22, అక్టోబర్ 2015, గురువారం

శ్రీకంఠార్ధ శరీరిణీ

జగన్మాతకు ఉన్న అనంతమైన నామాలలో 'శ్రీకంఠార్ధ శరీరిణీ' ఒకటి. శ్రీకంఠుడైన పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగమైన తల్లి. శ్రీకంఠుడు అంటే మంగళకరమైన కంఠం కలవాడు. మరి ఆయన కంఠం మంగళకరం ఎలా అయ్యింది అంటే లోకాలనన్నింటినీ త్రుటిలో భస్మీపటలం చేయగల హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు కాబట్టి. అయితే ఈ ఘటనలో అమ్మవారి పాత్ర విశేషమైనది.

మ్రింగెడి వాడు విభుండని
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో

అన్నారు పోతనా మహాత్ములు. చేసేది ఎంత ప్రమాదకరమైన పనో తెలిసికూడా తన భర్తని అందుకు ప్రోత్సహించింది ఆ తల్లి. అయితే ఆయన ఒక్కడే మ్రింగాడా? అంటే లేదు, ఆయనతో సమానంగా ఆవిడా మ్రింగింది. ఎందుకంటే ఆ తల్లి శ్రీకంఠార్ధ శరీరిణీ. మరి తన మాంగల్యం మీద అంత నమ్మకం ఎందుకు? అంటే 'శివా రుద్రస్య భేషజీ' అని చెప్పారు. ఆయనకు ఏం జరిగినా తిరిగి స్వస్థత చేకూర్చగల అద్భుతమైన వైద్యురాలు ఆతల్లి.

మరి మన మాటేమిటి? అని దిగులు పడక్కర్లేదు. 'శివా విశ్వస్య భేషజీ' - మన రోగాలన్నీ కూడా నివారించే భవరోగ వైద్యురాలు ఆ తల్లే. అటువంటి చల్లని తల్లి మనందరికీ ఆయురారోగ్యాలను, తరగని సంపదయైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.