5, ఆగస్టు 2024, సోమవారం

ముక్తి

    వైష్ణవ సంప్రదాయంలో ముక్తిని నాలుగు అంచెలుగా వర్ణించారు. ఈ భూలోకంలో జీవించినన్నాళ్ళు శ్రీమహావిష్ణువుపై అనన్య భక్తిని కలిగి ఉండి, మరణించిన తరువాత వైకుంఠాన్ని చేరడం ఇందులో మొదటి మెట్టయిన సాలోక్య ముక్తి. అంటే స్వామి ఉన్న లోకంలోనే మనమూ నివసించడం. ఇక దాని పైమెట్టు సామీప్యం - అంటే ఆ లోకంలో ఎక్కడో దూరంగా ఉండటం కాకుండా స్వామివారికి అతి దగ్గరలో ఆంతరంగిక సేవకునిగా మెలగడం. ఇక అలా సేవించుకున్న ఫలితంగా వచ్చేది సారూప్యం. మనకు జయవిజయులను చూపిస్తూ ఉంటారు కదా! వారు కూడా విష్ణుమూర్తిలాగానే నాలుగు చేతులు కలిగి, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉంటారు. అలా స్వామివారి రూపాన్ని పొందడం సారూప్య ముక్తి. ఇక చివరిమెట్టు సాయుజ్యం - అంటే ఆ పరమాత్మునిలో ఐక్యం అయిపోవడం. 

    ఈ నాలుగింటిపై కొంచెం లోతుగా విచారణ చేద్దాం. ఎందుకంటే అద్వైత సిద్ధాంతంలో ముక్తి అనేది చనిపోయాక పొందేది కాదు. బ్రతికి ఉండగానే నీ అసలు స్వరూపాన్ని గుర్తించి ఈ శరీరంతోనే జీవన్ముక్త స్థితిని అనుభవించాలి. ఇక పైన చెప్పుకున్న నాలుగు అంచెల ముక్తిని గూర్చి విచారిస్తే - ముందుగా సాలోక్యం అంటే పరమాత్మ ఉన్న లోకంలో మనం నివసించడం అని చెప్పుకున్నాం కదా. కానీ ఆయన ఉన్న లోకం ఏది? విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం కదా! మరి ఆయన లేని స్థానం కానీ, లోకం కానీ ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా? అంతేకాక గీతలో స్వామే స్వయంగా చెప్పినట్లు ధర్మ సంస్థాపన కోసం ఆయన మాటిమాటికీ అనేక మహాత్ముల, గురువుల, అవతారపురుషుల రూపాలలో మన మధ్యన సంచరిస్తూనే ఉన్నాడు కదా! అయితే ఈ విషయాన్ని గుర్తించి సదా అనుభవంలోకి తెచ్చుకోవడమే సాలోక్యం. అంటే మన జీవితంలో ప్రతి క్షణం పరమాత్మ ఉన్న లోకంలోనే, పుణ్యక్షేత్రంలోనే, వైకుంఠంలోనే మనం జీవిస్తున్నామనే ఎఱుక కలిగి ఉంటే మనం ఇక పాపాలు చేయలేము కదా! మనలోని మానసిక బలహీనతల వలనే మనం పాపాలు చేస్తాం. కుంఠితం అంటే బలహీనమైనది. కుంఠితం కానిది వైకుంఠం. ఇలా నిరంతరం స్వామి ఉనికిని గుర్తిస్తూ మన మనస్సు ఎప్పుడైతే తన బలహీనతలను అధిగమిస్తుందో అప్పుడు ఆ మనస్సే వైకుంఠం అవుతుంది.

    ఇక దీని పైమెట్టు సామీప్యం. కేవలం ఆ స్వామి ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడని మాత్రమే కాకుండా నిరంతరంగా ఆయన సన్నిధిని మనం అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆయన ఎప్పుడూ మన ప్రక్కనే, మనతోనే, మనలోనే ఉంటాడు. ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి.  ఆయన లేనిదే మనం లేము. ఈ నిరంతర సామీప్యాన్ని మనం అనుభవంలోనికి తెచ్చుకుంటే ఇక ఈ లోకంలోని ఈ కష్టాలు, బాధలు, సుఖదుఃఖాలు మనలను బంధించలేవు. నిరంతరం తన తల్లిదండ్రుల దగ్గర నివసించే పిల్లవానికి దేనిమీద చింత ఉంటుంది? అంతా వారే చూసుకుంటారనే నిశ్చింతతోనే హాయిగా బ్రతికేస్తాడు కదా! అదే సామీప్య ముక్తి.

    మరి సారూప్యం అంటే పైన చెప్పుకున్నట్టు ఆ స్వామి యొక్క రూపాన్ని మనం కూడా ధరించాలని, కొందరు అచ్చంగా విష్ణుమూర్తి, శివుడు, లేదా తన గురుదేవులు ధరించే విధంగానే నుదుటిపై నామాన్ని ధరించడం, వారిలాగానే పీతాంబరాన్నో, జింక చర్మంనో ధరించడం, వారి హావభావాలను అనుకరించడం చేస్తూ ఉంటారు. ఎంత సాధన చేసి అచ్చుగుద్దినట్లు అనుకరించినా అది అనుకరణే అనిపించుకుంటుంది కానీ వీరు వారవ్వరు కదా! పరమాత్మతో సారూప్యాన్ని పొందడం అంటే ఆయనలో ఉన్న సద్గుణాలను మనం అలవరచుకోవడం. ఆయనలో లేని దుర్గుణాలను మనలోనుండి తొలగించుకోవడం. అంతేకాదు ఈ సర్వ సృష్టిని విష్ణుమయంగా దర్శించే దృష్టిని అలవరచుకోవడం. చూడక మానవు చూచెడి కన్నులు ఏడనేడైన ఇతరములు, ఈడ నన్నింట నీ రూపము గన ఈడు లేని తెలివీయగదే అని ప్రార్థించాడు అన్నమయ్య. అటువంటి పరమాత్మ దృష్టిని అలవరచుకోవడం సారూప్యం.

    ఇక తన చుట్టూ ఉన్న సృష్టి అంతటిలో పరమాత్మనే దర్శిస్తూ ఉంటే తాను మాత్రం ఆ పరమాత్మకు భిన్నంగా ఉంటాడా? ఈ కనిపించే దేహం తాను కానని, ఈ దేహాలన్నింటినీ నడిపించే పరమాత్మ తానే అనే సత్యాన్ని గ్రహిస్తాడు, అనుభవిస్తాడు. అదే సాయుజ్య ముక్తి. కేవలం తాను తప్ప మరియొకటి లేదనే ఎఱుకయే కైవల్యం. అటువంటి ముక్తిని పొందినవాడికి ఇక దేనిమీదా మొహం కానీ, రాగద్వేషాలు కానీ కలుగవు. ప్రారబ్ధం ఉన్నంతవరకు ఈ దేహం నిలిచి ఉంటుంది. అయితే ఈ దేహంతో చేసే కర్మలు ఏవీ తనకు అంటవు. ఎందుకంటే వాటి వెనుక తనకు ఏదో కావాలనే కోరిక కానీ, తాను చేస్తున్నాననే అహంకార భావన కానీ ఉండదు. అవన్నీ లోకకళ్యాణం కోసం చేసే లీలలే అవుతాయి కానీ, తనను బంధించే కర్మలు కావు. ఎప్పుడైతే ఆ ప్రారబ్ధం తీరి ఈ దేహం పడిపోతుందో, అప్పుడు తాను స్వస్వరూప లయం పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి||

9, జులై 2024, మంగళవారం

నిరీక్షణా మాధుర్యం

    భగవంతుని దర్శించుకోవాలనే ఆర్తితో మనం ఎన్నో పుణ్య క్షేత్రాలకు, ప్రసిద్ధ దేవాలయాలకు వెళతాం. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత దర్శనానికి పెద్ద లైను ఉంటుంది. తిరుమల లాంటి చోట్ల అయితే కొన్ని గంటలో, ఒక్కొక్కసారి రోజు పైనే పట్టవచ్చు. ఇంతా కష్టపడి ఆలయం లోనికి ప్రవేశించాక గట్టిగా కొన్ని క్షణాలు కూడా ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించుకోనివ్వరు. పదండి, పదండి అని త్రోసివేస్తారు. ఇంకా కొందరు ఉంటారు. అందరూ ఒక వరుసలో వెళ్తుంటే వీరు వరుస తప్పి ప్రక్కకు జరిగి, ఆ దేవతామూర్తికి అడ్డంగా నిలబడి పరమ భక్తితో ఎంతోసేపు నమస్కరిస్తూ, స్తోత్రాలు చదువుతూ నిలబడిపోతారు. ఇక వెనుకవాళ్ళు వీళ్ళ వీపులనో, కొప్పులనో దర్శించుకొని పోవలసిందే కానీ, వీళ్ళు మాత్రం అక్కడినుండి కదలరు. కనీసం, మనతోపాటు వరుసలో ఉన్న వారందరూ భక్తులే కదా, మనకు ఆ పరమాత్మను దర్శించుకొనే హక్కు ఎంత ఉందో వారికి కూడా అంతే ఉంది కదా అనే ఆలోచనే వీరికి రాదు.

    ఇంకొంతమంది వరుసలో నిలుచున్నంత సేపూ వారు భగవంతుని తలచుకోకపోగా ప్రక్కవారిని అనేక ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. "మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఆహా, కాలేజీకి బస్సు వస్తుందా, మీరే దింపాలా? మీ అబ్బాయికి ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు?" ఇలా ఎందుకూ పనికిరాని ప్రశ్నలతో వారి మనశ్శాంతిని చెడగొడుతూ ఉంటారు. పోనీ ఆ ప్రశ్నల వలన వీరికి కానీ, వారికి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే ఏమీ ఉండదు. నిజంగా అవతలి వారికి ఏమన్నా సహాయం అవసరమైన సందర్భంలో వీరు కనీసం ముఖం కూడా చూపించారు. మరి ఎందుకు ఈ వృథా కంఠక్షోభ? నిజానికి భగవద్దర్శనం అనేది చాలా కొద్ది క్షణాలే లభిస్తుంది. మన పురాణేతిహాసాలలో ఎందరో భక్తులు, రాజులు, రాక్షసులు అనేక వందల, వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ఇలా ప్రత్యక్షమై, వరమిచ్చి, అలా మాయమైపోతాడు. కానీ అసలైన భగవద్దర్శన మాధుర్యం ఆయన దర్శనం కోసం నిరీక్షించడంలోనే ఉంది. 

    శబరి తల్లి రామునికోసం ఎన్నో సంవత్సరాలు నిరీక్షించింది. రాముడు వచ్చినప్పుడే ఆయనకు సేవలు చేద్దాంలే అనుకొని తన సమయాన్నంతా ఇతరులతో పోచికోలు కబుర్లు చెప్పడానికి ఉపయోగించలేదు. ప్రతిరోజూ ఈ రోజే రాముడు వస్తాడనే విశ్వాసంతో నిరంతర రామ స్మరణతోనే తన కుటీరాన్ని, అక్కడికి చేరే మార్గాన్ని అంతా చక్కగా అలికి, ముగ్గులు పెట్టి, పూరేకులతో అలంకరించి, రామునికోసం నీటిని, మధుర ఫలాలను సేకరించి సిద్ధంగా ఉండేది. ఇలా నిరంతర రామ నిరీక్షణా మాధుర్యాన్ని ఒక తపస్సుగా అనుభవించింది కనుకనే నిజంగా ఆ రాముడు వచ్చి తనవద్ద కొద్ది క్షణాలే గడిపినా వెంటనే తన ఆత్మ రామునిలో లీనమై, దేహం కూడా నదీరూపాన్ని ధరించి శాశ్వతత్వాన్ని పొందింది. అలా మాధుర్యాన్ని అనుభవించకుండా కేవలం దర్శనం కోసమే తపస్సు చేసి, తీరా భగవంతుడు ప్రత్యక్షం అయ్యాక తమకు ఎందుకూ పనికిరాని, లోకాలకు హానికారకమైన వరాలను అడిగి ఎందరు రాక్షసులు నాశనం అయిపోలేదు?

    కాబట్టి ఎంతసేపు దర్శనం అయ్యింది? మనం వెళ్ళిన రోజున ఆ దేవతామూర్తికి ఎన్ని అలంకారాలు చేశారు, ఇలాంటివి ముఖ్యం కాదు. మనం ఇంటిదగ్గర బయలుదేరిన దగ్గరినుంచి, లేదా అసలు మనకు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే సంకల్పం కలిగిన క్షణంనుంచి మనం ఎంతసేపు ఆ పరమాత్మను తలుస్తూ, ఆ స్మరణలో గడిపాము? అనే దానిపైనే ఆ దర్శనంలో మనం అందుకొనే మాధుర్యం ఆధారపడి ఉంటుంది. నిజానికి అలా నిరంతర భగవన్నామ స్మరణ జరగాలనే దేవాలయాలలో ఎవరో భక్తులు సంకీర్తన చేస్తూ ఉండటమో, ఆ సౌలభ్యం లేని చోట్ల ఏ సిడిలోనో భజనలు వినిపించడమో చేస్తూ ఉంటారు. మనం దర్శనానికి వరుసలో నిలబడినప్పుడు ప్రక్కవారితో లోకాభిరామాయణం మాట్లాడటం మానుకొని ఆ సంకీర్తన మనం చేయలేకపోయినా, కనీసం వినే ప్రయత్నం చేస్తే, అందులో ఏదో ఒక కీర్తన తప్పక మన హృదయానికి తాకుతుంది. అలా తాకిన కీర్తన మనం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా, ఆ రోజంతా ఏ పని చేస్తున్నా మన మనస్సులో తిరుగుతూనే ఉంటుంది. ఇంతకన్నా ధ్యానం ఏముంటుంది?

    అలా నిరంతర భగవన్నామ స్మరణ కన్నా గొప్ప సాధన మరొకటి లేదు. మెల్లమెల్లగా మనస్సు ఆ రుచికి అలవాటు పడితే, బయటి విషయాలపై ఆసక్తి తగ్గి, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సు భగవంతుని వైపే లాగుతూ ఉంటుంది. అట్టి సాధనకు ఫలితంగా కేవలం గర్భాలయంలో మూలవిరాట్టులో మాత్రమే భగవంతుని దర్శించే స్థితినుండి, మన చుట్టూ ఉండే సర్వ ప్రకృతిలో, సమస్త మానవాళిలో ఆ పరమాత్మనే దర్శించే స్థితికి చేరుకుంటాం. మానవ జన్మ ఎత్తినందుకు అదే సార్థకత.

8, జూన్ 2024, శనివారం

దానం

    దానానికి యజ్ఞము, తపస్సులతో సమానమైన స్థానాన్ని ఇచ్చింది భగవద్గీత. బ్రహ్మచర్యాది నాలుగు ఆశ్రమాలలో నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడూ మాత్రం మానడానికి వీల్లేదు అంటారు గీతాచార్యులు. మనుష్యులను పావనమొనర్చే శక్తి ఈ మూడింటికి ఉన్నదని కూడా చెప్పారు. అలాగే త్రిగుణాత్మకమైన మనస్సుతో కూడిన మానవుడు ఏ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఎటువంటి రీతిలో దానం చేస్తాడో కూడా చెప్పారు.

    అయితే అసలు దానం ఎలా ఇవ్వాలి? దాత మనస్థితి ఏవిధంగా ఉండాలి అని తైత్తిరీయ ఉపనిషత్తు నిర్వచిస్తోంది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం.

    శ్రద్ధయా దేయం - దానం ఇచ్చేవాడు శ్రద్ధగా ఇవ్వాలి. ఒక దానం అనే కాదు, ఏ పని చేసినా శ్రద్ధాభక్తులతో చేయమని మన ధర్మం బోధిస్తోంది. సాత్విక గుణం ప్రధానంగా కలిగినవాడు దేశ కాల పాత్రతలను ఎఱిగి, తనకు ఏమాత్రం తిరిగి ఉపకారం చేయలేని వ్యక్తులకు, దానాన్ని తన కర్తవ్యంగా భావించి చేస్తాడు అని భగవద్గీత బోధిస్తోంది. అదే తామసిక గుణ ప్రధానుడు అసలు ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేయాలో తెలియకుండా, దేశం, కాలం, పాత్రతలను చూడకుండా దానం చేస్తాడని చెబుతోంది. ఇక్కడే మనకి చేసేవారిలో శ్రద్ధ ఉందో, లోపించిందో అర్థం అయిపోతుంది.

    అశ్రద్ధయా దేయం - శ్రద్ధగా దానమివ్వాలని చెప్పిన మరుక్షణంలోనే ఉపనిషత్తు అశ్రద్ధగా దానమివ్వాలని చెబుతోంది. ఇది కొంచెం వింతగానే తోస్తుంది. అయితే ఇందులో అంతరార్థం ఏమిటంటే, ఒక్కసారి నువ్వు ఏదైనా వస్తువు దానమిచ్చావు అంటే, ఇక ఆ వస్తువుపై నీ మనసులో ఎటువంటి మమకారం ఉండకూడదు. ఎవరైనా మనకు చేసిన మేలును జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అదే మనం ఇతరులకు చేసిన మేలును వెంటనే మర్చిపోవాలి. ఉదాహరణకు మీ వీధి చివరన ఉన్న పేదవాడికి మీ బట్టలు ఇచ్చారనుకోండి. ఆ తరువాత అతను ఆ బట్టలు వేసుకొని కనిపించినప్పుడల్లా 'ఇవి నేనిచ్చిన బట్టలే కదా!' అనే భావన మీ మనసులో రాకూడదు. ఒక అన్నదాన సత్రానికి భూరి విరాళమిచ్చి ఆ మర్నాటినుండి మీ ఇంట్లో వంట మానేసి అందరూ అక్కడే తింటుంటే అది దానం ఎలా అవుతుంది? అలాగే ఒక గుడికో, బడికో స్థలమో, ధనమో దానమిచ్చి అక్కడ అంతా నా ఆధీనంలోనే ఉండాలి, నేను చెప్పినట్టే అన్నీ జరగాలి అని పట్టుబట్టేవాడు దాత ఎలా అవుతాడు? 

    అందుకనే దానమిచ్చిన ఆ క్షణంలోనే ఆ ద్రవ్యం మీద మనకు అశ్రద్ధ ఏర్పడాలి. దానితో ఎటువంటి సంగం పెట్టుకోకూడదు. ఒక్క కన్యాదానంలో తప్ప మిగిలిన అన్ని దానాలలో 'ఇదం న మమ' అని చెప్పిస్తారు. అంటే ఒకసారి దానమిచ్చిన వస్తువుతో ఇక నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. అయితే కుమార్తెను మాత్రం దానమిచ్చినా ఆమె ప్రేమానురాగాలపై మనకు హక్కు ఉంటుంది. ఆమెకు ఏ కష్టమొచ్చినా కలుగజేసుకొనే హక్కు ఉంటుంది. అయితే హక్కు ఉంది కదా అని ఏ తల్లిదండ్రులూ తమ కూతురి సంసారంలో నిరంతరం కలుగజేసుకోవాలని, ఆమెపై ఆధారపడాలని కోరుకోరు కదా! మరి హక్కు ఉన్న దానం విషయంలోనే ఇంత విరాగం ఉన్నప్పుడు, 'ఇది ఇంక నాది కాదు' అని చెప్పి దానమిచ్చిన వస్తువుపై శ్రద్ధాసక్తులు పెంచుకోవడం ధర్మం కాదు కదా! 

    ఎందరో అధర్మపరులైన రాజులను సంహరించి తాను పొందిన రాజ్యమంతా కశ్యప మహర్షికి దానమిచ్చేశానని, కనుక అత్యవసరమైనప్పుడే ఈ నేలపైకి వస్తానని, వచ్చినా చీకటి పడిన తరువాత తాను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేనని పరశురాముడు శ్రీరామునికి చెప్పడం మనం రామాయణంలో చూస్తాం. తనదైన వస్తువుని దానమిస్తేనే దానిమీద హక్కును వెంటనే పోగొట్టుకోవాలని మన ఆర్షధర్మం బోధిస్తూ ఉంటే అసలు తమది కాని ప్రజల సొమ్మును వారికే పంచిపెట్టి, దానిమీద తమ పేరు, బొమ్మ ముద్రించుకొనే వారి గురించి మాట్లాడుకోవటానికి ఏముంటుంది. అసలు ఇలాంటి వ్యక్తులు ఉంటారని గీతాచార్యులు కూడా ఊహించి ఉండరు. అందుకే సత్వరజస్తమో గుణ దాతల నిర్వచనంలో కూడా ఎక్కడా ఇటువంటి వారి ప్రస్తావన తేలేదు.

    శ్రియా దేయం - నీ స్తోమతకు తగిన రీతిలో నువ్వు దానం చెయ్యాలి. వెనకటికి ఒకడు తనకున్న సెంటు భూమిలో తోటకూర పండించి ఆ దారిన వచ్చేపోయేవారికి ఆ తోటకూర పంచిపెట్టేవాడు. అలా తనకున్న దానిలో అధికభాగం దానమిచ్చిన పుణ్యవశాన మరుజన్మలో అతడు రాజుగా పుట్టాడు. అయితే పూర్వజన్మ స్మృతి కూడా కొంత కలిగింది. 'ఆ జన్మలో కొద్దిగా తోటకూర దానమిచ్చి ఈ జన్మలో రాజునయ్యాను కదా! ఇప్పుడు చాలా తోటకూర దానమిస్తే ఇంకెంత గొప్ప జన్మ వస్తోందో!' అనుకొని ఎకరాల కొద్దీ తోటకూర పండించి దానమివ్వడం మొదలుపెట్టాడు. రాజుగారు తోటకూర దానమివ్వడమేమిటని లోకమంతా విచిత్రంగా చెప్పుకోవడం మొదలు పెట్టింది. ఒకనాడు ఒక మహాత్ములు అటుగా వెళ్తూ ఆ రాజును చూసి 'అంతకు ఇంతయ్యింది కానీ ఇక ఇంతకు ఇంతే!' అన్నారు. ఆ రాజుకు విషయం అర్థం కాక వివరించమని ఆ మహాత్ముని ప్రార్థించాడు. 'ఆ జన్మలో నువ్వు ఒక చిన్న రైతువి. నీ స్తోమతను బట్టి తోటకూర దానమిచ్చావు. ఆ పుణ్యవశాన రాజువయ్యావు. ఇప్పుడు రాజుగా మణిమాణిక్యాలు, రత్నరాశులు, అగ్రహారాలు దానమివ్వవలసిన స్థితిలో ఉన్న నువ్వు నీ స్తోమతను మరచిపోయి ఇంకా తోటకూరే దానమిస్తే అది నీకు ఎటువంటి ఉన్నతిని కలుగజేయదు' అని వివరించారు ఆ మహాత్ములు.

    హ్రియా దేయం - సిగ్గుతో దానమివ్వాలి. 'అయ్యో! ఇంతకు మించి ఇవ్వలేక పోతున్నానే' అని సిగ్గుపడుతూ దానమివ్వాలి తప్పితే 'నేను కాబట్టి ఇంత గొప్ప గొప్ప దానాలు చేస్తున్నాను. అందరూ నన్ను గౌరవించాలి' అనే డంబంతో, అహంకారంతో దానమివ్వకూడదు. పూర్వం సంత్ రహీమ్ అని గొప్ప భక్తుడు, కవి ఉండేవారు. ఆయన రోజంతా తన ఇంటి బయట కూర్చొని ఎంతో మందికి తనకున్న కొద్దిపాటి సంపదనంతా దానమిస్తూ ఉండేవారు. అయితే అలా దానమిచ్చేటప్పుడు తల వంచుకొని సిగ్గుపడుతూ దానమిచ్చేవారు. ఒకసారి ఈ విషయం తులసీదాసు వారికి తెలిసి 'చేసేది మంచి పని అయినప్పుడు తల ఎత్తుకొని చేయక అలా తల దించుకొని ఎందుకు దానమిస్తున్నారు?' అని ఒక చీటీపై వ్రాసి పంపించారు. అప్పుడు రహీమ్ సమాధానమిస్తూ 'ఇచ్చేవాడు వేరే ఉన్నాడు. ఆయన నా ఈ చేతులతో ఇప్పించడానికై అహోరాత్రాలూ నాకు సంపదనిస్తున్నాడు. ఈ జనులే తెలియక నేనిస్తున్నానని భ్రమ పడుతున్నారు. అందుకే తల దించుకొని ఇస్తున్నాను' అని వినయంగా వ్రాశారు.

    భియా దేయం - భయపడుతూ దానమివ్వాలి. 'భయమెందుకు?' అంటే 'మనకున్నది అయిపోతుందేమో' అని కాదు. 'నేను సరిగ్గానే దానమిస్తున్నానా? దేశకాలాలకు తగినట్లుగా, సరైన పాత్రత కలిగిన వారికే ఇస్తున్నానా? శ్రద్ధగా ఇస్తున్నానా? ఇచ్చిన దానిమీద వెంటనే విరాగాన్ని పొందుతున్నానా? నా స్తోమతకు తగినంతగా ఇస్తున్నానా? నాలో గర్వం కలగడం లేదు కదా?' ఇలా అనుక్షణం తనను తాను పరిశీలించుకుంటూ, భయభక్తులతో దానం చెయ్యాలి. శ్రద్ధ, భయభక్తులు లోపించిన ఏ కార్యమైనా అహంకారానికి, ఆ వ్యక్తి పతనానికి దారితీస్తుంది.

     సంవిదా దేయం - సంవిత్ అంటే జ్ఞానం. దానమిచ్చే పద్ధతినెఱిగి ఇవ్వాలి. అలాగే సంవిదా అంటే ఒప్పందం. అంటే ఒకసారి ఇస్తానని మాట ఇచ్చిన తరువాత తనకు ఎంత కష్టమొచ్చినా వెనుదిరగకూడదు. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, సక్తుప్రస్థుడు, హరిశ్చంద్రుడు ఇటువంటి దాతలందరూ తమకు ఎంతటి కష్టం కలిగినా వెనుదిరుగక దానమిచ్చినవారే. అటువంటివారు మనకు ఆదర్శం కావాలి.