4, నవంబర్ 2021, గురువారం

దీపావళి

పరమాత్మయైన శ్రీమన్నారాయణుడు తన అత్యున్నత స్థానం నుంచి దిగివచ్చి, అంటే అవతరించి వరాహరూపుడైనాడు. ఆ వరాహ స్వామి, ప్రకృతి స్వరూపిణియైన భూదేవి కలయిక ద్వారా జన్మించినవాడు నరకాసురుడు. ఇతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. అందరు అసురులలాగే యితడు కూడా అనేక అకృత్యాలు చేసి ఉంటాడు కానీ మనం ముఖ్యంగా చెప్పుకొనేవి రెండు - దేవమాత అదితి కర్ణకుండలాలు అపహరించడం, పదహారు వేలమంది స్త్రీలను బంధించడం. ఇతనికి ఉన్న వరం తన తల్లి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకపోవడం. ఆ వరానికనుగుణంగా మళ్ళీ ఆ భూదేవే సత్యభామగా అవతరించి శ్రీకృష్ణునితో కలిసి యుద్ధభూమికి వెళ్ళి ఆ నరకాసురుని వధించింది. అప్పుడు ప్రజలందరూ ఆనందంతో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇది స్థూలంగా దీపావళి కథ. 

అయితే మనం కొంచెం లోతుగా విచారిస్తే ఇదంతా మనలోనే జరుగుతున్న కథే. తన ఉన్నత స్థితినుండి దిగివచ్చిన ఆత్మ ఎప్పుడైతే ప్రకృతిగతమైన దేహత్రయంతో కలిసిందో అప్పుడే మనకు ఈ దేహం నేననే 'దేహాత్మ భావన' జనించింది. అదే నరకాసురుడు. ఇక అంతటితో మన శరీరమే ప్రాగ్జ్యోతిష పురమైపోయింది. 'ప్రాక్' అంటే తూర్పు అని, అప్పటి మన దేశంలో తూర్పున మొదటిగా అస్సాంలో సూర్యుడు ఉదయిస్తాడు కనుక అదే ప్రాగ్జ్యోతిష పురమని చెబుతారు. అయితే 'ప్రాక్' అంటే పూర్వం అనే అర్థం కూడా ఉంది. అంటే ఎప్పుడైతే ఈ దేహాత్మ భావన మనలో ప్రవేశించిందో అప్పుడే మనలోని దివ్యజ్యోతి మసకబారిపోయిందన్నమాట. అందుకే అది 'పూర్వం జ్యోతి ఉన్న పురం' అయ్యింది.

'మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోని దివ్యజ్యోతి మసకేసిపోతున్నది' అని మనం పాడుకుంటాం. అయితే మనస్సుకి, హృదయానికి ఈ శత్రుత్వం ఎందుకు వస్తుంది? హృదయం ఎప్పుడూ సత్యాన్ని పలకమంటుంది. కానీ మనస్సు సత్యాన్ని పలికితే ఈ శరీరానికో, దాని పరువుకో, దానికి సంబంధించిన ఇతర వస్తువులకో హాని కలుగుతుందని అసత్యం చెబుతుంది. హృదయం శాంతిగా ఉండమంటుంది. మనస్సు ఉన్నవీ, లేనివీ ఊహించుకొని ఈ శరీరానికో, దానికి సంబంధించిన వారికో ఏదో హాని జరగబోతోందని అశాంతికి గురవుతూ ఉంటుంది. హృదయం ఎదుటివాడిపై దయ చూపించమంటుంది. మనస్సు కులమో, మతమో, జాతో, భాషో ఇలా ఏదో ఒక సాకు చూపించి, వాడు మనవాడు కాదు పొమ్మంటుంది. హృదయం నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అందరినీ అలాగే ప్రేమించు అంటుంది. మనస్సు నేను వేరు, వాడు వేరు అంటుంది. మనస్సు ఇలా ప్రవర్తించడానికి ముఖ్య కారణం ఈ దేహం నేననే దేహాత్మ భావనే కదా!

ఇక మనలో దైవీగుణాలు పెరిగి మనం దైవత్వాన్ని పొందాలంటే దానికి మూడు మెట్లు ఉన్నాయి - శ్రవణం, మననం, నిదిధ్యాస. ముందుగా గురువుల, పెద్దల ద్వారా వచ్చే మంచి మాటలను వినాలి. ఆ తరువాత వాటిని మాటిమాటికీ గుర్తు తెచ్చుకుంటూ ఆచరణలో పెట్టుకోవటం, అనుభవంలోకి తెచ్చుకోవటం. అయితే మనం సత్సంగంలో కూర్చుంటే మన మనస్సు అవతలివారు చెప్పేది విననివ్వకుండా వారి పూర్వ ప్రవర్తనలో, వారి గురించి మనం విన్న చెడ్డ మాటలో గుర్తుకుతెచ్చి ఇలాంటివాడు చెబితే మనం వినేదేంటి? అంటుంది. లేదా, నా అంతటివాడు ఒకళ్ళ మాట వినేదేంటి అనుకుంటుంది. ఒకవేళ ఇవన్నీ దాటి బుద్ధిగా కూర్చున్నా, ఒకవైపు వింటున్నట్లే నటిస్తూ ఇంకొకవైపు నిన్నటి జ్ఞాపకాలకో, రేపటి వ్యాపకాలకో మనను లాక్కుపోతూ ఉంటుంది.  దీనికి కారణం దేహాత్మభావనే కదా! అదే నరకాసురుడు దేవతలకు జననియైన అదితి కర్ణకుండలాలను అపహరించడం - అంటే దేహాత్మభావన మనలోని దైవీగుణాలకు జననియైన శ్రవణాన్ని హరించటం. అందుకే 'సన్యస్య శ్రవణం కుర్యాత్' - సన్యసించి శ్రవణం చేయాలని పెద్దలు చెబుతారు. అంటే శ్రవణం చేయాలంటే ముందుగా సర్వ సంకల్పాలను, వాటికి కారణమైన దేహాత్మభావనను సన్యసించాలి. 

ఇక స్త్రీ అనే శబ్దం స,త,ర అనే మూడు అక్షరాలతో కూడినది. అంటే సత్వ, తమో, రజో గుణాలతో కూడిన మనస్సే స్త్రీ అని పెద్దలు చెబుతారు. మన దేహంలో మనస్సు ఎక్కడ ఉంది అంటే ఏం చెబుతాం? శరీరమంతా వ్యాపించి ఉంది. నీ శరీరంలో ఎక్కడ తాకినా, నొప్పి కలిగినా నీ మనస్సుకు తెలుస్తోంది కదా. మన శరీరంలోని నాడీవ్యవస్థ ద్వారా మనస్సు శరీరమంతా వ్యాపించి ఉంది. ఈ నాడులు పదహారు వేలని పెద్దలు చెబుతారు. అవే నరకాసుడు బంధించిన పదహారు వేల స్త్రీలు. అయితే దేహాత్మభావనతో బంధనాన్ని పొందుతున్న ఈ మనస్సుకి విముక్తి కావాలంటే ముందుగా త్రిగుణాలను వదలి, సత్య వస్తువైన పరమాత్మను పట్టుకోవాలి. అదే మనకు పెద్దలు చిన్ముద్ర ద్వారా సూచించారు. అలా త్రిగుణాలను వదలి సత్యాన్ని పట్టుకున్నప్పుడు స్త్రీత్వం నుండి సత్యభామత్వానికి ఎదుగుతాం. అలా ఎదిగిన మనస్సు ద్వారా మాత్రమే దేహాత్మభావన అనే నరకాసురుని సంహారం సాధ్యం. 

ఒక్కసారి ఈ దేహాత్మభావన నశిస్తే మనస్సుకు, హృదయానికి శత్రుత్వం అంతరించి మనలోని దివ్యజ్యోతి మళ్ళీ ప్రజ్వలిస్తుంది. అలా ప్రతి మానవుడు ఒక్కొక్క దివ్యజ్యోతిగా ప్రజ్వలించినప్పుడు అదే నిజమైన దీపావళి.

అనాద్యవిద్యా హరణే క్షమాభ్యాం 
అహం మమోన్మత్త గజాంకుశాభ్యాం
గళత్సుధా సౌరభ సంతతాభ్యాం
నమోనమ శ్రీ గురు పాదుకాభ్యాం||

11, అక్టోబర్ 2021, సోమవారం

గురుశక్తి

అయస్కాంతం, ఇనుపముక్క రెండింటిలోనూ ప్రతి ఒక్క అణువులో అయస్కాంత శక్తి, ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. అయితే అయస్కాంతంలో అణువులన్నీ ఒకే వైపుకి తిరిగి ఉంటాయి. అందుకే దానిలోని ఆకర్షణ శక్తి బహిర్గతమౌతుంది. అదే ఇనుప ముక్కలో అణువులన్నీ తలొక వైపుకి తిరిగి ఉంటాయి. అందుకే దానిలోని అయస్కాంత శక్తి అభివ్యక్తం అవ్వదు. మరి ఆ ఇనుములోని అయస్కాంత శక్తిని వెలికితీసి దానిని ఉపయోగకరంగా చేయాలంటే అందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఆ ఇనుపముక్కను ఒక అయస్కాంతానికి దగ్గరగా చేర్చడం. అప్పుడు ఆ అయస్కాంతంలోని ఆకర్షణ శక్తికి ఆ ఇనుపముక్కలోని అణువులన్నీ ఆకర్షింపబడి ఒకేవైపుకు తిరుగుతాయి. అప్పుడు అది కూడా అయస్కాంతమైపోతుంది. అయితే ఇది తాత్కాలికమే. అయస్కాంతం నుండి దూరం జరుగగానే మళ్ళీ ఇనుప అణువులన్నీ వివిధ దిశలలో తిరిగిపోయి అది తన అయస్కాంత శక్తిని కోల్పోతుంది. శాశ్వతంగా అయస్కాంతత్వాన్ని పొందాలంటే ఆ ఇనుపముక్క దీర్ఘకాలం ఆ అయస్కాంతాన్ని ఆశ్రయించి ఉండాలి

ఇక రెండవ పద్ధతి ఆ ఇనుమును అత్యధిక ఉష్ణోగ్రతకు వేడిచేయడం. అప్పుడు ఆ ఇనుములోని అణువులన్నీ ఒకేవైపుకి తిరిగి వాటిలోని అయస్కాంత శక్తి బహిర్గతమౌతుంది. నిజానికి మన భూగోళానికి ఉన్న అయస్కాంత శక్తి కూడా ఇలా వచ్చినదే. భూగోళం మధ్యభాగంలో ఇనుముతో నిండి, ఒక కొలిమిలా నిరంతరం మండుతూ ఉంటుంది. అక్కడ సూర్యుని ఉపరితలం కంటే అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ వేడికి ఆ ఇనుప ముద్ద అంతా ఒక మహా అయస్కాంతంలా మారి భూమికి అయస్కాంత శక్తిని ఇస్తోంది. నిజానికి భూమి చుట్టూ ఈ అయస్కాంత శక్తి వలయం లేకపోతే సూర్యునినుంచి వచ్చే హానికారక కిరణాలకు భూమిమీద జీవనం మనగలిగేది కాదు.

మన మనస్సు కూడా ఆ ఇనుపముక్క లాంటిదే. అందులో అసంఖ్యాకమైన సంకల్పాలు, ఆలోచనలు నిరంతరంగా అనేక దిక్కులలో ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే మనకు మనోబలం, లేదా సంకల్పబలం లోపించి మనలోనే నిక్షిప్తమై ఉన్న అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని మనం అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. ఇలా అనేకాగ్రమై పలుదిశలలో పరుగులు పెట్టే మనస్సును ఏకాగ్రపరచి నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపటానికి కూడా పైన చెప్పిన రెండు మార్గాలే ఉపయోగపడతాయి.

ఇనుపముక్కను అయస్కాంతం దగ్గరలో ఉంచితే దానిలోని అణువులు ఏకాగ్రమైనట్లే, నిరంతర భగవదాయత్త చిత్తులైన మహాత్ముల, గురువుల సన్నిధిలో మన మనస్సు ఏకాగ్రత చెంది, ప్రాపంచిక విషయాలను, బలహీనతలను అధిగమించి ఆధ్యాత్మిక శక్తిని అందుకోగలుగుతుంది. శ్రీగురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు దసరా మహోత్సవాలలో జరిగే సత్సంగాలలో ఒక్కొక్కసారి ఏడెనిమిది గంటలు నిర్విరామంగా బోధ చేసేవారు. అన్ని గంటలూ సభలోని బాలురనుండి వృద్ధులవరకు ఏ ఒక్కరూ కదలకుండా కూర్చుని శ్రద్ధగా వినేవారు. మరి మామూలుగా ఇంట్లో ఒక గంట ధ్యానమో, పూజో చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుందే? వారి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మనలో చాలామంది అన్ని గంటలు కదలకుండా, ఏ అవశిష్టాలకీ లేవకుండా కూర్చోలేమే? మరి అంతమందిని అంతసేపు ఏ శక్తి సర్వాన్ని మరిపించి కూర్చోబెట్టింది? అదే గురువుల ఆధ్యాత్మిక శక్తి.

అయస్కాంతానికే కాకుండా సృష్టిలోని ప్రతి వస్తువుకూ ఆకర్షణ శక్తి ఉంటుంది. అదే గురుత్వాకర్షణ శక్తి. ఒక వస్తువు ఎంత పెద్దదైతే దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గురు అంటేనే పెద్ద, లేదా గొప్ప అని అర్థం. అందుకే మన సౌరకుటుంబంలోని నవగ్రహాలలో అన్నిటికంటే పెద్దదాన్ని గురుగ్రహం అని పిలుస్తాం. నిజానికి మన భూగోళంపై ఇంకా జీవనం నిలిచి ఉండటానికి ఈ గురుగ్రహం కూడా ఒక ముఖ్య కారణమే. నిరంతరం అనేక గ్రహశకలాలు, తోకచుక్కలు మన భూమిపైపుగా దూసుకువస్తూనే ఉంటాయి. ఇందులో భూమిపై జీవరాశిని సమూలంగా నాశనం చేయగల పరిమాణంగలవి కూడా ఉంటాయి. అయితే వాటిలో అధికభాగాన్ని గురుగ్రహం తన గురుత్వాకర్షణతో తనలోనికి లాక్కుని మన భూమిని రక్షిస్తూ ఉంటుంది.

ఇక ఆధ్యాత్మిక గురువుల విషయానికి వస్తే, సృష్టిలోని ఏ వస్తువును, లేదా శక్తిని తీసుకున్నా అంతకంటే పెద్దది, గొప్పది గురుశక్తి. ఆ గురువులు మనకోసం దేహధారణ చేసివచ్చి మనకు ప్రసాదించే అమోఘ వరం వారి సన్నిధి. ఆ గురుసన్నిధి మన మనసులలోని సంకల్పాలను, వాసనలను, బలహీనతలను అధిగమించి, ఏకాగ్రతను సాధించి మనలోనే ఉన్న బ్రహ్మామృతాన్ని అందుకొనే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. అలాగే బయటినుండి నిరంతరం మన మనసుమీద దాడిచేసే ప్రాపంచిక విషయాదులనుండి మనను కాచి రక్షిస్తుంది.

మన మనసులను స్థిరపరచి, మన సంకల్పాలన్నింటినీ బ్రహ్మవస్తువునందు ఏకీకృతం చేసి మనకు బ్రహ్మానందాన్ని అందించే మరొక మార్గం ధ్యానాగ్ని. అత్యధిక ఉష్ణోగ్రతకు వేడిచేస్తే ఇనుము అయస్కాంతంగా మారినట్లే, ఈ ధ్యానాగ్ని మనలోని దేహాత్మ భావనను, అహంకార మమకారాలను, పూర్వజన్మ వాసనలను, అన్నింటినీ దహించివేసి, మన నిజతత్వాన్ని ఎరుకపరచి పరమశాంతిని మనకందిస్తుంది. అయితే ఈ ధ్యానం గురువు మార్గదర్శకత్వంలో, వారి సన్నిధిలో చేసినప్పుడు అత్యంత విశేష ఫలితాన్నిస్తుంది. 

ఒక వస్తువుయొక్క గురుత్వాకర్షణ శక్తి అత్యధికమైన ప్రభావాన్ని చూపించాలంటే ఆ వస్తువుచేత ఆకర్శింపబడే రెండవ వస్తువు దానికన్నా చాలా చిన్నదై ఉండాలి. అలాగే గురుశక్తి మనమీద ప్రభావం చూపించాలంటే మనం ముందుగా మన అల్పత్వాన్ని గుర్తించి వారికి సంపూర్ణ శరణాగతి చెందాలి. అంతేకాని గురువుని ఆశ్రయించి కూడా ఇంకా నేనెంతో గొప్పవాడిని, పండితుడిని, మేధావిని అనుకొనేవాడు ఆ గురుశక్తిని అనుభవంలోనికి తెచ్చుకోలేడు. గురువుల సన్నిధిలో జీవించడానికి ముఖ్యంగా మూడు సూత్రాలు చెబుతారు - చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చచ్చినట్టు పడుండాలి.

ఒక్కసారి గురు సమాశ్రయం లభిస్తే ఇక ఆ జీవి తరించినట్లే. శ్రీగురుదేవులు "నేను కామవరపుకోట జీడిని. ఒక్కసారి పట్టుకుంటే విడిచిపెట్టను" అనేవారు. ఒకవేళ బలవత్తరమైన కర్మప్రభావం చేత ఏ శిష్యుడైనా వారికి దూరమైనా, ఈ జన్మలో కాకపోతే మరెన్ని జన్మలకైనా వారికి మళ్ళీ గురుసమాశ్రయం తప్పక లభిస్తుంది. అది గురుదేవులు ఇచ్చే గ్యారంటీ.

ఏనా డేము భవ త్పదాబ్జముల నెంతే బట్టుకొన్నారమో?
ఆనాడే చరితార్థజన్ములము మేమైనార మెట్లేని
బాబూ! నీ దృష్టిబడం ద్యజింప వెటులం బోనీక, ప్రేమించి
సుజ్ఞానం బీగల సత్యమూర్తివి కదా కాళీప్రసాదప్రభూ!

20, ఆగస్టు 2021, శుక్రవారం

లక్ష్మి

        లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అంటే సుఖసంతోషాలు, లక్ష్మి అంటే ఆనంద కోలాహలం. క్షీరసాగర మథనంలో అవతరించి, క్షీరసాగరశాయిని వరించి, తనను నమ్ముకొన్న భక్తులను పాడిపంటలలో, సుఖశాంతులలో ఓలలాడించే చల్లని తల్లి లక్ష్మీదేవి. తన సోదరుడైన చంద్రుడు ఎలాగైతే సూర్యకాంతిని ప్రతిబింబిస్తూ లోకానికి చల్లని వెన్నెలను ప్రసాదిస్తాడో అలాగే ఈ తల్లి శ్రీమన్నారాయణుని వైభవాన్ని ప్రతిబింబిస్తూ లోకానికి పోషణను అందిస్తుంది.

        అయితే ఈ లక్ష్మి, లేదా ఐశ్వర్యం నీడలాంటిది. మనం వెలుగువైపుకు ప్రయాణిస్తుంటే నీడ మన వెంటబడి వస్తుంది. అదే మనం వెనక్కి తిరిగి నీడ వెంటబడితే అది మనకన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది కానీ మనకు ఎప్పటికీ అందదు. అలాగే లోకానికంతటికీ ప్రకాశాన్నిచ్చే నారాయణుని వైపుకు మనం ప్రయాణిస్తూ ఉంటే ఐశ్వర్యం మనవెంటే ఉంటుంది. అదే మనం నారాయణుని వదలివేసి ఐశ్వర్యం వెంట పరుగులు తీస్తే అది ఎన్నటికీ దక్కదు, దక్కినా నిలవదు. లక్ష్మీదేవి నామాలలో ఓం చంచలాయై నమః, ఓం చపలాయై నమః అనే నామాలు కూడా ఉన్నాయి. అంటే ఆవిడ ఏ ఒక్కరి దగ్గరా స్థిరంగా ఉండదు. 

        కానీ ఆవిడ స్థిరనివాసం చేసే స్థానం ఒకటే ఉంది. అదే శ్రీమన్నారాయణుని హృదయమందిరం - ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః. మన మనస్సులలోని చాపల్యాన్ని, చంచలత్వాన్ని వీడి ఎప్పుడైతే ఆ నారాయణుని మన హృదయ మందిరంలో స్థిరంగా ప్రతిష్టించుకుంటామో అప్పుడు ఆయన హృదయస్థితయైన లక్ష్మీ కటాక్షం మనకు సుస్థిరమౌతుంది. "లక్ష్మీనారాయణుని చరణాలను నీవు ఆశ్రయిస్తే లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఆ తల్లి నీకు ఇహంలో ఏ లోటూ లేకుండా చూస్తుంది, ఆయన నీకు పరమపదాన్ని ప్రసాదిస్తాడు" అని శ్రీగురుదేవులు చెప్పేవారు.

        అయితే ఇలా మనకు లభించిన సంపదను సరిగ్గా వినియోగించ గలగటం కూడా ఒక వరమే. "దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య| యో న దదాతి న భుఙ్క్తే తస్య తృతీయా గతిర్భవతి||" - విత్తానికి మూడు గతులని భర్తృహరి చెబుతాడు. అవి దానం, భోగం, నాశం. ఇందులో ఉత్తమగతి మనకున్న సంపదను వీలైనంత దానం చేయడం. ఇక మధ్యమ గతి కనీసం నీవైనా అనుభవించడం. ఇక ఈ రెండూ చేయని పిసినారి వాని సంపదకు మూడవగతే శరణ్యమని చెబుతాడు. అంటే ఎవరైతే తమ సంపదని దానం చేయకుండా, తాము అనుభవించకుండా దాచిపెడతారో ఆ సంపద చివరికి అగ్ని వల్లనో, చోరుల వల్లనో, రాజులవల్లనో, ఇంకంటాక్స్ వాళ్ళ వల్లనో నాశనం అయిపోతుంది.

        ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీర్యలక్ష్మి, విద్యాలక్ష్మి - ఇలా ఈ ఐశ్వర్యం వివిధ రూపాలలో ఉంటుంది. అయితే "యద్యత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా| తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవం||" - ఈ లోకంలో ఏదైతే ఐశ్వర్యం, తేజస్సు, బలం, సంపదలతో  ప్రకాశిస్తూ ఉంటుందో అదంతా నా తేజస్సుయొక్క అంశనుండే ఉద్భవించిందని తెలుసుకో అని భగవానుడు గీతలో స్వయంగా ప్రకటించాడు. అంటే లక్ష్మి నారాయణునికి వేరుగా ఎప్పుడూ లేదు. ఆయననుండే ఉద్భవిస్తోంది, ఆయనయందే ప్రకాశిస్తోంది, ఆయనలోనే లయమైపోతోంది. నారాయణుడు స్థితి కారకుడు. అయితే ఆయన ఈ లోకాలను నడపడానికి కావలసిన ముఖ్య ఇంధనం సంపద(లక్ష్మి) - ధనం మూలం ఇదం జగత్. 

    అయితే ఈ సంపదల అన్నిటికంటే ఉత్కృష్టమైనది మోక్షలక్ష్మి - ముకుందా ముక్తినిలయా. ఈవిడ మొక్షాన్నిచ్చే ముకుందుని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది. అసలు వారిద్దరూ ఒకే శక్తియొక్క రెండు రూపాలు. మరిసుస్థిరమైన ఆ మోక్షలక్ష్మిని వదిలేసి మానవులు అస్థిరమైన లౌకిక సంపదల కోసం ప్రాకులాడుతూ, తమ సోదర మానవులపై ఈర్ష్యాద్వేషాలను పెంచుకుంటూ ఉంటారు. రామాయణంలో కథాపరంగా చూస్తే తన కుమారునికి దక్కవలసిన రాజ్యం రామునికి దక్కుతోందని కైకమ్మ ఈర్ష్యపడింది. అలాగే ఒకవేళ భరతుని రాజుని చేసినా, రాముడు ఇక్కడే ఉంటే ఈర్ష్యతో ఆ రాజ్యాన్ని దక్కించుకోవడానికి కుట్రలు పన్నుతాడేమో అని కూడా భయపడి రాముని అడవులకు పంపింది. అయితే లక్ష రూపాయలు పెట్టి ఆటో కొనుక్కున్నవాడు వెనకాల "నన్ను చూసి ఏడువకురా" అని వ్రాసుకుంటే ఆ వెనకాల కోటి రూపాయల కారులో వెళ్ళేవాడు ఎలా నవ్వుకుంటాడో సాక్షాత్తు లక్ష్మీపతియైన రామచంద్రుడు ఈ చిన్న అయోధ్యా నగరానికి రాజైన భరతుని చూసి ఈర్ష్య చెందుతాడనుకోవడం అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే పైన చెప్పినట్లు ఇది కేవలం కథాపరంగా మాత్రమే అనుకోండి. అసలు కైకమ్మకు ఆ బుద్ధి పుట్టడానికి వెనుక గల దేవరహస్యం, రామావతార లక్ష్యం ఆ లోగుట్టు పెరుమాళ్ళకే యెఱుక. 

            లక్ష్మీదేవికి ఒక విశేష లక్షణం ఉంది. "ఆర్ద్రాం జ్వలన్తీ తృప్తాం తర్పయన్తీ" - తడిసిన వాటిని మండిస్తుంది, తృప్తి చెందిన వాడిని మళ్ళీ తృప్తి పరుస్తుంది. అంతులేని సంపదలో తడిసి ముద్దయిన వాడయినా వీడి జేబులో ఐఫోన్ 12 ఉండి పక్కవాడి జేబులో ఐఫోన్ 13 కనిపిస్తే వాడి గుండె భగ్గున మండుతుంది. అలాగే వీడికి రాని కాంట్రాక్టు ఏదో ప్రక్కవాడికి వస్తే అసూయతో రగిలిపోతాడు. ఇక ఎవరైనా కడుపు నిండా తృప్తిగా తిన్నవాడికి మరొక పిండివంట పెడతానంటే "అమ్మో నేను తృప్తిగా తిన్నాను, ఇక తినలేను" అంటాడు. అదే "ఇవాళ జేబులో వంద రూపాయలు వచ్చాయి, నేను తృప్తిగా ఉన్నాను" అనుకున్నవాడికి మరొక పదిరూపాయలు ఇస్తే "ఇప్పుడు మరింత తృప్తిగా ఉన్నాను" అనుకుంటూ తీసుకుంటాడు కానీ భోజనంలాగా "ఇక నావల్ల కాదు" అనడు.

        కాబట్టి లౌకికమైన సంపద ఎంత సంపాదించినా మనకు తృప్తి కలుగదు, మనశ్శాంతి లభించదు. పైగా వీటితో భగవంతుని మెప్పించడం అసాధ్యం. అంతులేని ఐశ్వర్యం ఉన్న సత్యభామ తూచలేని శ్రీకృష్ణుని భక్తితో కూడిన ఒక్క తులసీదళంతో రుక్మిణీదేవి తూచగలిగింది. కాబట్టి భక్తిలేని సంపద వ్యర్థమే. "భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు" అంటాడు వేమన. మిగిలిన లక్ష్ముల అనుగ్రహం పొందటానికి ఎన్ని సాధనాలు ఉన్నా మోక్షలక్ష్మి అనుగ్రహం పొందాలంటే భక్తి ఒక్కటే సాధనం. 

4, జూన్ 2021, శుక్రవారం

హనుమంతుడు

 బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకమ్ సుందరం

సుగ్రీవాది సమస్త వానరగణైః సంసేవ్య పాదాంబుజం

నాదేనైవ సమస్త రాక్షసగణాన్ సంత్రాశయంతమ్ ప్రభుమ్ 

శ్రీమద్రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజమ్


హనుమంతుడు ఎంత శక్తిమంతుడో మనందరికీ తెలిసినదే. త్రిభువన ప్రక్షోభకమ్ - మూడు లోకాలను ఒక్కపెట్టున అతలాకుతలం చేయగల శక్తివంతుడైనా మధ్యాహ్న మార్తాండుడిలాగా తన తేజస్సుతో మనలను మండించకుండా - బాలార్కాయుత తేజసం - ఉదయించే సూర్యుడిలాగా మన మనస్సులకు ఆహ్లాదాన్నే కలిగిస్తాడు. ఇక సుందరం - ఒక వానరుడు సుందరంగా ఉండటం ఏమిటని మనం అనుకోవచ్చు. అయితే Beauty is in the eye of the beholder - అందం చూసేవాడి కంటిలో(దృష్టిలో) ఉంటుందని ఆంగ్లంలో సామెత. అందం అంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేది. ఒకసారి హనుమంతుని రూపం తలుచుకోగానే ఎంతటి చికాకులలో, కష్టాలలో ఉన్నవారికైనా ఒక్కసారిగా ఆనందం, ఉత్సాహం కలుగుతాయి. అందుకే ఆయన సుందరుడు. అంతేకాదు మామూలుగా ఎక్కడైనా బలవంతుడైన శత్రువో, పెద్ద ఆపదో పొంచి ఉన్నదంటే ఎవరైనా దూరంగా పారిపోవటానికే ప్రయత్నిస్తారు. కానీ సుందరకాండలో చూస్తే వేలాది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణిస్తున్నా ఇంకా ఇంకా వేలాదిగా ఆయన వద్దకు వస్తూనే ఉంటారు కానీ పారిపోరు. అంటే ఒక మంట మిడుతల దండుని ఎంతగా ఆకర్షిస్తుందో అలాగే ఆ రాక్షసులను కూడా ఆకర్షించేంతటి సుందర రూపం ఆయనది.

ఇక సుగ్రీవుడు మొదలైన సమస్త వానరులతో సేవింపబడే పాదపద్మాలు కలవాడు అంటే మనకి కొంచెం అనుమానం వస్తుంది. మిగతా వానరులు ఆయనను సేవించారంటే నమ్ముతాం కానీ సుగ్రీవుడు రాజు, హనుమంతుడు ఆయనకు మంత్రి కదా! పైగా రామాయణంలో ఎక్కడ చూసినా 'మా ప్రభువైన సుగ్రీవుడు' అనే హనుమంతుడు సంబోధిస్తాడు. మరి సుగ్రీవుడు హనుమంతుని పాదాలను సేవించడం ఏమిటి? అయితే సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలవాడు అని అర్థం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని పెద్దలు చెబుతారు కదా. అలా హనుమత్ స్మరణ ద్వారా వాక్పటుత్వాన్ని సాధించిన బుద్ధిమంతులు అందరూ సుగ్రీవులే. మరి వారందరూ నిరంతరం ఆ హనుమంతుని పదపద్మాలను సేవిస్తూనే ఉంటారు కదా. అలా నిరంతరం సేవించుకొంటే ఆ కొమ్మ మీదనుంచి ఈ కొమ్మకు, ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకు వానరంలా దూకుతూ ఉండే మన బుద్ధి స్థిరత్వాన్ని పొంది పద్మంలో మకరందాన్ని గ్రోలుతూ అక్కడే నిలిచిపోయిన భ్రమరంలా ఆ పాదాలయందే నిలిచిపోతుంది.

'నువ్వరిస్తే అరుపులు, అదే నేనరిస్తే మెరుపులే' అని ఏదో ప్రాస కోసం మన సినిమా హీరోలు చెప్తారు కానీ అసలు అరుపులతో మెరుపులేంటి, పిడుగులే సృష్టించినవాడు హనుమంతుడు. ఆయన ఒక్కసారి పెద్దగా నాదం చేస్తే సమస్త రాక్షసగణాలు భయంతో గజగజ వణికిపోతాయి. ఆ బయట ఉన్న రాక్షసులే కాదు, భూత ప్రేత పిశాచాలే కాదు, మనలో ఉన్న దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు, దుష్ట వాసనలు అన్నీ కూడా ఒక్కసారి ఆ హనుమంతుని సింహనాదం వినగానే గజగజ వణుకుతూ తోక ముడుచుకొని పలాయనం చిత్తగిస్తాయి.

అయితే ఇంతటి అమోఘ శక్తివంతుడు, గుణసంపన్నుడు అయినా ఆయన ఎన్నడూ ఇది తన శక్తి అనే భావనే మనసులోకి రానీయక నిరంతరం శ్రీరామచంద్ర పాదాబ్జాల ధ్యానంలోనే రమిస్తూ ఉంటాడు. అటువంటి వాతాత్మజుడైన హనుమంతుని ధ్యానిస్తే మనకు కూడా ఆయనలోని కొన్ని సుగుణాలైనా అలవడతాయి. హనుమంతుడు ఒక్క రామాయణంలోనే ఎన్నెన్ని మహత్తర కార్యాలు నిర్వహించాడో లెక్కపెట్టలేం. అంతేకాక ఆయన చిరంజీవి. ఇప్పటికీ అనేకమందిని అనేకవిధాలుగా సంరక్షిస్తూనే ఉన్నాడు. 

అయినా ఇదంతా ఆ రాముని మహిమ అనే ఆయన చెప్పుకుంటాడు కానీ 'నేను చేస్తున్నాను' అనే కర్తృత్వ భావన కానీ, 'దీని ప్రతిఫలం నాకే దక్కాలి' అనే భోక్తృత్వ భావన కానీ ఆయనకు లేవు. పైగా తాను చేసే మహత్తర కార్యాలతో తనకు ఎటువంటి సంగమూ లేకపోయినా, ఆయా కార్యాల సిద్ధి విషయంలో ఎటువంటి వికారము (కార్యం సిద్ధిస్తే ఆనందము, విఫలమైతే విషాదము) లేకపోయినా  'ఇది నాకెందుకులే' అనే నిరాసక్తత ఏమాత్రం లేకుండా మొక్కవోని దృఢ సంకల్పంతో, తిరుగులేని ఉత్సాహంతో ఆయా కార్యాలను నిర్వహిస్తాడు. అందుకే ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిధ్యసిధ్యౌ నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే అని గీతాచార్యుడు నిర్వచించిన శుద్ధ సాత్విక కర్త హనుమంతుడు.

సూపర్ మాన్, స్పైడర్ మాన్, ఐరన్ మాన్ ఇలాంటి కల్పిత పాత్రలు ఎన్ని వచ్చినా తరతరాలుగా ఆబాలగోపాలన్నీ అలరిస్తున్న సూపర్ హీరో హనుమాన్. ఇతర దేవతలలో ఎవరైనా కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ హనుమంతుడు నచ్చనివాడు ఎవడూ ఉండడు. అయితే హనుమంతునికి మాత్రం ఆ భేద భావాలు ఏవీ ఉండవు. నువ్వు ఏ దేవతను అర్చించినా హనుమంతుని అనుగ్రహం నీకు చాలా సులభంగా కలుగుతుంది. 'మా దేవుడు గొప్ప' అంటే 'కాదు మా దేవుడే గొప్ప' అని కొట్లాడుకోవటాన్ని ఆయన ఎన్నడూ హర్షించడు. అందుకే తులసీదాసు వారు భక్త్యావేశంలో 'ఔర దేవతా చిత్త న ధరయి, హనుమత్ సేయి సర్వసుఖ కరయి' అని వ్రాస్తే దానిని తెనిగించిన ఎంఎస్ రామారావుగారు ఇతర దేవతలను కించపరచ వలసిన అవసరం ఏముందని 'ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు' అని మార్చి వ్రాసారు.

వీరాంజనేయుడు, భక్తాంజనేయుడు, దాసాంజనేయుడు, అభయాంజనేయుడు ఇలా రకరకాల రూపాలలో ఆంజనేయుడు మనకు దర్శనమిస్తాడు. మరే దేవుడిలో ఇన్ని కోణాలు మనకు కనిపించవు. దేవతలలో, భక్తులలో, దాసులలో, వీరులలో, మహిమాన్వితులలో, పండితులలో, ఇలా ఎందులో చూసినా ఆయనే అగ్రగణ్యుడు. అంతేకాదు, సగుణ నిర్గుణ భక్తులు రెండింటిలోను ఆయనకు ఆయనే సాటి. హనుమంతుడు ఒక్కసారి 'రామ్' అంటే ఆయన శరీరంలోని ముప్పదిమూడు కోట్ల రోమాలూ నిక్కబొడుచుకొని 'రామ్' అని ప్రతిధ్వనిస్తాయని శ్రీగురుదేవులు చెప్పేవారు. అలా తన తనువులోని అణువణువునా నిర్గుణ రూపంలో రామచంద్రుడు నిండి ఉన్నా ఎప్పుడెప్పుడు ఆ స్వామిని సగుణంగా కనులారా దర్శించుకుంటానా, చేతులారా సేవ చేసుకుంటానా అని అని నిరంతరం అశ్రుపూరిత నయనాలతో ఎదురుచూస్తూ ఉంటాడు ఆయన.

అటువంటి హనుమంతుని మన హృదయంలో నిలుపుకుంటే ఆయనతో పాటు ఆయన హృదయంలో సదా నివసించే శ్రీరాముడు, ఆ రాముని హృదయనివాసి అయిన పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని హృదయనివాసి అయిన గురుదేవుడు, ఇలా సకల దేవతలు మన హృదయంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. మనకీ మానవ జన్మ వచ్చినందుకు అంతకంటే సార్థకత ఏముంటుంది?

29, మే 2021, శనివారం

ఆక్సిజన్

    ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆక్సిజన్. ఆక్సిజన్, లేదా ప్రాణవాయువు జీవకోటికి అంతటికీ ఎంత ముఖ్యమైనదో చిన్నప్పుడే మనందరం చదువుకున్నాం. అయితే కొద్దిగా ఆలోచిస్తే ఈ ప్రాణవాయువుకు, భగవంతునికి చాలా దగ్గర సంబంధం ఉన్నదనిపిస్తుంది. ఆక్సిజన్ అనే మూలకంయొక్క రెండు పరమాణువులు కలిస్తే ఒక ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది. ఆ ఆక్సిజన్ మన చుట్టూ ఉన్న వాతావరణం అంతటా వ్యాపించి ఉండి సర్వ జీవకోటి మనుగడకు ఆధారమై ఉంటుంది. అలాగే పరమాత్మ తన రెండు భిన్న రూపాలైన ప్రకృతి, పురుషుల రూపంలో సృష్టి అంతటా నిండివుండి ఈ సృష్టి మనుగడకు కారణం అవుతున్నాడు. 

        ఇదే ఆక్సిజన్ పరమాణువులు మూడు కలిసి ఒక అణువుగా ఏర్పడితే అది ఓజోన్ రూపంలో భూ వాతావరణం పైభాగంలో ఒక గొడుగులా ఏర్పడి సూర్యునినుంచి వచ్చే హానికారక కిరణాలనుండి భూమినంతటినీ రక్షిస్తోంది. పరమాత్మ కూడా అలాగే తన మూడురూపాలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఏర్పడి సృష్టిని నిరంతరంగా నడుపుతూ, కాచి రక్షిస్తూ ఉన్నాడు. మరి అదే ఆక్సిజన్ ఒక పరమాణువు రెండు హైడ్రోజన్ పరమాణువులతో కలిసి నీటి రూపాన్ని సంతరించుకుంటుంది. సృష్టి ఏర్పడాలన్నా ఈ నీరే ఉండాలి, సృష్టి అంతా లయమైపోయినా చివరికి ఈ నీరే మిగులుతుంది. నీరు నారాయణ స్వరూపమని శ్రీ గురుదేవులు ఎప్పుడూ చెబుతుండేవారు. భూమిపై మూడు వంతులు నీరే, మన శరీరంలోనూ మూడు వంతులు నీరే.  అలాగే పురుషోత్తముడైన పరమాత్మ  క్షర పురుషుడు(పాంచబౌతికమైన శరీరాలు), అక్షర పురుషుడు(కూటస్థ చైతన్యమైన ఆత్మ) లతో కలిసి ప్రకృతిలోని ప్రతి ప్రాణియందు నిండి ఉండి వాటిని నడిపిస్తున్నాడు.

        ఇక ఆక్సిజన్ ఒకే పరమాణువు రూపంలో మనకు ప్రకృతిలో ఎక్కడా కనబడదు. అలాగే పరమాత్మ ఒక్కడే ఉన్నప్పుడు నిరాకారుడై, నిర్గుణుడై మనకు అగోచరంగానే ఉంటాడు. ఇక ఇప్పటి ఆక్సిజన్ కొరతను ఉటంకిస్తూ కొంతమంది విషయం తెలియనివారు, "ముందునుంచి చెట్లు పెంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా!" అని సలహాలు ఇస్తున్నారు. అయితే ఎంత చెట్లు పెంచినా, మన చుట్టూ ఆక్సిజన్తో కూడిన ఎంతటి స్వచ్ఛమైన గాలి ఉన్నా, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి, వ్యాధిగ్రస్తులకు ఆ గాలిలోని ప్రాణవాయువును నేరుగా పొందే సామర్థ్యం ఉండదు. అందుకే వారికి ఆ ప్రాణవాయువును ఏకీకృతం చేసి వారి సామర్థ్యానికి తగ్గట్టుగా అందించే ఒక యంత్ర పరికరం (ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్) కావలసి వస్తుంది. అలాగే మన చుట్టూ, మన లోపలా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని అందుకోవటానికి భవరోగంతో ఉన్న మనకు సామర్థ్యం లేదు కాబట్టే ఆ పరమాత్మ తత్వమే ఘనీభవించి ఒక గురు రూపంలో  మన మధ్యకు వచ్చి ఎవరి సామర్థ్యానికి తగ్గట్లుగా వారికి ఆ పరమాత్మ తత్వాన్ని అందజేస్తారు.

             ఇక మన శరీరంలో కూడా పంచ  ప్రాణవాయువులు, పంచ ఉపవాయువులు ఉండి వివిధ జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడుతున్నాయి. భగవద్గీతలో పరమాత్మ తానే స్వయంగా వైశ్వానరుడి రూపంలో అందరి ప్రాణులలో ఉండి ప్రాణ, అపాన వాయువుల సహాయంతో ఆహారాన్ని అరిగిస్తున్నానని శెలవిచ్చారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, ఇతర ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపమే. అందుకే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం పరోపకారం చేస్తూ ఉంటాయి. "జీవాధారము నీరము జీవాధారంబు గాలి చెలగుచు నుండున్ కావలసిన నవి యొక్కరి ఈవిని కోరకయె చిక్కునిలలో వేమా" అంటాడు వేమన. మరి ఏ ఖర్చూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభించే ఈ ప్రకృతి వనరులను మనం ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి.

10, ఏప్రిల్ 2021, శనివారం

ప్లవ

అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి - భగవద్గీత 4-36

నీవు ఎంతటి పాపాత్ముడవైనా, పాపాత్ములందరికంటే అత్యంత అధిక పాపాలు చేసినా ఆ పాపసాగారాన్ని నీవు జ్ఞానమనే ప్లవంతో చక్కగా దాటిపోగలవు అని పరమాత్ముడు అభయమిస్తున్నాడు. 'ప్లవ' అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో గెంతు అనేది ఒక అర్థం. గెంతుతూ వెళ్తాయి కాబట్టి వానరాలను ప్లవగములు అంటారు. మరి అట్టి వానరులలో ప్లవగోత్తముడైన ఆ ఆంజనేయుడు ఒక్క గెంతులో మహా సముద్రాన్ని లంఘించి సీతమ్మను చేరుకున్నాడు. అప్పటివరకు 'నేను చాలా చిన్నవాడిని' అని ఒక మూలన కూర్చున్న ఆంజనేయుడికి అతని స్వస్వరూప జ్ఞానాన్ని జాంబవంతుడు బోధించడంతో మైనాకుడు, సురస, సింహిక అనే త్రిగుణాలతో నిండియున్న సంసార సాగరాన్ని ఒక్క గెంతులో దాటి పంచకోశాంతర స్థితయైన జగన్మాతను చేరుకోగలిగాడు. 

అలాగే ఎంతో క్రూరుడైన రత్నాకరుడు నారద మహర్షి ప్రబోధంతో క్షణంలో పరివర్తనం చెంది వాల్మీకియైనాడు. పరమ పాపాత్ముడైన అంగుళీమాలుడు కూడా బుధ్ధ భగవానుని దర్శనంతో సంపూర్ణ పరివర్తనం చెందాడు. గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారి చరిత్రలో కూడా మనకు ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తాయి. భీమవరంలో నాచు వెంకటరత్నంగారనే ప్రఖ్యాత లాయరు ఉండేవారు. వారికి మహాత్ములన్నా, గురువులన్నా ఎటువంటి గౌరవం లేదు. అయినా శ్రీగురుదేవులను  దర్శించుకున్న మరుక్షణంలోనే వారి మనస్సు గురుదేవుల అధీనమైపోయింది. లోకాన్ని, తన వృత్తిని అన్నింటినీ మరచిపోయి అలా శ్రీగురుదేవుల సన్నిధిలోనే తిరుగుతూ ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు వచ్చి పిలిచినా, 'నా మనస్సు ఆయన తీసేసుకున్నారు. అది తిరిగి నాకు ఇస్తేగానీ నేను రాలేను' అనేవారు. అలాగే 'ఈ గురువులందరూ వేషగాళ్ళు, మోసగాళ్ళు. ఈయన అంతు తేలుస్తాన'ని వచ్చిన విఠల్ దాసుగారు ఒక్క క్షణంలోనే శ్రీగురు చరణదాసులై భక్తికి శరణాగతికి పరాకాష్ట స్థితిని చేరుకున్నారు.

ఇలా భగవంతునికి పూర్తి వ్యతిరేకులైనవారు ఒక్క క్షణంలో జ్ఞానమనే గెంతుతో సంసార సాగరాన్ని దాటివేయడం చూస్తే మనబోటివారికి అసూయా, నిరుత్సాహమూ కలుగుతాయి. 'చిన్నప్పటినుంచి మంచిచెడుల సమాహారంగా జీవితాన్ని గడుపుతూ, వీలున్నంతవరకు మంచివైపు మనలను మనం మళ్ళించుకుంటూ ఎంతకాలమైనా ఇంకా మనం ఈ సంసార సాగరాన్ని పూర్తిగా దాటలేకపోతున్నామే' అనిపించడం సహజం. ఇక్కడే 'ప్లవ'  అనే పదానికి ఉన్న మరొక అర్థం మనం తెలుసుకోవాలి. ప్లవ అంటే చిన్న పడవ. వింధ్యవీధీ ప్లవంగమః - సూర్యభగవానుడు ఆకాశమార్గంలో ఒక చిన్న పడవలాగా ఉదయంనుంచి సాయంత్రం వరకు మెల్లగా సంచరిస్తూ ఉంటాడని ఆదిత్యహృదయం చెబుతోంది. 

సముద్రంలో పడవ ప్రయాణాన్ని గమనించండి. తెడ్డువేసి నాలుగడుగులు ముందుకు పోగానే ఒక పెద్ద కెరటమో, లేక గాలో వచ్చి మళ్ళీ రెండడుగులు వెనుకకు నెట్టుతూ ఉంటుంది. అలాగే గాఢమైన భక్తికాని, గాఢమైన వ్యతిరేకత కానీ లేకుండా మధ్యేమార్గంగా ఉండే మనబోటివారి ప్రయాణం కూడా సముద్రంలో పడవ ప్రయాణంలాగే ఉంటుంది. ఖాళీ సమయంలో ధ్యానమో పూజో మరో భగవత్కార్యమో చేస్తాం. ఏదో చిన్న ఆటంకం రాగానే ఆ పూటకి విరమించుకుంటాం. అయితే మన ప్రయత్నాన్ని పూర్తిగా విరమించకుండా మళ్ళీ మళ్ళీ మన పడవను దారిలో పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికైనా గమ్యాన్ని మాత్రం తప్పక చేరుతాం. 

ఎంతటి మహా పాపాలైనా దాటాలంటే జ్ఞానమే శరణ్యం. పాపరాశిని దహించాలంటే జ్ఞానాగ్నే శరణ్యం. అందుకే గీతాచార్యుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు. అయితే మన ఇంటిలో దీపం వెలగాలంటే ముందుగా అగ్గిపుల్ల వెలగాలి. అది వెలగాలంటే ముందు ఆ పుల్లని అగ్గిపెట్టెపై రాపిడి పెట్టాలి. అలాగే మనలో జ్ఞానాగ్ని వెలగాలంటే ముందుగా ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం నిలవాలంటే మనస్సును భగవన్నామముతో రాపిడి పెట్టాలి. అందుకే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణి అని శ్రీగురుదేవులు, నామాగ్ని దగ్ధ కర్మాణి అని శ్రీ మాతాజీవారు ఉద్బోధించారు. 

కాబట్టి శార్వరి అనే అంధకారం నుంచి జ్ఞానాగ్నిని వెలిగించుకుని ఆ జ్ఞాన 'ప్లవం' లో పాపపంకిలమైన సంసార సాగరాన్ని (ఒక్క గెంతులోగాని, పడవలో నెమ్మదిగాగానీ) దాటి 'శుభకృత్' - సకల శుభాలకు నిలయమైన మోక్ష సామ్రాజ్యాన్ని మనందరం చేరుకుంటామని ఆశిస్తూ శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు. 

31, మార్చి 2021, బుధవారం

కాలజ్ఞానం

    గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారి ప్రార్థనా శ్లోకాలలో ముఖ్యమైన మూడింటిలో మనకు ఒక అంశం ప్రముఖంగా కనిపిస్తుంది. ఒక శ్లోకంలో 'కాలజ్ఞాన విదగ్రణిం' అని, మరొక దానిలో 'కాలవేదినం' అని, మూడవదానిలో 'కాలజ్ఞతాది మహితోజ్వల శక్తిమంతం' అని ఉంటుంది. ఇంతకీ ఈ కాలజ్ఞానం అంటే ఏమిటో, అది కలిగి ఉండటం వలన సాధక బాధకాలేమిటో కొంచెం విచారణ చేద్దాం. 

    మామూలుగా మనకి గతంలో మన జీవితంలోనో, మన కళ్లెదుటనో జరిగిన విషయాలు తెలుస్తాయి. అలాగే వర్తమానంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్న, అనుభవిస్తున్న విషయాలు తెలుస్తాయి. అంతేగాని భవిష్యత్తులో మనకుగాని, వేరే వ్యక్తులకు కానీ ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నిజానికి మానవునికి ఇలా భవిష్యత్తు తెలియకపోవటం ఒక పెద్ద వరమనే చెప్పాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడికి రేపు పరీక్షలో మంచి మార్కులు వస్తాయని ముందుగానే తెలిసిందనుకోండి, ఎలాగూ మంచి మార్కులు వస్తాయి కదా అని వాడు ఈరోజు చదవడం మానేస్తాడు. అలాగే పరీక్షలో తప్పుతానని తెలిసినా ఎలాగూ తప్పేదానికి వృథా శ్రమ ఎందుకని చదవడం మానేస్తాడు. అలాగే మనం జీవితంలో చేసే ప్రతి పనిలో దానివలన భవిష్యత్తులో మనకు ఉపయోగం ఉంటుందనో, మంచి జరుగుతుందనో ఆశతోనే ఆయా పనులు చేస్తూ ఉంటాం. అదే నీ శ్రమంతా వృథా అవుతుంది అని ముందుగానే తెలిస్తే ఏ వ్యక్తీ ఆ పని చేయడు.

    ఈ బ్రతుకు శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. మన దగ్గరివారు ఎవరైనా చనిపోగానే 'ఎంతైనా మానవ జీవితం అశాశ్వతం కదా!' అని స్మశాన వైరాగ్యాన్ని తెచ్చిపెట్టుకుంటాం. కానీ మనం మన జీవితానికి వచ్చేసరికి చేసే ప్రతిపనీ, వేసే ప్రతి ప్రణాళికా మన జీవితం ఇంకా సుదీర్ఘ కాలంపాటు నడుస్తుందనే అంచనాతోనే ముడిపడి ఉంటుంది. అంతెందుకు, రేపు ప్రొద్దున్న దూరప్రయాణం చేయాలంటే ఇవాళ రాత్రంతా మనకు నిద్ర పట్టదు. అలాంటిది రేపు తెల్లవారి మనం లేవకుండా శాశ్వతంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి పోతామని ముందే తెలిస్తే అసలు మనం నిద్రపోగలమా? మరి ప్రతిరోజూ నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి కారణం రేపు తప్పకుండా లేస్తామనే ఆశ. 

    మన పిల్లలు ఎంత చెడుగా ప్రవర్తించినా మాటిమాటికీ వారిని క్షమించి మళ్ళీసారి మంచిగా నడుచుకోమని హితబోధ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఎప్పటికైనా వారు మారతారనే ఆశ. అలాగే  అవతలివారు అడిగినా అడగకపోయినా వారు పాటిస్తారనే ఆశతో సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. అదే మనకు భవిష్యత్తు తెలిసి, వీరు ఖచ్చితంగా మారరు, లేదా మన సలహాలు పాటించరు అని తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఎంతమాత్రం ఆసక్తి చూపిస్తాం? 'పోతేపోనీ' అనుకుంటాం కదా! అలాగే కేవలం భవిష్యత్తే కాదు, వర్తమానంలో ఎదుటివారి మనస్సులో కలిగే భావనలు మనకు తెలిసినా మనం వారితో మాములుగా ప్రవర్తించగలమా?

    అదే కాలజ్ఞాన విదగ్రణి అయిన శ్రీ గురుదేవులకు ఎదుటివారి భూత, భవిష్యత్, వర్తమానాలు స్పష్టంగా తెలియటమే కాకుండా వారి వారి మనస్సులు కూడా తెరచిన పుస్తకంలా విస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయినా వారి వాక్కులోగాని, ప్రవర్తనలో గాని ఎటువంటి మార్పు లేకుండా కేవలం అది తమ ధర్మంగా భావిస్తూ నిష్కామంగా ఎదుటివారిపైన తమ నిర్హేతుకమైన కరుణావర్షాన్ని కురిపింపజేస్తూనే ఉంటారు. తమ బోధనలను పెడచెవిని పెడతారని ముందే తెలిసినా, తమ సూచనలను పాటించరని తెలిసినా, వీరు గతంలో ఎంతో దుష్ప్రవర్తన కలిగినవారని తెలిసినా, వీడి బుద్ధి కుక్క తోకలాగా మళ్ళీ మళ్ళీ వంకర తిరుగుతూనే ఉంటుందని తెలిసినా  శ్రీగురుదేవుల కర్తవ్య నిష్టలో కానీ, వారి కరుణా ప్రసారంలో కానీ ఎటువంటి మార్పూ ఉండదు. ఎందుకంటే సర్వ మానవాళిని, సకల జీవకోటిని ఉద్దరించటమే వారి అవతార లక్ష్యం, ఆశయం. అందుకే 'మాములు మానవులు ఆశలకోసం జీవిస్తారు, మహాత్ములు ఆశయాలకై జీవిస్తారు' అని పెద్దలంటారు.

    అంతేకాదు, మనం ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూస్తాం. అంటే ముందు ఒక శరీరాన్ని, దానియొక్క రంగును, రూపురేఖలను, వేషభాషలను చూస్తాం. ఇంకొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళనైతే వాళ్ళ మానసిక స్వభావాన్ని బట్టి చూస్తాం. అంతేగాని ఆయా శరీరాలను, మనసులను దాటి సర్వత్రా ప్రకాశించే ఆత్మవస్తువును చూడటం మనకు చేతకాదు. కానీ గురువుల, మహాత్ముల దృష్టి ఎల్లప్పుడూ ఆత్మవస్తువు మీదనే ఉంటుంది. అటువంటప్పుడు ఈ పైకి కనిపించే భేదాలు కానీ, వారి దివ్యదృష్టికి మాత్రమే కనిపించే త్రికాలాలయందలి చర్యలు, భావనలు కానీ అట్టి మహాత్ములపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. ఆయా దేహాలను, మనసులను వారు ఆ ఆత్మ ధరించే ఆచ్చాదనలగానే చూస్తారుగాని వాటిని ఆ ఆత్మకు ఆపాదించరు. 

    ఉదాహరణకు మీరు ఒక పెళ్ళి బంతిలో పప్పు వడ్డన చేస్తున్నారనుకోండి. ఎవరో మిమ్మల్ని 'ఓయ్ పప్పూ! ఇలా రా!' అంటే మీరు వెంటనే వెళ్ళి వారికి వడ్డిస్తారా? లేకపోతే 'వీడెవడు నన్ను పప్పు అని పిలుస్తాడు?' అని వాళ్ళతో గొడవపడతారా? ఖచ్చితంగా మొదటి మార్గాన్నే  ఎంచుకుంటారు కదా! ఎందుకంటే ఇక్కడ మీకు రెండు విషయాలు స్పష్టంగా తెలుసు. మొదటిది అతడు పప్పూ అని పిలిచింది పప్పు బకెట్టు పట్టుకున్న వ్యక్తి అనే ఉద్దేశ్యంతోనే కానీ మీరేదో తెలివితేటలు లేనివారని కాదు. రెండవది, మీరు కేవలం పప్పును పట్టుకున్నారే కానీ దాని గుణగణాలతో, లక్షణాలతో మీకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ శరీరాన్ని, మనసును ఆత్మ పట్టుకుని నడిపిస్తోందే కానీ వీటి గుణగణాలలో, రూపనామాలతో దానికి ఎటువంటి సంబంధం లేదు. మరి ఈ జ్ఞానాన్ని దృఢంగా నిత్యం అనుభవిస్తూ ఉన్న మహాత్ములకు ఆయా శరీరాల, మనసుల గుణగణాలతో, రూపనామాలతో పని ఏముంది? వారు ఎవరితో ఏమి మాట్లాడినా, ఎవరికి ఏమి చేసినా అక్కడ అంతా ఏకత్వమే కానీ రెండో భావనకు చోటు లేదు.

    ఎదుటివారికి దురద వచ్చి మిమ్మల్ని గోకమంటే అది కాలిమీదా, లేక తలమీదా అని ఉచ్చనీచాలు ఆలోచిస్తారు కానీ మీ కాలికి దురద వస్తే మీ చేయి అలా ఆలోచిస్తోందా? నేను ఉన్నతమైన తలమీద అయితేనే గోకుతాను కానీ నీచమైన ప్రదేశంలో గోకను అంటుందా? ఎందుకు? ఇవన్నీ మీ శరీరంలోని భాగాలే కాబట్టి అక్కడ భేద దృష్టి లేదు. అలాగే ఈ సృష్టిలో కనిపించేదంతా ఆ పరమాత్మలో భాగమే అనే దృఢమైన జ్ఞానం ఉన్నవారే ఎదుటివారిలోని తప్పులు, లేదా వారి భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తున్నా ఎటువంటి భేదదృష్టి లేకుండా అందరితో సమానంగా ప్రవర్తించగలరు. 

22, ఫిబ్రవరి 2021, సోమవారం

భీష్మ పితామహుడు

మహాభారతంలో భీష్మ పితామహులవారిది అత్యంత విశిష్టమైన పాత్ర. భీష్ముడు గత జన్మలో అష్ట వసువులలో ఒకడైన ప్రభాసుడు. ఒకనాడు అష్ట వసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠులవారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈ ప్రభాసుని భార్య అక్కడి నందినీ ధేనువుని తరలించుకు పోవాలని కోరుతుంది. భార్యను సంతోషపెట్టడానికై ప్రభాసుడు ఆ ధేనువును దొంగిలిస్తాడు. దానికి మిగిలిన ఏడుగురు వసువులు కూడా సహకరిస్తారు. అప్పుడు మానవ లోకంలో జన్మించమని వశిష్ఠుడు వారందరినీ శపిస్తే వారు తిరిగి వేడుకొనగా అసలు పాపం చేసిన ప్రభాసుడు మాత్రం చిరకాలం మనుష్య జన్మలో గడపవలసి ఉంటుందని, మిగిలినవారు జన్మించగానే శాపవిమోచనమై తిరిగి వసులోకానికి చేరతారని శెలవిస్తారు. ఆ అష్ట వసువులు తమకు తల్లిగా ఉండమని గంగాదేవిని ప్రార్ధించి శంతన మహారాజు ద్వారా ఆవిడకు పుత్రులుగా జన్మిస్తారు. మొదటి ఏడుగురిని పుట్టగానే గంగామాత నదిలో ముంచి శాపవిమోచనం కలిగించడం, ఎనిమిదవవాడైన ప్రభాసుని కూడా ముంచబోతుంటే శంతనుడు అడ్డుపడటంతో అతడు చిరకాలం మానవ రూపంలో జీవించవలసిరావడం మనకు తెలిసిందే. 

పూర్వం జడభరతుడు సర్వసంగ పరిత్యాగం చేసి కూడా ఒక చిన్న లేడిపిల్లమీద జాలితో దగ్గరకు తీసి, దానిమీద మమకారం పెంచుకొని చివరకు దాని ధ్యాసలోనే మరణించి పునర్జన్మను పొందుతాడు. అయితే మరుజన్మలో తన గతజన్మ స్మృతి ఉండటంతో మళ్ళీ అటువంటి వలలో పడకూడదని సర్వ కర్మలను త్యజించి జడుడిగా జీవిస్తూ జడభరతుడనే పేరు తెచ్చుకున్నాడు. అలాగే శాపవశాత్తూ దేవవ్రతునిగా జన్మించిన ఈ ప్రభాసునికి కూడా గత జన్మ స్మృతి ఉన్నదనిపిస్తుంది.  గత జన్మలో భార్య మోహంలో పడి తాను చేసిన కర్మవలన తాను ఈ మానవజన్మ ఎత్తవలసి వచ్చిందనే జ్ఞానం ఎక్కడో బీజరూపంలో ఉన్నదనిపిస్తుంది. తాను ఆ కాలంలో సంపూర్ణ భారతావనిలోనే అత్యంత శక్తివంతుడు, సకల విద్యాపారంగతుడు అయినప్పటికీ తనకోసం ఎట్టి కర్మలూ ఆచరించడు.

చిన్నతనంలో తల్లి ఎలా చెబితే అలా నడుచుకోవటం, ఆ తల్లి తనను తండ్రియైన శంతనునికి అప్పగించిన తరువాత ఆయనకోసమే తన జీవితాన్ని అంకితం చేయడం మనం గమనించవచ్చు. తండ్రి మత్స్యకన్య మోహంలో పడి దుఃఖాతురుడై ఉన్నప్పుడు అదే అదనుగా భావించి తాను రాజ్యాన్ని, సంసార సుఖాలను త్యజించి ఎవరు రాజైనా హస్తినాపుర సింహాసనానికి బద్ధుడనై తన జీవితం గడుపుతానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా వినుతికెక్కుతాడు దేవవ్రతుడు. తండ్రి మరణం తరువాత తాను దక్షుడై ఉండి కూడా అసమర్థుడైన విచిత్రవీర్యుడిని రాజుగా చేస్తాడు. తల్లి ఆజ్ఞమేరకు ఆ విచిత్రవీర్యుని కొరకై అంబ, అంబిక, అంబాలికలను వారి స్వయంవరం భగ్నం చేసి మరీ తీసుకువస్తాడు. తాను చేసిన పనివలన అంబ జీవితం నాశనమైనా తాను మాత్రం తన నిస్సంగత్వానికే కట్టుబడి ఉంటాడు. విచిత్రవీర్యుడు మరణించిన తరువాత కూడా తాను రాజ్యాన్ని స్వీకరించక కర్తవ్యాన్ని సత్యవతికే వదలివేస్తాడు.

భీష్మాచార్యుల వారిని తప్పుపట్టే స్థాయి మనకు ఎవ్వరికీ లేదు కానీ, వారి జీవితాన్ని మరో దృక్కోణంలో చూడటానికి, దానినుంచి కొంతైనా పాఠం నేర్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. ఇక్కడ ప్రతిజ్ఞ గురించి మాట్లాడుకుంటే మరి శ్రీకృష్ణుడు కూడా తాను మహాభారత యుధ్ధంలో కేవలం సలహాలు మాత్రమే ఇస్తాను కానీ ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసాడు. కానీ ధర్మరక్షణ కోసం అర్జునుని కాచుకోవటానికి, అలాగే తనతో ఆయుధం పట్టించాలనే తన భక్తుడైన భీష్ముని కోరిక నెరవేర్చటానికి తన ప్రతిజ్ఞను సైతం పక్కనపెట్టి చక్రాన్ని చేపట్టి భీష్మునిపైకి లంఘించాడు. కానీ భీష్ముడు మాత్రం ఎంతటి ధర్మ సంకటం ఎదురైనా, ధర్మగ్లాని కలిగినా, తన ప్రతిజ్ఞకే కట్టుబడి నిష్క్రియంగానే ఉండిపోయాడు. అలాగే రాజాజ్ఞ మేరకు ఉత్తర గోగ్రహణంలో, మహాభారత యుద్ధంలో కూడా అధర్మ పక్షానే నిలిచాడు. 

ఒకవిధంగా చూస్తే తనకు సమర్థత లేనప్పటికీ విదురుడు తనకు చేతనైనంతలో ఎప్పటికప్పుడు కౌరవుల కుతంత్రాలను కనిపెడుతూ, పాండవులను హెచ్చరిస్తూ వారిని, ధర్మాన్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళి ఆయనను అనుగ్రహించాడనిపిస్తుంది. భీష్మునికి ధర్మం పాండవుల పక్షానే ఉన్నదని మొదటినుంచీ తెలిసినా, మనసులో పాండవుల క్షేమాన్ని, అభ్యుదయాన్నే కోరుకుంటూ ఉన్నా, అందుకు తగిన కర్మలను మాత్రం చేయలేకపోయాడు. ద్రోణాచార్యులవారు కూడా అన్నీ తెలిసినా గ్రుడ్డిగా భీష్ములవారినే అనుసరించారు. అందుకే రాయబారంలో పరమాత్మ సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ -  సత్యధర్మాలు  పాపము, బొంకు వలన ఎప్పుడైతే  దురవస్థల పాలై తిరిగి వృద్ధిపొందే దారి కానక క్షోభిస్తాయో అప్పుడు తాము దక్షులై ఉండికూడా ఉపేక్ష చేసినవారికి అది తప్పక చేటు చేస్తుంది. అయితే సత్యధర్మాలను ఉద్ధరించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడని వారిరువురినీ హెచ్చరిస్తాడు.

సంసార బంధాలనుండి విడివడి ముక్తిని పొందటానికి కర్మపరిత్యాగం ఎంతమాత్రం మార్గం కాదని, 'నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకు కావాలి' అనే కర్తృత్వ, భోక్తృత్వ అహంకారాలను విడిచిపెట్టి నిష్కామంగా తన కర్తవ్యాన్ని ఆచరించడమే ముక్తికి మార్గమని కృష్ణుడు బోధించిన గీతాసారాన్ని ఎట్టకేలకు గ్రహించిన భీష్మాచార్యులవారు, హస్తినాపుర సింహాసనానికి కట్టుబడి ఉంటాననే తన ప్రతిజ్ఞను ప్రక్కనపెట్టి ధర్మవిజయానికై పాండవులకు తనను జయించే మార్గాన్ని ఉపదేశిస్తారు. అలా తన బోధను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన భీష్మునిపట్ల  భగవానుడు అత్యంత ప్రసన్నుడై ఆయన అంత్యకాలంలో పరమ భాగవతులందరిని వెంటపెట్టుకొని ఆయనకు దర్శనమిచ్చి, ఆయన ముఖస్తుగా విష్ణు సహస్రనామాలను ప్రవహింపచేసి ముక్తిని ప్రసాదించారు.

కర్తా కారయితాచైవ ప్రేక్షకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతంచైవ చత్వారః సమభాగినః అని ఆర్యోక్తి. ఒక మంచి పనికైనా చెడ్డ పనికైనా చేసినవాడు, చేయించినవాడు, చూస్తూ ఊరుకున్నవాడు, దానిని ఆమోదించి ఆనందించినవాడు ఈ నలుగురూ దాని ఫలితాన్ని సమానంగా పొందుతారని దీని భావం. ఈనాడు లోకంలో జరుగుతున్న అనేక అన్యాయాలను చూస్తూ, వాటిని ఆపే సమర్థత, కనీసం అది తప్పని చెప్పే పెద్దరికం ఉండికూడా 'వారి పాపాన వారే పోతారులే, మనకెందుకు?' అని ఊరుకునేవారు ఇది తప్పక తెలుసుకోవలసిన విషయం.

31, జనవరి 2021, ఆదివారం

ఈశ్వరుడు

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః

    ఈశ్వరుడికి, గురువుకు, ఆత్మకు రూపంలో భేదం తప్ప అసలు వస్తువులో భేదం లేదని, ఆకాశం ఎలాగైతే సర్వవ్యాపకమై ఉన్నదో అలాగే ఈశ్వరుడు కూడా సర్వవ్యాపకుడని ఈ దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకం వివరిస్తోంది. ఇలా మూడు రూపాలలో ఉంటూ మనకి బాగా తెలిసిన వస్తువు నీరు. నీటి ఆవిరి, లేదా తేమ రూపంలో మన చుట్టూ ఉన్న గాలి అంతటా వ్యాపించి ఉంటుంది నీరు. దీనికి ఒక రూపం లేదు. అలాగే ద్రవ రూపంలో మనం నిత్యం ఉపయోగించుకునే నీరు ఒక రూపంలో కనిపిస్తుంది కానీ ఒక నిర్దుష్టమైన ఆకారం లేకుండా అది ఏ పాత్రలో ప్రవేశిస్తే ఆ పాత్ర ఆకారాన్ని తాను పొందుతూ ఉంటుంది. అదే నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు తనకంటూ ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

    ఈశ్వరుడు కూడా ఆ నీటి ఆవిరిలాగే సర్వవ్యాపకుడైనప్పటికీ మన కంటికి కనిపించకుండా ఉంటాడు. అదే ఈశ్వరుడు ఆత్మ రూపాన్ని పొందినపుడు ఏ ప్రాణి శరీరంలో ప్రవేశిస్తే ఆ ప్రాణి ఆకారాన్ని పొంది, దానిలో చైతన్యాన్ని నింపి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ రెండు రూపాలూ కూడా ఇంద్రియాలకు అగోచరమైనవే. మరి ఆ ఈశ్వరుని, లేదా ఆత్మను తెలుసుకోవడం ఎలా? నిజంగా అలా తెలుసుకోవాలన్న ఆవేదన తీవ్రతరమైనపుడు ఆ భక్తుని భక్తిని సిద్ధింపచేయటానికై అదే ఈశ్వరుడు ఘనీభవించిన రూపంలో ఒక గురువుగా మనముందు ప్రత్యక్షమవుతాడు. "అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తిసిద్ధయే"

    నీరు వాతావరణంలోని మార్పులకు చాలా త్వరగా వేడెక్కిపోతూ ఉంటుంది. అలాగే మనందరిలో ఉన్న ఆత్మ సంసార తాపత్రయ స్పర్శ చేత ఆవేదనకు గురవుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు వేసవికాలంలో ఏవైనా పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు మంచినీళ్ళ పాత్రలలో మంచుగడ్డలు వేసేవారు. ఆ మంచుగడ్డ తాను ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా తన సాన్నిహిత్యంతో ఆ నీటిని కూడా చల్లగా చేస్తుంది. అలాగే ఆ మంచుగడ్డ త్వరగా కరిగిపోయినా కూడా నీటిలో ఆ చల్లదనం చాలాకాలం నిలిచి ఉంటుంది. అలాగే ఒక మహత్తరమైన ప్రయోజనం కొరకు ఆకారాన్ని ధరించి వచ్చిన గురువులు ఈ సంసార తాపత్రయంలో ఉంటూ కూడా తాము నిశ్చలమైన ప్రశాంతతను అనుభవించడమే కాకుండా తమనాశ్రయించిన వారందరి మనసులనూ అటువంటి ప్రశాంతతతో నింపివేస్తారు. తమ అవతార ప్రయోజనం నెరవేరగానే ఆ గురువుల రూపం కనుమరుగయినా వారి బోధలనుండి ప్రసరించిన ప్రశాంతత చిరకాలం అనేక జీవాత్మలకు శాంతిని ప్రసాదిస్తూనే ఉంటుంది.

    "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి" - "అర్జునా! ఈశ్వరుడు సర్వభూతాల హృదయంలో స్థిర నివాసియై ఉంటాడు" అని గీతాచార్యుడు ప్రవచించాడు. అయితే మనం ఈ హృదయంలోకి చూడటం అలవాటు చేసుకోవాలి. మన మనస్సు నిరంతరం బయటి విషయాల వెంటే పరుగులు పెడుతూ ఉంటుంది. తాను అనుకున్నది పొందటం కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. అది జరిగితే ఆనందిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా కృంగిపోతుంది. దీనికి కారణం కూడా అదే శ్లోకంలో పరమాత్మ చెబుతున్నాడు. "భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా" - "ఆ ఈశ్వరుడు ఊరికే హృదయంలో కూర్చోకుండా ఆయా జీవులను తన మాయ అనే యంత్రంలో వేసి గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు". 

    సాక్షాత్తు ఈశ్వరాంశ అయిన ఆంజనేయ స్వామి కుడా సీతాన్వేషణలో ఇలాగే లంకంతా గాలించినా అమ్మ కనబడక "ఇప్పుడు నేను అమ్మను చూడకుండా తిరిగి వెళితే రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తాడు, సుగ్రీవుడు మరణిస్తాడు, అయోధ్యలో ఇంకా కిష్కింధలో ఉన్న వారందరూ మరణిస్తారు" ఇలా చాలా చాలా దూరాలోచన లోకి వెళ్ళిపోతాడు. మనసు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అయితే ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఒక్కసారి తన మనస్సును కట్టడి చేసి తన హృదయంలోకి చూసుకుంటాడు. అక్కడ ప్రకాశిస్తున్న సీతారాముల దర్శనం కాగానే వారిని ప్రార్థించడం, వెంటనే ఆయనకు అశోకవనం, అందులో సీతాదేవి ప్రత్యక్ష దర్శనం కలగడం జరిగిపోతాయి. 

    గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు కూడా "నేను మీ హృదయ బాబును" అనేవారు. మనం సమస్యలలో చిక్కుకుని, ఎటూ నిర్ణయించుకోలేని ద్వైదీభావంలో మనస్సు అశాంతిని పొందినప్పుడు నిరాకారంగా ఉండే ఈశ్వరుడిని దర్శించలేకపోయినా, సాకారంగా వచ్చిన గురుదేవుల రూపం కనుమరుగయినా, మనసును పక్కనబెట్టి మన హృదయ క్షేత్రంలో నిరంతరం ప్రకాశించే ఈశ్వరుని మాట వినగలిగితే అంతులేని ప్రశాంతత మన సొంతమవుతుంది.