వెంకట్రావుకి భక్తి మెండు. పైగా అతనికి ఎలాగైనా చనిపోయిన తరువాత వైకుంఠానికి చేరుకోవాలని కోరిక. భారతదేశంలో అతడు దర్శించని పుణ్యక్షేత్రం లేదు, నీరాడని తీర్థం లేదు. ఎవరు ఏమి చేస్తే పుణ్యం వస్తుందని చెప్పినా అవన్నీ చేసేవాడు. ప్రతి పుణ్యక్షేత్రంలో తన పేర అన్నదానానికి విరాళాలు ఇచ్చాడు. నలుగురిలో గొప్ప పుణ్యాత్ముడనే పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా చివరికి అతనికి అంత్యకాలం సమీపించింది. అయితే తనను తీసుకుపోవడానికి విష్ణుదూతలు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న వెంకట్రావు ఆశ అడియాసే అయ్యింది. ఎదురుగా యమదూతలను చూసి బిక్కచచ్చిపోయాడు.
చేసేదేమీ లేక వారితో బయలుదేరాడు. ఆ ప్రయాణం సుదీర్ఘంగా సాగుతోంది. కొంత సమయం గడిచాక ఎలాగో మెల్లగా ధైర్యం కూడదీసుకొని ఆ యమదూతలతో మాట కలిపాడు. “అయ్యా! నేను నా జీవితమంతా ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. గొప్ప పుణ్యాత్ముడిగా పేరు గడించాను. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని నమ్మి కనబడిన దేవునికల్లా మ్రొక్కాను. ఈ చేసిన పుణ్యకార్యాలకు నారాయణుడు ఎంతగానో సంతోషించి నన్ను వైకుంఠానికి తీసుకెళతాడని నేను విష్ణుదూతలకోసం నిరీక్షిస్తుంటే తీరా మీరు వచ్చారు. దయచేసి నేను చేసిన తప్పేమిటో సెలవిస్తారా?” అని భయపడుతూనే ప్రశ్నించాడు.
దానికా యమదూతలు పెద్దగా నవ్వుతూ “చూడు నాయనా! నువ్వు చెప్పినదంతా నిజమే. నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు. అయితే అంతకంటే ఎక్కువే పాపాలు చేశావు. అందుకే నిన్ను ముందుగా నరకానికి తీసుకువెళ్ళడం జరుగుతోంది. నువ్వు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగావు. అక్కడి విగ్రహాలలో, నదులలో భగవంతుని చూడటానికి ప్రయత్నించావు, కానీ ఏనాడైనా నీ చుట్టూ ఉన్న మనుష్యులలో, ఇతర ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని గుర్తించావా? ఏ క్షేత్రానికి వెళ్ళినా నీ మనస్సు ఎంతసేపూ పూజల చుట్టూ, స్నానాల చుట్టూ తిరుగుతూ ఉండేది తప్ప, అక్కడ నీకు ఎదురైన దీనజనులకు నీ చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? పైగా ఎవరైనా సహాయం అర్థిస్తే వారిని అనుమానంతో చూడటమే కాక, చీదరించుకునే వాడివి, గుర్తుందా?
ఎన్నో క్షేత్రాలలో అన్నదానానికి విరాళాలు ఇచ్చావు కానీ, అవన్నీ కేవలం పుణ్యం సంపాదించుకోవడానికే తప్ప అన్నార్తుల మీద జాలితో కాదు. నీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వచ్చినా వారిని అసహ్యించుకుంటూ, తప్పదని దూరంనుంచే ఎంతో కొంత విసిరివేసేవాడివి కానీ ఇస్తున్నది నారాయణుడికనే భక్తితో, వినయంతో ఎపుడైనా దానం చేశావా? నీ అవసరానికి చెప్పులు కుట్టించుకొని కనీసం అందుకు మూల్యాన్ని అతనికి మర్యాదగా చెల్లించకుండా, నేలమీద విసిరేసి వెళ్లిపోయేవాడివి. ఎందుకంటే అలాంటి వారిని ముట్టుకోవాలంటేనే నీకు అసహ్యం. దివ్య క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ సహపంక్తి భోజనాలు చేయడానికి నీకు చిరాకు. నీ ఇంటిలోనే పనిచేసే పని మనుషులను ఏనాడూ మనుషులుగా చూడలేదు.
బంధువులకు, స్నేహితులకు గొప్పకోసం మళ్ళీ మళ్ళీ క్రొత్త బట్టలు పెడుతూ ఉండేవాడివి కానీ, ఎవరైనా లేనివారు వచ్చి ఒక పాత బట్ట ఇవ్వమంటే చీదరించుకునే వాడివి. పెద్ద ఇల్లైతే కట్టుకున్నావు కానీ వర్షానికి భయపడి నీ వసారాలోకి ఏ కుక్కో వస్తే దాని కాళ్ళు విరగగొట్టే వాడివి. ఇలా అనేక దీనజీవుల పట్ల అసహ్యాన్ని ప్రదర్శిస్తూ పాపాన్ని పోగేసుకున్నావు. ‘సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని నమ్మావు కానీ ‘సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’ అని తెలుసుకోలేకపోయావు. నువ్వు నమ్మిన ఆ నారాయణుడే స్వయంగా ‘సర్వస్య చాహం హృది సన్నివిష్టః’, ‘ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి’ అని చాటి చెప్పాడు కదా! భగవంతుడికి తనకు పూజలు చేసే వారికన్నా ఇతర జీవులకు సేవ చేసేవారు అంటేనే ఎక్కువ ఇష్టం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి వచ్చే జన్మలోనైనా సర్వ జీవకోటిలో ప్రకాశిస్తున్న జీవేశ్వరుని దర్శించి సేవించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వెక్కడ ఉంటే అదే వైకుంఠం అవుతుంది” అని ప్రబోధించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి