12, మార్చి 2023, ఆదివారం

క్షుద్ర దేవత

    సత్యం, సుందరం బాల్యంనుంచి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ప్రక్కప్రక్క ఇళ్ళలోనే పుట్టి పెరిగారు. కలిసి చదువుకున్నారు, ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ మంచి నడవడిక, దైవభక్తి ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని దగ్గరలోని బాలా త్రిపుర సుందరి ఆలయానికి వెళ్ళి ఆ జగన్మాతను దర్శించుకొని కానీ ఉద్యోగానికి వెళ్ళరు.

    ఒకసారి వారిద్దరూ ఆఫీసు పనిమీద నెలరోజుల పాటు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. చాలా రోజుల తరువాత పల్లెటూరులో పచ్చని వాతావరణాన్ని చూడబోతున్నామనే ఉత్సాహంతో ఇద్దరూ పెట్టేబేడా సర్దుకొని బయల్దేరారు. ఆ ఊరు చేరేసరికి చీకటి పడిపోయింది. ఆఫీసువారు వసతి ఏర్పాటు చేసిన ఇంటిలో దిగి, ప్రయాణ బడలికతో మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. 

    తెల్లవారి నిద్ర లేచి స్నానాదికాలు ముగించుకొని తమ అలవాటు ప్రకారం దైవదర్శనం చేసుకుందామని ఊర్లోకి వెళ్ళారు. ఎంత వెదకినా వారికి ఆ ఊర్లో ఆలయమేదీ కనిపించలేదు. ఊర్లో వాళ్ళని అడుగగా ఊరి పొలిమేరలో పోలేరమ్మ ఆలయం ఉందని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక రావిచెట్టు క్రింద ఒక పెద్ద రాయి ఉంది. ఆ శిలకు పసుపుకుంకుమలు అద్ది ఉన్నాయి. ఆ ఊరి ప్రజలందరూ పొలం పనులకు వెళ్తూ అక్కడ ఆగి ఆ శిలారూపంలో ఉన్న పోలేరమ్మకు భక్తితో నమస్కరించి వెడుతున్నారు. వారిని చూసిన సత్యం కూడా ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే అలా నమస్కరించడానికి సుందరానికి మనస్కరించలేదు.

    "ఒరేయ్ సత్యం! ఇదేమి దేవాలయం రా? ఇక్కడ ఒక ఆలయం లేదు, గోపురం లేదు, ఆగమశాస్త్రంలో చెప్పిన ఎటువంటి కట్టడాలూ లేవు. వేదాలు చదువుకున్న పూజారి లేడు, సరికదా అమ్మవారు అని నమస్కరించడానికి ఇక్కడ అసలు సరైన విగ్రహమే లేదు. ఏదో చదువురాని ఈ ఊరి జనులందరూ మూఢభక్తితో నమస్కరించినంత మాత్రాన ఈ రాయి నిత్యం మనం కొలిచే బాలా త్రిపుర సుందరి అయిపోతుందా? ఇటువంటి క్షుద్రదేవతలను నేను నమ్మను" అన్నాడు సుందరం.

    "అది కాదురా సుందరం! జగత్తులో ఆ జగన్మాత లేని ప్రదేశం అణువైనా లేదని మన ఆలయంలో ప్రవచనకారులు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పగా మనం వినలేదు? మరి సర్వత్రా నిండి ఉన్న ఆ పరమాత్మ భక్తానాం హృదయాంభోజే విశేషేన ప్రకాశతే - భక్తుల హృదయాలలో ఇంకా విశేషంగా ప్రకాశిస్తాడు అని పెద్దలు చెబుతారు కదా! మరి ఈ ఊరిలో ఇంతమంది భక్తులు హృదయపూర్వకంగా ఇక్కడ ఈ శిలారూపంలో పోలేరమ్మగా జగన్మాత కొలువై ఉన్నదని విశ్వసిస్తున్నపుడు ఆ జగన్మాతను ఎలా కాదంటావు? ఇప్పుడంటే ఆ అలవాటు తగ్గిపోయింది కానీ పూర్వం మన అమ్మమ్మల కాలంలో వంట ఇంట్లోనే ఒక మూల గోడకి ఇంత పసుపు కుంకుమలు పూసి, అదే దైవస్థానమని నమ్మి, చేసిన వంట అంతా అక్కడే మహానివేదన చేస్తే మనం ప్రసాదంగా భావించి స్వీకరిచేవాళ్ళం కదా!" అన్నాడు సత్యం.

    "నువ్వు ఎన్నయినా చెప్పు సత్యం! నాకెందుకో ఇటువంటి క్షుద్రదేవతల మీద నమ్మకం కుదరటం లేదు" అని సుందరం అక్కడనుంచి వెళ్ళిపోయాడు. తరువాత వారిద్దరూ పనిలోపడి ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు. ప్రతిరోజూ స్నానం అవ్వగానే సత్యం ఊరి పొలిమేరకు వెళ్ళి ఆ పోలేరమ్మకు భక్తితో నమస్కరించి తన పనిలోకి వెడుతున్నాడు. సుందరానికి మాత్రం ఆ ఊరిలో సరైన దేవాలయం లేదు, తన భక్తిని చూపించడానికి ఒక ఆలంబన లేదనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.

    ఇలా ఒక వారం గడిచేసరికి పట్నంలో ఫిల్టర్ నీళ్ళకి అలవాటుపడ్డ సుందరానికి ఆ పల్లెటూరి నీరు తేడా చేసి విరేచనాలు మొదలయ్యాయి. ఒకటి, రెండు కాస్తా పది, పదిహేను అయ్యేసరికి నీరసించి గుడ్లు తేలేశాడు. ఆ ఊరిలో వైద్యశాల లేదు. దగ్గరలోని వైద్యశాలకు చేరాలంటే కాలినడకన కనీసం ఒక రోజు పడుతుంది. పైగా సుందరానికి నడిచే శక్తి లేదు. అందకని సత్యం పరుగున వెళ్ళి ఆ ఊరిలోని నాటువైద్యుణ్ణి పిలుచుకు వచ్చాడు. ఆ వైద్యుడు తన దగ్గరున్న మూలికలేవో ఇచ్చాడు కానీ ఎంతసేపైనా విరేచనాలు ఆగటంలేదు. ఇక ఆ వైద్యుడు "ఇది నా చేత అయ్యేపని గాదు సామీ! మా ఊరి పోలేరమ్మ శానా మహిమగల తల్లి. తెల్లదొరల కాలంలో ఈ ప్రాంతమంతా మశూచికం వచ్చి ఎన్నో వేలమంది చనిపోయారు. అది మా ఊరిని కూడా కబళిస్తాదేమో అని మా పెద్దలు గుండెలు చిక్కబట్టుకొని ప్రార్థిస్తే ఆ లోకాలనేలే తల్లే ఈ ఊరి పొలిమేరలో పోలేరమ్మగా వెలసి ఆ మాయదారి రోగాన్ని మా ఊర్లోకి రాకుండా అడ్డుకుంది. మీరు ఆ తల్లికి మొక్కుకోండి. దయగల మాతల్లి తప్పక కరుణిస్తాది" అని చెప్పి వెళ్ళిపోయాడు.

    ఇక వేరే గత్యంతరం లేక సుందరం మనసులోనే ఆ పోలేరమ్మకు నమస్కరించి "అమ్మా! నువ్వు జగన్మాతవని ఇక్కడి ప్రజలంతా నమ్ముతున్నారు. నేను నిత్యం కొలిచే బాలా త్రిపుర సుందరే నీ రూపంలో ఇక్కడ ఉందని మా సత్యం కూడా చెబుతున్నాడు. నేనేనాడూ నీకు మొక్కకపోయినా కనీసం వారందరి విశ్వాసాన్ని చూసైనా నన్ను ఈ దురవస్థ నుండి తప్పించు తల్లీ!" అని వేడుకున్నాడు. మెల్లగా విరేచనాలు తగ్గుముఖం పట్టి మర్నాటికి కొంచెం కోలుకున్నాడు సుందరం. శక్తిని కూడదీసుకొని అతి కష్టంమీద తన స్నేహితుని సాయంతో నడుచుకుంటూ పోలేరమ్మ దగ్గరకు చేరి మనసారా నమస్కరించాడు. 

    అప్పుడు ఆశ్చర్యంగా ఆ పోలేరమ్మలోనే సుందరానికి తన ఇష్టదైవమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారు ప్రత్యక్షమైంది. "నాయనా! నీ కళ్ళు తెరిపించడానికే నేను ఈ లీల చూపించవలసి వచ్చింది. నేను నా బిడ్డలందరినీ సమానంగా సృష్టించినా మీలో మీరే ఎక్కువ తక్కువలు కల్పించుకొని కొట్టుకుంటున్నారు. ఇది నాకెంత బాధను కలిగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడితో ఆగకుండా చివరికి నావే అయిన వివిధ రూపాలలో, వాటి ఆరాధనా పద్ధతులలో కూడా ఎక్కువ తక్కువలు కల్పించి ఎందుకిలా భ్రాంతిలో పడిపోతున్నారు? దైవం, లేదా దేవత అంటేనే స్వయంప్రకాశమైనది. మళ్ళీ అందులో ఎక్కువ తక్కువలకు తావెక్కడ? గూటిలోని చిన్న దీపమైనా సూర్యనికంటే వేలరెట్లు కాంతివంతమైన నక్షత్రమైనా చేసేపని చీకటిని పారద్రోలడమే కదా! అలాగే బదరీ, కేదార, శ్రీశైల, తిరుమలాది పుణ్యక్షేత్రాలలో కొలువైవున్న దేవతల నుంచి పల్లెటూరి పొలిమేరలో చెట్టుక్రింద ఉన్న పోలేరమ్మ వరకు దేవతలందరిలో ఉన్న శక్తి ఒక్కటే. కొలిచే భక్తుల భక్తిలో ఎక్కువ తక్కువలు ఉండవచ్చేమో కానీ దైవత్వంలో క్షుద్రత్వం ఉండదు" అని సుందరానికి కనువిప్పు కలిగించి ఆ జగన్మాత మాయమైపోయింది.

వెలుగున్న యెడ చీకటెక్కడ
దైవమున్న యెడ క్షుద్రమెక్కడ
గురువున్న యెడ యజ్ఞానమెక్కడ
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||