1, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఎందరో మహాత్ములు

మనం ఏ పని చేసినా దానికి రెండు ప్రయోజనాలు ఉండాలని ఆర్ష ధర్మం నిర్ణయించింది - ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ అని. 1) మనకు మోక్షం కలగటం 2) జగత్తుకు హితం కలగటం. ఈ రెండు ప్రయోజనాలు సాధించలేని పనులన్నీ మనకు కర్మలుగా చుట్టుకుంటాయి.

చివరికి మనం తినే ఆహారం కూడా భగవంతుని నివేదన కోసం వండి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలిగానీ మన రుచులకోసం, మన ఆకలి కోసం కాదు అని "యజ్ఞ శిష్టామృత భుజః యాన్తి బ్రహ్మ సనాతనం", "భుంజతేతే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్" వంటి గీతా వాక్యాల ద్వారా చెప్పబడింది. "ఒక యోగి ఆత్మకథ" అనే గ్రంథంలో శ్రీ పరమహంస యోగానంద వారు తమ తల్లిదండ్రులు కేవలం సంతానప్రాప్తి అనే ధర్మం కోసం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సంసారం చేసేవారని వ్రాసారు.

ఇటువంటి ధర్మానికి మూలస్థంభాలనదగిన ఎందరో మహాత్ములు ఏకాంతంగా సాథన చేసుకొని మోక్షాన్ని పొందుతున్నారు. అయితే అలా పొందిన వారిలో కొద్దిమంది మాత్రమే మళ్ళీ సద్గురువులుగా వచ్చి జనబాహుళ్యాన్ని సన్మార్గంలో నడిపి ఉద్ధరిస్తున్నారు. మరి అలా రాకుండా ఏకాంతంలోనే ఉండిపోయిన మహాత్ముల వలన జగద్హితం ఎలా సమకూరుతుంది? అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది.

దీనికి సమాధానమా అన్నట్లు మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ ఎన్నోసార్లు తమ బోధలో ఇలా చెప్పేవారు - ఎందరో మహాత్ములు హిమాలయాలలో, అడవులలో, కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ప్రతి ఉదయం తమ సాథననుండి బయటకు వచ్చి తమ తపశ్శక్తినంతా ధారపోసి "సర్వే జనాః సుఖినో భవంతు" "లోకాస్సమస్తా సుఖినో భవంతు" అని ఆశీర్వదించి తిరిగి తమ సాథనలో లీనమవుతూ ఉంటారు. వారెవరో ఈ లోకానికి పరిచయం లేకపోయినా కేవలం వారి ఆశీస్సుల వల్లనే ఈ లోకం ఇలా పచ్చగా కళకళలాడుతోంది. అందుకు మనం వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.