10, ఆగస్టు 2017, గురువారం

వ్యష్టి-సమిష్టి

మనం ఎప్పుడూ నేను, నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా కులం, నా ఊరు, నా జాతి ఇలా ప్రతి దాంట్లో నాది, పరాయిది అని భావిస్తూ ఉంటాం. దీనినే వ్యష్టి భావన అంటారు. ఈ వ్యష్టి భావనలో ఉన్నంత కాలం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అలాగే మంచి చెడులు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాక ఈ జగత్తంతా ఒక్కటే అనే భావన దృఢమైన నాడు ఈ వ్యత్యాసాలన్నీ అంతరించిపోతాయి.

ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఎవరైనా పెద్దల దగ్గరకు వెళ్ళి "అయ్యా! నేను నుదుటన విభూతి ధరించాలి అనుకుంటున్నాను" అన్నారనుకోండి, "అయ్యో! తప్పకుండా ధరించు నాయనా. అది ఎంతో శుభప్రదం" అంటారు. అదే మీరు "అయ్యా! నేను విభూతి నా కాలికి రాసుకోవచ్చా?" అని అడిగారనుకోండి, "బుద్ధుందా? లేదా? పరమ పవిత్రమైన విభూతిని అలా అవమానిస్తావా?" అని తిడతారు. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాల పట్ల వ్యష్టి భావన ఉంది కనుక ఒక ఇంద్రియం ఉన్నతమైనది మరొకటి నీచమైనది అనే భేదాలు ఉన్నాయి. అదే మీరు "అయ్యా! నేను నా ఒళ్ళంతా విభూతి పూసుకోవాలనుకుంటున్నాను" అన్నారనుకోండి, "భేషుగ్గా పూసుకో నాయనా! సాక్షాత్తూ పరమశివునిలా ప్రకాశిస్తావు" అంటారు. మరి ఈ ఒళ్ళంతాలో తల, పాదాలు, ఇంకా మధ్యలోని అన్ని అంగాలూ, మనం పైకి చెప్పుకోటానికి సిగ్గుపడే వాటితో సహా, ఉంటాయి కదా. కానీ ఇక్కడ సమిష్టి భావన ఉండటంచేత ఆ భేదాలన్నీ అంతరించిపోయి అది తప్పుగా తోచలేదు.

మరో ఉదాహరణ చూద్దాం. మీరు గుడిలోకి వెళ్లి దేవుడికి శిరస్సుతోనో, చేతులతోనో నమస్కరించారనుకోండి, చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అదే మీరు పాదాలతో నమస్కరిస్తామన్నారనుకోండి విన్నవాళ్ళు మీ పైకి చెప్పులు తీస్తారు. కానీ మరి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మనం పాదాలతో కూడా భగవంతునికి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే "ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగముచ్యతే". ఇదే వ్యష్టి భావనకు సమిష్టి భావనకు ఉన్న తేడా.

3, జులై 2017, సోమవారం

నొప్పింపక-తానొవ్వక

మనం చాలామందిని చూస్తూ ఉంటాం - ఇతరులను ఎట్టి పరిస్థితులలోనూ కష్టపెట్ట కూడదని తాము మాత్రం వారివలన చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ లోకంలో అలా బ్రతకటం చాలా కష్టం. మానవుడు సంఘజీవి. మనందరం పరస్పర ఆధారితులం. అందుకే ఇతరులను కష్టపెట్టకపోవటం ఎంత ముఖ్యమో మనం కష్టపడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే సుమతీశతకంలో "పరులను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అని చెప్పబడింది. అలాగే భగవద్గీతలో కూడా భక్తునికి ఉండవలసిన లక్షణాలలో "యస్మాన్నోద్విజతే లోకాః లోకాన్నోద్విజతేచయః" - లోకాన్ని కష్టపెట్టకుండా, లోకం వలన తాను కష్టపడకుండా ఉండటం ఒక లక్షణంగా చెప్పబడింది.

వెనకటికి ఒక ఊరిలో ఒక సాధువు ఆథ్యాత్మిక ఉపన్యాసం చేస్తూ అహింస గురించి ప్రముఖంగా ప్రస్తావించి అందరిలో పరమాత్ముడు ఉంటాడు కనుక ఎవరినీ హింసించకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారుట. ఆయన అక్కడనుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద బలిష్టమైన సర్పం ఆయనకు ఎదురుపడి, "స్వామీ మీరు ఎవరినీ హింసించకూడదు అని చెప్పారు కదా, నిజంగా అదే సరైన పనా?" అని అడిగింది. అప్పుడు ఆ స్వామి "అవును. ఇకనుంచి నువ్వు కూడా ఎవరినీ కరవకుండా ఉండగలవా?" అని ప్రశ్నిస్తే ఆ సర్పం అందుకు అంగీకారం తెలిపింది. ఆ సర్పాన్ని ఆశీర్వదించి ఆ స్వామి అక్కడనుండి వెళ్ళిపోయారు.

అప్పటినుండి ఆ సర్పం ఎవరినీ కరవటం మానేసింది. ఇది గమనించిన ఊరివారు దానికి భయపడటం మానేసి ఎదురు దానినే రాళ్ళతో కొట్టటం, రకరకాలుగా హింసించటం మొదలుపెట్టారు. అయినా అది స్వామికి ఇచ్చిన మాటకు కట్టుపడి ఎవరికీ ఎదురు తిరగకుండా అలాగే బాధలను భరిస్తోంది. కొన్నాళ్ళకు ఆ స్వామి మళ్ళీ అదే ఊరిగుండా వెళ్ళడం తటస్థించింది. అప్పటికి చిక్కి శల్యమై వళ్ళంతా గాయాలతో ఉన్న ఆ సర్పాన్ని చూసి స్వామి మనసు ద్రవించింది. దానిని దగ్గరకు పిలిచి "ఎందుకు నీకీ దురవస్థ?" అని కరుణ నిండిన హృదయంతో ప్రశ్నించారు. అందుకు ఆ సర్పం "స్వామీ! మీకిచ్చిన మాట ప్రకారం నేను ఎవరినీ కరవటం లేదు. అందుకే నాకీ దురవస్థ" అని సమాధానమిచ్చింది. అప్పుడు ఆ స్వామి "నేను నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు కదా. ఎదుటివారిని హింసించకపోవటం ఎంత ముఖ్యమో మనలను మనం కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వారిలో ఉన్న పరమాత్ముడే నీలో కూడా ఉన్నాడు కదా!" అని సమాధానమిచ్చారు. అప్పటినుండి ఆ సర్పం ఎవరైనా తన మీదకు రాగానే బుసకొట్టి వారినుండి తనను తాను రక్షించుకోవటం మొదలుపెట్టింది.

30, మే 2017, మంగళవారం

వైరాగ్యం

మనకు సాధారణంగా ఇష్టమైన వస్తువులు చూస్తే రాగం, అలాగే ఇష్టం లేని వాటిపై ద్వేషం కలుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కష్టం కలిగినప్పుడో, చూసినప్పుడో, మంచి మాటలు విన్నప్పుడో క్షణికావేశంలో వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. దీనినే మన పెద్దలు ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అన్నారు. ఆయా సందర్భాలు దాటిపోగానే మళ్ళీ మన రాగద్వేషాలు మామూలే.

అయితే మనందరికీ సంతృప్తితో కూడిన వైరాగ్యం కలిగేది ఒక్క ఆహారం విషయంలో మాత్రమే. మనిషికి ఇతర పదార్థాలు ఎన్ని యిచ్చినా ఇంకా కావాలనే కోరుకుంటాడు కానీ కడుపు నిండిన తరువాత ఆహారాన్ని మాత్రం ఇక కోరుకోడు, అది ఎంత ఇష్టమైన పదార్థమైనా సరే.

ఎందుకంటే ఇతర పదార్థాలు ఎన్ని పొందినా అవన్నీ మనకు భిన్నంగానే ఉంటున్నాయి. అదే ఆహారమైతే మనలో ప్రవేశించి మన స్వరూపాన్ని పొందుతోంది. అందుకే ఆ తృప్తి, ఆ వైరాగ్యం. తిన్న ఆహారం తన పని పూర్తి చేసుకుని మళ్లీ మననుంచి భిన్నత్వాన్ని పొందితే కానీ మనకు మళ్లీ దానిమీద కోరిక కలుగదు.

అలాగే ఈ కనిపించే సృష్టి అంతా మన స్వరూపమే, మనకు భిన్నమైనది ఏదీ లేదు - "నీవు చూచునదెల్ల నీవయేయను తత్త్వమసి వాక్యం" మనకు ఆరూఢ జ్ఞానమైనప్పుడు మనకు శాశ్వతమైన సంతృప్తి, అన్నిటి పట్ల వైరాగ్యం కలుగుతాయి. ఆ జ్ఞానాన్ని పొందేవరకు కనీసం మనకంటే భిన్నంగా ఏదీ లేదనే విషయాన్ని మాటిమాటికీ గుర్తు చేసుకుంటూ ఉంటే వైరాగ్యం పొందటం సులభమవుతుంది.