11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అనాయాస మరణం

 అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం

దేహాన్తే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే||

    ప్రతి మానవుడు తప్పకుండా కోరుకోవలసిన కోరిక ఇది. బ్రతికినన్నాళ్ళు ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకడం, మరణ సమయంలో ఎక్కువగా కష్టపడకుండా సునాయాసంగా మరణించడం, ఆ తరువాత పరమేశ్వరునిలో సాయుజ్యం చెందడం, ఇంతకన్నా కోరుకోదగినది ఏమి ఉంటుంది?

            జన్మకు వచ్చిన ప్రతి జీవికి ఆరు అవస్థలు ఉంటాయి. వీటినే షడ్భావ వికారాలు అంటారు. అవి - అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, నశ్యతే. ముందుగా తల్లి గర్భంలో ఉండటం - అస్తి. ఆ తరువాత జన్మించడం - జాయతే. ఇక అలా జన్మించిన వ్యక్తి ముందు పెరుగుతాడు(వర్ధతే), ఆ తరువాత మధ్య వయస్సులో శరీరం అనేక మార్పులు చెందుతుంది(పరిణమతే). ఆ వయసు దాటిన తరువాత మెల్లగా శరీరంలోని పటుత్వం, అలాగే చూపు, వినికిడి, నడక ఇలా ఒక్కొక్క అవయవం క్షీణించడం మొదలుపెడుతుంది(అపక్షీయతే). చివరికి ఈ శరీరం పడిపోతుంది(నశ్యతే).

        పుట్టడం, పెరగడం, మార్పు చెందడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమని మనందరికీ తెలిసినదే కదా! అయితే గర్భిణీ అయిన ప్రతి స్త్రీ తనకు సహజ ప్రసవం జరగాలని కోరుకుంటుంది కదా. కొంతకాలం క్రితం వరకు డబ్బులకోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసిన డాక్టర్లు కూడా ఇప్పుడు సహజ ప్రసవమే తల్లికి, బిడ్డకు మంచిదని, తల్లిపాలే బిడ్డకు అత్యుత్తమమని, అలాగే మనందరం సహజంగా పండిన ఆహారాన్నే తీసుకోవాలని ఇలా చెబుతున్నారు కదా.

        ఇలా పుట్టుకనుంచి జీవితంలో ప్రతి విషయంలో సహజత్వాన్ని ఎలా కోరుకుంటున్నామో మరణం విషయంలో కూడా అలాగే సహజ మరణాన్ని కోరుకోవాలి. వెనకటి కంటే వైద్య సదుపాయాలు బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మృత్యువు అంచులలో ఉన్నవారిని, ఇంకా మరణించిన వారిని కూడా ఏదో ఒక పద్ధతిలో బ్రతికించాలని, వారి ఆయుష్షును పొడిగించాలనే ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఇంకా జీవితం సరిగ్గా అనుభవించని యువకులు, లేదా బాధ్యతలు తీరని మధ్య వయస్కుల విషయంలో అనుకోని ఆపద, లేదా వ్యాధి ఎదురై మరణించే పరిస్థితి వచ్చినపుడు ఇలా ఆరాట పడటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

        కానీ నిండు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన పెద్దవారు తాము కట్టకొన్న ఇంటిలో తన వాళ్ళందరూ చుట్టూ ఉండగా, ఆనందంగా, సహజంగా దేహాన్ని వదిలిపెట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! ఇక దేహాన్ని వదలివేయడం తథ్యం అన్న పరిస్థితులలో కూడా వారిని ఐసియూలో పెట్టి వంటినిండా సూదులు, గొట్టాలు గుచ్చి చుట్టూ తనవాళ్ళు అంటూ ఎవరూ కనబడని నిస్సహాయ స్థితిలో మరణించేలా చేయడం ఎంతవరకు సమంజసం? మనం ప్రేమించేవాళ్ళు ఎల్లకాలం మనతోనే ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. అయితే దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా. వయసుకు వచ్చిన పిల్లలు మనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఎంత సహజమో, వయసు అయిపోయిన పెద్దవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం కూడా అంతే సహజం. 

        అయితే ఎవరైనా పెద్దవారు ఇంట్లో సహజంగా మరణించారంటే ఈ చుట్టూ ఉన్న సమాజం చూస్తూ ఊరుకోదు. ఒక్కొక్కరూ పలకరింపుగా వచ్చి ఆ పిల్లలను "అయ్యో పెద్ద డాక్టరుకి చూపించక పోయారా?" "ఎకో టెస్టు చేయించాల్సింది." "లేదు, ట్రెడ్మిల్ టెస్టు చేస్తే కానీ ఇలాంటివి బయటపడవు" అని ఇలా సలహాలు ఇస్తున్నట్లుగా సూటిపోటి మాటలతో తామేదో లోటు చేశామనే అపరాధ భావనను ఆ పిల్లలలో కలిగిస్తారు. ఈ పోరు తట్టుకోలేక, ఇటువంటి పరిస్థితిని చూసినవారు రేపు తమ ఇంటిలో పెద్దవారిని ఏ చిన్న రోగం వచ్చినా నానా రకాల వైద్యాలు చేయించి చివరికి ఏ ఐసీయూలోనో మరణించే పరిస్థితిని కల్పిస్తారు.

    మరణం ఏ విధంగా సంభవిస్తుంది అనేది మన చేతిలో లేదు. ఈ శరీరం ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చినది. అది తీరగానే పడిపోతుంది. కొంతమందికి ముందుగానే ఆ ప్రారబ్ధం తీరిపోయి ఏ నిద్రలోనో అనాయాస మరణం సంభవించవచ్చు. మరికొంత మందికి చివరివరకూ తీరక విపరీతమైన మరణవేదన అనుభవించవలసి రావచ్చు. ఏదైనా ఈశ్వర సంకల్పమే. అయితే పైన చెప్పుకున్నట్లు ఆ మరణం సహజంగా తన ఇంటిలో తన వారి మధ్య జరగాలని ప్రతి వ్యక్తి కోరుకోవడంలో తప్పు లేదు కదా! 

         అయితే తాను మరణించిన తరువాత తన పిల్లలు ఇలా సూటిపోటి మాటలకు గురై ఏదో లోటు చేశామనే అపరాధ భావనకు లోను కాకుండా తాను తృప్తిగానే జీవితాన్ని ముగించానని వారు కూడా సంతోషపడేలా చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. నిజంగా మరణ సమయం ఆసన్నమయినపుడు తాను తెలివిలో ఉంటాడో, అపస్మారక స్థితిలో ఉంటాడో తెలియదు కదా. అందువలన వారు ఎటువంటి మరణాన్ని కోరుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, తన సంతానానికి, స్నేహితులకి ఒకటికి రెండు మూడుసార్లు తెలియజెబితే, తాను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా తన ఇంటిలోనే, తనవారి మధ్యలో సహజంగా శరీరాన్ని వదిలి శివ సాయుజ్యాన్ని పొందుతాడు.

2 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా చెప్పారు.
    ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఐన వాళ్ళ అత్యాశా, అటువంటి రోగులను డబ్బులమూటల్లా చూసే వైద్యులదురాశా కారణంగా వృధ్ధులు దారుణవేదనామరణాల పాలవుతున్నారు. నిజం.

    రిప్లయితొలగించండి