పూర్వం ఒక అడవిలో ఒక గురువుగారు ఆశ్రమం నిర్మించుకొని నివసించేవారు. ఆయన వద్ద కుమార్, మోహన్, ఈశ్వర్ అని ముగ్గురు శిష్యులు ఉండేవారు. ముగ్గురికీ గురువుగారంటే ఎంతో భక్తిశ్రద్ధలు ఉండేవి. శ్రద్ధాతత్పరతలతో గురుసేవ, ఆశ్రమసేవ చేసుకొనేవారు. తన కర్తవ్యంలో భాగంగా కుమార్ గురువుగారితో కలిసి వారి కుటీరంలోనే నివసిస్తూ రోజంతా వారికి ఎప్పుడు ఏ సేవ అవసరమో కనిపెట్టుకొని నిర్వహించేవాడు. ఇక మోహన్, ఈశ్వర్ వేరే కుటీరంలో ఉంటూ ఆశ్రమ నిర్వహణకు కావలసిన పనులన్నీ చేస్తూ ఉండేవారు.
నిరంతరం గురువుగారి సమీపంలో ఉండటంతో తనంటే గురువుగారికి ఎంతో ఇష్టమని, తన మాట ఆయన తప్పక వింటారని కుమారుకి కొంచెం గర్వం కూడా ఉండేది. అలాగే ఇదే విషయంలో మిగిలిన ఇద్దరికీ అతనంటే అసూయగా ఉండేది. ఇప్పటిలాగా సెల్ఫోనులు లేకపోవడంతో వీరు ముగ్గురూ రోజూ రాత్రి భోజనానంతరం ఆశ్రమంలో అరుగుమీద కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటల సందర్భంలో 'గురువుగారు ఈరోజు నన్ను నవ్వుతూ ఎంతో ప్రేమగా పలుకరించార'ని ఒకరు, 'నావైపు కోపంగా చూశార'ని ఒకరు, 'గురువుగారు నేను చేసిన వంకాయకూర ఇవాళ ఎంతో ఇష్టంగా తిన్నార'ని ఒకరు, ఇలా సంభాషణ సాగుతుండేది.
ఆశ్రమవాసం చేస్తూ, తమ తమ సాధన పురోగతిని గూర్చి ఆలోచించకుండా శిష్యులు ఇటువంటి విషయాలను చర్చిస్తూ ఉండటం గురువుగారు గమనించారు. ఒకరోజు వారి ముగ్గురినీ తమ ఆశ్రమంలోని మామిడిచెట్టు వద్దకు పిలిచి, పచ్చిగా ఉన్న మామిడికాయ కోసి తినమన్నారు. తిన్న తరువాత 'మీరు ఏమి గమనించారు?' అని అడిగారు గురువుగారు. కుమార్ 'ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండీ' అన్నాడు. మోహన్ 'లేదండీ, ఇది వగరుగా ఉంది' అన్నాడు. ఇక ఈశ్వర్ 'ఈ కాయ కోసినపుడు చాలా సొన కారిందండీ' అన్నాడు.
గురువుగారు మరొక పచ్చి కాయను చూపించి 'దానిని రోజూ గమనిస్తూ ఉండండి' అని ఆదేశించారు. ముగ్గురు శిష్యులూ ఆ కాయను రోజూ గమనిస్తున్నారు. కొన్నాళ్ళకి అది మెల్లిగా పండి బంగారు రంగులోకి మారి ఒకరోజు ముట్టుకోగానే చెట్టునుండి ఊడి చేతిలోకి వచ్చేసింది. వెంటనే శిష్యులు ముగ్గురూ దానిని తీసుకొని పరిగెత్తుకుంటూ గురువుగారి వద్దకు చేరారు. ఆ పండును చూసిన గురువుగారు 'ఏదీ, ఇప్పుడు దీనిని తిని చూడండి' అన్నారు. ముగ్గురూ దానిని తిని ఏకకంఠంతో 'ఇది ఎంతో తియ్యగా ఉంది గురువుగారూ!' అన్నారు. ఈశ్వర్ తాను ఇంతకు ముందు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ 'ఈ పండు చెట్టునుండి దానంతటదే విడిపోయిందండీ. పైగా సొన కూడా కారలేదు' అన్నాడు ఆశ్చర్యంగా.
'చూశారా మరి! మానవుడు కూడా ఈ మామిడిపండులాంటి వాడే. పచ్చిగా ఉన్నప్పుడు కామ క్రోధాది గుణాలతో పుల్లగా, వగరుగా ఉన్న మామిడికాయలాగే ఉంటాడు. సంసార వృక్షాన్ని వదలాలంటే సొన కార్చినట్టుగా ఏడుస్తాడు. అదే ఆత్మజ్ఞానంతో ఒకసారి పండిన మానవుడు మధుర స్వరూపుడై సంసారం నుండి తనకు తానుగా విడిపోతాడు' అని వివరించిన గురువుగారు 'మరి మీలో ఎవరైనా ఈ పండుని మళ్ళీ కాయగా మార్చగలరా?' అని ప్రశ్నించారు. శిష్యులందరూ ఏకకంఠంతో 'అదెలా సాధ్యం గురువుగారూ? అది జరిగే పని కాదు' అన్నారు.
'మరి మీరు నన్ను ఆత్మజ్ఞానం పొందిన పండునని అనుకుంటున్నారా, లేక ఇంకా పచ్చిగా ఉండి సంసారాన్ని విడువలేని సామాన్య మానవుడనని అనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు గురువుగారు. ఊహించని ఈ ప్రశ్నకు ఖంగుతిన్న శిష్యులు 'మీరు ఆత్మజ్ఞాన సంపన్నులయిన సిద్ధ పురుషులనే మా అందరి నిశ్చితాభిప్రాయం స్వామీ!' అని సమాధానమిచ్చారు. 'మరి అటువంటి గురువుకు ఇంకా ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు, ఒకరంటే ప్రేమ, మరొకరంటే కోపం ఇలాంటి గుణాలు ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు?
గురువు స్వచ్ఛమైన అద్దంలాంటివాడు. మీ హృదయంలో ఏ భావన ఉంటుందో గురువునుంచి ఆ విధమైన ప్రతిస్పందనే వచ్చినట్లుగా మీకు కనిపిస్తుంది. మీలో ప్రేమ, భక్తి ఉప్పొంగితే గురువు కూడా మిమ్మల్ని ప్రేమించినట్లుగా, ఆదరించినట్లుగా కనిపిస్తారు. మీలో ఏదైనా తప్పు చేశాననే అపరాధ భావన దాగి ఉంటే గురువుగారు మిమ్మల్ని కోపగించుకున్నట్లుగానే కనిపిస్తారు. లోపం చూసే వ్యక్తిలోనిదే కానీ అద్దానిది కాదు.
అంతే కాదు. మీరందరూ నాలోని భాగాలే. అలాగే నేను మీ అందరిలో ప్రకాశించే ఆత్మవస్తువునే కదా! మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతమ్ సూత్రే మణిగణాయివ అని గీతాచార్యుడు చెప్పినట్లు ఆత్మజ్ఞానియై, భగవత్స్వరూపుడైన గురువుకన్నా భిన్నమైనది ఈ ప్రపంచంలో ఏ ఒక్కటీ లేదు. మణిమాలలో మణులన్నీ దారంతో ఎలా అనుసంధానించబడి ఉన్నాయో ఈ ప్రపంచమంతా గురువు(భగవంతుని)తో అలా అనుసంధానించబడి ఉంది. మీ శరీరంలో ఒక అవయవాన్ని ఎక్కువగా ప్రేమించి మరొకదాన్ని ద్వేషించరు కదా! ఆ అవయవాలన్నీ మీకు సమానమే కదా. అలాగే మీరందరూ నాకు సమానులే. కాబట్టి మీలో మీరు ఎక్కువ తక్కువలు కల్పించుకొని, ఆ భేదభావాలను నాకు కూడా ఆపాదించి, మీ ఆశ్రమవాసాన్ని వ్యర్థం చేసుకోకుండా, సమదృష్టి కలిగి ఉండి, చక్కగా సాధన చేసుకొని తరించడానికి ప్రయత్నించండి' అని బోధించి వారికి కనువిప్పు కలిగించారు గురువుగారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి