22, మే 2016, ఆదివారం

అహల్య

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా ||
నిన్నటిదాకా శిలనైనా నీపదము సోకి నే గౌతమినైనా ||
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట, నా నావమీద కాలు పెడితె ఏమౌతాదో తంటా ||

రామావతారంలో ఎన్నో రాళ్ళు ఆయన పాదాలు తాకి ఉంటాయి. అలాగే అప్పటికీ, ఇప్పటికీ ఎందరో జనులు ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించి తమ జీవితాలను గడుపుకుంటున్నారు. కానీ వారందరూ అహల్యలా ఎందుకు తరించలేకపోతున్నారు? ఒక్కసారి విశ్లేషించుకుందాం.

మనం మన హృదయ క్షేత్రాలను అహంకార మమకారాలనే జోడెడ్లు కట్టిన మాయయనే నాగలితో దున్నుకొని అందులో కర్మ బీజాలను నాటుకొని మళ్ళీ మళ్ళీ పునర్జన్మలనే పంటలను పండించుకుంటున్నాం. నాగలిని హలం అంటాం కదా. మరి ఆ మాయ అనే హలం పేరుకైనా తగలని మనో క్షేత్రం కలది కనుకనే ఆ తల్లి అహల్యామాత అయింది. పూర్వజన్మ సంచిత కర్మబీజాలు ఏమీ లేకుండా నేరుగా బ్రహ్మలోకంలో ఆ విధాత ద్వారానే సృష్టించబడింది. ఎందరు నవమన్మధులైన దేవతలు తనను కోరుకున్నా, పందెంలో గెలిచిన గౌతమమహర్షినే వివాహమాడింది.

నాగలి తగలని బంజరు భూములలో వర్షం కురిపించి సేద్యానికి అనుకూలంగా చేయటం ఇంద్రునికి ఇష్టమైన వ్యాపకం. అందుకే ఆయనకు అహల్యాప్రియుడని పేరు. ఆ అలవాటుతోనే తమ మనోక్షేత్రాలలో జన్మపరంపరల సేద్యాన్ని విరమించాలని తపస్సు చేసే వారందరినీ ఎలాగైనా ఆ తపస్సునుండి విరమింపచేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాల వర్షానికి లొంగిపోయిన మనస్సులు, మళ్ళీ మళ్ళీ జన్మలకు దారితీస్తూ ఉంటాయి. లొంగక దృఢంగా నిలచినవారు తరిస్తారు.

ఆ మాయను గుర్తించలేని అహల్య తన భర్తే అనుకొని లొంగిపోయింది. మన సనాతన భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తల బంధం కేవలం సంసారానికే పరిమితం కాదు. అది ఒక గురు-శిష్య సంబంధం. వారిరువురూ కలిసి ధర్మమార్గంలో మోక్షాన్ని పొందేందుకు ఏర్పరచినది. గురువుకి తమ శిష్యులమీద అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. వారు ఎప్పుడు ఏ అంతశ్శత్రువుకు లొంగిపోయి మయామోహంలో పడిపోతారో అని నిరంతరం కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటారు.

తాబేలు ప్రమాదం ఎదురుకాగానే తన అవయవాలన్నింటిని ఎలా ఐతే లోపలకు ముడుచుకొని రాయిలా మారిపోతుందో సాధకుడు విషయాలు ఎదురుకాగానే అలాగే తన ఇంద్రియాలను లోనికి ముడుచుకొని మనస్సును రాయిలా మార్చివేసుకోవాలి. లేదంటే మాయలో పడి నాశనం అయిపోతాడు. తన శిష్యురాలైన అహల్య అలా ప్రమాదంలో పడిందని గ్రహించగానే గౌతమమహర్షి పరుగు పరుగున వచ్చి ఆమెను రాయిలా మార్చివేసారు.

అలా తనను తాను విషయాసక్తినుండి గురుదేవుని అనుగ్రహం వలన రక్షించుకోగలిగింది కనుకనే ఆ తల్లి పరమాత్ముని పాదం తాకి ముక్తిని పొందగలిగింది. మనం కూడా మన మనోక్షేత్రాలలోని సంకల్పాలనే మొక్కలన్నింటినీ పీకివేసి గురుదేవుల అనుగ్రహంతో ఇంద్రియాలను నిగ్రహించుకొని మాయాహలం ఛేదించలేనంత గట్టిగా మార్చుకోగలిగితే ఆ అహల్యామాతలాగే తరించగలుగుతాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి