు ప్రభూ!' అని భావించే భక్తునికీ, 'అసలీ దృశ్య ప్రపంచమంతా నేను కల్పించుకున్నది, నాలోనుంచే వచ్చింది. ఇది నా భ్రమ తప్ప దీనికి ఉనికే లేదు' అని తెలుసుకున్న జ్ఞానికీ కూడా ఈ చమకం చక్కగా సరిపోతుంది. మరి ఆ నమక చమకాలతో పంచామృతాలు, నవరసాలతో ఆ సదాశివునికి అభిషేకం చేస్తే మన పంచేంద్రియాలు విషయ విషాలనుండి భగవన్నామామృతం వైపుకు తిరిగి, నవ రంధ్రాలతో కూడిన ఈ శరీరం ఆనంద రసమయం అవుతుందనటంలో సందేహం ఏముంది?

వికారి, శార్వరిల సంధికాలంలో ప్రపంచాన్ని కబళించడానికి వస్తున్న కరోనా మహమ్మారి నుండి జనులంతా రక్షింపబడి ప్రపంచమంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలనే మహదాశయంతో శ్రీ మాతాజీవారు శ్రీ కాళీ వనాశ్రమంలో 'శ్రీ సద్గురు విశ్వశాంతి మహాయాగాన్ని' అత్యంత నియమనిష్ఠలతో పదకొండు రోజులు నిర్వహించారు. అందులో భాగంగా ప్రతిరోజూ పైన చెప్పుకున్న విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర పారాయణ, చండీ యాగము, శ్యామలా దండకం, 121 రుద్ర నమక చమకాలతో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో, నవరసాలతో అభిషేకము, గోపూజలు, పర్యావరణాన్ని పవిత్రమొనర్చటానికై శ్రీ గురుదేవుల పాదుకా ప్రదక్షిణలు, అంతఃకరణ శుద్ధికై ధ్యాన శిబిరము, శివ, నారాయణ కవచాలు, వివిధ ఉపనిషత్తులు, ఆదిత్య హృదయం, సుందరకాండ మొదలైన అనేక పారాయణలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడ్డాయి. 

కాళరాత్రిలా మొదలైన ఈ శార్వరి నిరంతరం విశ్వశాంత్యర్థం, లోక కళ్యాణార్థం శ్రమించే మహాత్ములందరి ఆశీస్సులతో మనందరికీ విశ్రాంతినిచ్చి నూతనోత్సాహాన్ని కలిగించే ప్రశాంత రాత్రిలా ముగుస్తుందని ఆశిద్దాం. 

సర్వేజనాః సుఖినో భవన్తు!!!

15, మే 2020, శుక్రవారం

జీర్ణవస్త్రం

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ

మానవుడు జీర్ణమైన వస్త్రాన్ని విడచి నూతన వస్త్రాన్ని ధరించినట్లే జీవుడు జీర్ణమైన దేహాన్ని విడచి నూతన దేహాన్ని ధరిస్తాడని గీతాచార్యుడు వివరించారు కదా. కానీ ఇక్కడ ఎంతో వయస్సు వచ్చి ముసలిదైపోయిన దేహం జీర్ణమైనది అంటే నమ్ముతాం కానీ చిన్న వయసులో ఉన్నవారి దేహంకూడా జీర్ణమైపోయిందంటే నమ్మబుద్ధి కాదు. ఇదే విషయాన్ని శ్రీగురుదేవుల ఆరాధనా మహోత్సవాలలో శ్రీదండి స్వామివారు విశ్లేషిస్తూ అది భౌతికంగా జీర్ణమవడం కాదని, ఆ శరీరంద్వారా అనుభవించవలసిన కర్మ ఎప్పుడు జీర్ణమైపోతుందో అప్పుడా జీవి శరీరాన్ని వదిలివేస్తాడని వివరించారు.

మనం వస్త్రాల ఉదాహరణే తీసుకుంటే ఒక నల్లచొక్కా నాలుగైదు రోజులు ధరించినా మాపు తెలియదు. అదే ఇతర రంగుల చొక్కాలు రోజంతా ధరించేసరికి మాసిపోతాయి. ఇక తళతళలాడే తెల్లని చొక్కా ఒక పూటకే మాసిపోతుంది. అలాగే పాపపు ఆలోచనలతో, నీచబుద్ధులతో కూడిన మానవుని కర్మ చిరకాలం జీర్ణమవకుండా ఉంటుంది. అందుకే 'పాపీ చిరాయుః' అంటారు. ఇక మంచిచెడుల మిశ్రమ బుద్ధితో ఉండే మానవులే మనలో ఎక్కువ శాతం ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఏ ఎనభై తొంభై ఏళ్ళో జీవించి శరీరం శిధిలమవగానే మరొక శరీరాన్ని ధరించడానికి తరలిపోతారు.

మరి తెల్లని వస్త్రంలా నిర్మలమైన బుద్ధి కలిగి సంచరించే సత్పురుషులు వారి కర్మ త్వరగానే జీర్ణమైపోవడంతో చిన్న వయసులోనే దేహాన్ని చాలించేస్తారు. మన దగ్గర ఉండే వస్త్రాలలో మరో రకం కూడా ఉంటాయి ఇవి అత్యంత విలువైనవి. వీటిని ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాలకోసం కొనుక్కొని, ఆయా సందర్భాల్లో ధరించి, ఒకటి రెండు గంటలలోనే విప్పి మళ్ళీ భద్రపరచుకుంటాం. ఇలాంటి విలువైన వస్త్రాలలాంటి వారే కారణజన్ములు. వారిని భగవంతుడు ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లోకోద్ధరణ నిమిత్తంగా ఉద్భవింపచేస్తూ ఉంటాడు. వారు తాము వచ్చిన కార్యం త్వరత్వరగా ముగించుకుని తిరిగి కనుమరుగైపోతారు.

అయితే అలా అని త్వరగా వెళ్ళిపోయిన వారందరూ మహాత్ములనీ దీర్ఘకాలం జీవించిన వారందరూ పాపాత్ములనీ అనుకోవడానికి లేదు. పాపీ చిరాయు అన్నప్పటికీ చిరంజీవులైన మహాత్ములెందరో మన పురాణాలలోనే కాక ఇప్పటి కాలంలో కూడా దర్శనమిస్తారు. మళ్ళీ మన వస్త్రం పోలికకే వెళితే కొన్ని దివ్య వస్త్రాలు ఉంటాయి. అవి ఎంతకాలం అయినా మాయకుండా ఉంటాయి. మన సీతమ్మ అటువంటి వస్త్రాన్నే లంకలో ఉన్నంతకాలం ధరించింది. అలా ఎందరో మహాత్ములు తమ స్వార్థంకోసమో, దేహంమీద మోహంతోనో కాక కేవలం దీనజనోద్ధరణ కోసం నిస్వార్థంగా కొన్ని వందల, వేల సంవత్సరాల కాలం జీవించి తమ సుదీర్ఘ జీవితాలనంతా లోకకళ్యాణం కోసం త్యాగం చేశారు.

కాబట్టి ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు. మన జీవితకాలంలో ఎంతభాగం సద్వినియోగం చేసుకున్నాం, ఎంత త్వరగా ఈ దేహంయొక్క అశాశ్వతత్వాన్ని గుర్తించి దీనిమీది మోహాన్ని వదిలించుకున్నాం అనేదానిపైనే మన జీవిత సార్థకత ఆధారపడుతుంది.

19, ఫిబ్రవరి 2020, బుధవారం

శత్రులు మిత్రులౌట

కమలములు నీట బాసిన 
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ 
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

కమలములు నీళ్లలో ఉన్నంతకాలం సూర్యుడు వాటికి మిత్రుడే. ఆయన ప్రకాశం సోకినకొద్దీ అవి మరింతగా విప్పారుతాయి. కానీ అవే పద్మాలు నీటినుండి బయటకు రాగానే ఆ సూర్యుని వేడికే కమిలిపోతాయి. అలాగే ఎవరు ఉండవలసిన స్థానంలో వారు ఉన్నప్పుడే మిత్రత్వం వర్ధిల్లుతుంది కానీ ఆ నెలవులు తప్పితే మిత్రులే శత్రువులుగా మారిపోతారని బద్దెనవారు వివరిస్తున్నారు. అలాగే మొసలి బలం గురించి చెబుతూ వేమన కూడా 'స్థానబలిమి కాని తన బలిమి కాదయా' అంటాడు. వారి వారి స్థానాలు మారేసరికి మిత్రత్వాలు, బంధుత్వాలూ కూడా ఎలా మారిపోతున్నాయో ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం.

మరి మనకు కూడా ఆరుగురు శత్రువులు ఉన్నారు కదా! వాళ్ళే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటినే అంతశ్శత్రువులు అంటారు. బయటివాళ్ళెవరో మనకు శత్రువులుగా ఉండి మనను నాశనం చేయాలని చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మనలోనే ఉన్న ఈ గుణాలు మనల్ని నాశనం చేయాలని చూడటం కొంచెం విచిత్రమే. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవటంలా అనిపిస్తుంది. అయితే మరి వీటికి మనతో శత్రుత్వం ఎందుకొచ్చింది? అది పోయి మిత్రత్వం కలగాలంటే ఏమి చేయాలో చూద్దాం. 

పైన చెప్పుకున్నట్లుగా మన స్థానాన్ని మనం విడిచిపెట్టడమే మిత్రులుగా ఉండవలసిన వాళ్ళు శత్రువులుగా మారటానికి కారణం. మన అసలు స్థానం ఏది? భగవంతుడే మనందరికీ నెలవు. ఆయనను విడిచిపెట్టడం వల్లనే మన స్థానబలం తగ్గి మనలోనే ఉన్న గుణాలు మనకు శత్రువులుగా మారడం, మనం వాటిని మన బలంతో జయించలేకపోవడం జరుగుతోంది. ఈ శత్రువులు మళ్ళీ మనకు మిత్రులుగా మారాలంటే మన స్థానానికి మనం చేరుకోవాలి, లేదా కనీసం ఆ దిశగా ప్రయాణం అయినా ప్రారంభించాలి. అప్పుడు మెల్లమెల్లగా ఆయా గుణాలు తమ శత్రుత్వాన్ని వదలి మనకు మిత్రులుగా మారిపోతాయి. కామక్రోధాది అరిషడ్వర్గం శమాది షట్కసంపత్తిగా మారిపోతుంది. అదెలాగో చూద్దాం.

కామం - మనకు దేనిమీదైనా కోరిక కలిగిందంటే ఇక అది తీరేవరకూ మనం ఏపని చేస్తున్నా ఆ వస్తువే మన ఆలోచనలలో మెదులుతూ ఉంటుంది. అది ఒక వస్తువైనా, సుఖమైనా, లేదా వ్యక్తి అయినా, మనకు ఆ కోరుకున్నది లభించేవరకు మనఃశాంతి ఉండదు. నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అదే మనం ఈ కామాన్ని భగవంతునివైపు మరల్చుకున్నామనుకోండి, అప్పుడు నిరంతరం ఆయన ధ్యాసే ఉంటుంది. శరీరం ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం నిరంతరంగా ఆ పరమాత్మతోనే రమిస్తూ ఉంటుంది. అదే ఉపరతి

క్రోధం - మనం కోరుకున్నది మనకు దక్కకపోయినా, లేదా మనం అనుకున్నట్లుగా జరగకపోయినా/ఎదుటివాళ్ళు ప్రవర్తించకపోయినా మనకు క్రోధం వస్తుంది. అయితే మనస్సుని భగవంతునివైపు మరల్చినప్పుడు ఈ క్రోధం ఎదుటివారిపై కాక మన ఆధ్యాత్మిక సాధనకు అడ్డువచ్చే మన ఇంద్రియాలు, గుణాలపైకి మరలుతుంది. అప్పుడే ఇంద్రియనిగ్రహం సాధించగలుగుతాం. ఆ బాహ్యేంద్రియ నిగ్రహమే దమము.

లోభం - లోభియైనవాడు తనకున్నదానిని ఎవరికీ పెట్టలేడు, తానూ అనుభవించలేడు. చేసే ప్రతి పనిలోనూ పిసినారితనం చూపిస్తూ ఏదో తప్పనిసరిగా చేస్తాడు తప్పితే అందులో ఆసక్తి  ఉండదు. మరి యితడు తన మనస్సును భగవంతునిపై లగ్నం చేసి ఆయన ప్రేమను కొద్దిగానైనా చూరగొన్ననాడు ఆ భగవంతునికి తాను చేసే సేవలన్నింటిలోనూ ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఇష్టంగా చేయటం తనకు తెలియకుండానే అలవాటు చేసుకుంటాడు.

మోహం  -  మోహమనే శత్రువుకు లోబడినవాడు తన భార్యాపిల్లలు కానీ, లేదా తనకు ఇష్టమైన ఏ వస్తువైనా కానీ ఒక్క క్షణం దూరమైనా తాను బ్రతకలేనట్లు ప్రవర్తిస్తాడు. అలాగే తాను లేకుండా తనవాళ్ళు బ్రతకలేరనీ భావిస్తాడు. అయితే ఈ మోహాన్ని మోహనాకారుడైన పరమాత్మ మీదకు మరల్చుకున్నవాడు చివరకు ఆ పరమాత్మ ఒక్కడే సత్యమని, ఈ జగత్తులో తక్కినవన్నీ జనించి గతించిపోయేవేనన్న నిజాన్ని గుర్తించి ఆ పరమేశ్వర ప్రసాదంగా ఎప్పటికప్పుడు తనకు ఇతర వ్యక్తులతో లేదా వస్తువులతో కలిగిన సంగమాన్ని, వియోగాన్ని కూడా సమదృష్టితో చూస్తూ ఎక్కడికక్కడ సమాధానపడతాడు.

మదం - మదం బాగా తలకెక్కినవాడు నా అంతవాడు లేడని విర్రవీగుతూ, ప్రతివారినీ అవమానిస్తూ, తన బలహీనతల గురించి అవతలివారు నిజం చెప్పినా అది తనకు ఘోర అవమానంగా భావిస్తూ, ప్రతీకారాగ్నిలో రగిలిపోతూ ఉంటాడు. కానీ యితడు పరమాత్మయొక్క అనంత శక్తిని గుర్తించి తననూ, ఈ సమస్త ప్రపంచాన్నీ నడిపించేది ఆ పరమాత్మే అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎఱిగిననాడు ఆ మదమే మానావమానాలను సమదృష్టితో స్వీకరించగలిగే తితీక్షగా మారిపోతుంది.

మాత్సర్యం - మాత్సర్యం అనే దుర్గుణం కలిగినవాడు ఎప్పుడూ ఎదుటివ్యక్తి అభివృద్ధిని చూసి అసూయ చెందుతూ, మనసులో ఆ వ్యక్తి పతనాన్ని కాంక్షిస్తూ, బుద్ధితో అతని నాశనానికి ప్రణాళికలు రచిస్తూ, చిత్తంతో ఆ వ్యక్తి ఇంతకుముందు ఎప్పుడో చేసిన తప్పులన్నింటినీ నెమరువేసుకుంటూ, అహంకారంతో ఆ వ్యక్తికి హానికలిగేలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే వ్యక్తి తన హృదయంలో భగవంతుని నింపుకున్నప్పుడు ఆ భగవంతునే సర్వ జీవకోటిలో దర్శిస్తూ, తన మనో బుద్ధి చిత్త అహంకారాలతో సదా సర్వులయొక్క అభివృద్ధినే కాంక్షిస్తూ తనకై ఏమీ ఆశించకుండా, ఎటువంటి మానసిక ప్రలోభాలకు లొంగకుండా ఉంటాడు. అటువంటి అంతరేంద్రియ నిగ్రహమే శమము.

మనకంటే బలవంతులెవరో మన ఆస్తిని ఆక్రమించారనుకోండి, మనం వారికంటే బలవంతులైనవారిని ఆశ్రయించి మన ఆస్తిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం కదా! అలాగే మన మనస్సును ఆక్రమించిన శత్రువులను చూస్తూ సినిమా పాటలో శాస్త్రిగారు అన్నట్టు 'మనసుమీద వయసుకున్న అదుపు చెప్పతరమా?' అనుకుంటూ ఊరుకోకుండా ఆ మనస్సును అంతకంటే బలవంతుడైన భగవంతుని అదుపులోకి అర్పించగలిగితే ఆ స్థానబలంతో ఆ శత్రువులందరూ మనకు మిత్రులుగా మారిపోయి మన సాధన పురోగతి చెందటానికి ఎంతగానో సహకరిస్తారు.

7, జనవరి 2020, మంగళవారం

సమదృష్టి


దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ||

మనం జీవితంలో ప్రతిరోజూ ప్రతి విషయంలోనూ నాది పరాయిది, మిత్రుడు శత్రువు, గొప్పది తక్కువది, ఇష్టమైనది ఇష్టం లేనిది ఇలా భేదదృష్టితోనే చూస్తూ ఉంటాం. మెత్తటి పరుపులున్న పెద్ద మంచం కనిపిస్తే అదే సుఖం అనుకుంటాం. కటికనేలమీద పడుకోవాలంటే డీలా పడిపోతాం. మన మిత్రులు కనిపిస్తే ముఖం చేటంత చేసుకుంటాం, శత్రువులు కనిపిస్తే అదే ముఖం మాడ్చుకుంటాం. తెల్లగా ఉండేవాళ్ళు, పెద్దపెద్ద కళ్లుగలవారు, లావుగా లేనివారు ఇలా అందానికి కొన్ని నిర్వచనాలు మనమే చెప్పుకొని అలా కనబడినవారిని ఆరాధిస్తాం. దానికి వ్యతిరేక లక్షణాలతో ఉన్నవారిని ఆటపట్టించడమో ఈసడించుకోవటమో చేస్తాం. డబ్బు, అధికారం ఉన్నవాడిని అతిగా గౌరవిస్తాం, పేదవాడిని నెట్టివేస్తాం.

ఈ పైన చెప్పినవన్నీ మనలోనే మనకు తెలియకుండా అంతర్లీనంగా ఉన్న రాక్షస లక్షణాలు. మన పురాణాలలో కనిపించే అనేకమంది రాక్షసులలో ఇవే లక్షణాలు బహిరంగంగా కనిపిస్తాయి. అందులో అందరికంటే బలవంతుడు, దుర్మార్గుడు అయిన రావణుడు తాను సదాశివుని సేవించుకోవాలంటే ముందు తనకు ఎటువంటి దృష్టి అలవడాలో శివతాండవ స్తోత్రంలో భాగమైన పై శ్లోకంలో చెబుతున్నాడు. 'నాఽరుద్రో రుద్రమర్చయేత్' - రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించరాదు - అనేది నియమం. అందుకే మనం శివాభిషేకం చేసుకోవాలంటే ముందుగా మహన్యాసంతో మనలో ప్రతి అంగంలో ఉన్న శివుని మనకు దర్శింపచేసి మన అసలు శివస్వరూపాన్ని మనకు గుర్తింపచేసి అప్పుడు కానీ మనకు అభిషేకానికి అనుజ్ఞ ఇవ్వరు.

మనం శివునిగా మారాలంటే ఆయన లక్షణాలను మనం ముందుగా అలవర్చుకోవాలి కదా. అవే ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. కఠిన శిలను విచిత్ర తల్పాన్ని, పాములదండను ముత్యాల హారాన్ని, మట్టిముద్దను శ్రేష్టమైన రత్నాన్నీ, శత్రువును స్నేహితుని, గడ్డిపోచలలాంటి కళ్లుగలవాడిని అరవిందనేత్రుడిని, సామాన్య ప్రజానీకాన్ని మహేంద్రుడిని సమదృష్టితో చూడటం ఆ శివుని లక్షణం. ఆ నీ లక్షణాన్ని నేనెప్పటికి అలవరచుకొని నీ సేవకు అర్హత సంపాదిస్తాను తండ్రీ! అని రావణుడు ప్రశ్నిస్తున్నాడు.

మనం సాధారణంగా దారిద్య్రానికి కుచేలుడిని, ఐశ్వర్యానికి కుబేరుడిని ప్రతీకలుగా చెప్పుకుంటాం. మనకు అవకాశం వస్తే కుబేరుడితోనే స్నేహం చెయ్యాలనుకుంటాము కానీ కుచేలుడితో కాదు కదా! అలాగే పైన చెప్పిన జతలన్నింటిలో మనం రెండవ వాటినే ఎంచుకోవాలనుకుంటాం కానీ మొదటివాటిని కాదు. భగవంతుని దృష్టిలో ఆ భేదాలేవీ ఉండవు. పదహారు వేల తరుణులను పెండ్లాడగల సిరిగల దేవుడైన శ్రీకృష్ణునికి కుచేలుడు ప్రాణమిత్రుడు. అలాగే ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొనే శివునికి కుబేరుడు ప్రాణమిత్రుడు.

కృష్ణుడు వెన్నముద్దలను ఎంత ఇష్టంగా తిన్నాడో మట్టిముద్దనూ అంతే ఇష్టంతో స్వీకరించాడు. శివుడు భక్తులందరూ సమర్పించిన నైవేద్యాలను ఎలా స్వీకరించాడో హాలాహలాన్ని కూడా అలాగే స్వీకరించాడు. ఒకరు పాములను దండలుగా ధరించినా మరొకరు ముత్యాల హారాలను ధరించినా, ఒకరి కుమారుడు గడ్డిపోచలలాంటి సన్నని కళ్లుగల వినాయకుడైనా ఇంకొకరి కుమారుడు అరవిందనేత్రుడైన మన్మథుడైనా శివకేశవుల స్నేహానికి ఇవేమీ అడ్డు కాలేదు. వారిద్దరిలో ఎటువంటి భేదదృష్టి లేదు. అసలు వారిద్దరికీ భేదమే లేదు.

మనం కూడా అన్నింటా అటువంటి సమదృష్టిని అలవరచుకొన్నప్పుడే ఆ పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యులమౌతాము. అంతేకాని నిరంతరం సృష్టిలో ప్రతిదానిలో భేదభావాన్నే చూస్తూ, సాటి జీవులను హింసిస్తూ మనం ఎన్ని పూజలు చేసినా ఆ పరమాత్మ వాటిని స్వీకరించడు. ఈ సమదృష్టిని సాధించడమే యోగమంటే - సమత్వం యోగముచ్యతే.