19, మార్చి 2026, గురువారం

పరాభవ



ఉగాది వచ్చేస్తోంది. తొందరగా ఒక పంచాంగం కొనుక్కొని నా రాశిఫలాలు చూసుకోవాలి. 

బాబూ! ఒక పంచాంగం ఇవ్వమ్మా!

    అయ్యో! సరిపోయింది! అసలే నా రాశికి ప్రతి సంవత్సరం రాజయోగం తక్కువ, అవమానం ఎక్కువ అని ఏడుస్తూ ఉంటే ఈసారి ఏకంగా సంవత్సరం పేరే 'పరాభవ'నా? భగవంతుడా! ఇక నా జీవితం తెల్లారినట్లే. 

    అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఒకసారి ఈ పేరుని విడదీసి అసలు అర్థం ఏమిటో విచారిస్తాను. భవము అంటే పుట్టుక. మరి పరా అంటే? మనకన్నా వేరుగా ఉన్నది, గొప్పది అని అర్థం వస్తుంది కదా! భగవద్గీతలో స్వామి 'ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యః పరం మనః| మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || 3-42||' అని చెప్పారు కదా! అంటే ఇంద్రియాలు గొప్పవి. వాటికంటే మనస్సు గొప్పది. దానికంటే బుద్ధి గొప్పది. అయితే ఆ బుద్ధి కంటే గొప్పదై వీటన్నింటినీ ప్రకాశింపజేసేది ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువే 'పరా'. దానినుంచి ఉద్భవించిన మనం పరాభవులం. ఆత్మనుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి, ఓషధులు, అన్నము, పురుషుడు ఇలా ఒక క్రమంలో ఉద్భవించాయని ఉపనిషద్వాక్యం కదా!

    అలాగే మన వాక్కును కూడా నాలుగు రకాలుగా చెప్పారు కదా! పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ - మనలో నిరంతరం కలిగే సంకల్పాలకు బీజరూపం పరా. అంటే సంకల్పం కంటే ముందు స్థితి. దీనికి భాష, రూపము ఉండవు. నీలో సంకల్పం కలగడానికి ఆరు నెలల ముందే నాకు తెలుస్తుంది అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు కదా! ఆ మునుపటి స్థితే పరా. ఆ తరువాత అది మెల్లగా ఒక రూపాన్ని సంతరించుకొని ఆలోచనగా పరివర్తన చెందుతుంది. అదే పశ్యంతి. ఆ ఆలోచన ఒక భాషను ఆధారం చేసుకొని వృద్ధి పొంది పదాలుగా, వాక్యాలుగా విస్తృతం అవుతుంది. అయినా ఇంకా మనస్సులోనే ఉంటుంది. అది మధ్యమా వాక్కు. ఎప్పుడైతే అది మన ముఖస్తుగా వెలువడి బయటి వారికి వినిపించే రూపాన్ని పొందుతుందో అప్పుడది వైఖరీ అని పిలువబడుతుంది.

    మనం రోజూ చదివే నారాయణోపనిషత్తులో చూస్తే నారాయణుని బీజరూపమైన సంకల్పం నుండి ముందుగా ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, బ్రహ్మాది దేవతలు, ఈ సకల చరాచర సృష్టి ఉద్భవించిందని చెబుతోంది కదా! అంటే మనందరము ఆ పరవస్తువైన నారాయణుని నుంచే ఉద్భవించాము కదా! అందుకే శ్రీ గురుదేవులు ఎప్పుడూ 'పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ' అనే శ్లోకాన్ని ఇష్టపడేవారు కారు. "నువ్వు పాప సంభవుడవు కావు. ఆత్మ సంభవుడవు. అది గుర్తించక నేను పాపిని అనుకొని బంధానికి లోనవుతున్నావు. నువ్వు మేకల మధ్యలో పెరిగిన సింహానివే కానీ మేకవు కావు. నీ నిజస్వరూపాన్ని నువ్వు దర్శిస్తే నువ్వు ఎప్పుడూ ముక్తపురుషుడవే" అని చెప్పేవారు. కాబట్టి మనమే పరాభవులం.

    ఇంకొక రకంగా ఆలోచిస్తే పరులనుంచి మనకు కలిగేది పరాభవం. ఎవరో ఏదో అన్నారని, లేదా అంటారని నిత్యం మనని మనం మార్చుకుంటూ, వాళ్ళ మెప్పు పొందాలని తహతహలాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనస్సు బైటినుంచి వచ్చే తన్మాత్రలకు ప్రతిస్పందించడం మానేసి పరమైన ఆత్మలో లీనమై ఉంటుందో అప్పుడు మనకు పరాభవమే ఉండదు కదా! స్థితప్రజ్ఞ లక్షణం అదే కదా! తనను తాను గుర్తించి సదా స్వస్వరూప స్థితిలో ఓలలాడే మహాత్ముని ఎవరు పరాభవించగలరు? అటువంటి వ్యక్తికి రాజపూజ్యం అవమానం మధ్య తేడా ఏమి తెలుస్తుంది? అవి వారిని చలింపజేయలేవు కదా!

    కాబట్టి ఈ అల్పమైన రాశిఫలాలను వదిలేసి అత్యుత్తమమైన మన పరాస్థితిని తెలుసుకోమని ఈ పరాభవ నామ సంవత్సరం మనకు సందేశం ఇస్తోంది. చూశావా! నిరాశా నిస్పృహల నుంచి కూడా శ్రీ గురుదేవులు ఎటువంటి విచారణను కలిగించి దివ్య సందేశాన్ని అందించారో. దేశకాలాలు ఏవైనా నిరంతరం ఇటువంటి సద్విచారణ మాలో నిలబడాలని ఆశీర్వదించండి గురుదేవా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి