4, మార్చి 2019, సోమవారం

అభ్యాసం

మనం ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా అభ్యాసం తప్పనిసరి. పుట్టిన పిల్లవాడు తల్లి దగ్గర పాలు త్రాగడం దగ్గరనుండి ముసలివాడైనాక మనవలతో ఆడుకోవడం వరకు ప్రతిరోజూ ఎన్నో విద్యలను అభ్యసిస్తూనే ఉంటాడు. అలాగే నీవెవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, ఈ కనిపించే జగత్తు అంతా ఏమిటో తెలిపే ఆథ్యాత్మిక విద్యకు కూడా అభ్యాసం అవసరమే. ఈ అభ్యాసానికి మనకు గురువులు రెండు ఉపకరణాలను ఇచ్చారు. అవే శ్రవణం, మననం. బ్యాంకు లాకరుకు రెండు తాళాలు ఉన్నట్లుగా మన బుద్ధికి కూడా ఈ రెండూ తాళాలే. ఒకే తాళంచెవిని ఇటు త్రిప్పితే తాళం పడుతుంది, అటు త్రిప్పితే తాళం తెరుచుకుంటుంది. అలాగే ఈ శ్రవణ మననాలనే తాళం చెవులను ప్రపంచం వైపుకు త్రిప్పితే బంధానికి దారితీస్తాయి, గురుబోధ వైపుకు త్రిప్పితే మోక్షానికి దారి తీస్తాయి. తాళం పడితే అజ్ఞానం, తెరుచుకుంటే అదే జ్ఞానం.

మనందరం స్వతహాగా పరమాత్మ స్వరూపులమే అయినా ఆ జ్ఞానం మరుగున పడిపోయి "నేను ఫలానా, వీరు నా బంధువులు, ఇది నా కులం, గోత్రం, దేశం, ప్రాంతం" అనే బంధనాలు మనకు మనమే తగిలించుకుని సతమతమౌతున్నాం. మదాలసలాంటి తల్లి మనందరికీ దొరికి ఉంటే, పుట్టిన క్షణంనుండి "నువ్వు ఈ దేహానివి కావు. దీనికి కలిగే హాని వృద్దులు, సుఖదుఃఖాలు నీవి కావు. ఈ దేహానికి పేరు కోటేశ్వర రావు అయినా నీకు ఒరిగేదేమి లేదు, భిక్షపతి అయినా నీకు పోయేదేమీ లేదు. ఈ కనిపించేదంతా నశించిపోయేదే. నీవు శాశ్వతుడవు" అని నూరిపోసేది. కానీ మన తల్లిదండ్రులు మనం పుట్టిన క్షణంనుండి "నేను అమ్మను, నేను నాన్నను, ఇది నీపేరు, మేమంతా నీ బంధువులం, వారు పరాయివారు. ఇది నీ ఇల్లు, అది పరాయిది. ఇది నీ  బొమ్మ, ఎవరికీ ఇవ్వకు. నువ్వు బాగా చదివి మా పేర్లు నిలబెట్టాలి. బాగా సంపాదించాలి, కూడబెట్టాలి." ఇలాంటివే నూరిపోస్తున్నారు. 

నిజానికి చిన్నారి పాపలకు ఈ తరతమ భేదాలు ఏవీ తెలియవు. వారు ఎవరిని చూసినా నవ్వుతారు, చేతిలో ఉన్నది ఎవరడిగినా ఇచ్చేస్తారు. ఒక రుచికరమైన తినుబండారం ఇస్తే ఎలా తింటారో, అలాగే తాము విసర్జించిన మలాన్ని కూడా తీసి నోట్లో పెట్టుకుంటారు. కానీ పెద్దలు చేసే ఈ నిరంతర బోధవలన వారికి అదే శ్రవణ మననాలు కలిగి ప్రాపంచిక బంధాలలో ఇరుక్కుపోతున్నారు. అటువంటి మానవులు తమ నిజ తత్త్వాన్ని తెలుసుకోవటానికై సద్గురువులను ఆశ్రయించినప్పుడు ఆ గురుబోధ శ్రవణం ద్వారా అసలు తత్త్వం అర్థం అవుతుంది. అయితే నిరంతర మననం, అభ్యాసం లేనప్పుడు అది నిలబడదు.

ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పిల్లవాడికి చిన్నప్పటినుండి 'రెండు రెళ్ళు ఆరు' అని నేర్పించామనుకోండి, వాడికి అదే శ్రవణం, మననం వలన ఆ తప్పు లెక్కే వాడి మనస్సులో స్థిరంగా నాటుకుపోతుంది. అలాంటి పిల్లవాడు బడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు ముందుగా 'రెండు రెళ్ళు నాలుగు' అని చెప్పినా వీడు నమ్మడు. అప్పుడు ఆయన ఒక నాలుగు పెన్సిళ్ళనో, రూపాయి బిళ్ళలనో తీసుకొని ప్రాక్టికల్గా నిరూపిస్తారు. ఈ పిల్లవాడు ముందు ఆశ్చర్యానికి గురైనా తరువాత మెల్లగా అర్థం చేసుకుంటాడు. అయితే అంతకుముందు నరనరానా జీర్ణించుకుపోయిన తప్పుడు లెక్క అంత తేలికగా పోదు. హఠాత్తుగా ఎవరైనా 'రెండు రెళ్ళు ఎంత?' అనగానే ఠక్కున 'ఆరు' అంటాడు. అందుకే ఆ ఉపాధ్యాయుడు వీడికి అర్థం అయిన తరువాత కూడా అనేకసార్లు 'రెండు రెళ్ళు నాలుగు' అని నెమరువేయిస్తూ ఉంటాడు. అయితే పిల్లవాడు ఇంటికి రాగానే మళ్ళీ తల్లి 'రెండు రెళ్ళు ఆరు' అని చెబుతూ ఉందనుకోండి, ఇక వీడికి అసలైన లెక్క రావడానికి ఎంత కష్టం?

అలాగే మనం నిత్యం ఈ ప్రపంచంలో చూసేదంతా సత్యం అనే అందరి ద్వారా వింటున్నాం, దానినే మననం చేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి గురువుల ద్వారా "ఇదంతా మిధ్య, నీ అసలు తత్త్వం వేరు" అని విన్నా అది పురాణ వైరాగ్యం లాగా అక్కడినుంచి లేచి ఇవతలకు రాగానే మళ్ళీ మరపునకు వచ్చేస్తోంది. ఎందుకంటే మన శ్రవణ మననాలనే తాళంచెవులు నిరంతరం ప్రపంచం వైపుకే త్రిప్పబడుతున్నాయి, బంధాన్ని కలిగిస్తున్నాయి. మనం పుట్టినప్పటినుండే కాక ఇంతకు ముందు ఎన్నో జన్మలనుండి కూడా ఇదే అభ్యాసం చేస్తూ వస్తున్నాం. ప్రపంచం వైపుకు తిరిగిన ఈ శ్రవణ మననాలు చివరికి అధ్యాస, లేదా భ్రాంతికి దారి తీస్తున్నాయి. ఈ భ్రాంతి తొలగి మనలో జ్ఞానకాంతి ప్రకాశించాలంటే ఇంతకంటే మరెన్నో రెట్లు ఎక్కువగా గురుబోధని శ్రవణం, మననం చేయాలి. అప్పుడు అది నిదిధ్యాసకు, లేదా ఆత్మానందానుభూతికి దారితీస్తుంది.

అంతటి తీవ్రమైన అభ్యాసం లేకపోతే 'రెండు రెళ్ళు నాలుగు' అని ప్రత్యక్షంగా నిరూపణ అయినా మళ్ళీ ఆ పిల్లవాడు హఠాత్తుగా అడిగితే ఏమరుపాటుగా 'ఆరు' అని చెప్పినట్లే, మనకు ఒకవేళ భగవద్దర్శనం కలిగినా కూడా మళ్ళీ మాయ ఆవరించి ఈ జగత్తే సత్యమనే భ్రమలో పడిపోతాం. ఎంతమంది రాక్షసులకు తపస్సుల వలన భగవద్దర్శనం కాలేదు? వారందరూ ఆ క్షణం గడవగానే తిరిగి మాయలో పడిపోలేదా? Practice doesn't make you perfect. Practice just makes it permanent. So, beware of what you practice and make sure you always practice the perfect thing. "అభ్యాసం మనలను పరిపూర్ణులుగా చేస్తుంది" అనే ఒక భ్రమ ప్రచారంలో ఉంది. కానీ పైన చెప్పుకున్నట్టు మనం తప్పు విషయాన్ని అభ్యాసం చేస్తే ఆ తప్పే మన మనస్సులో శాశ్వతంగా నాటుకుపోతుంది. ఎప్పటికీ పరిపూర్ణులం కాలేము. అభ్యాసం కేవలం మన మనస్సును అభ్యసించే విషయం మీద స్థిరంగా నిలుపుతుంది. కాబట్టి పరిపూర్ణుడు కావాలంటే పరిపూర్ణమైన విషయాన్నే అభ్యాసం చేయాలి.

మన మనస్సుకు పట్టిన అజ్ఞానానికి కారణమైన వాసనలను, కర్మలను గురుబోధా శ్రవణ మననాలు దగ్ధం చేసివేస్తాయి. శ్రవణం వలన భూతకాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. నిరంతర మననం వలన వర్తమాన కాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. ఇక అలా నిదిధ్యాసను పొందినవాడికి ఇక భవిష్యత్తులో కర్మలు, వాసనలు అంటుకొనే  ప్రశ్నే లేదు. అయితే నిజమైన శ్రద్ధ, వైరాగ్యం కలిగి శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేసిన పరీక్షిత్తు మోక్షాన్ని పొందినట్లే మనమూ పొందగలం.