23, డిసెంబర్ 2023, శనివారం

వైకుంఠ ఏకాదశి

 శ్రీమహావిష్ణువు శయనైకాదశి(ఆషాఢ శుద్ధ ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళతాడని మన పెద్దలు చెబుతారు. అప్పటినుండి నాలుగు నెలలు మహాత్ములు అందరూ చాతుర్మాస్య వ్రతం చేస్తారు.  శయనైకాదశి అయిన రెండు నెలలకు విష్ణుమూర్తి నిద్రలోనే ఇటునుండి అటు తిరుగుతాడని, దానిని పరివర్తన ఏకాదశి(భాద్రపద శుద్ధ ఏకాదశి) అంటారు. మరో రెండు నెలల తరువాత ఆయన నిద్రనుండి లేచే ఉత్థాన ఏకాదశి(కార్తీక శుద్ధ ఏకాదశి) వస్తుంది. దీనినే క్షీరాబ్ధి ఏకాదశి అని, చిలుక(చిలుకు) ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాగర మథనం (సముద్రాన్ని చిలకడం) ఆ రోజే ప్రారంభమైనదని చెబుతారు. ఆ తరువాత ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని(అది మార్గశిర మాసం కావచ్చు, లేదా పుష్య మాసం కావచ్చు) వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం.

    ఈరోజు శ్రీమహావిష్ణువు వైకుంఠపు ఉత్తరద్వారాలు తెరచి దర్శనమిస్తారని, ముక్కోటి దేవతలు ఆ అరుదైన దర్శనానికి వైకుంఠానికి చేరుకుంటారని ప్రతీతి. అయితే మనం దేవతల కాలమానాన్ని కొద్దిగా గమనిస్తే, చద్రమండలంలో ఒక రోజు అంటే మనకి ఒక నెలతో సమానం. అలాగే సూర్య మండలంలో ఒక రోజు మనకు ఒక సంవత్సరం. అలా పైకి వెళ్ళినకొద్దీ కాలప్రమాణం పెరుగుతూ పోతుంది. బ్రహ్మదేవుడికి ఒక క్షణం అయితే మనకు ఒక సంవత్సరం అవుతుంది. మరి అంతకంటే పై స్థాయిలో ఉండే విష్ణుమూర్తికి మన ఒక సంవత్సరంలోనే నిద్ర, మెలకువలతో కూడిన రోజు పూర్తి అయిపోవడమంటే కొంచెం ఆశ్చర్యంగానే తోస్తుంది.

    కొంచెం లోతుగా ఆలోచిస్తే నిజానికి ఇవన్నీ మన సాధనలోని దశలని అనిపిస్తాయి. వ్యాపకత్వం విష్ణువు లక్షణం. ఆయన విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు. అలాగే మన శరీరంలో అంతటా వ్యాపించి ఉండేది మనస్సు. ఉత్ అంటే ఎత్తు, లేదా పైన. మనం మ్యాపులో చూస్తే పైన ఉండే దిశను ఉత్తరం అంటాం కదా. ఉత్తరం అంటే నువ్వు చూస్తున్న వాటిలో మిగిలిన వాటికంటే పైన ఉండేది. ఉత్తర ద్వారం అంటే సహస్రార చక్రమే. అసలు అన్నిటికంటే పైన ఉండేది ఉత్తమం. సనకాది మహర్షులు జ్ఞానతృష్ణతో ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటే అక్కడ దక్షిణాభిముఖుడై పరమేశ్వరుడు గురురూపంలో దక్షిణామూర్తిగా వారి ఎదుట ప్రత్యక్షమై తన మౌన వ్యాఖ్యతోనే పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటితం చేస్తారు. అలా గురుమూర్తి ఉత్తర భాగంలో, అంటే తనకంటే పై స్థాయిలో ఉండి చేసిన బోధను అందుకొని సాధకుడు తన యోగసాధనను ప్రారంభిస్తాడు. అదే శయనైకాదశి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేన్ద్రియాలను నిగ్రహించి వాటికి అధిపతియైన పదకొండవది అయిన మనస్సుతో చేసేది సాధన. అందుకే ఇవన్నీ ఏకాదశులు.

    ఇలా సాధన మొదలు పెట్టిన సాధకుడి మనస్సు మెల్లగా పరివర్తన చెంది ప్రపంచాభిముఖంగా ఉండేది పరమాత్మకు అభిముఖంగా తిరుగుతుంది. అదే పరివర్తన ఏకాదశి. సాధన మరికొంత ముందుకు సాగుతున్న కొద్ది ఆ వ్యక్తి తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎగబ్రాకుతాడు. చివరికి బ్రహ్మజ్ఞానోదయం అవుతుంది. అలా బ్రహ్మజ్ఞానమునందు మేల్కొనడమే ఉత్థాన ఏకాదశి. అలాగే సాధనలో మన మనస్సును చిలికి అందులోని మంచి, చెడు విషయాలనన్నింటిని బయటకు తీసివేసినప్పుడు చివరికి బ్రహ్మామృతం లభిస్తుంది. అందుకే ఇది చిలుకు ఏకాదశి కూడా. ఇప్పుడు తాను బ్రహ్మమునని, ఈ జగత్తుకంటే ఉన్నతమైన స్థితిలో (దానికి ఉత్తరభాగంలో) ఉన్నానని అనుభూతిలోకి తెచ్చుకుంటాడు. అలా 'అహం బ్రహ్మాస్మి' అని అనుభవంలోకి తెచ్చుకున్న తరువాత మరి జగత్తు ఏమవుతుంది? తాను మాత్రమే బ్రహ్మ కాదు కదా! బ్రహ్మమంటేనే సర్వవ్యాపకమైనది. అంటే 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని గ్రహిస్తాడు.

    విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటిది 'విశ్వం', రెండవది 'విష్ణుః'. అంటే ఈ విశ్వమంతా విష్ణువే. ఈ అనుభవాన్ని పొందడమే ఉత్తరద్వార దర్శనం. దీనిని ఉత్తరద్వారం అన్నారు కానీ ఉత్తమద్వారం అనలేదు. ఎందుకంటే అది పైన ఉంది కానీ, అన్నిటికంటే పైన కాదన్నమాట. ఎందుకంటే ద్వారం అంటేనే దానిలోనుంచి ఇటూ అటూ వెళ్ళే వీలు ఉంటుంది కదా. అంటే ఆ ద్వారానికి ఇంకా పైన (ఇంకా ఉత్తరంలో) ఏదో ఉంది అన్నమాట. సరిగ్గా అక్కడే ఈ ముక్కోటి దేవతలు విష్ణుదర్శనం కోసం నిరీక్షిస్తూ ఉంటే స్వామి సాక్షాత్కరిస్తారు. ఇప్పుడు చూస్తే దేవతలందరూ ఉత్తరభాగంలో దక్షిణం వైపు తిరిగి ఉన్నారు, విష్ణుమూర్తి దక్షిణభాగంలో ఉత్తరంవైపు తిరిగి ఉన్నారు. మొదట మనం చెప్పుకున్న దక్షిణామూర్తి ఉత్తరభాగంలో దక్షిణం వైపు తిరిగి ఉంటే ఋషులు దక్షిణభాగంలో ఉత్తరంవైపు తిరిగి ఉన్నారు.

    మళ్ళీ మన సాధన విషయానికి వస్తే, ప్రపంచానికంటే క్రింది స్థితిలో ఉండి, దానిచే నిత్యం బాధింపబడుచున్న సాధకుడు ఉన్నత స్థితిలో ఉన్న గురుదేవుల ఉపదేశంతో సాధన ప్రారంభించి, పరివర్తన చెంది, తనను ఈ ప్రపంచం బంధించలేదని, తాను దానికంటే ఉన్నతుడైన బ్రహ్మవస్తువునని తెలుసుకుని, ఇప్పుడు క్రిందికి(దక్షిణానికి) తిరిగి చూస్తే తనకు విశ్వం ఉండవలసిన స్థానంలో విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇదే ఉత్తరద్వార దర్శనం. ఇట్టి అత్యుత్తమ స్థితిలో స్థిరంగా కూర్చున్న వ్యక్తి (ఉత్ + ఆసీన = ఉదాసీన) సర్వాన్ని సమదృష్టితో చూస్తాడు. నేలమీద నడిచేవానికి ఒకరు లావుగా, ఒకరు సన్నగా, ఒకరు ఎత్తుగా, ఒకరు పొట్టిగా ఇలాంటి భేదాలన్నీ కనిపిస్తాయి కానీ ఎత్తైన పర్వతశిఖరం మీదనుంచో, విమానంలోనుంచో చూసేవాడికి ఏ భేదాలైనా కనిపిస్తాయా? అంతా ఏక స్వరూపంగానే కనిపిస్తుంది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'.

    ఈ ఏకాదశులన్నీ ఒకదానికొకటి రెండేసి నెలల దూరంలో ఉండటం మనం గమనించవచ్చు. అలాగే సాధనలో కూడా మనస్సు నిలబడాలంటే రోజూ కనీసం రెండు గంటలైనా ధ్యానం చెయ్యాలని గురువులు చెబుతారు. అలా సాధన చేసిన సాధకుడికి చివరికి 'నీవె నేనై నేనె నీవై జగంబెల్ల ఏక స్వరూపమై నేనుగా భాసించే బ్రహ్మానందానుభూతిని' గురుదేవులు అనుగ్రహిస్తారు. అప్పుడు నిత్యం వైకుంఠ ఏకాదశే! తాను చూసేదంతా ఉత్తరద్వార దర్శనమే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి