5, అక్టోబర్ 2016, బుధవారం

భక్త చిత్త కేకి ఘనాఘనా

భక్తుల చిత్తములనే నెమళ్ళకు పరవశాన్ని కలిగించి పురి విప్పి నర్తించేలా చేసే కారుమబ్బు వంటిదని జగన్మాతను కీర్తించే నామమిది. నల్లని కారు మేఘాన్ని చూడగానే మగ నెమలి పరవశించి ఆనందంగా పురి విప్పి నాట్యం చేస్తుంది. అలా అది ఆనంద పరవశయై ఉండగా దాని నేత్రాలనుండి వీర్యస్ఖలనం జరుగుతుంది. ఆడ నెమలి ఆ వీర్యాన్ని గ్రహించి సంతానానికి జన్మనిస్తుంది. ఇలా స్త్రీపురుష సంయోగం లేకుండానే సంతానాన్ని కనే ఏకైక జీవి నెమలి అని పెద్దలు చెబుతారు. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకు చిహ్నంగా నెమలి పింఛాన్ని తన శిరస్సుపై ధరించేవాడు.

అలాగే ఆ జగన్మాత అనే కారుమేఘం దర్శనం కాగానే భక్తుని చిత్తం పరవశించి ఆనంద తాండవం చేస్తుంది. అప్పుడు ఆ చిత్తం కార్చే ఆనందభాష్పాలను ఆ భక్తుని బుద్ధి గ్రహించి భక్తిగర్భాన్ని దాల్చి జ్ఞానపుత్రుని ప్రసవిస్తుంది. అట్టి జ్ఞానపుత్రుడే నిజంగా పున్నామనరకాన్నుంచి రక్షించి మోక్షానికి కారణమవుతాడు కానీ దేహ కర్మల వలన జనించే కర్మపుత్రులు కాదు. ఈ భక్తిగర్భాన్ని ధరించటానికి స్త్రీపురుష వ్యత్యాసం కానీ, జాతి నీతి భేదాలు కానీ లేవు. జగన్మాత బిడ్డలైన సకల జీవకోటికి అందుకు అర్హత ఉంది.