11, అక్టోబర్ 2016, మంగళవారం

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా

జగన్మాతను ఎక్కడ వెదకాలి? ఎలా తెలుసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ జంట నామాలు. మనం ఆ తల్లిని పూజించటం కోసం ఎన్నెన్నో క్షేత్రాలు, దేవాలయాలు తిరుగుతాం. ఎక్కడెక్కడికో వెళతాం. కానీ బయట ఎంతగా వెదకినా ఆ తల్లిని అందుకోలేము. అందుకు మనం చెయ్యవలసినది మన లోపల వెదుక్కోవడం. ఆ తల్లి నిరంతరం మనలోనే ఉండి మనలను నడిపిస్తోంది. ఈ కనపడే శరీరానికి, లోపలి మనస్సుకి, వాటికి ఆధారమైన ప్రాణానికి, వీటన్నింటినీ నడిపించే విజ్ఞానానికీ, మన సహజ స్థితియైన ఆనందానికీ కూడా లోపల ఉండి నడిపించేది ఆ తల్లే. అందుకే ఆవిడ "పంచకోశాంతర స్థితా".

ముందుగా మనం మనలోనే "చేతనారూపంలో" ఉండి మనలను నడిపిస్తున్న ఆ "చిచ్ఛక్తిని" గుర్తిస్తే అప్పుడు మనం బయట ఉన్న "జడాత్మికమైన" ప్రకృతి అంతటా "జడశక్తి" రూపంలో భాసిస్తున్న ఆ తల్లిని గుర్తించగలుగుతాం. నిజానికి సత్యమైన పరమాత్మ, అసత్యమైన జగత్తు రెండూ ఆ తల్లి స్వరూపాలే. అందుకే ఆవిడ "సదసద్రూపధారిణి". అలాగే నశించిపోయే జగత్తు, నాశనం లేని చైతన్యం ఆ తల్లి రూపాలే - "క్షరాక్షరాత్మికా". వ్యక్తంగా మనకు కనపడే ఈ జగత్తు, అవ్యక్తంగా అంతటా నిండియుండి కనపడకుండా దీనిని నడిపిస్తున్న పరమాత్మ శక్తి, రెండూ అమ్మ రూపాలే - "వ్యక్తావ్యక్తాా".

ఆ అమ్మ నిజ తత్వాన్ని ఈ విధంగా భావిస్తూ ఎవరైతే తమ ధ్యానాన్ని, సాధనను పరిపూర్ణం చేసుకుంటారో వారు ఆ అమ్మ స్వరూపాన్నే పొందుతారు. ఎందుకంటే ఆ తల్లి "ధ్యానధ్యాతృధ్యేయరూపా" - అంటే ధ్యాన ప్రక్రియ, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయబడే వస్తువు మూడూ ఆ అమ్మ రూపాలే.