7, ఆగస్టు 2023, సోమవారం

మోక్షం

    రామారావు ఊరిలో పెద్దమనిషి. గొప్ప ధర్మాత్ముడని పేరు గడించాడు. గుళ్ళూ గోపురాలూ కట్టించాడు, చెరువులు తవ్వించాడు. అయితే ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యం అంతా తనకే దక్కాలని, దానితో తాను మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలని అభిలషించేవాడు. ఇలా ఉండగా కొంత కాలానికి రామరావుకి మరణకాలం సమీపించింది. బాధగా తనవైపు చూస్తున్న కొడుకుని పిలిచి, "ఎందుకురా బాధ పడతావు? నేను పుట్టి బుద్ధెరిగిన తరువాత ఎన్నో పుణ్యాలు చేశాను. ఒక్క పాపకార్యమూ చెయ్యలేదు. మరణించిన తరువాత నాకు ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకు తగిన అపరకర్మలు అన్నీ నువ్వు సవ్యంగా నిర్వర్తించు. నాకదే చాలు" అని చెప్పి కన్నుమూశాడు.

    కొడుకు సుభాష్ ఆ చుట్టుప్రక్కల ప్రసిద్ధిగాంచిన పురోహితులను రప్పించి వారు చెప్పిన విధంగా అన్ని కర్మలూ శాస్త్రోక్తంగా నిర్వహించాడు. తండ్రి అస్థికలను అనేక పుణ్యనదులలో నిమజ్జనం చేశాడు. ప్రయాగ, బ్రహ్మకపాలం వెళ్ళి మరీ పిండాలు పెట్టాడు. అయినా సుభాష్ మనసులో ఏదో వెలితి. తన తండ్రి నిజంగా మోక్షాన్ని పొందాడా? ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాడు. అతని ఆరాటం ఫలించి ఒక మహాత్ముని దర్శనభాగ్యం కలిగింది. ఆ మహాత్ముని శ్రద్ధగా సేవించి మెల్లగా తన సందేహాన్ని తెలియజేశాడు.

    ఆ మహాత్ములు చిరునవ్వు నవ్వి, "నాయనా! ఇప్పుడు మీ తండ్రి స్వర్గంలో ఉన్నాడు. కావాలంటే పిలిపిస్తాను నువ్వే మాట్లాడు" అని తన తపశ్శక్తితో రామారావును పిలిపించారు. అన్నాళ్ళ తరువాత తండ్రిని చూడగానే సుభాష్ ఆనందంగా "నాన్నగారూ! ఎలా ఉన్నారు? మీ చిరకాల కోరిక తీరిందా? మీకు మోక్షం ప్రాప్తించిందా" అని ఆతృతగా ప్రశ్నించాడు. అందుకు రామారావు విచారంగా, "లేదు నాయనా! నేను పొరబడ్డాను. ధర్మంగా నడుచుకోవటం, అనేక పుణ్యకార్యాలు చేయడమే మోక్షానికి మార్గమని నమ్మాను. పైగా మోక్షం అంటే అదెక్కడో వేరే లోకంలో ఉంటుందని, మరణించిన తరువాత మాత్రమే పొందగలమని నమ్మాను. నేను చేసిన పుణ్యాలరాశికి ఫలితంగా నాకు స్వర్గం ప్రాప్తించింది.

    తీరా ఇక్కడకు వచ్చాక చూస్తే ఇది కూడా శాశ్వతం కాదని, కేవలం నా పుణ్యం ఖర్చు అయిపోయేదాకా మాత్రమే నన్ను ఇక్కడ ఉండనిస్తారని, ఆ పుణ్యఫలం కాస్తా అనుభవించేస్తే ఇక్కడినుండి మళ్ళీ భూమిమీదకు తోసేస్తారని తెలిసింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉండే ఇంద్రాది దేవతలకు సైతం అమృతం త్రాగడం వలన మరణం అయితే లేదుగాని, వారి పదవులు, స్వర్గంలో వారి స్థానం సైతం అశాశ్వతమేనట! వారిలో వారు మాట్లాడుకుంటుండగా నేను విన్నదేమంటే జన్మరాహిత్యం పొంది మోక్షాన్ని అందుకోవాలంటే వారుసైతం భూమిపై మానవ రూపంలో జన్మించి ఆధ్యాత్మిక సాధన చేయవలసిందేనట.

    పైగా మనం చేసే పుణ్యకార్యాలు అన్నీ మన పాపరాశిని తగ్గించుకోవడానికి, అలాగే లోకహితం కోసమేగానీ అవి మనకు మోక్షాన్ని ఇవ్వలేవుట. 'ఇది నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకే దక్కాలి' అనే భావనలు ఉన్నంతకాలం అవి మనకు బంధాన్నే కానీ మోక్షాన్ని ఇయ్యలేవని ఇప్పుడే గ్రహించాను. అంతేకాదు నేను మరణించిన తరువాత నువ్వు చేసిన శ్రాద్ధ కర్మలన్నీ ఆయా క్షేత్రాలలోని పండాల బ్రతుకుదెరువు కోసం తప్పితే వాటివలన నాకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదు" అన్నాడు.

    ఇంతలో ఆ మహాత్ములు కల్పించుకొని "మోక్షం పొందాలంటే సద్గురువులను ఆశ్రయించి, వారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సాధన చేసి, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించుకొని, ముఖ్యంగా నేను, నాది అనే అహంకార మమకారాలను వదుల్చుకొని, ఉన్నదంతా ఒకటే అనే సత్యాన్ని గ్రహించాలి. అంతేకాదు నాకు మోక్షం కావాలి అనే కోరిక కూడా బంధమే అవుతుంది. అలా జీవుని బంధించే ఈ గుణాలు, సంకల్పాలు, వాసనలనన్నింటినీ వదుల్చుకుంటే ఏ బంధన లేని ఆ స్థితే మోక్షం. అది ఎక్కడో వేరే లోకంలోనో, లేదా బయట ఎవరినుంచో పొందేది కాదు. అది నీ సహజ స్థితి. దానిని కప్పివేసిన అజ్ఞానపు పొరలు తొలగించుకుంటే మోక్షం నీ స్వరూపమే. అది బ్రతికి ఉండగానే నీ శరీరం మీద జ్వరాన్ని ఎలా అనుభవిస్తావో అలా నీ అనుభూతిలోకి వస్తుంది. అంతేగానీ చచ్చాక వచ్చేదేమీ లేదు, ఎత్తిపోతలు తప్ప" అని విశదీకరించి వారిద్దరికీ స్వాంతన కలిగించారు.

చచ్చాకేమొచ్చు ఎత్తిపోతలు గాక
బొంది జీవముండగనె మోక్షంబు
బొందవలయు జ్వరము మాడ్కి
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||