5, ఏప్రిల్ 2026, ఆదివారం
అర్థమనర్థం
19, మార్చి 2026, గురువారం
పరాభవ
ఉగాది వచ్చేస్తోంది. తొందరగా ఒక పంచాంగం కొనుక్కొని నా రాశిఫలాలు చూసుకోవాలి.
బాబూ! ఒక పంచాంగం ఇవ్వమ్మా!
అయ్యో! సరిపోయింది! అసలే నా రాశికి ప్రతి సంవత్సరం రాజయోగం తక్కువ, అవమానం ఎక్కువ అని ఏడుస్తూ ఉంటే ఈసారి ఏకంగా సంవత్సరం పేరే 'పరాభవ'నా? భగవంతుడా! ఇక నా జీవితం తెల్లారినట్లే.
అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఒకసారి ఈ పేరుని విడదీసి అసలు అర్థం ఏమిటో విచారిస్తాను. భవము అంటే పుట్టుక. మరి పరా అంటే? మనకన్నా వేరుగా ఉన్నది, గొప్పది అని అర్థం వస్తుంది కదా! భగవద్గీతలో స్వామి 'ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యః పరం మనః| మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః || 3-42||' అని చెప్పారు కదా! అంటే ఇంద్రియాలు గొప్పవి. వాటికంటే మనస్సు గొప్పది. దానికంటే బుద్ధి గొప్పది. అయితే ఆ బుద్ధి కంటే గొప్పదై వీటన్నింటినీ ప్రకాశింపజేసేది ఆత్మవస్తువు. ఆ ఆత్మవస్తువే 'పరా'. దానినుంచి ఉద్భవించిన మనం పరాభవులం. ఆత్మనుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి, ఓషధులు, అన్నము, పురుషుడు ఇలా ఒక క్రమంలో ఉద్భవించాయని ఉపనిషద్వాక్యం కదా!
అలాగే మన వాక్కును కూడా నాలుగు రకాలుగా చెప్పారు కదా! పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ - మనలో నిరంతరం కలిగే సంకల్పాలకు బీజరూపం పరా. అంటే సంకల్పం కంటే ముందు స్థితి. దీనికి భాష, రూపము ఉండవు. నీలో సంకల్పం కలగడానికి ఆరు నెలల ముందే నాకు తెలుస్తుంది అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు కదా! ఆ మునుపటి స్థితే పరా. ఆ తరువాత అది మెల్లగా ఒక రూపాన్ని సంతరించుకొని ఆలోచనగా పరివర్తన చెందుతుంది. అదే పశ్యంతి. ఆ ఆలోచన ఒక భాషను ఆధారం చేసుకొని వృద్ధి పొంది పదాలుగా, వాక్యాలుగా విస్తృతం అవుతుంది. అయినా ఇంకా మనస్సులోనే ఉంటుంది. అది మధ్యమా వాక్కు. ఎప్పుడైతే అది మన ముఖస్తుగా వెలువడి బయటి వారికి వినిపించే రూపాన్ని పొందుతుందో అప్పుడది వైఖరీ అని పిలువబడుతుంది.
మనం రోజూ చదివే నారాయణోపనిషత్తులో చూస్తే నారాయణుని బీజరూపమైన సంకల్పం నుండి ముందుగా ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, బ్రహ్మాది దేవతలు, ఈ సకల చరాచర సృష్టి ఉద్భవించిందని చెబుతోంది కదా! అంటే మనందరము ఆ పరవస్తువైన నారాయణుని నుంచే ఉద్భవించాము కదా! అందుకే శ్రీ గురుదేవులు ఎప్పుడూ 'పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ' అనే శ్లోకాన్ని ఇష్టపడేవారు కారు. "నువ్వు పాప సంభవుడవు కావు. ఆత్మ సంభవుడవు. అది గుర్తించక నేను పాపిని అనుకొని బంధానికి లోనవుతున్నావు. నువ్వు మేకల మధ్యలో పెరిగిన సింహానివే కానీ మేకవు కావు. నీ నిజస్వరూపాన్ని నువ్వు దర్శిస్తే నువ్వు ఎప్పుడూ ముక్తపురుషుడవే" అని చెప్పేవారు. కాబట్టి మనమే పరాభవులం.
ఇంకొక రకంగా ఆలోచిస్తే పరులనుంచి మనకు కలిగేది పరాభవం. ఎవరో ఏదో అన్నారని, లేదా అంటారని నిత్యం మనని మనం మార్చుకుంటూ, వాళ్ళ మెప్పు పొందాలని తహతహలాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన మనస్సు బైటినుంచి వచ్చే తన్మాత్రలకు ప్రతిస్పందించడం మానేసి పరమైన ఆత్మలో లీనమై ఉంటుందో అప్పుడు మనకు పరాభవమే ఉండదు కదా! స్థితప్రజ్ఞ లక్షణం అదే కదా! తనను తాను గుర్తించి సదా స్వస్వరూప స్థితిలో ఓలలాడే మహాత్ముని ఎవరు పరాభవించగలరు? అటువంటి వ్యక్తికి రాజపూజ్యం అవమానం మధ్య తేడా ఏమి తెలుస్తుంది? అవి వారిని చలింపజేయలేవు కదా!
కాబట్టి ఈ అల్పమైన రాశిఫలాలను వదిలేసి అత్యుత్తమమైన మన పరాస్థితిని తెలుసుకోమని ఈ పరాభవ నామ సంవత్సరం మనకు సందేశం ఇస్తోంది. చూశావా! నిరాశా నిస్పృహల నుంచి కూడా శ్రీ గురుదేవులు ఎటువంటి విచారణను కలిగించి దివ్య సందేశాన్ని అందించారో. దేశకాలాలు ఏవైనా నిరంతరం ఇటువంటి సద్విచారణ మాలో నిలబడాలని ఆశీర్వదించండి గురుదేవా!
15, ఫిబ్రవరి 2026, ఆదివారం
ఓం పూష దంతభిదే నమః
శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఓం పూష దంతభిదే నమః. పూష అనేది సూర్యభగవానుని నామం. లోకానికంతటికీ పోషణనిచ్చేది సూర్యుడే కదా. మరి అటువంటి సూర్యుడికే పోషణకు అవసరమైన దంతాలు లేకుండా పరమేశ్వరుడు ఎందుకు వాటిని భేదనం చేయవలసి వచ్చింది? దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకొన్నప్పుడు పరమేశ్వరుడు ఉగ్రరూపంలో వీరభద్రుడై ఆ యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించిన చరిత్ర మనందరికీ తెలుసు కదా. ఆ సందర్భంలోనే అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా వీరభద్రుడు శిక్షిస్తాడు. తమ కళ్ళముందు అధర్మం, అన్యాయం జరుగుతూ ఉంటే 'పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు' అని మోహమాటానికి పోయినందుకు వారు కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆ శిక్షలో భాగంగానే సూర్యుడికి పళ్ళు ఊడగొట్టబడ్డాయి. అందుకే రథసప్తమి నాడు, లేదా ఇతర మాఘ అదివారాలలో కూడా సూర్యునికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం వండితే అందులో గట్టి పదార్థాలు (కనీసం జీడిపప్పులు కూడా) లేకుండా వండుతారు.
కర్తా కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారః సమభాగినః అని శాస్త్రం చెబుతోంది. ఒక మంచిపని కానీ చెడ్డపని కానీ జరుగుతున్నప్పుడు ఆ పని చేసినవాడు, చేయించినవాడు, దానికి ప్రేరణ కలిగించినవాడు, చూసి ఆనందించిన వాడు ఈ నలుగురూ ఆ పనియొక్క ఫలితాన్ని సమానంగా అనుభవిస్తారు. అందుకే ఏదైనా పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు మనం ఆ కార్యానికి ఏవిధంగానూ సహకరించలేక పోయినా కనీసం చూసి ఆనందించినా ఆ పుణ్యఫలం మన ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఏదైనా పాపకార్యం జరుగుతున్నప్పుడు దానిని ఆపే సామర్థ్యం మనలో లేనప్పుడు ఆ సామర్థ్యం ఉన్నవారిని పిలవాలి, లేదా కనీసం అక్కడినుంచి దూరంగా అయినా వెళ్ళిపోవాలి. అలా కాకుండా అక్కడే ఉండి చూస్తూ ఉంటే ఆ శిక్షలో మనం కూడా భాగస్వాములం అవుతాం.
సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁబారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్
15, జనవరి 2026, గురువారం
మకర సంక్రాంతి
నరేష్: సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా!
సురేష్: నీకు కూడా నరేష్! అసలు ప్రతినెలా సంక్రాంతి వస్తుంది తెలుసా? ఇవాళ వచ్చింది, మనం ప్రముఖంగా జరుపుకునేది మకర సంక్రాంతి.
న: అసలు సంక్రాంతి అంటే ఏంటన్నా?
సు: సూర్యుడు కానీ, నవగ్రహాలలో మరేదైనా గ్రహం కానీ ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని సంక్రాంతి అని, క్రాంతి అని, కార్తె అని అంటారు. ఇందులో సూర్యుడు మనకు అతి ముఖ్యుడు కదా! ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకే మనం ఈ మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటాం. అసలు మన పురాణాలలో మకరం ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నరేష్.
న: నాకు గుర్తుంది అన్నా! గజేంద్ర మోక్షంలో ఏనుగును పట్టుకొన్నది మొసలే కదా.
సు: అవును. నిజానికి మనం గజేంద్ర మోక్షం అంటాం కానీ, విష్ణుమూర్తి గజేంద్రునికి కేవలం మొసలి బారినుండి విముక్తి కలిగించాడు కానీ, ఆ మొసలికి మాత్రం ఆయన చేతిలో, సుదర్శన చక్రంతో మరణించడంతో ఏకంగా ఈ సంసారం నుండే మోక్షం లభించింది కదా!
న: అవును, ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. విష్ణుమూర్తికి ఏనుగు కన్నా మొసలి అంటేనే పక్షపాతం అని. ఎంతైనా ఏనుగు జరాయుజం(తల్లి గర్భంలో ఉండి, మావి నుండి పుట్టినది), మొసలి అండజం(గుడ్డు నుండి పుట్టినది) కదా!
సు: అయితే!?
న: అదే అన్నా! ఆయన అండజ(గరుడ) వాహనుడు, అండజ(ఆదిశేష) శయనుడు కదా! పైగా మకరకుండలధారి కూడానూ!
సు: అదేం లేదు. ఆయనకు సర్వ జీవులు సమానమే. సమోహం సర్వ భూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః - నేను సర్వ భూతములయందు సమదృష్టి కలిగి ఉంటాను. నేను ద్వేషించే వారుకాని, ప్రేమించే వారుకాని ప్రత్యేకంగా ఎవరూ లేరు, అని భగవద్గీతలో ఆ స్వామే చెప్పారు కదా!
న: అవుననుకో కానీ మళ్ళీ ఆయనే భక్తియోగంలో యో మద్భక్త స్స మే ప్రియః అని రెండుసార్లు, ఇంకా స చ మే ప్రియః, భక్తిమాన్యః స మే ప్రియః, భక్తిమాన్మే ప్రియో నరః, భక్తాస్తేఽతీవ మే ప్రియాః అని నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని ఇన్నిసార్లు చెప్పాడు కదా!
సు: అదే ఇక్కడ కిటుకు. గాలి మన చుట్టూ అంతటా వ్యాపించి ఉన్నా ఫ్యాను కిందనే మనకు బాగా అనుభవంలోకి వచ్చినట్లు, పరమాత్మ అంతటా సమానంగానే ప్రకాశిస్తున్నా భక్తానాం హృదయాంబోజే విశేషేణ ప్రకాశతే - భక్తుల హృదయ కమలాలలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనను పట్టుకోవాలంటే ముందు భాగవతులను పట్టుకోవాలి. అక్కడ ఆ మొసలి చేసినది అదే. అందుకే దానికి మోక్షం లభించింది.
న: అదేంటి అది భాగవతుడిని హింసించింది కదా?
సు: ఒక్కసారి ఆలోచించు. నారాయణమూర్తి వచ్చేముందు ఆ మొసలి, ఏనుగు వెయ్యి సంవత్సరాలు పోరాడాయి. ఏనుగుకు అయితే అది జీవన్మరణ సమస్య కాబట్టి విడవకుండా పోరాడింది. మరి మొసలికి ఏమవసరం? ఈ ఏనుగు కాకపోతే ఇంకో పీనుగు, తన కడుపు నింపుకోవడానికి ఏదో ఒక జంతువు దొరక్కపోదు. ఈ ఏనుగుకు ఉన్నట్లుగానే ఆ మొసలికి కూడా భార్య, పిల్లలు ఉండి ఉంటారు కదా! వాళ్ళందరూ ఈ వెయ్యి సంవత్సరాలో ఎన్నోసార్లు వచ్చి "ఎందుకండీ మీకు ఇంత మొండిపట్టు? నిద్రాహారాలు మాని ఇన్నేళ్ళనుంచి ఆ ఏనుగు పాదాన్ని పట్టుకొని ఉండకపోతే వదిలేసి ఇంకొక వేట ఏదైనా చూసుకోవచ్చు కదా!" అని ఎన్నిసార్లు నచ్చచెప్పి ఉంటారు? అయినా ఆ మొసలి తన పట్టుదలను వదిలిపెట్టలేదు. "బలమైన పట్టుదలే వైరాగ్యం" అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎన్నోసార్లు చెప్పారు కదా! భక్తి, జ్ఞానము కలగాలంటే ముందు మనకు ఈ వైరాగ్యం ఉండాలి. మనందరినీ అటువంటి మొసలిపట్టు లాంటి అంతటి బలమైన వైరాగ్యాన్ని పెంపొందించుకోమని ఈ మకర సంక్రాంతి సూచిస్తోంది.
న: నిజమే అన్నా! మరి విష్ణుమూర్తి మకర కుండలాలు ధరించడంలో రహస్యం ఏమిటో కాస్త చెప్పరాదూ.
సు: విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అది మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఆ రెండింటినీ గుర్తుచేస్తూ ఆయన శ్రవణేంద్రియాలకు మకర కుండలాలు ధరిస్తాడని పైపై అర్థం చెబుతారు. కానీ, సన్న్యస్య శ్రవణం కుర్యాత్ అని ఋషి వాక్యం. శ్రవణం చేసేటప్పుడు ఇతర విషయాలన్నింటినీ సన్యసించి శ్రవణం చెయ్యాలి. అటువంటి వైరాగ్యంతో, పట్టుదలతో శ్రవణం చేసినప్పుడే అది మళ్ళీ మననానికి వచ్చి నిదిధ్యాసకు నిన్ను తీసుకెళ్తుంది కానీ సత్సంగంలో కూర్చున్నంత సేపు వచ్చిపోయే వాళ్ళను చూస్తూ, గోళ్ళు కొరుక్కుంటూ, మరేదో చేస్తూ వింటే అది నీ చెవికెక్కదు, మనసుకు అసలే పట్టదు. ఈ విషయాన్ని మనకు తెలియజెప్పడానికే నారాయణుడు తన చెవులకు మకర కుండలాలను ధరిస్తాడు.
న: ధన్యవాదాలు అన్నా! భక్తి జ్ఞానాలు కలగాలన్నా, విన్న ఆధ్యాత్మిక విషయాలు వంటబట్టాలన్నా మకరం లాంటి పట్టుదల, వైరాగ్యం ఎంత అవసరమో చక్కగా వివరించావు. నీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు! ఈ సందర్భంగా ఇటువంటి వైరాగ్యాన్ని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిద్దాం.