27, ఆగస్టు 2019, మంగళవారం

అద్దాల గది

ఒకచోట ఒక అద్దాల గది ఉంది. ఆ గది గోడలన్నీ రకరకాల అద్దాలతో చేసినవే. ఒక అద్దం మనను పొడవుగా చూపిస్తే, ఇంకొకటి పొట్టిగా చూపిస్తుంది. ఒకటి లావుగా చూపిస్తే, ఇంకొకటి సన్నగా చూపిస్తుంది. ఒకటి వికృతంగా చూపిస్తే ఇంకొకటి తలక్రిందులుగా చూపిస్తుంది. ఇలాంటి గదిలోకి ఒక కుక్క ప్రవేశించింది. ఎటు చూసినా రకరకాల ఆకారాలలో అనేక కుక్కలు కనిపించాయి. భయమేసి గట్టిగా మొరిగింది. ప్రతిగా అవికూడా మొరిగాయి. తాను బయటకు తప్పించుకునే మార్గం కనపడలేదు. ఇక తెగించి ఆ కుక్కలపై దాడిచేసి ఆ అద్దాలన్నింటిని పగులగొట్టేస్తుంది.

అదే గదిలోకి ఒక చిన్న పిల్లవాడు ప్రవేశించాడనుకోండి. అందులో రకరకాలైన విచిత్ర ఆకృతులలో కనబడుతున్న తన రూపాన్నే చూసుకొని, ఒకసారి సంతోషానికి, ఒకసారి విషాదానికి, భయానికి, కోపానికి ఇలా రకరకాల భావోద్వేగాలకు గురవుతాడు. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి తనను ఇక్కడినుండి తప్పిస్తే బాగుండును అని ఆరాటపడతాడు. అదే బుద్ధి వికసించిన ఒక పెద్దమనిషి ప్రవేశించాడనుకోండి. ఏంచేస్తాడు? ఎటువంటి మనోవికారానికి లోనుకాకుండా, తననే వివిధ రూపాలలో చూపిస్తున్న ఆ అద్దాల ప్రతిభను మెచ్చుకుంటూ, తన ఇష్టం ఉన్నంతసేపు అక్కడ ఆనందంగా గడిపి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు.

మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కూడా ఈ అద్దాల గదిలాంటిదే. అందులో మనకు మిత్రులుగా, శతృవులుగా, బంధువులుగా, తెలియనివారిగా, పక్షులుగా, జంతువులుగా, వృక్షాలుగా, వివిధ వస్తువులుగా కనిపించేవన్నీ మన ప్రతిబింబాలే. వాటికీ మనకూ ఎటువంటి తేడా లేదు. వస్తుతః చూసుకుంటే అవన్నీ మనలాగే పంచభూతాలతో నిర్మితమైనవే. కొంచెం లోపలికి వెళితే అన్నిట్లోనూ ఉండి అన్నింటినీ ప్రకాశింపచేసే ఆత్మవస్తువు కూడా ఒకటే. బంగారంతో వివిధ నగలు తయారు చేస్తారు. అది తలమీద పెట్టుకునే కిరీటం కావచ్చు, లేదా కాలికి పెట్టుకునే అందె కావచ్చు. కానీ అది నీకు కావాలంటే దానిలో ఎంత బంగారం ఉందో, ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో దాని ప్రకారం లెక్కగట్టి అమ్ముతారు కానీ కేవలం కిరీటం అయినందువలన దానికి ఎక్కువ ధర, కాలి పట్టీ అయినందున దానికి తక్కువ ధర ఉంటాయా?

అయినా మనం ఈ అద్వైతాన్ని గుర్తించక ఆ అద్దాల గదిలోని బాలునివలె రకరకాల భావోద్వేగాలకు గురవుతున్నాం. రాక్షసులవంటి కొందరైతే ఆ కుక్కలాగా ఈ ప్రపంచాన్నే నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి మనకు ఒకరిని చూస్తే ప్రేమ, ఇంకొకరిని చూస్తే ద్వేషం ఇలాంటి భావాలు కలుగుతున్నాయి కానీ వాటికి కారణం మన మనస్సే తప్ప అవతలివారు కాదు కదా. కారణం అవతలివారే అయితే నువ్వు ప్రేమించే, గౌరవించే వారికి నీపట్ల ద్వేషభావం, చులకన భావం ఎలా కలుగుతున్నాయి? నువ్వు ఎంతో ద్వేషించేవారికి నిజానికి నీ పట్ల ఎంతో ప్రేమభావం ఉండి ఉండవచ్చు కదా. పోనీ మనుషులను ప్రక్కన పెట్టినా, నీకు ఎంతో ఇష్టమైన ఆహారపదార్థానికి నీ పట్ల ఎటువంటి భావం ఉండట్లేదు కదా. అంటే ఈ భావోద్వేగాలన్నింటికీ మన మనస్సే కారణం కానీ అవతలి వ్యక్తో లేక వస్తువో కారణం కాదన్నమాట.

ఇంకా ఒకే వస్తువును లేదా వ్యక్తిని వివిధ సందర్భాలలో చూసినప్పుడు నీకు విభిన్నమైన భావనలే కలుగుతున్నాయి కదా. మాములుగా తీపి అంటే ఎంతో ఇష్టమైనవాడు కూడా జ్వరం వచ్చినప్పుడు అదే తీపిని చూస్తే వాంతి చేసుకుంటాడు. అలాగే తాను ఆనందంగా ఉన్నప్పుడు తన పిల్లవాడిని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నవాడే పని ఒత్తిడిలో ఉన్నప్పుడు అదే పిల్లవాడిని అవతలకి తోసేస్తాడు. అంటే ఇక్కడ వివిధ భావోద్వేగాలను కలిగించే ఆకారాలన్నీ నీ మనస్సనే అద్దంలో ఉన్న లోపాల కారణంగా వికృతాకారంలో కనిపించే నీ ప్రతిబింబాలేనన్నమాట. అందుకే శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ వారు "నీవు చూచునదెల్ల నీవయేయను తత్వమసి వాక్యమునకు అర్థమ్ము నిజము" అన్నారు. 

పై ఉదాహరణలో కుక్కకి, పిల్లవాడికి కనిపించినట్లే బుద్ధి వికసించిన పెద్దమనిషికి కూడా వివిధ వికారాలతో తన ప్రతిబింబాలు కనిపించాయి. అయితే అతడు ఇవన్నీ తన స్వరూపాలేనని, ఇందులో కనిపిస్తున్న వికృతులన్నీ నిజానికి అద్దాలు చేస్తున్న మాయేతప్ప అక్కడగాని, తనలోగాని  ఎలాంటి వికృతి లేదని గుర్తించి, ఆ గదిలో ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఉన్నాడు. అలాగే జ్ఞాని కూడా మనకు కనిపించినట్లే సృష్టిలోని వైవిధ్యం ఆయనకూ కనిపిస్తున్నా, ఇదంతా కేవలం ఉపాధి స్వభావాలలోని వ్యత్యాసం వల్ల వచ్చినది తప్ప అసలు తత్వంలో ఉన్నదంతా తానేననే జ్ఞానం కలిగి నిశ్చింతగా, ఆనందంగా ఉంటాడు.

23, ఆగస్టు 2019, శుక్రవారం

నిజమైన వైష్ణవుడు

మనం ఇన్నాళ్లూ 'మా దేవుని నమ్మకపోతే నరకానికి పోతావ్' అనే వాళ్ళను చూసాం. ఇప్పుడు క్రొత్తగా 'మా దేవుడికి జై కొట్టకపోతే నీకు ఇక్కడే నరకం చూపిస్తాం' అనేవాళ్ళు కూడా తయారవుతున్నారు. 'ప్రక్క దేశాన్ని తిట్టకపోతే నీకు దేశభక్తి లేదు, ప్రక్క మతాన్ని తిట్టకపోతే నీకు దైవభక్తి లేదు' అనే విపరీతవాదం పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలైన భక్తుడెవరో తెలుపుతూ పరమభక్తుడైన శ్రీ నర్సీ మెహతా వారు వ్రాసిన 'వైష్ణవ జన్ తో తేనే కహియెజ్' అనే గేయం అర్థం తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవటం ఎంతైనా ఆవశ్యకం. శ్రీ నర్సీ మెహతా వారిని గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ 'నరసింహ మేధ' అని పిలిచేవారు. అది వారికి చక్కగా సరిపోయే పేరు. అపారమైన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ నారసింహ మూర్తి. ఇప్పుడు పరమ శత్రువైనా ఒకప్పటి తన ద్వారపాలకుడైన హిరణ్యకశిపుని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలనే కరుణ, తన పుత్రుడైన బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని నిలబెట్టాలనే కరుణ, తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని మాట నిలబెట్టాలనే కరుణ ఇలా పూర్తి కరుణతో నిలువెల్లా నిండిన స్వామి, లోకాలన్నింటిని నిరంతరం నడిపిస్తూ ఉండే స్వామి ఏ కదలికా లేకుండా నిశ్చలంగా హిరణ్యకశిపుని మందిరమంతా నిండి నిలిచి ఉన్నాడు. అందుకే అన్నమయ్య 'చలనవిధి నిపుణ నిశ్చల నారసింహా' అంటాడు.

అటువంటి కరుణే నిండిన నర్సీమెహతా నిజమైన భక్తుని లక్షణాలు తెలుపుతూ వ్రాసిన ఆ గుజరాతీ గేయం అర్థం ఏమిటో చూద్దాం. ఇతరుల బాధను, కష్టాన్ని తన బాధగా, కష్టంగా అనుభూతి చెందగలిగినవాడే నిజమైన వైష్ణవుడు. కేవలం వారి బాధలు తనవిగా అనుభూతి చెందటమే కాక ఆ బాధా నివారణకు తనవంతు సహాయం చేసి కూడా ఎన్నడూ 'నేను చేశాను' అనే అహంకారాన్ని అతడు మనసులో రానివ్వడు. అతడు సమస్త జగత్తునూ విష్ణు స్వరూపంగానే భావించి గౌరవిస్తాడు. ఎన్నడూ ఎవరినీ కించపరచడు, దుర్భాషలాడడు. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటినీ సదా పరిశుద్ధంగా ఉంచుకుంటాడు. అటువంటి భక్తుని కన్న తల్లి ధన్యురాలు. ఒక్క తల్లేమిటి, అటువంటి భక్తుని వంశంలో అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు కూడా తరిస్తాయి. 

అతడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. దేనినీ ఆశించడు. అన్య స్త్రీలందరినీ తన తల్లులుగా భావిస్తాడు. వారి నాలుక ఎన్నడూ అసత్యం పలుకదు. చేతులెన్నడూ పరుల విత్తాన్ని తాకవు. వారికి ప్రపంచంలోని ఏ వస్తువుతోనూ సంగం ఉండదు. సదా నిస్సంగులై ఉంటారు. వారికి ఉన్న అనురక్తి కేవలం రామనామం మీదే. సర్వ పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఆ సత్పురుషునిలోనే సదా విరాజిల్లుతూ ఉంటాయి. లోభం, కపటం అంటే ఏమిటో వారికి తెలియదు. కామక్రోధాలు వారి దరికి కూడా చేరలేవు. నర్సీ అంటున్నారు - తమ వంశాన్నంతటిని తరింపచేయగల అట్టి మహాత్ముని దర్శిస్తే నా జన్మ ధన్యమైనదిగా భావిస్తాను - అని. శ్రీ గురుదేవులు కూడా ఇలాగే 'అట్టి మహాత్ముడు కనిపిస్తే వారి పాదధూళి నా శిరస్సున ధరిస్తాను' అనేవారు. 

భక్తుని గురించి భక్తుడే వివరించిన ఈ పై లక్షణాలన్నీ భక్తుని గురించి భగవంతుడు వివరించిన భక్తియోగంలోని లక్షణాలతో సరిగ్గా సరిపోలుతున్నాయి. అవేమిటో ఒక్కసారి చూద్దాం. 'అద్వేష్టా సర్వభూతానాం'తో మొదలుపెట్టి పరమాత్మ తన భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో, ఎటువంటివాడు తనకు ప్రియుడో వివరిస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం సృష్టిలో దేనినీ, ఎవరినీ  ద్వేషించకుండా ఉండటం. అలాగే అందరిపట్ల మిత్రభావం, కరుణ కలిగివుండటం. అహంకార మమకారాలు లేకపోవటం, సుఖదుఃఖాలను సమదృష్టితో స్వీకరిస్తూ ఓర్పు కలిగి ఉండటం. ఎల్లప్పుడూ లభించినదానితో తృప్తిగా ఉండటం, యోగియై ఉండటం, ఆత్మనిగ్రహం, దృఢనిశ్చయం కలిగివుండటం. తన మనోబుద్ధులను నాకే అర్పించి ఉండటం, లోకానికి తాను భయపడకుండా, లోకాన్ని తాను భయపెట్టకుండా ఉండటం, సంతోషం, విషాదం, భయం, ఉద్వేగం మొదలైన మానసిక లక్షణాలకు అతీతంగా ఉండగలగడం. దేనినీ ఆశించకుండా, శుచియై, చేసే ప్రతిపనిలో సమర్థుడై ఉండటం, ఎటువంటి చింతలు లేకుండా ఉదాసీనంగా ఉండటం.

తన స్వలాభంకోసం ఏ పనులూ చేయనివాడు, అతిగా సంతోషంగాని, బాధకాని, కోరికగాని, ద్వేషంగాని లేనివాడు, శుభాశుభములను శత్రుమిత్రులను, మానావమానములను, శీతోష్ణములను, సుఖదుఃఖములను సమదృష్టితో చూస్తూ దేనితోనూ సంగం ఏర్పరుచుకొననివాడు, నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తూ, ఏకొంచెం దొరికినా దానితోనే సంతుష్టుడై, దేహం ఎక్కడ సంచరిస్తున్నా మనస్సు మాత్రం సదా పరమాత్మయందే నిలిపి ఉంచేవాడే నిజమైన భక్తుడని, అట్టివాడే తనకు ప్రియుడని పరమాత్మ మనకు గీతలో బోధించాడు. అటువంటి లక్షణాలు అలవరచుకోవటం మానేసి తుఛ్చమైన ప్రాపంచిక విభేదాలను సహించలేక వాటికోసం కొట్టుకు చావటం ఏమి వివేకం?