31, జనవరి 2021, ఆదివారం

ఈశ్వరుడు

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః

    ఈశ్వరుడికి, గురువుకు, ఆత్మకు రూపంలో భేదం తప్ప అసలు వస్తువులో భేదం లేదని, ఆకాశం ఎలాగైతే సర్వవ్యాపకమై ఉన్నదో అలాగే ఈశ్వరుడు కూడా సర్వవ్యాపకుడని ఈ దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకం వివరిస్తోంది. ఇలా మూడు రూపాలలో ఉంటూ మనకి బాగా తెలిసిన వస్తువు నీరు. నీటి ఆవిరి, లేదా తేమ రూపంలో మన చుట్టూ ఉన్న గాలి అంతటా వ్యాపించి ఉంటుంది నీరు. దీనికి ఒక రూపం లేదు. అలాగే ద్రవ రూపంలో మనం నిత్యం ఉపయోగించుకునే నీరు ఒక రూపంలో కనిపిస్తుంది కానీ ఒక నిర్దుష్టమైన ఆకారం లేకుండా అది ఏ పాత్రలో ప్రవేశిస్తే ఆ పాత్ర ఆకారాన్ని తాను పొందుతూ ఉంటుంది. అదే నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు తనకంటూ ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

    ఈశ్వరుడు కూడా ఆ నీటి ఆవిరిలాగే సర్వవ్యాపకుడైనప్పటికీ మన కంటికి కనిపించకుండా ఉంటాడు. అదే ఈశ్వరుడు ఆత్మ రూపాన్ని పొందినపుడు ఏ ప్రాణి శరీరంలో ప్రవేశిస్తే ఆ ప్రాణి ఆకారాన్ని పొంది, దానిలో చైతన్యాన్ని నింపి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ రెండు రూపాలూ కూడా ఇంద్రియాలకు అగోచరమైనవే. మరి ఆ ఈశ్వరుని, లేదా ఆత్మను తెలుసుకోవడం ఎలా? నిజంగా అలా తెలుసుకోవాలన్న ఆవేదన తీవ్రతరమైనపుడు ఆ భక్తుని భక్తిని సిద్ధింపచేయటానికై అదే ఈశ్వరుడు ఘనీభవించిన రూపంలో ఒక గురువుగా మనముందు ప్రత్యక్షమవుతాడు. "అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తిసిద్ధయే"

    నీరు వాతావరణంలోని మార్పులకు చాలా త్వరగా వేడెక్కిపోతూ ఉంటుంది. అలాగే మనందరిలో ఉన్న ఆత్మ సంసార తాపత్రయ స్పర్శ చేత ఆవేదనకు గురవుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు వేసవికాలంలో ఏవైనా పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు మంచినీళ్ళ పాత్రలలో మంచుగడ్డలు వేసేవారు. ఆ మంచుగడ్డ తాను ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా తన సాన్నిహిత్యంతో ఆ నీటిని కూడా చల్లగా చేస్తుంది. అలాగే ఆ మంచుగడ్డ త్వరగా కరిగిపోయినా కూడా నీటిలో ఆ చల్లదనం చాలాకాలం నిలిచి ఉంటుంది. అలాగే ఒక మహత్తరమైన ప్రయోజనం కొరకు ఆకారాన్ని ధరించి వచ్చిన గురువులు ఈ సంసార తాపత్రయంలో ఉంటూ కూడా తాము నిశ్చలమైన ప్రశాంతతను అనుభవించడమే కాకుండా తమనాశ్రయించిన వారందరి మనసులనూ అటువంటి ప్రశాంతతతో నింపివేస్తారు. తమ అవతార ప్రయోజనం నెరవేరగానే ఆ గురువుల రూపం కనుమరుగయినా వారి బోధలనుండి ప్రసరించిన ప్రశాంతత చిరకాలం అనేక జీవాత్మలకు శాంతిని ప్రసాదిస్తూనే ఉంటుంది.

    "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి" - "అర్జునా! ఈశ్వరుడు సర్వభూతాల హృదయంలో స్థిర నివాసియై ఉంటాడు" అని గీతాచార్యుడు ప్రవచించాడు. అయితే మనం ఈ హృదయంలోకి చూడటం అలవాటు చేసుకోవాలి. మన మనస్సు నిరంతరం బయటి విషయాల వెంటే పరుగులు పెడుతూ ఉంటుంది. తాను అనుకున్నది పొందటం కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. అది జరిగితే ఆనందిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా కృంగిపోతుంది. దీనికి కారణం కూడా అదే శ్లోకంలో పరమాత్మ చెబుతున్నాడు. "భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా" - "ఆ ఈశ్వరుడు ఊరికే హృదయంలో కూర్చోకుండా ఆయా జీవులను తన మాయ అనే యంత్రంలో వేసి గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు". 

    సాక్షాత్తు ఈశ్వరాంశ అయిన ఆంజనేయ స్వామి కుడా సీతాన్వేషణలో ఇలాగే లంకంతా గాలించినా అమ్మ కనబడక "ఇప్పుడు నేను అమ్మను చూడకుండా తిరిగి వెళితే రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తాడు, సుగ్రీవుడు మరణిస్తాడు, అయోధ్యలో ఇంకా కిష్కింధలో ఉన్న వారందరూ మరణిస్తారు" ఇలా చాలా చాలా దూరాలోచన లోకి వెళ్ళిపోతాడు. మనసు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అయితే ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఒక్కసారి తన మనస్సును కట్టడి చేసి తన హృదయంలోకి చూసుకుంటాడు. అక్కడ ప్రకాశిస్తున్న సీతారాముల దర్శనం కాగానే వారిని ప్రార్థించడం, వెంటనే ఆయనకు అశోకవనం, అందులో సీతాదేవి ప్రత్యక్ష దర్శనం కలగడం జరిగిపోతాయి. 

    గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు కూడా "నేను మీ హృదయ బాబును" అనేవారు. మనం సమస్యలలో చిక్కుకుని, ఎటూ నిర్ణయించుకోలేని ద్వైదీభావంలో మనస్సు అశాంతిని పొందినప్పుడు నిరాకారంగా ఉండే ఈశ్వరుడిని దర్శించలేకపోయినా, సాకారంగా వచ్చిన గురుదేవుల రూపం కనుమరుగయినా, మనసును పక్కనబెట్టి మన హృదయ క్షేత్రంలో నిరంతరం ప్రకాశించే ఈశ్వరుని మాట వినగలిగితే అంతులేని ప్రశాంతత మన సొంతమవుతుంది.