22, మార్చి 2018, గురువారం

అగర్తల

మన దేశానికి ఈశాన్య ప్రాంతంలో త్రిపుర అనే రాష్ట్రం ఉంది. దాని రాజధాని అగర్తల.  సువాసనలు వెదజల్లే అగరు వృక్షాలు ఎక్కువగా ఉండే స్థలం కాబట్టి దానికి అగర్తల అని పేరు. అలాగే అంతా ఈశ్వరునితో నిండియున్న ఈ జగత్తులో స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనే త్రిపురాలతో కూడిన ఈ రాష్ట్రం (శరీరానికి రాష్ట్రం అని కూడా పేరు)  ఏర్పడింది . దీనికి రాజధాని వాసనలతో నిండియున్న కారణ శరీరం. దీనినే వాసనా దేహం అని కూడా అంటారు. జన్మజన్మాన్తరాలనుండి అనేక వాసనలను ఇది మోసుకొస్తూ ఉంది. మానవ దేహాలన్నీ ఒకేవిధంగా పంచభూతాలతో నిర్మితమైనా, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకు కూడా చిన్నప్పటినుండి వారివారి స్వభావాలలో, ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొందరు పైకి ఎటువంటి కారణమూ కనిపించకపోయినా శైశవదశ నుండి ఏదో ఒక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. దీనికి కూడా కారణం పూర్వజన్మ వాసనలే. 

ఈ వాసనలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. వాటి గురించిన వివరణ నా ఈ పోస్టులో చూడగలరు. వీటి వలననే మనం ఎంతసేపూ నేను, నాది అనుకుంటూ మనం చూస్తున్న విషయాలో చదివిన విషయాలో పరమ సత్యాలని నమ్ముతూ, మనుషుల అంతరంగాలు తెలుసుకోకుండానే వారి వేషభాషలను బట్టి వారికి గుణాలను అంటగడుతూ ఉంటాము. ఈ వాసనలు ఎంత బలవత్తరంగా ఉంటాయనే దానికి ఒక చిన్న ఉదాహరణ - సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శించి లోకమంతా ఉన్నది ఆయనే అనే సత్యాన్ని కనులారా దర్శించిన సమయంలో కూడా అర్జునుడు ఇంకా తన లోకవాసనను వదులుకోలేక కర్ణుణ్ణి సూతపుత్రుడని సంబోధిస్తాడు (భగవద్గీత 11-26). అదే సమయంలో వాసనా రహితుడైన వాసుదేవుడు మాత్రం కర్ణుడనే సంబోధిస్తాడు (భగవద్గీత 11-34).  ఈ బలవత్తరమైన వాసనలే మన త్రిపురాలని మనకు ఆవరణగా అడ్డుపెట్టి ఈశ్వరుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తించనీకుండా చేస్తున్నాయి. 

మరి ఈ త్రిపురాలను హరించి జగత్తంతా ఈశ్వరమయంగా దర్శించటం ఎట్లా? దానికి త్రిపురాసుర సంహార ఘట్టం లోనే మనకు ఉపాయం కనిపిస్తుంది. పరమేశ్వరుడు సూర్యచంద్రులనే చక్రాలుగా గల భూమి రథాన్ని ఎక్కి మేరు పర్వతాన్ని ధనస్సుగానూ, వాసుకిని దాని నారిగానూ, నారాయణుని అస్త్రంగానూ చేసుకొని త్రిపురాలను ఒకే సరళరేఖలో నిలబెట్టి భస్మం చేసేసాడు. అలాగే మనం కూడా సూర్యచంద్రులు కలిసే రెండు సంధ్యలలోనూ  భూమిపై స్థిరాసనంలో కూర్చొని సాధన చేయాలి. ఇక మేరుపర్వతాన్ని ధీరత్వానికి ప్రతీకగా చెబుతారు. అలాగే మనం కూడా మన సాధనలో ధీరులమై ఉండాలి. మరి వాసుకి అనే సర్పం ఈశ్వరుని కంఠాభరణం, అంటే శంకరాభరణం. ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణం అని మనం పాడుకుంటూ ఉంటాం కదా.  అంటే ధ్యానంలో ముందుగా మన మనస్సు నిర్మలమయ్యే వరకూ  దీర్ఘంగా ఓంకారాన్ని నాభినుండి పూరించాలి. ఆ ఓంకార నాదానికి జాగృతమైన కుండలినీ శక్తియే మనలోని వాసుకి. అప్పుడు దానిపై గురు లక్ష్యార్థమనే నారాయణాస్త్రాన్ని సంధించి త్రిపురాలను ఒకే వరుసలో నిలబెట్టి, అంటే త్రికరణశుద్ధిగా ధ్యానం చేస్తే అప్పుడు ఈ త్రిపురాలయందుగల వాసనలు దగ్ధమై విశ్వమంతా ఈశ్వరమయమనే జ్ఞానజ్యోతి మనలో ప్రకాశిస్తుంది. 

20, మార్చి 2018, మంగళవారం

తితీక్ష

మన ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడే సాధనాలలో వివేకము, వైరాగ్యము తరువాత ముఖ్యమైనవి శమాది షట్క సంపత్తి. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఉపరతి అంటే ఎల్లప్పుడూ ఆ పరమాత్మ వస్తువునందే మన మనస్సు రమిస్తూ ఉండటం. తితీక్ష అంటే మానావమానములను సమానముగా స్వీకరించగలగటం. శ్రద్ధ అంటే మన సాధనయందు ఆసక్తి కలిగి చక్కగా చేయగలగడం. ఇక సమాధానము అంటే అంతా భగవంతుని ఇఛ్చ ప్రకారమే జరుగుతోందని గ్రహించి ఎక్కడికక్కడ మనకు లభించిన దానితో తృప్తిపడటం. 

మనం ఎంతటి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా సంఘజీవులం కాబట్టి బయటి ప్రపంచంతో సంబంధం తప్పదు. మరి ఆ సంఘంలో అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు అందరితో మంచిగా ఉంటూ తాము ఆనందిస్తూ చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందింపచేస్తూ ఉంటారు. మరికొందరు వారికి ఏమాత్రం అవసరం లేకపోయినా ఎదుటివారి విషయాలలో కల్పించుకుంటూ లేనిపోని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంకొందరు మరికాస్త ముందుకు వెళ్లి తమకేదో చాలా బాధ్యత, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ "ఏమ్మా! మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చెయ్యరా?" "మీ అబ్బాయి మొన్ననే ఉద్యోగం మానేసి వచ్చేసాడుట కదా?" "అయ్యో ఉన్న డబ్బంతా అలా ఊర్లో వాళ్ళ కోసం ఖర్చు పెట్టేస్తే ఎలా బ్రతుకుతారు?" "మరీ ఇంత పీనాసితనం నీకు పనికిరాదు." ఇలా సూటిపోటి మాటలతో కాకులలా పొడుస్తూ ఉంటారు.

ఇలాంటి వారిని చూసినప్పుడు మనకి సహజంగా కోపం వస్తుంది. అదేదో సినిమాలో అన్నట్లు "ఏమిరా నీవల్ల దేశానికి ఉపయోగము?" అని అడగాలనిపిస్తుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే భగవంతుని సృష్టిలో వ్యర్థమైనది అంటూ ఏదీ లేదు. ప్రతిదానికీ ఎదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి వారివలన ప్రయోజనం ఏమిటో చూద్దాం. పైన చెప్పిన శమాది షట్క సంపత్తిలో మిగిలిన అయిదు గుణాలను మనం ఎంతవరకు అలవరచుకొన్నామో తెలుసుకుంటూ ఆయా గుణాలను ఇంకా పెంపొందించుకోవడానికి మనను మనమే ఎప్పటికపుడు పరీక్షించుకొని అంచనా వేసుకోవటానికి వీలు పడుతుంది.  కానీ తితీక్షను మాత్రం మనకుగా మనం పరీక్షించుకోలేము. అందుకు బయటినుండి ఇలాంటి వ్యక్తుల సహాయ సహకారాలు మనకు ఎంతగానో అవసరమవుతాయి. 

ఇలాంటి వారు ఎదురైనప్పుడల్లా వారి మాటలను అవమానంగానో బాధాకరంగానో భావించక మన తితీక్షను పరీక్షించుకోవడానికి ఒక చక్కని అవకాశంగా స్వీకరించి ఎన్ని నదులు వచ్చి తనలో కలిసినా సముద్రం ఎలా తొణకక బెణకక నిశ్చలంగా ఉంటుందో అలాగే ఎన్ని అవమానాలు ఎదురైనా మన మనస్సుని నిశ్చలంగా ఉంచుకోగలగటం సాధన చేయాలి. అప్పుడే మనం పరమ శాంతిని పొందగలుగుతాం. 

ఒకసారి బుద్ధభగవానుడు భిక్షాటనకై వెళ్ళినప్పుడు ఒక ఇల్లాలు భిక్ష వేయకపోగా ఆయనను సోమరిపోతుగా భావించి నానా మాటలూ అంది. అయినా ఆయన చిరునవ్వుతోనే నిలబడి ఉన్నారు. కొంతసేపటికి విసుగెత్తిన ఆ ఇల్లాలు "ఇందాకటినుంచి ఇంతగా తిడుతున్నాను, నీకేమీ బాధే కలగటం లేదా?" అని ప్రశ్నించింది. అప్పుడు బుద్ధభగవానుడు "తల్లీ! ఒకవేళ నీవు వేసిన భిక్షను నేను స్వీకరించలేదనుకో అప్పుడు ఆ భిక్ష ఏమవుతుంది?" అని ప్రశ్నించారు. అందుకామె "అప్పుడది నా దగ్గరే ఉంటుంది." అని సమాధానం చెప్పింది. "అలాగే తమరు ఇంతసేపూ నన్ను అన్న మాటలేవీ నేను స్వీకరించలేదు" అని చెప్పి ఆయన ముందుకు సాగిపోయారు. 

ఒకసారి శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు నదీ స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక పొగరుబోతు ఆయనపై ఉమ్మి వేశాడు. ఆయన మారు మాట్లాడక తిరిగి నదీ స్నానం చేసి వచ్చారు. ఆ పొగరుబోతు మళ్ళీ ఉమ్మి వేయడం, ఈయన మళ్ళీ స్నానం చేయడం ఇలా 108 సార్లు జరిగింది. చివరికి విసుగెత్తిన అతడు "నేను ఇన్నిసార్లు నీమీద ఉమ్మినా నీకు సిగ్గు అనిపించటం లేదా?" అని ప్రశ్నించాడు . అందుకు ఏకనాథ్ వారు "సోదరా! సిగ్గెందుకు. ఈరోజు ఏకాదశి. నా అంతట నేను అనుకోలేదు కానీ నీ దయవల్ల నేనివాళ 108 సార్లు నదీ స్నానం చేయగలిగాను. ఇంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది?" అని నవ్వుతూ బదులిచ్చారు.