24, ఆగస్టు 2016, బుధవారం

పుట్టు భోగులము మేము

మా గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ తరచుగా చెప్పేవారు - లక్ష్మీదేవి మహా పతివ్రత. ఎప్పుడూ తన పతిదేవుడైన శ్రీమన్నారాయణుడిని అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మీరు ఆ నారాయణున్ని మనస్సులో నింపుకుంటే మీకు ఇహంలో కావలసినవన్నీ ఆ తల్లి చూసుకుంటుంది. ఇక పరం సంగతి నారాయణుడు చూసుకుంటాడు - అని.

ఇదే విషయాన్ని అన్నమయ్య మరింత వివరంగా పుట్టుభోగులము మేము అనే కీర్తనలో వివరించారు. మనం సాధారణంగా ఏ మహారాజునో ఆశ్రయిస్తే వారు పల్లకీలు, అందలాలు, నిత్యం మనని పొగుడుతూ తిరిగే భట్రాజులూ ఇవ్వవచ్చు. కానీ ఇవన్నీ మహాలక్ష్మీ విలాసాలే కదా? మరి ఆ తల్లి భర్తకు దాసులమైన మనకు నడమంత్రపు సిరిగల రాజులనుండి ఇవి ఆశించాల్సిన అవసరమేముంది?

పోనీ, ఆ రాజులు గ్రామాలనో, రత్నాలనో, ఏనుగులు, గుఱ్ఱాలనో ఇస్తారనుకుందాం. మరి ఇవన్నీ ప్రకృతి స్వరూపిణయైన భూమాత శరీరంలో భాగాలే కదా! ఆ తల్లికి నాధుడైన వాడిని ఆశ్రయించిన మనకి ఇవి వేరేవాళ్ళు ఇచ్చేదేమిటి?

అసలు ఈ సృష్టిలోని విశేష వస్తువులన్నీ బ్రహ్మదేవుడు తయారు చేసినవే కదా! మరి ఆ బ్రహ్మకే తండ్రియైన వేంకటేశ్వరుడు మనవాడై, మనకు ఏ సమయానికి ఏది కావాలో ప్రేమతో అందిస్తున్నప్పుడు ఇక మనం అన్యులనుండి పొందాల్సింది ఏముంటుంది? అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు.