15, అక్టోబర్ 2023, ఆదివారం

వాచాజ్ఞానం

"పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు", "ఈ శరీరం అశాశ్వతమైనది. దీనితో వచ్చే బంధాలన్నీ కూడా అశాశ్వతమే", "ఇక్కడ ఎంత సంపాదించినా, ఎంత దాచుకున్నా పోయేటప్పుడు పూచికపుల్ల కూడా తీసుకుపోలేం" ఇలాంటి జ్ఞానం మనలో ప్రతి ఒక్కరికీ ఉంది. కాస్త ఊహ తెలిసిన చిన్న పిల్లలు కూడా ఇందులో కొంతవరకైనా చెబుతారు. అయితే ఇది కేవలం వాచాజ్ఞానంగానే మిగిలిపోతోంది తప్పితే అనుభవంలోకి, ఆచరణలోకి రావడంలేదు. ఈ జ్ఞానం మనకు ఎలా వస్తోంది? అంటే పుస్తకాలు చదవటం వల్లనో, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం వల్లనో, లేదా మనకు బాగా కావలసిన వారు దూరమైన క్షణికావేశంలోనో వస్తోంది. అది పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగా కొద్దిసేపే ఉంటోంది కానీ శాశ్వతంగా నిలవట్లేదు. కొంతమంది అదే పనిగా పుస్తకాలు చదవటమో, చర్చలలో పాల్గొనటమో చేసేవారు రోజూ ఇదే జ్ఞానాన్ని వల్లించవచ్చు. కానీ వారికి నిజంగా ఒక ఆపదో, కష్టమో వచ్చినప్పుడు ఈ వల్లించిన జ్ఞానం వారికి ఉపయోగపడుతోందా? వారి మనస్సును నియంత్రిస్తోందా? స్వాంతన కలిగిస్తోందా? అంటే సమాధానం చెప్పలేము.


పైకి ఎంత వేదాంతం వల్లించినా తన సంతానం స్థిరపడలేదనో, లేదా వారి బుద్ధి బాగోలేదనో, తనకు దక్కవలసిన ఆస్తి మరొకరికి పోయిందనో, లేదా తనకే ఏదో పెద్ద రోగం వచ్చినప్పుడో ఈ జ్ఞానం ఎంతవరకు నిలబడుతోంది? మనస్సు ఈ జ్ఞానానికి వ్యతిరేక దిశలో ఆలోచించకుండా ఉంటోందా? దీనికి కారణం ఏమిటి? ఆ జ్ఞానాన్ని కేవలం వల్లె వేయటమే తప్పితే ఆచరణలో చూపించలేకపోవటం, అభ్యాసం చేయకపోవటం, అనుభవంలోకి తెచ్చుకోకపోవటం. "కారు ఫలానా విధంగా నడపాలి. గేరు ఇలా వెయ్యాలి. స్టీరింగు ఇలా తిప్పాలి" ఇలా ఎన్నాళ్ళు పుస్తకంలో చదివినా, లేదా నలుగురితో చర్చించినా నీకు నిజంగా కారు నడపడం వస్తుందా? నీ మాటలు విన్న నలుగురూ "అమ్మో వీడికి కారు నడపడంలో ఎంత అనుభవం ఉందో" అని ఆశ్చర్యపోయి నిన్ను పొగడవచ్చు. కానీ నిజంగా కారు నడపవలసిన అవసరం పడినప్పుడు నువ్వు తెల్లమోహం వేస్తావు. ఇలాగే జీవితంలో ఏ విద్య అయినా కేవలం వల్లెవేయడం వలన అనుభవంలోకి రాదు కదా! ఒక గురువును ఆశ్రయించి, ఆయన చెప్పిన మెలకువలను పాటించి చక్కగా అభ్యాసం చేస్తేనే వస్తుంది.


ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. అయితే గురువును ఆశ్రయించి కొంతకాలం సత్సంగాలలో పాల్గొని నాలుగు మంచి ముక్కలు గుర్తు పెట్టుకోగానే మనకేదో చాలా జ్ఞానం వచ్చేసిందని అనుకుంటాం. చివరికి దానిని గురువుల ముందు ప్రదర్శించడానికి కూడా వెనుకాడం. చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరిగి "జీవితంలో ప్రతి అడుగులో గురుదేవుల సూచనలు పాటించాలి. గురుదేవులు ఏది చెబితే అది తప్పనిసరిగా ఆచరించాలి" అని వింటూ ఉన్న యువకులు పదవ తరగతి అయిన తరువాత శ్రీ బాబూజీ మహరాజ్ వారి వద్దకు వెళ్ళి "ఇంజనీరు కావాలా, డాక్టరు కావాలా ఏమి చదవమంటార"ని అడిగేవారు. శ్రీగురుదేవులు వారిని "నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు ఏదంటే ఇష్టం?" అని ప్రశ్నిస్తే వీరు ఇంతకు ముందు విన్న వాచాజ్ఞానంతో "మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాను బాబూ!" అనేవారు. 'శ్రీ బాబూ విజ్ఞానమందిర్' మూడవ అంతస్తులో వాకింగ్ చేస్తున్న శ్రీ బాబూజీ "అయితే ఇక్కడినుండి క్రిందకు దూకు!" అనేవారు. ఈ యువకులు తెల్లమోహం వేసేవారు. అనుభవం లోనికి రాని వాచాజ్ఞానం, వాచావేదాంతం ఇలాగే ఉంటాయి.


మళ్ళీ మన కారు ఉదాహరణకే వస్తే డ్రైవింగ్ నేర్చుకొనే కొత్తల్లో భయం భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎటు చూడాలి, ఎప్పుడు క్లచ్ నొక్కాలి, ఎలా గేర్ మార్చాలి, ఎప్పుడు బ్రేక్ వెయ్యాలి ఇలా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ప్రక్కన ఎవరైనా మాట్లాడించినా, లేదా రోడ్డుమీద ఇతర ఆకర్షణలు ఎన్ని ఉన్నా వీడి దృష్టి అటు పోదు. అలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో కొంతకాలం అభ్యాసం చేసిన తరువాత పైన చెప్పిన పనులన్నీ వాడికి సహజంగా అలవాటు అయిపోతాయి. నడవడం, మాట్లాడటం, గాలి పీల్చడం ఎంత సహజంగా చేస్తాడో, కారు నడపడంలో చేయవలసిన వివిధ పనులన్నీ అంతే సహజంగా చేసేస్తాడు. అప్పుడు ప్రక్కవాళ్ళతో ఎంత చర్చలు జరుపుతున్నా, రోడ్డుమీద వచ్చే పోయేవారిని, ప్రక్కనున్న ప్రకటనలను ఎన్ని చూస్తున్నా అతి సహజంగా చేతులు, కాళ్ళు తమ పని తాము చేసుకుపోతూ ఉంటే కారు ముందుకు సాగిపోతూ ఉంటుంది. 


ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ జ్ఞానం, ఈ వేదాంతం మన నరనరాల్లో జీర్ణించుకొని అది మన సహజ స్థితిగా మారేవరకు నిరంతర అభ్యాసం, సాధన చేయవలసిందే. అది లేకుండా కేవలం మాటలలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఒలకబోయడం వ్యర్థం. ఈ విశ్వమంతా నిజంగా పరమాత్మ సృష్టే, ఇందులో నాదంటూ ఏదీ లేదు అని నిజంగా విశ్వసించిన వాడు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతరంగంలో పరమ భక్తుడై నిరంతరం ఆ భగవచ్చింతన లోనే ఉంటూ, ఎప్పుడు ఏది లభిస్తే అది ప్రసాదంగా స్వీకరిస్తూ,  కర్తృత్వ భోక్తృత్వాలను తనమీద వేసుకోకుండా నిగర్విగా జీవనం సాగిస్తూ ఉంటాడు. అలాగే కనిపించే విశ్వమంతా భగవత్స్వరూపమే అన్న అవగాహన దృఢంగా ఉన్నవాడు జ్ఞానియై అంతటా భగవంతునే దర్శిస్తూ, దేని యెడల రాగద్వేషాలు లేక సహజ విరాగియై ఉంటాడు. ఇటువంటి విశ్వాసము, అవగాహన లేకుండా కేవలం వినడానికి, మాట్లాడడానికి అలవాటు పడిన మానవుడు పైకి ఎంత భక్తునిగా నటించి ఎన్ని భగవత్కైంకర్యాలు చేసినా, "నాదేమీ లేదు, అంతా భగవంతుడిదే. ఆయనదే ఆయనకు ఇచ్చాను" అని పైకి ఎన్ని మాటలు చెప్పినా గుడిలోకి వెళ్ళి దేవుని మూర్తిని చూడగానే "ఈరోజు నేనిచ్చిన నగలను వేశారా లేదా? నేను పెట్టిన బట్టలను కట్టారా లేదా?" అని ఇలాగే అతడి మనస్సు ఎంతసేపూ 'నేను, నేను' చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పట్టుచీర అరువిచ్చి ఆ కట్టుకున్నావిడ ఎక్కడ మాపేస్తుందో అని వెనకాలే పీట పుచ్చుకుని తిరిగినట్టు 'నేనిచ్చాను' అనే భావన వదలనంత కాలం పైకి ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేదు.


అలాగే మరి కొంతమంది ఎవరైనా మర్యాదకి "బాగున్నారా!" అని పలకరించినా "ఈ శరీరం ఎప్పుడూ బాగోదు, ఆత్మ ఎప్పుడూ బాగానే ఉంటుంది. నువ్వు అడిగినది శరీరాన్నా, లేక ఆత్మనా?" అంటూ వారికి పెద్ద వేదాంత ఉపన్యాసం చెప్పి "వీడిని ఎందుకు పలకరించానురా దేవుడా!" అనుకొనేలా చేస్తారు. నిజంగా బ్రహ్మజ్ఞాన సంపన్నులయిన మహాత్ములు ఎవరూ ఇలా మాట్లాడరు. వాచావేదాంతులే ఇలా ప్రవర్తిస్తారు. మహాత్ములు ఆంతర్యంలో నిరంతరం పరబ్రహ్మ వస్తువుతో అనుసంధానులై ఆ బ్రహ్మామృతాన్ని గ్రోలుతూ ఉన్నా పైన వ్యవహారంలోకి వచ్చేసరికి సాధారణ మానవుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తరచి చూడగల హృదయం ఉన్నవారికి మాత్రమే వారి అసలు సత్తా కొంచెమైనా అంచనాకు వస్తుంది తప్పితే మామూలుగా వారిని మహాత్ములని పోల్చుకోవడం కష్టం.


కాబట్టి నిజమైన భక్తికానీ, జ్ఞానంకానీ, వైరాగ్యంకానీ సహజసిద్ధంగా ఉండాలి తప్పితే అవి తెచ్చి పెట్టుకొనేవి కావు, పైకి ప్రదర్శించేవి కావు. అలా పైకి ప్రదర్శించినంత కాలం వాటిలోని నిజమైన సారాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేము. ఆ మూడిటి ఫలస్వరూపమైన ఆత్మానందాన్ని పొందలేము. ఎప్పుడైతే ఈ పైపై మాటలన్నీ కట్టిపెట్టి, నిరంతర భగవత్స్మరణలో, తత్వచింతనలో మనస్సును ఊరబెట్టి, ఆ పరమాత్మ తప్ప మరియొకటి మన మనస్సులో నిలువలేని స్థితికి చేరుకుంటామో అప్పుడే నిజమైన అనుభవ జ్ఞానం, అనుష్టాన వేదాంతం అలవడుతుంది. శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పినట్లుగా నీటిలో సగం మునిగిన చెంబు బుడబుడ శబ్దాలు చేస్తుంది కానీ, పూర్తిగా నీటితో నిండిన చెంబునుంచి ఏ శబ్దమూ రానట్లుగా అటువంటి అత్యున్నత స్థితికి చేరిన వ్యక్తినుంచి వాచాజ్ఞానం వెలువడదు. అతడు తన ఆచరణతోనే సర్వులకు ఆదర్శప్రాయుడై నిలుస్తాడు.


కేవలం గ్రంధాలు చదివి 'ఇది సత్తు, ఇది అసత్తు, ఇది చిత్తు' అని ఎంతసేపూ నీలో నువ్వుగానీ, లేదా ఇతరులతోగానీ వృధా చర్చలు పెట్టుకోకుండా నిరంతరం జగన్మాత స్మరణలో గడిపితే 'సదసద్రూప ధారిణి' అయిన ఆ జగన్మాత అనుగ్రహం, సాక్షాత్తు జగన్మాతృ స్వరూపులే అయి 'సదసద్రూప సంపన్ను'లయిన శ్రీ గురుదేవుల అనుగ్రహం కలిగిన నాడు నీవు దర్శించేదంతా సత్య వస్తువే కానీ అక్కడ ఇంక అసత్తుకు స్థానమే లేదు. 'నీవు చూచునదెల్ల నీవయే' అను 'తత్త్వమసి' వాక్యానికి అర్థమై నిలుస్తావు.

2, అక్టోబర్ 2023, సోమవారం

అహింస

అక్టోబర్ నెల వచ్చిందంటే ముందుగా గాంధీ జయంతి వస్తుంది. మన ఆధునిక కాలంలో అహింసకు మారుపేరుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకొని ఎన్నో దేశాలలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు మన జాతిపిత మహాత్మాగాంధీ. అలాగే ఇదే నెలలో అనేకమంది లోకకంటకులైన రాక్షసులను జగన్మాత సంహరించినందుకు గుర్తుగా మనం దసరా వేడుకలను జరుపుకుంటాం.


ఇక్కడే కొందరికి సందేహం కలుగుతుంది. అసలు మనం అహింసను పాటించాలా, లేక అవసరమైనపుడు హింసామార్గాన్ని అవలంబించాలా అని. మనకు ఈ మానవజన్మ లభించడంలో ముఖ్య ఉద్దేశ్యం, ఈ మానవ జన్మకు సార్థకత మనం మోక్షాన్ని పొందటం. మోక్షాన్ని పొందాలంటే దైవీ సంపదను పెంచుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఈ దైవీ సంపద అంటే ఏమిటో 16వ అధ్యాయం మొదటి మూడు శ్లోకాలలో వివరించాడు. ఇందులో మొదటి శ్లోకం అభయం(భయం లేకపోవటం)తో మొదలైతే రెండవ శ్లోకం అహింసతో మొదలవుతుంది. అంటే జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం ఎంత అవసరమో ఆ సమస్యా పరిష్కారంలో ఎవరినీ హింసించకుండా అహింసను పాటించడం కూడా అంతే ముఖ్యం.


ఏ దేశంలో చూసినా యుద్ధంలో ధైర్యంగా పోరాడి శత్రు సైనికులను మట్టుబెట్టిన వీరునికి అనేక సత్కారాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సత్కారానికి ప్రాతిపదిక ఆ సైనికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంత ధైర్యంగా పోరాడాడు అనేదే కానీ ఎంతమందిని చంపాడు అనే లెక్క కాదు. అలాగే యుద్ధంలో శత్రువులను చంపి సత్కారాన్ని పొందిన ఆ సైనికుడే తన వ్యక్తిగత కక్షతో దేశంలో ఎవరినైనా చంపితే అతను శిక్షింపబడతాడు. అంటే రెండు సందర్భాలలోనూ చేసిన పని చంపడమే అయినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అది సత్కారార్హమైనదా లేక శిక్షార్హమైనదా అని నిర్ణయిస్తుంది.


పైన మనం చెప్పుకున్న జగన్మాత చేసిన రాక్షస సంహారాన్ని గమనిస్తే అందులో వ్యక్తిగత కక్షగానీ, స్వార్థం కానీ లేదు. అది కేవలం లోకంలోని ఇతర జీవులను రక్షించడానికి చేసిన సంహారమే. అందులో ముఖ్య ఉద్దేశ్యం రక్షణే కానీ హింస కాదు. "శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు కదా, మరి మనం మన శత్రువులను సంహరిస్తే తప్పేమిటి?" అని కొందరు వాదిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు క్షత్రియుడు, పైగా సైనికుడు. అంతకుమించి అతడు యుద్ధరంగంలో నిలిచి ఉన్నవాడు. 


అందుకే పరమాత్మ యుద్ధానికి ప్రోత్సహించాడు కానీ అంతకుముందు ఆయన శాంతికి ఎంతగా ప్రయత్నించలేదు? అంతెందుకు స్వయంగా తన భార్యను అపహరించిన రావణునితో కూడా యుద్ధం చేసేముందు శ్రీరాముడు అనేకమార్లు శాంతియత్నాలు చేశాడు. పైగా గీతాచార్యుడు ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి కానీ, ఎంత గొప్పదైనా పరుల ధర్మం జోలికి పోకూడదని హెచ్చరించాడు. అందువలను యుద్ధం చేయడం, శత్రుసంహారం చేయడం సైనికుల ధర్మమే కానీ మనబోటి వాళ్ళది కాదు. ధర్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితిలో తమవారితోనే యుద్ధం చేసినా, ఆ తరువాత పాండవులు జీవించినంత కాలం మనశ్శాంతి లేకుండా ఆ బాధలోనే బ్రతికారు.


తమ మతానికో, జాతికో చెందిన ప్రతి వ్యక్తీ ఆయుధాలు సమకూర్చుకొని పరాయి జాతి, మతం వారితో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చే నాయకులు దాని వలన కలిగే దుష్ప్రభావాలను గమనించడం లేదు. ప్రతివ్యక్తికి సులభంగా ఆయుధాలు దొరికే వ్యవస్థ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఆ ఆయుధాలను దుర్వినియోగ పరుస్తూ విచక్షణారహితంగా పసిపిల్లలనుండి వృద్ధులవరకు ఎందరినో కాల్చి చంపుతున్న ఘటనలు మనం తరచుగా వింటూనే ఉన్నాం కదా!


విచ్చలవిడితనానికి నెలవైన ఆటవిక వ్యవస్థను వదలి మనకంటూ ఒక సమాజాన్ని, దానికి కొన్ని కట్టుబాట్లను, వ్యవస్థను ఏర్పరచుకొన్న మానవుడు మళ్ళీ మళ్ళీ ఆ ఆటవిక న్యాయం వైపుకే మొగ్గు చూపడం ఎంతవరకూ సమంజసం? అవతలివారిని హింసించడం ఎంత తేలికో ఆ హింసకు తట్టుకొని ధైర్యంగా నిలబడి, తనకు శక్తి ఉండి కూడా ధర్మానికి కట్టుబడి అహింసతో జీవించడం అంత కష్టం. అలా జీవించారు కనుకనే పాండవులు, శ్రీరాముడు మొదలైన వారి చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 


అదే అహింసా ధర్మాన్ని ఆధునిక కాలంలో కూడా ఆచరించి చూపి "అసలు ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే ముందు తరాలవారు నమ్మలేరు" అని ఐన్‌స్టీన్ మహాశయుడంతటి గొప్ప శాస్త్రవేత్తతో కొనియాడబడిన గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం.