2, జూన్ 2026, మంగళవారం

శ్రీ సద్గురు బాబూజీ పూరీ కామాఖ్య యాత్ర


    2026 ఏప్రిల్ 26 నుండి మే 12 వరకు శ్రీ కాళీవనాశ్రమ భక్తులనేకులతో కలిసి శ్రీ సద్గురు బాబూజీ పూరీ కామాఖ్య యాత్ర చేయడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాధ దేవాలయం, సాక్షి గోపాలుడు, జాజిపూర్ గిరిజాదేవి, భువనేశ్వర్ లింగరాజ్, కలకత్తా కాళీమాత, దక్షిణేశ్వర్ కాళీమాత, బేలూరు మఠం, గంగాసాగర్‌, మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధాన దేవాలయం, శ్రీ చైతన్య మహాప్రభువు నడయాడిన నవద్వీపం, వైద్యనాథ్, తారకేశ్వర్, శృంఖలాదేవి, మా తారా, ఏకచక్రపురం, కామాఖ్య, ఉమానందాశ్రమం, వశిష్ఠాశ్రమం మొదలైన ఎన్నో దివ్య క్షేత్రాలను దర్శించడం జరిగింది. ఆయా క్షేత్రాలలో క్షేత్రాధిష్ఠాన దేవతల మాహాత్మ్యమే కాకుండా క్షేత్రజ్ఞులైన జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి దగ్గరనుండి గురుదేవులు శ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వరకు ఎందరో మహాత్ములు నడయాడిన ఫలితంగా అలముకొన్న పవిత్రత అనుభవైకవేద్యం.

    కోణార్క్ సూర్య దేవాలయం మన ప్రాచీన శిల్పకారుల ప్రతిభకు అద్దం పడుతుంది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పాలకులు ఆడంబరానికి ఇచ్చిన ప్రాముఖ్యత మానవతా విలువలకు ఇవ్వడంలేదని అక్కడి విషాద చరిత్ర మనకు గుర్తుచేస్తుంది. అయితే పరమాత్మకు కావలసింది ఆడంబరాలు కాదు కదా! అందుకే ఈ దేవాలయం పూజలకు నోచుకోలేకపోయింది. సరిగ్గా పన్నెండు సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి చేయకపోతే అక్కడ పనిచేస్తున్న పన్నెండు వేలమంది శిల్పులను వధిస్తానని అక్కడి రాజు శాసించాడు. అయితే ఆలయం అంతా నిర్మించిన వారికి శిఖరాన్ని స్థాపించడం మాత్రం సాధ్యపడలేదు. చివరి రోజున ప్రధాన శిల్పి పన్నెండేళ్ళ కుమారుడు వచ్చి దానిని స్థాపించడం, ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఎక్కడ ఇంతమందిని పొట్టనపెట్టుకుంటాడో అని భయపడి ఆ శిఖరం మీదినుండే దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయింది. దానితో అపవిత్రమైన అంతటి భవ్యమైన ఆలయం పూజలకు నోచుకోలేకపోయింది.

    ఇక పూరీ జగన్నాధ ఆలయంలో ఆ స్వామి రెండు చేతులూ చాచి ఆప్యాయంగా మనలను ఆహ్వానిస్తున్నా, అక్కడి విపరీతమైన రద్దీలో ముందు మనం ఊపిరితో బయటపడితే చాలన్న భావన ముప్పిరిగొంటుంది. ఒక్క పూరీ అలయంలోనే కాదు, యాత్రలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో దాదాపుగా ఇదే పరిస్థితి. దేవుడు దయతలచినా పూజారి దయ తలిస్తే కానీ సవ్యంగా దర్శనం జరుగదు. "కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు" అని పాడుకుంటాం కానీ ఆచరణలో మాత్రం పైసాలోనే పరమాత్మ.

  మనవాళ్ళు దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి తప్పించి ధర్మకర్తలకు అప్పజెప్పమని ఉద్యమిస్తూ ఉంటారు కానీ, పండాల ఆధ్వర్యంలో నడిచే ఉత్తరదేశ దేవాలయాల కంటే శుచి శుభ్రతల విషయంలో కానీ, నియమిత రూపంలో దర్శనాది సేవలను అందించడంలో కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మన దక్షిణాది దేవాలయాలే చాలా మెరుగు అనిపిస్తుంది. అక్కడ అంతా దైవాధీనం. నీకు సరైన పండా లభిస్తే చక్కగా దర్శనం అవుతుంది. లేకపోతే క్రొత్తవాళ్ళు, అమాయకులు తేలికగా మోసపోయే అవకాశం చాలా ఎక్కువ. బయట టిక్కెట్టు కొనుక్కుని వెళ్ళవలసి వచ్చినా ఒకసారి మూలవిరాట్టు ముందు నిలబడిన తరువాత అక్కడ ప్రశాంతత, భక్తిభావమే నిండిపోవాలి కానీ అక్కడ కూడా డబ్బులకోసం పీడిస్తూ ఉంటే ఇక భగవంతునిపై మనస్సు ఎలా నిలుస్తుంది? అయితే ఇక్కడ కాదనలేని సత్యం ఏమిటంటే శ్రీగురుదేవుల అనుగ్రహం వలన మాకు దొరికిన పండాలందరు అక్కడి క్షేత్రాల గూర్చిన వివరాలన్నీ చక్కగా తెలియజేసి మాకు తృప్తిగా దర్శనం కల్పింపజేశారు.

    అయితే ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా పరమ ప్రశాంతంగా ఉన్న క్షేత్రాలు మాత్రం మాయాపూర్ ఇస్కాన్ దేవాలయం, దక్షిణేశ్వర్ కాళీమాత దేవాలయం, బేలూరు మఠం. అక్కడ అంతా పరిశుభ్రత, చిత్త ప్రశాంతతే కానీ విత్తం గురించిన ఆరాటం లేదు. మీరు గమనిస్తే ఇవన్నీ గురువులతో ముడిపడిన క్షేత్రాలు. అందుకే దేవాలయంలో ఉన్న నిజమైన దేవుని దర్శించడం ఎలాగో, ఆరాధించడం ఎలాగో తెలియాలంటే కచ్చితంగా గురువు అవసరం అనేది. గురువు మార్గదర్శకత్వం లేనిచోట భగవంతుడు కూడా నీ ఉపాధికి తోడ్పడే వ్యాపార వస్తువే అవుతాడు. 

    ఇక మళ్ళీ పూరీ దేవాలయానికి వస్తే ప్రతిరోజూ సాయంకాలం ఎట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా అక్కడి పూజారులు అంత ఎత్తైన ఆలయశిఖరం మీదకు ఎక్కి పతాకాలను మార్చడం చూసి తీరవలసిన అద్భుత దృశ్యం. అలాగే మన కాళీప్రసాద దేవుడిలాగే ఆ స్వామి కూడా నిరతాన్నదానపరుడు. ఇక ఆ జగన్నాధుని దర్శించడానికి ఆ స్వామియొక్క మరో రూపమైన సాక్షిగోపాలుడు బృందావనం నుండి పాదరక్షలు కూడా లేకుండా కాలినడకన తరలిరావడం ఒళ్ళు గగుర్పొడిచే అద్భుత చరితం.

    జాజిపూర్ గిరిజాదేవి ఆలయం సతీదేవి నాభి పడిన శక్తిపీఠం. దీనినే నాభిగయ అని కూడా అంటారు. ఇక్కడి పూజారి శ్రీ మాతాజీ వారిని దర్శించడంతోనే తన ఉపాసన సార్థకం అయినట్లు భావించి ఉప్పొంగిపోయాడు. అమ్మను వదలలేక మేము ఆ ఊరు విడిచిపెట్టేదాకా ఆమె వెంటనే తిరిగాడు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పానవట్టంలో శివలింగం, విష్ణు సాలగ్రామం ఒకే రూపంగా వెలసిన లింగరాజ్ క్షేత్రం కూడా మన శిల్పకారుల అద్భుత నైపుణ్యానికి ప్రతీకయే.

    శ్రీగురుదేవుల నిత్యపూజా మందిరంలో కొలువైఉన్న కలకత్తా కాళీమాతను దర్శించి ఆ తల్లి నాలుకను స్పృశించడం ఒక అనుభూతి అయితే శ్రీగురుదేవులు తమ సాధనకాలంలో ఎన్నో మార్లు, అలాగే ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల అనంతరం క్రమం తప్పకుండా వెళ్ళి దర్శించుకొనే దక్షిణేశ్వర్‌లోని భవతారిణి కాళీమాతను దర్శించడం, అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస వారి నివాస మందిరం, వారు తాము పొందుతున్న బ్రహ్మానందాన్ని అందుకోవడానికి రాబోయే శిష్యుల గురించి ఆరాటపడుతూ ఎదురుచూసిన మెట్ల మార్గాన్ని, శ్రీ వివేకానందులవారికి మంత్రదీక్షను ప్రసాదించిన సోపానాలను స్పృశించడం ఒక దివ్యానుభూతి.

    ఇక శ్రీ పరమహంస వారు తమ అవతార పరిసమాప్తి చేయబోయేముందు కొద్ది మాసాలు నివసించిన కాసిపూర్ మఠంలో పొందిన అలౌకిక అనుభూతి మాటలలో చెప్పలేనిది. స్వామివారు, శారదా మాత, వారి సాంసారిక, సన్యాస శిష్యులు నివసించిన మందిరాలలో నెలకొన్న ప్రశాంతత వర్ణనాతీతం. ఇక ఆ మందిరానికి ముందు భాగంలో 1886 జనవరి 1న శ్రీ పరమహంస వారు "కల్పవృక్ష లీల" నెరపిన వృక్షం ఆ దివ్యలీలకు సాక్షిగా ఇప్పటికీ అక్కడ నిలచి ఉంది. ఆనాడు స్వామివారు 'నేనే భగవంతుడిని' అని నిర్ద్వంద్వంగా ప్రకటించి తమను ఆశ్రయించిన సాంసారిక శిష్యులను అందరినీ హృదయంపై స్పృశించి వారికి అలౌకికమైన సమాధి స్థితిని అనుభవింపజేశారు. ఆ మఠానికి సమీపంలోనే ఉన్న శ్మశానవాటికలో స్వామివారి బృందావనం దర్శనీయం.

    విశ్వవ్యాప్తమైన శ్రీ రామకృష్ణ మఠాలకు మూలస్థానమైన బేలూరు మఠం అత్యంత విశాలమై నయనానందకరంగా ఉంటుంది. అక్కడి ప్రధాన మందిరంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారి దివ్యమంగళ మూర్తికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ స్వామే మనలను ఆప్యాయంగా స్పృశించి తమ ఒడిలోనికి చేర్చుకుంటున్నారా అన్న అనుభూతిని కలిగిస్తూ గంగానది పైనుంచి వీచే సాయంకాలపు మందమారుతం మనను సుతారంగా తాకుతూ ఉంటుంది.

    ఇక వైశాఖ పౌర్ణమి ముందునాటి సాయంకాల ఘడియలలో గంగాసాగర్‌లో పవిత్ర సముద్ర స్నానం అయితే మన భక్తులందరికీ ఎన్నెన్నో విశేష అనుభవాలను మిగిల్చింది. శ్రీ మాతాజీవారు శ్రీగురుపాదుకలను చేత ధరించి సముద్రంలోకి ప్రవేశిస్తే మేమందరం వారు మధ్యలో ఉండగా రెండు వరుసలలో V ఆకారంలో వారి ముందు నిలబడి స్నానానికి సిద్ధమయ్యాము. అయితే జగన్మాతను, శ్రీ గురుపాదుకలను అందుకోవాలనే ఉత్సాహంలో సముద్రుడు పెద్దపెద్ద కెరటాలతో ఎగసిపడుతూ అమ్మను సైతం రెండుసార్లు తూలిపాటుకు గురిచేశాడు. ఇక మూడవ పెద్ద కెరటం మమ్ములను సమీపిస్తూ ఉండగా క్షణంలో నాలుగవవంతు కాలం అమ్మ ఆ సముద్రుని వైపు తీక్షణంగా చూసిన చూపు ఎన్నటికీ మరువలేనిది. అంతే పులిలా వచ్చిన కెరటం పిల్లిలా మారిపోయి చిన్న అల అయి అమ్మ పాదాలకు నమస్కరించి వెనుదిరిగింది. మా అందరి స్నానాలు పూర్తి అయి, శ్రీ సద్గురు పాదుకలకు అభిషేకము, అర్చన పూర్తి అయ్యే వరకు మళ్ళీ ఒక్క పెద్ద కెరటం వస్తే ఒట్టు!

    ఇక దేశవిదేశాలలో శ్రీకృష్ణ చైతన్యాన్ని విస్తరింపజేస్తున్న మాయాపూర్ లోని ఇస్కాన్ ప్రధానకేంద్రంలో దర్శనం ఒక అద్భుత అనుభూతి. ఎన్ని వేలమంది భక్తులు ఉన్నా అక్కడ తాండవించే నిశ్శబ్దం, అంతమంది చక్కగా వరుసక్రమంలో దర్శనానికి వచ్చే క్రమశిక్షణ ముచ్చటగొలుపుతాయి. ఎటువంటి రోగాలనైనా నయం చేసే వైద్యనాథ్ జ్యోతిర్లింగం, తారకేశ్వర్, సతీదేవి మూడవకన్ను పడిన మా తారా క్షేత్రం మొదలైన చోట్ల రద్దీ ఎక్కువగా ఉన్నా దేనికదే చక్కని దర్శన అనుభూతిని కలిగించింది. శృంఖలాదేవిగా భావించబడుతున్న జగత్ గౌరీ మాత ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరినీ సర్పబాధల నుండి రక్షిస్తూ ఉంటుంది.

    ఇక అత్యంత దుర్లభమైన కామాఖ్య అమ్మవారి దర్శనం శ్రీగురుదేవుల కృప వలన మా అందరికీ చక్కగా లభించింది. మనందరికీ మాతృస్థానమైన జగన్మాత యోని పడిన శక్తిపీఠం ఇది. అక్కడి అంతరాలయంలో పూజారి సంకల్పం చెబుతూ ఇక్కడ అమ్మ యోనిని స్పృశించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు అని మంత్రాలు చదువుతూ ఉంటే "ఎన్ని జన్మములు ఎత్తితినో తల్లి, ఇంకెన్ని జన్మములు ఎత్తెదనో మళ్ళి, కన్నతల్లి మరి జన్మలనీయకు, కాత్యాయని నీ సన్నిధిలో చేర్చు" అనే కీర్తన మదిలో మెరిసింది. అంతలోనే "మనం జన్మించేది ఆ తల్లి గర్భంలో నుండి అయినప్పుడు, ఆ జగన్మాత బిడ్డగా ఎన్ని జన్మలు ఎత్తితే మటుకు తప్పేముంది?" అని కూడా అనిపించింది.

    శ్రీ గురుదేవులు పర్యటించిన ఈ దివ్య క్షేత్రాలు అన్నిటితో పాటు వారి పాదధూళికి నోచుకున్న షిల్లాంగ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి ప్రకృతి సౌందర్యం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనశాల చూసి తీరవలసిందే. ఇక చిరపుంజిలోని నోహ్కలికై జలపాతం అయితే ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. హిమాలయాలకు పాదపీఠమై, విరబోసుకున్న పరమేశ్వరుని జటాజూటం అని అర్థం కలిగిన శివాలిక్ కొండలలో నుండి క్రిందికి పడుతున్న దేశంలోనే ఎత్తైన జలపాతం ఆనాటి గంగావతరణాన్ని తలపింపజేసింది. అయితే ఆ జలపాతం వెనుక ఉన్న విషాదగాధ మాత్సర్యం ఎంతటి నీచమైనదో, శ్రీగురుదేవులు దానిని మళ్ళీ "ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం" అని నాలుగుగా విభజించి ఎందుకు మాటిమాటికీ ప్రస్తావించేవారో అర్థమయ్యేలా చేసింది. కా లికాయి అనే స్త్రీ తన భర్త మరణించడంతో ద్వితీయ వివాహం చేసుకొంది. అయితే ఆ రెండవ భర్త తన భార్య తనకంటే తన సంతానమైన నెలల పాపను ఎక్కువగా ప్రేమిస్తోందనే అసూయతో ఆ పసికందును వధించి, వండి ఆ తల్లికి భోజనంగా వడ్డించాడు. తాను భుజించినది తన కన్నబిడ్డనే అని తెలుసుకొన్న ఆ తల్లి తల్లడిల్లిపోయి ఈ జలపాతంలోకి దూకి ఆత్మార్పణ చేసుకొంది.

    ఎన్నికల సమయంలో, ఫలితాల సమయంలో హింసకు ప్రసిద్ధిగాంచిన బెంగాల్ ప్రాంతంలో అదే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఈ యాత్ర జరిగిందంటే అది కేవలం శ్రీ గురుదేవుల పరమనుగ్రహం, శ్రీ మాతాజీవారు ఆదేశించి భక్తులందరితో జరిపించిన శ్రీ శివకవచ, శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణల మహాత్మ్యం అనే చెప్పాలి. భక్తజనులందరూ దిగ్విజయంగా యాత్ర ముగించుకొని, రైలు ప్రయాణంలో శ్రీగురుదేవులతో తమకు కలిగిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకొంటూ, శ్రీ కాళీవనాశ్రమం చేరుకొని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, శ్రీ మహాకాళికా పరమేశ్వరీ మాతకు కుంకుమార్చనలు, హోమలు, శ్రీ సద్గురు పాదపూజతో యాత్రాఫలాన్ని శ్రీ గురుదేవుల శ్రీచరణాల సన్నిధిలో అర్పించి ధన్యులయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి