18, జులై 2022, సోమవారం

నిరాడంబరత

ఆగస్టు నెల వచ్చిందంటే చిన్న పిల్లలనుండి వృద్ధులవరకు ప్రతి వారికి ఇష్టమైన ఇద్దరు దేవుళ్ళ పండుగలు వస్తాయి. అవే కృష్ణాష్టమి, వినాయక చవితి. శ్రీకృష్ణుడు, వినాయకుడు ఈ ఇద్దరినీ ఇష్టపడని వారు ఉండరు. దాదాపుగా మిగిలిన పండుగలు అన్నింటికీ ఏ దేవాలయానికో వెళ్ళి దర్శనం చేసుకోవటంతో సరిపెడతారు కానీ ఈ రెండు పండుగలు మాత్రం ప్రతివారు తమ ఇంట్లో చేసుకుంటారు. వయస్సుతో, హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ తమ స్వంతమైన దేవుళ్ళు వీరిద్దరూ.

అవతరించిన నాటినుండి వరుసగా ఎన్నెన్నో హత్యా యత్నాలను ఎదుర్కొని, చివరికి జగద్గురువుగా ఎదిగినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ప్రాణం పోసుకొన్న కొద్ది సేపటికే శిరస్సును కోల్పోయి విగతజీవుడైనా తిరిగి మరొక శిరస్సును పొంది, ప్రధమపూజ్యుడయిన వాడు, విఘ్నాధిపతి  అయినవాడు వినాయకుడు. పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, చివరికి ఇన్ని నీళ్లయినా భక్తితో సమర్పిస్తే ప్రీతితో స్వీకరిస్తానని ప్రకటించాడు శ్రీకృష్ణుడు. ఇదే విషయాన్ని ప్రతి సంవత్సరం మనకు ప్రత్యక్ష నిదర్శనంగా చూపిస్తున్నాడు వినాయకుడు.

నిజానికి ఒకప్పుడు వినాయక చవితి పూజలు ఎవరింట్లో వారు వారి వారి స్తోమతకు తగినట్లుగా చేసుకొనేవారు. వ్రతకథలో కూడా "తమ తమ విభవము కొలది గణేశుని పూజించార"ని ఉంటుంది. అయితే స్వాతంత్రోద్యమ కాలంలో పరాయి పాలకుల న్యాయ సూత్రాలను ఉల్లంఘించకుండానే, ప్రజలందరిని ఒకచోట సంఘటిత పరచి స్వాతంత్ర్య స్ఫూర్తి రగుల్కొల్పటానికై తిలక్ మహాశయులు సామూహిక గణపతి పూజలను ఒక సాధనంగా ఎంచుకొన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ భక్తి గతి తప్పి ఒకరికంటే ఇంకొకరు భారీగా పూజ చేయాలనే పోటీతో బలవంతంగా చందాలు వసూలు చేయటం, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ రోడ్లమీద పూజలు చేయటం, విపరీతమైన ధ్వని కాలుష్యం, ఇంకా పూజ పందిళ్ళలో, ఊరేగింపులో అశ్లీల పాటలు, నృత్యాల వంటివి ఎక్కువయ్యాయి.

భక్తి వేరు, ఆడంబరం వేరు. రెండిటికి పొసగదు. తాము మహారాజులమని అహంకారంతో పెద్దపెద్ద దేవాలయాలను నిర్మించి ఆర్భాటంగా ప్రతిష్టాది కార్యక్రమాలను నిర్వహించ తలపెట్టిన వారిని నిరాకరించి, తమ చిన్న కుటీరంలో మనసునే ఆలయంగా మలచుకొని మట్టి పూలతోనే పూజించిన భక్తులను అనుగ్రహించిన ఉదంతాలు ప్రతి దేవుని చరిత్రలోనూ మనకు కనిపిస్తాయి. భక్తిలో నిరాడంబరత మాత్రమే కాదు, నిస్వార్థత కూడా ఉండాలి. 'భగవంతుడు అందరివాడు. ఆ అందరిలో నేను కూడా ఒకడిని' అని భావించేవాడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. ఆయన నాకు మాత్రమే స్వంతం అనుకునేవాడు ఆయనను దక్కించుకోలేడు. సత్యభామ శ్రీకృష్ణుడు నాకు మాత్రమే దక్కాలి అని పట్టుబట్టి చివరికి ఎంతటి కష్టాలకు, అవమానాలకు గురైందో మనకు తెలిసినదే కదా! అలాగే వినాయకోత్పత్తికి, ఆయన గజముఖానికి మూల కారకుడయిన గజాసురుడు పరమేశ్వరుడు నాకు మాత్రమే స్వంతం కావాలనుకొని చివరికి అకాల మరణం పాలయ్యాడు. అయితే తరువాత వీరిద్దరూ, వారి అచంచల భక్తి ద్వారా ఉద్ధరింపబడ్డారు.

ఇక గజాసుర సంహారం తరువాత ఒక విచిత్ర విషయం జరిగింది. "దుష్టాత్ములకు ఇట్టి వరములు ఈయరాదు. ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లగును" అని రోజంతా పాము మీద పడుకొనే ఒక దేవుడు తన ఒళ్ళంతా పాములను ధరించే మరొక దేవునికి హితబోధ చేస్తాడు. ఇది చూడటానికి విచిత్రంగానే అనిపించినా, భగవంతుని నిష్పాక్షికతకు ఒక నిదర్శనం. "ఎటువంటి భయము, పక్షపాతము లేకుండా ప్రజలందరిని సమానంగా సేవించుకుంటానని" ఉత్తుత్తి ప్రమాణాలు చేసే నాయకులను ఎందరినో మనం చూసి ఉన్నాం. కానీ ఏ ప్రమాణమూ చేయకపోయినా సృష్టిలోని ప్రతి ప్రాణిని సమభావనతో చూస్తూ, అది తమకు కష్టకారకమని తెలిసినా కూడా వారి వారి కర్మలను అనుసరించి వారికి ఫలాలను అందించే ఉదాత్తమైన స్వభావం పరమాత్మునిది. ఇది మనందరికీ కూడా అనుసరణీయం.

ఇక ఈ మాసంలో ప్రతి ఇంట్లో జరుపుకొనే మరొక ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. వరలక్ష్మీ అమ్మవారు చారుమతీదేవిని, ఆమె స్నేహితులను ధన కనక వస్తు వాహనాలతో అనుగ్రహించిందని, వాటి మీద ఆశతో పూజ చేసేవారు కొందరు ఉంటారు. అయితే ఆ వ్రతకథ మొదట్లోనే వారు నివసిస్తున్న కుండిన నగరం అప్పటికే స్వర్ణమయమైన గృహాలతో సుసంపన్నంగా ఉండేదనే విషయాన్ని మరచిపోతారు. కర్మానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః అనే ఆర్యోక్తిని అనుసరించి, ఎంత పరమాత్ముడు అనుగ్రహించినా, మన కర్మఫలంలో లేనిది మనకు దక్కదనే విషయాన్ని గ్రహించి దక్కినదంతా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించే స్వభావాన్ని అలవరచుకోవాలి. అలాగే స్వయంగా వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై పూజా విధానాన్ని బోధించడానికి చారుమతిదేవి అర్హత ఎలా సంపాదించిందో ఆ వ్రతకథలోనే తెలుపబడింది. అట్టి సత్ప్రవర్తనను అలవర్చుకొన్ననాడు, పరమాత్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆ అనుగ్రహాన్ని అనుభవించగలిగే యోగ్యత కూడా ఆ సత్కర్మ వలన లభిస్తుంది.