22, ఆగస్టు 2011, సోమవారం

కృష్ణం వందే జగద్గురుం

అవతరిస్తూనే తల్లి తండ్రుల భవ బంధాలను త్రెంచివేశాడు. తనను ప్రేమించిన గోపికా గోపాలురకు, ద్వేషించిన రాక్షసులకు కూడా ముక్తిని ప్రసాదించాడు. గోపికల అజ్ఞాన వస్త్రాలను అపహరించి వారికి జ్ఞాన వస్త్రాలను ప్రసాదించాడు. జీవాత్మకు పరమాత్మకు మధ్య అనునిత్యం జరుగుతూ ఉండే అద్భుత క్రీడను రాసలీల రూపంలో మనకు వివరించాడు. ప్రేమకు అందంతో సంబంధం లేదని కుబ్జ ద్వారా నిరూపించాడు. స్నేహానికి అంతస్తులతో పని లేదని కుచేలుని ద్వారా నిరూపించాడు. తనను ఆశ్రయించిన పాండవులను అడుగడుగునా రక్షించాడు. తనను వ్యతిరేకించిన కౌరవులను కూడా మంచి మార్గంలో పెట్టటానికి చివరి వరకు ప్రయత్నించాడు. అన్నా అని అర్థించిన ద్రౌపది మానాన్ని అక్షయ వలువలిచ్చి కాపాడాడు. ఆహవరంగంలో కర్తవ్యతా విమూఢుడై దిశా నిర్దేశానికి ప్రార్థించిన అర్జునుని నెపంగా పెట్టుకుని మానవులందరికీ తరతరాలకీ ఆచారణీయమైన భగవద్గీతను ప్రసాదించాడు. అట్టి జగద్గురుదేవుడైన గీతచార్యునికి జన్మాష్టమి సందర్భంగా నా శత సహస్ర వందనాలు.

20, ఆగస్టు 2011, శనివారం

సహాయం

మొన్న శీతాకాలంలో నేను నా మిత్రుడు మంచులో జాగ్రత్తగా నడుస్తుండగా అతని పక్కనే ఒక స్త్రీ జారి క్రింద పడింది. మా స్నేహితుడు ఆమెను "మీరు బాగానే ఉన్నారా? నేను మిమ్మల్ని పైకి లేపవచ్చా?" అని ఒకటికి నాలుగు సార్లు అడిగి మరీ పైకి లేపాడు. నాకు ఆశ్చర్యం వేసి ఎందుకు అన్ని సార్లు అడిగావు అని అడిగితే అతను ఒక ఆసక్తికరమైన వార్తను చెప్పాడు.

ఆ మధ్యన ఇద్దరు స్నేహితురాళ్ళు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అందులో ఒక స్త్రీ బాగానే బయటపడింది కానీ రెండవ స్త్రీ కాళ్ళు వాహనంలో ఇరుక్కుపోయాయి. సహాయక బృందం వచ్చేలోగా ఆ వాహనం మండిపోతుందేమో అని భయపడిన మొదటి స్త్రీ తన స్నేహితురాలిని బలవంతంగా బయటకు లాగేసింది. తరువాత వైద్యులు ఆమెకు రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయని తేల్చారు. అదే మన దేశంలో అయితే "పోనిలే, సమయానికి ప్రాణాలైనా కాపాడింది" అని కృతజ్ఞత చూపి ఉండేది. కానీ ఇక్కడ ఆ గాయపడిన స్త్రీ తన స్నేహితురాలిపై కొన్ని లక్షల డాలర్లకై దావా వేసింది.

అందుకే ఈ దేశంలో ఎవరికైనా సహాయం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు అలోచించి, వారి అనుమతి తీసుకుని మరీ చెయ్యాలి.

12, ఆగస్టు 2011, శుక్రవారం

జలుబు లెక్కలు

జలుబుకు మందు వాడితే వారంలో, వాడకపోతే ఏడు రోజులలో తగ్గుతుందనే సామెత విన్నప్పుడు, మరీ వారానికి ఏడు రోజులని తెలియని వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసేది. ఈ మధ్యన మా మిత్రుడొకరు కొత్తగా ఇల్లు కొన్నారు. తీరా వాళ్ళు గృహ ప్రవేశం చెయ్యాలనుకున్న సమయానికి అనుకోని ఇబ్బంది వచ్చి ఒక నెల రోజులు వాయిదా వేసుకోవలసి వచ్చింది. వారు అద్దెకుండే ఇంటి యజమానిని ఒక నెల రోజులు ఎక్కువ ఉండటానికి అనుమతి అడిగితే, అతను నెల రోజులు పొడిగించటానికి తమ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాడు. సరే వీళ్ళు కొన్ని రోజులైనా అనుమతి దొరికితే తరువాత ఏదో ఒకటి చేద్దాంలే అని, ఎన్ని రోజులు పొడిగించగలరని అడిగితే అతను ముప్పై రోజుల వరకు మాత్రమే పొడిగించగలనని చెప్పాడు. వీళ్ళు వీడి తెలివి తెల్లారినట్లే ఉందని ఆనందంగా ముప్పై రోజులు పొడిగించుకుని, సుఖంగా గృహ ప్రవేశం చేసుకున్నారు. ఇంతకీ ఇది జరిగింది ఫిబ్రవరి నెలలో.

10, ఆగస్టు 2011, బుధవారం

ఎక్స్ రాక్స్

అవి పల్లెటూరి పాఠశాలలో చదువు ముగించుకొని కళాశాలకై మొదటి సారిగా పట్నంలో అడుగు పెట్టిన రోజులు. ఒక రోజు మా అత్తయ్య కొన్ని కాగితాలు ఇచ్చి వాటిని ఫోటోస్టాట్ తీయించుకుని రమ్మంది. నేను ఫోటోస్టాట్ అంటే ఏమిటి అది ఎక్కడ తీస్తారు అని అడిగాను. మా అత్తయ్య చాలా కొట్ల ముందు జిరాక్స్ అని వ్రాసి ఉంటుంది. అక్కడికి వెళ్లి అడిగితే వాళ్ళే తీసి ఇస్తారు అని చెప్పింది. నేను ఊరంతా తిరిగి వట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఏరా ఫోటోస్టాట్ ఎందుకు తీయించలేదంటే "నాకు ఎక్కడా జిరాక్స్ అని కనపడలేదు కానీ ఒకటి రెండు చోట్ల మాత్రం ఎక్స్ రాక్స్ అని వ్రాసి ఉంది. నువ్వు చెప్పిన కొట్టు అదో కాదో అని నేను వెళ్ళలేదు" అని చెప్పాను. ఇది తలచుకుంటే అప్పటి నా అమాయకత్వానికి నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది.

9, ఆగస్టు 2011, మంగళవారం

ఫెడెక్స్ - తపాలా

నా చిన్నప్పుడు మన తపాలా శాఖ గురించి ఒక తమాషా విషయం చెప్పే వారు. ఏదైనా ఒక చిన్న ఊరిలో ఉండే తపాలా శాఖ వారి వాహనానికి చిన్న మరమ్మత్తు చేయించవలసి వస్తే ఆ 5 -10 రూపాయలు ఖర్చు పెట్టే అధికారం వారికి ఉండదట. దాని కోసం జిల్లా లేదా రాష్ట్ర ముఖ్య కార్యాలయానికి లేఖ వ్రాసి అనుమతి తెచ్చుకోవాలిట. కానీ అంతవరకూ వారు ఎంత ఖర్చైనా పెట్టి ఒక అద్దె వాహనాన్ని వాడుకోవచ్చుట. ఈ తెలివి మాలిన దుబారా ఖర్చు ఒక్క మన ప్రభుత్వానికే పరిమితమనే భ్రమలో ఉండేవాడిని.

నా భ్రమలు పటాపంచలు చేస్తూ నిన్ననే నాకో విషయం తెలిసింది. నా సహోద్యోగి ఒకరు అంతర్జాలంలో ఏదో వస్తువు కొన్నారు. అది న్యూయార్క్ నగరంలోనే ఒక చోటి నుండి ఇంకొక చోటికి చేర్చవలసి ఉంది. ఉచితంగా వస్తుందని అతను 5 రోజులలో చేర్చే సేవను ఎంచుకున్నాడు. తీరా ఆ ఫెడెక్స్ వాడు అన్ని రోజులు దానిని తన దగ్గరే ఎందుకు ఉంచుకోవాలనుకున్నాడో ఏమో దానిని న్యూయార్క్ నుండి న్యుజెర్సికి అక్కడి నుండి విమానంలో టెన్నిసీకి తిరిగి మళ్లీ విమానంలో న్యుజెర్సి ద్వారా న్యూయార్క్ కి తెచ్చి అయిదవ రోజున ఇతనికి ఇచ్చాడు.

అభివృద్ధి - మందబుద్ధి

వాషింగ్ మెషిన్ లో బట్టలు మాత్రమే ఉతకవలెను, మీ పిల్లలను కాదు. కాఫీ వేడిగా ఉన్నది, చేతులు కాలును. ఫినాయిల్ దొడ్లు కడగటానికే, దానిని త్రాగరాదు. ఇది ప్లాస్టిక్ కవరు మాత్రమే, బొమ్మ కాదు. దీనిని తింటే గొంతుకు అడ్డం పడుతుంది.

ఇలాంటి హెచ్చరికలు చూసినప్పుడు నాకు కూడా ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదించాలనిపిస్తుంది.

"దేశం అభివృద్ధి చెందినకొద్దీ ప్రజలు మందబుద్దులు అగుదురు"

8, ఆగస్టు 2011, సోమవారం

డార్విన్ --- గడ్డం

డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతమే నిజమైతే రోజూ ఇన్ని కోట్లమంది మగవాళ్ళు కష్టపడి పొద్దున్నే గడ్డం గీసుకుంటున్నా ఇంకా మగవాళ్ళకి గడ్డం లేకుండా పోవటం లేదెందుకో?

బహుశా డార్విన్ కి గడ్డం ఉండటం వల్లనేమో.

అయినా నాకొక సందేహం - కోతి మనిషిగా రూపాంతరం చెందితే ఇంకా భూమి మిద ఇన్ని కోతులు ఎందుకు ఉన్నాయంటారు?

జనాభా సమస్యా?

అందరూ మన జనాభాని అదుపు చెయ్యాలంటారు కానీ ఇంటికి ఒక్కరినే కంటే చివరికి మన తరువాతి తరమంతా ఒంటరి బ్రతుకులు అయిపోతాయి. లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళేమో పిల్లలనే కనట్లేదు. కూటికి కూడా గతి లేని వాళ్ళు గంపెడు సంతానాన్ని కంటున్నారు. అవినీతిని ఆర్థిక అసమానతలను తొలగిస్తే జనాభా ఒక సమస్యే కాదంటాను. మరి మీరేమంటారు?


 దీనిపై మా మిత్రుడు రవి ఒక చమత్కారమైన వ్యాఖ్య చేసాడు. పేదవారు అంతమంది పిల్లలను ఎందుకు కంటారంటే - కనీసం వారైనా తాము చెయ్యలేకపోయిన పని చేస్తారనిట. ఇంతకీ ఆ పని ఏమిటయ్యా అంటే ఒక గొప్పింటి పిల్లని పెళ్ళిచేసుకుని స్థిరపడటం. పైగా తను కూడా చాల సార్లు అలాగే కలలు కన్నాట్ట కానీ పాపం అది జరగలేదు.