11, అక్టోబర్ 2016, మంగళవారం

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా

జగన్మాతను ఎక్కడ వెదకాలి? ఎలా తెలుసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ జంట నామాలు. మనం ఆ తల్లిని పూజించటం కోసం ఎన్నెన్నో క్షేత్రాలు, దేవాలయాలు తిరుగుతాం. ఎక్కడెక్కడికో వెళతాం. కానీ బయట ఎంతగా వెదకినా ఆ తల్లిని అందుకోలేము. అందుకు మనం చెయ్యవలసినది మన లోపల వెదుక్కోవడం. ఆ తల్లి నిరంతరం మనలోనే ఉండి మనలను నడిపిస్తోంది. ఈ కనపడే శరీరానికి, లోపలి మనస్సుకి, వాటికి ఆధారమైన ప్రాణానికి, వీటన్నింటినీ నడిపించే విజ్ఞానానికీ, మన సహజ స్థితియైన ఆనందానికీ కూడా లోపల ఉండి నడిపించేది ఆ తల్లే. అందుకే ఆవిడ "పంచకోశాంతర స్థితా".

ముందుగా మనం మనలోనే "చేతనారూపంలో" ఉండి మనలను నడిపిస్తున్న ఆ "చిచ్ఛక్తిని" గుర్తిస్తే అప్పుడు మనం బయట ఉన్న "జడాత్మికమైన" ప్రకృతి అంతటా "జడశక్తి" రూపంలో భాసిస్తున్న ఆ తల్లిని గుర్తించగలుగుతాం. నిజానికి సత్యమైన పరమాత్మ, అసత్యమైన జగత్తు రెండూ ఆ తల్లి స్వరూపాలే. అందుకే ఆవిడ "సదసద్రూపధారిణి". అలాగే నశించిపోయే జగత్తు, నాశనం లేని చైతన్యం ఆ తల్లి రూపాలే - "క్షరాక్షరాత్మికా". వ్యక్తంగా మనకు కనపడే ఈ జగత్తు, అవ్యక్తంగా అంతటా నిండియుండి కనపడకుండా దీనిని నడిపిస్తున్న పరమాత్మ శక్తి, రెండూ అమ్మ రూపాలే - "వ్యక్తావ్యక్తాా".

ఆ అమ్మ నిజ తత్వాన్ని ఈ విధంగా భావిస్తూ ఎవరైతే తమ ధ్యానాన్ని, సాధనను పరిపూర్ణం చేసుకుంటారో వారు ఆ అమ్మ స్వరూపాన్నే పొందుతారు. ఎందుకంటే ఆ తల్లి "ధ్యానధ్యాతృధ్యేయరూపా" - అంటే ధ్యాన ప్రక్రియ, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయబడే వస్తువు మూడూ ఆ అమ్మ రూపాలే.

10, అక్టోబర్ 2016, సోమవారం

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా

ముందుగా తాపత్రయం అంటే ఏమిటో చూద్దాం. ప్రతి మనిషికీ మూడు రకాల తాపాలు ఉంటాయని వేదాంతంలో చెప్పబడింది. అందులో మొదటిది ఆదిభౌతిక తాపం - అంటే ఇతర మనుష్యుల వలనగాని, జంతువుల వలనగాని, లేదా మరే ఇతర భౌతిక పదార్ధాల వలనగాని కలిగే బాధలు. రెండవది ఆదిదైవిక తాపం - అంటే దైవికంగా సంభవించే వరదలు, భూకంపాలు మొదలైన వాటి వలన కలిగే బాధలు. ఇక మూడవది ఆధ్యాత్మిక తాపం - అంటే మన మనస్సు మనను పెట్టే బాధలు - భయాలు, సంకోచాలు, మానసిక రోగాలు, దుస్స్వప్నాలు మొదలైనవి.

ఇటువంటి మూడు తాపాలతోను బాధపడే మనుష్యుల హృదయాలకు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని ఇచ్చి స్వస్థత కలిగించే చంద్రునివంటిది జగన్మాత. ఆ జగన్మాతను హృదయంలో నింపుకున్న భక్తులకు ఇతర జీవులుగాని మనవులుగానీ ఎటువంటి కష్టాన్ని కలిగించలేరని మనకు అనేక భక్తుల చరిత్రలలో నిరూపితమైనదే కదా! ఇక నిత్యం ఆత్మానందంలో ఓలలాడే అటువంటి భక్తులు ప్రకృతి వైపరీత్యాలను అసలు గుర్తించనే గుర్తించరు. మరి మనస్సంతా జగన్మాత నిండిపోయాక ఇంక మానసిక రోగాలకుగానీ, భయ సంకోచాలకుగానీ చోటెక్కడ ఉంటుంది?

హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః

నిత్యం మన ఆధ్యాత్మిక సాధనలో మనలను ముందుకు వెళ్ళకుండా ప్రధానంగా అడ్డుపడేది కామం. ఈ అంతఃశ్శత్రువు ఉన్నంత కాలం మనం ఆ పరమేశ్వరుని చేరుకోలేం. మరి ఆ కామాన్ని మనకు అడ్డు పడకుండా పూర్తిగా దగ్ధం చేయగలది ఆ పరమేశ్వరుని మూడవ నేత్రమొక్కటే. అంటే మనలోనే ఉన్న ఆ పరమేశ్వరుడు మన జ్ఞాన నేత్రాన్ని తెరచినప్పుడు మన కామం పూర్తిగా దగ్ధమైపోతుంది. అప్పుడు మనం సాధనలో పురోగమించి ఆ పరమేశ్వరుని పొందగలం.

అయితే అలా పరమేశ్వరునితో ఏకత్వాన్ని పొందిన మహాత్ములందరూ ఏ కోరికా లేకుండా తమలో తాము రమిస్తూ ఉండిపోతే మరి ఈ లోకం ఉద్ధరించబడేదెలా? వారిలో మళ్ళీ గురువులుగా మారి తాము పొందిన పరమగతిని సమస్త మానవాళిచేతా పొందించాలనే సంకల్పం కలగాలి కదా. ఇక్కడే ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత తన అపార కరుణను కురిపిస్తూ ఆ కామాన్ని మళ్ళీ జీవింపచేస్తుంది. అయితే అది ఆత్మజ్ఞానాన్ని పొందిన మహాత్ముల హృదయంలో కావడంతో ఆ కామం ప్రాపంచిక కామంగా కాక ప్రపంచాన్ని ఉద్ధరించటానికి ఉపయోగపడుతుంది.

8, అక్టోబర్ 2016, శనివారం

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః

మనం మన ఈ అల్ప జీవితంలో సాధించే చిన్న చిన్న విజయాలకే గర్వంతో పొంగిపోతూ ఉంటాం. కానీ ఈ పద్నాలుగు లోకాలనూ పరిపాలిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ అధర్మం జరిగినా దానిని సరిదిద్ది ధర్మాన్ని ఉద్ధరిస్తానని తానే స్వయంగా చెప్పుకున్న శ్రీమన్నారాయణుడు మనకు తెలిసి ప్రముఖంగా పది అవతారాలు ధరించి ధర్మ సంస్థాపన చేసాడు కదా. మరి ఆ పది అవతారాలూ జగన్మాతయొక్క చేతి వ్రేళ్ళకు ఉన్న పది గోర్లనుండి ఉత్పన్నమైనవేనని ఈ నామం మనకు చెబుతోంది.

దీనినిబట్టి అంతటి నారాయణుడు కూడా ఆ జగన్మాత ఎలా ఆడిస్తే అలా ఆడే తోలుబొమ్మే అని తెలుస్తోంది కదా! మరి అల్ప జీవులమైన మనమెంత? మన బ్రతుకెంత? మనం సాధించే విజయాాలెంత? మనందరం ఆ అమ్మ ఆడించే తోలుబొమ్మలమేనని స్ఫష్టంగా తెలుసుకొని నిత్యం ఆ స్పృహతో నడుచుకొన్ననాడు మనం ఎటువంటి తప్పులూ చేయం. అలాకాక అంతా మన ప్రజ్ఞే అని విర్రవీగితే ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలు వేయడం, జారి పడటం ఖాయమే.

7, అక్టోబర్ 2016, శుక్రవారం

శృతి సీమంత సిందూరీకృత పాదాబ్జ ధూళికా

మనం చదువుకొన్న ఈ కొద్దిపాటి చదువులకే మనకు ఎంతో తెలుసని మిడిసిపడుతూ ఉంటాం. కానీ ఈ సృష్టిలోని చదువులన్నింటికీ మకుటాయమానమైన వేదాలకే అధినేత్రి అయిన ఆ వేదమాత ప్రతిరోజూ జగన్మాత పాదాలకు నమస్కరించి ఎర్రటి ఆ పాదధూళిని తన పాపిటలో సిందూరంలా అలంకరించుకుంటుందిట. మరి మన చదువులు ఆ జగన్మాత ముందు ఏ పాటివి? ఏ చదువులు చదవకపోయినా ఆ జగన్మాతను తన హృదయంలో నింపుకున్న వారికి సర్వ విద్యలూ కరతలామలకములే.

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మా గురుదేవులే. వారు ప్రాపంచికమైన ఏ చదువులూ చదువుకోలేదు. ఎవ్వరి దగ్గరా ఒక్క అక్షరం ముక్క కూడా నేర్చుకోలేదు. కానీ ఎంతటి పండితులనైనా ఒప్పించి మెప్పించగల సామర్థ్యం వారి సొంతం. ఒకసారి వారి వద్దకు ఒక పెద్ద శాస్త్రవేత్త వచ్చారు. శ్రీగురుదేవులు వారిని "అయ్యా తమరు ఏం చేస్తూ ఉంటారు?" అని ప్రశ్నించగా వారు, 'చదువుకోని ఈయనకు ఏం తెలుస్తుందిలే' అనే చులకన భావంతో, "న్యూక్లియర్ ఫిజిక్స్, అంటే పరమాణు భౌతిక శాస్త్రమని ఒకటి ఉందిలెండి. అందులో రీసెర్చ్, అంటే పరిశోధన చేస్తున్నాను" అన్నారు. అప్పుడు మా గురుదేవులు, "చాలా సంతోషం బాబూ!కానీ మీకు అందులో ఏదో ఒక ప్రశ్నకి సమాధానం లభించక తమరి పరిశోధన ఆగిపోయినట్లుంది? జెర్మనీకి చెందిన ఫలానా శాస్త్రవేత్త అదే విషయంపై ఒక పెద్ద గ్రంధమే వ్రాసారు. ఆ గ్రంధం ఢిల్లీలోని గ్రంధాలయంలో లభిస్తుంది. అది చదివారంటే తమ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది, పరిశోధనా ముందుకు సాగుతుంది." అనగానే ఆ శాస్త్రజ్ఞుడు తన అహంకారాన్ని వదలి శ్రీగురుదేవులకు పాదాక్రాంతుడైనాడు.

6, అక్టోబర్ 2016, గురువారం

జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయినీ

మనం ఒక చిన్న పిల్లవాడిని బొమ్మల కొట్టులోకి తీసుకుని వెళ్ళామనుకోండి, వాడు ఒక్కసారిగా అన్ని బొమ్మలను చూసేసరికి ఆనందం పట్టలేక వాటితో ఆడుకోవటం మొదలుపెడతాడు. అలా కొన్ని బొమ్మలతో ఆడి, వాటిని వదలి మరికొన్ని బొమ్మల వెంటపడతాడు. ఇలా పూటంతా రకరకాల బొమ్మలతో మళ్ళీ మళ్ళీ ఆడి అలసిపోతాడు. అప్పుడు వాడికి అమ్మ ఒడి లభించిందనుకోండి ఇంక ప్రపంచాన్నంతా మరచిపోయి ఆదమరచి నిద్రపోతాడు. దానిని మించిన సుఖం వాడికి ఇంకేదైనా ఉంటుందా? ఎంత అల్లరి పిల్లవాడైనా, చిచ్చరపిడుగైనా తల్లి ఒడిలో చేరితే ప్రశాంతంగా నిద్రపోవలసిందే కదా?

మరి అలాగే మన తల్లియైన జగన్మాత మనలను ఈ బొమ్మల లోకంలో విడిచిపెట్టింది. ఈ బొమ్మల మధ్యలో మళ్ళీ మళ్ళీ పుడుతూ, చస్తూ, ముసలివాళ్ళం అవుతూ ఇలా ఎంతకాలమని ఆడుతాం? ఎప్పటికైనా మనకి కూడా ఈ పరుగులనుండి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది కదా? మరి అలాంటప్పుడు మనకి ఉన్న ఏకైక మార్గం ఆ తల్లి ఒడి చేరుకోవటమే. అదే మోక్షమంటే. అందుకే ఆవిడ ముకుందా, ముక్తి నిలయ కూడా.

5, అక్టోబర్ 2016, బుధవారం

భక్త చిత్త కేకి ఘనాఘనా

భక్తుల చిత్తములనే నెమళ్ళకు పరవశాన్ని కలిగించి పురి విప్పి నర్తించేలా చేసే కారుమబ్బు వంటిదని జగన్మాతను కీర్తించే నామమిది. నల్లని కారు మేఘాన్ని చూడగానే మగ నెమలి పరవశించి ఆనందంగా పురి విప్పి నాట్యం చేస్తుంది. అలా అది ఆనంద పరవశయై ఉండగా దాని నేత్రాలనుండి వీర్యస్ఖలనం జరుగుతుంది. ఆడ నెమలి ఆ వీర్యాన్ని గ్రహించి సంతానానికి జన్మనిస్తుంది. ఇలా స్త్రీపురుష సంయోగం లేకుండానే సంతానాన్ని కనే ఏకైక జీవి నెమలి అని పెద్దలు చెబుతారు. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకు చిహ్నంగా నెమలి పింఛాన్ని తన శిరస్సుపై ధరించేవాడు.

అలాగే ఆ జగన్మాత అనే కారుమేఘం దర్శనం కాగానే భక్తుని చిత్తం పరవశించి ఆనంద తాండవం చేస్తుంది. అప్పుడు ఆ చిత్తం కార్చే ఆనందభాష్పాలను ఆ భక్తుని బుద్ధి గ్రహించి భక్తిగర్భాన్ని దాల్చి జ్ఞానపుత్రుని ప్రసవిస్తుంది. అట్టి జ్ఞానపుత్రుడే నిజంగా పున్నామనరకాన్నుంచి రక్షించి మోక్షానికి కారణమవుతాడు కానీ దేహ కర్మల వలన జనించే కర్మపుత్రులు కాదు. ఈ భక్తిగర్భాన్ని ధరించటానికి స్త్రీపురుష వ్యత్యాసం కానీ, జాతి నీతి భేదాలు కానీ లేవు. జగన్మాత బిడ్డలైన సకల జీవకోటికి అందుకు అర్హత ఉంది.

చిదగ్ని కుండ సంభూతా

చిత్ అంటే జ్ఞానం. జగన్మాత జ్ఞానాగ్ని కుండంలోనుండి ఆవిర్భవించింది అని ఈ నామం చెబుతోంది. అయితే ఈ అగ్నికుండం/యజ్ఞకుండం ఎప్పుడో ఎక్కడో చరిత్రలో లేదు. మన మనస్సనే యజ్ఞకుండంలో ధ్యానాగ్నిని రగిల్చి అందులో నిరంతర సాధన ద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ తన్మాత్రలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, పంచ వాయువులను, అంతఃకరణ చతుష్టయాన్ని, మూడు గుణాలను, మూడు అవస్థలను, మూడు మలాలను, మూడు వాసనలను, మూడు ఈషణలను, మూడు తాపాలను, మూడు దేహాలను, అహంకార మమకారాలను, సుఖదుఃఖాలను, రాగద్వేషాలను హవిస్సులుగా అర్పిస్తూ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ ధ్యానాగ్నియే జ్ఞానాగ్నిగా పరివర్తన చెందుతుంది.

అప్పుడు మనలోనే ఆ చిదగ్ని కుండంనుండి అష్టాదశ భుజాలతో, సర్వాభరణ భూషితయై కోటి సూర్యుల కాంతిని కూడా తలదన్నే కాంతితో జగన్మాత ఆవిర్భావం జరుగుతుంది. ఇది సాధించిన మహాత్ములు నిరంతర ఆత్మజ్యోతితో ప్రకాశిస్తూ నలుదిశల తమ ప్రసన్న రోచస్సులను వెదజల్లుతూ ఉంటారు. అట్టి మహాత్ముల దర్శనమాత్రం చేతనే మన సకల తాపాలు నశించి అంతులేని ప్రశాంతతతో మన హృదయం నిండిపోతుంది.

ఇక అలా జగన్మాతను తమలోనే సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ములు మనలో ఉన్న అజ్ఞానమనే మహిషాసురుని సమూలంగా నాశనం చేయగలరనటంలో సందేహమేముంది? అందుకే గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది. సర్వ దేవతామూర్తుల శక్తులన్నీ కలిసి జగన్మాతగా ఎలా అయితే రూపు దాల్చాయో అలాగే గురువు కూడా సర్వదేవతా స్వరూపుడు. గురువుకి జగన్మాతకి భేదం లేదు.

3, అక్టోబర్ 2016, సోమవారం

సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా

సాధారణంగా మనకు ఏదైనా ప్రభుత్వ శాఖలో పని కావాలంటే ఆ శాఖలోని క్రింది స్థాయి ఉద్యోగస్థులతో మొదలుపెట్టి కార్యదర్శిదాకానో మంత్రిదాకానో బ్రతిమాలుతూ తిరుగుతాం. అదే ప్రధానమంత్రితో మనకు గాఢమైన స్నేహం ఉందనుకోండి, ఆ మంత్రులే మనకు ఎదురువచ్చి మనకు కావలసిన పనులన్నీ చిటికెలో చేసిపెడతారు. 

ఈ రోజులలో ప్రతివారూ ముఖ్యంగా కోరుకునేవి రెండు - తమకు అంతులేని సంపద, తమ బిడ్డలకు అపార విద్య. మరి ఈ ఆర్థిక శాఖకు, విద్యాశాఖకు అధిపతులైనవారు ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి కదా? వారిద్దరూ ఏం చేస్తూ ఉంటారో ఈ నామం చెప్తోంది. వారిద్దరూ ఎల్లప్పుడూ జగన్మాతకు కుడి ఎడమలలో నిల్చొని సేవికలవలే ఆ తల్లికి వింజామరలు వీస్తూ ఉంటారు.

మరి ఆ జగన్మాతను హృదయంలో నింపుకొని ఆ తల్లియందు గాఢమైన భక్తి ప్రపత్తులను కలిగినవారికి అటు సంపదలో కానీ ఇటు విద్యలో కానీ లోటు ఏం ఉంటుంది? దీనికి మనకు అటు మహాకవి కాళిదాసు, ఇటు తెనాలి రామలింగకవుల జీవితాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఇంత స్పష్టంగా మన కోరికలు తీరటానికి సుళువైన మార్గం కనిపిస్తూ ఉంటే, దానిని వదిలివేసి లోకంలో వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకొనేవారు ఎంతటి అవివేకవంతులు?

2, అక్టోబర్ 2016, ఆదివారం

ఆబ్రహ్మ కీట జననీ

ఈ సృష్టిలో ఒక చిన్న చీమ మొదలు బ్రహ్మదేవుని వరకు మనందరం ఒక తల్లి బిడ్డలమే. ఆ తల్లే జగన్మాత. సృష్టిలోని ప్రతి జీవజాతిలోనూ మాతృమూర్తులు తమ పిల్లలు సొంత కాళ్ళపై నిలబడే వరకు ఎప్పుడు ఏది కావాలో క్రమం తప్పకుండా అందజేస్తూ అనుక్షణం కంటికి రెప్పలా తమ సంతానాన్ని కాపాడుకుంటూ ఉంటాయి.

అయితే ఈ తల్లులకు ఎప్పుడైనా నిద్ర, ఏమరుపాటు కలుగుతాయేమో కానీ ఆ జగన్మాత మాత్రం ఎప్పటికీ ఏ ఒక్క ప్రాణినీ నిర్లక్ష్యం చేయదు. అయితే తల్లి చిన్నపిల్లల సంరక్షణలో తనకు చేదోడుగా ఉండటానికి పెద్దపిల్లలకు శిక్షణనిచ్చినట్లుగా ఆ జగన్మాత మానవులకు మిగిలిన జీవులకు లేని బుద్ధిని ప్రసాదించింది.

కానీ మనం మాత్రం ఆ బుద్ధిని సృష్టి పోషణలో ఆ తల్లికి సహకరించటానికి ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? మిగిలిన జీవరాశులను మన తోబుట్టువులలా సాకటం మాట అటుంచి, మనలో మనమే జాతి నీతి కుల గోత్రాలనీ నామ రూప గుణ దోషాలనీ అడ్డుగోడలు కట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నాం. మన అంతులేని ఆశకు ప్రకృతి సమతౌల్యాన్ని బలి చేస్తున్నాం.

మరి తన సంతానమంతా ఇలా పరస్పరం కలహించుకుంటూ, కాపాడవలసిన అగ్రజులే తమ అనుజులను కాటేస్తూ ఉంటే ఆ అమ్మలగన్నయమ్మ మనస్సు ఎంతగా క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుంటే మనలో తప్పకుండా మార్పు వస్తుంది.