7, మే 2024, మంగళవారం

హస్తవాసి

    అశ్వినీ కుమార్ మంచి హస్తవాసి ఉన్న వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు. 30 ఏళ్ళ తన వైద్యవృత్తిలో అనేక వేలమందికి వైద్యం చేసి ఎన్నో జబ్బులను నయం చేశాడు. పెద్ద పెద్ద స్పెషలిస్టులు సైతం నయం చేయలేని రోగాలు ఆయన చెయ్యి పడితే చాలు నయమైపోతాయని ప్రతీతి. కుమార్ ఎంత గొప్ప వైద్యుడో అంతకు మించిన శివభక్తుడు. ప్రతిరోజూ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, తలారా స్నానం చేసి, మహన్యాసం, నమక చమకాలతో రుద్రాభిషేకం చేస్తే కానీ బయటకు వెళ్ళేవాడు కాదు.


    ఆయన హస్తవాసి గురించి ఆయన సమక్షంలోనే ఊరి వారందరూ గొప్పగా చెప్పుకుంటుంటే, ముందు కొన్నాళ్ళు పట్టించుకోలేదు కానీ ఆ తరువాత మెల్లగా తన గురించి తాను గర్వపడటంతో మొదలై, అది చివరికి అహంకారానికి దారితీసింది. 'ఈ ప్రాంతంలోనే నా అంత గొప్ప వైద్యుడు లేడ'ని పొంగిపోసాగాడు. అయితే ఈ మధ్యన ఎందుకో అతని వైద్యం సరిగా పనిచేయటం మానేసిందని, హస్తవాసి తగ్గిందని ఊరిలో వారు మెల్లగా చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అందుకు తగినట్లుగానే ఒకరిద్దరు రోగులు ఎన్నిసార్లు ఆయన దగ్గర మందులు పుచ్చుకొన్నా తమ రోగం తగ్గడంలేదని ఆయన దగ్గరకు రావడం తగ్గించుకున్నారు.

    ఇలా ఉండగా ఒకరోజు ఆ ప్రాంతపు ఎంఎల్ఏ ఏడుకొండలు గారికి అంతుబట్టని రోగం దాపురించింది. ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంతమంది వైద్యులకు చూపించినా ఉపయోగం లేకపోయింది. ఎవరి ద్వారానో అశ్వినీ కుమార్ గారి హస్తవాసి గురించి విన్న ఏడుకొండలు ఆయన దగ్గరకు వచ్చి 'ఇక మీరే దిక్క'ని మొరబెట్టుకున్నాడు. ఇన్నాళ్ళూ సామాన్య జనులకు ఎందరికో రోగనివారణ చేసిన అశ్వినీ కుమార్ ఈ రోజు ఒక పెద్దమనిషి తన దగ్గరకు వచ్చి శరణు కోరడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు. ఎలాగైనా ఇతని రోగం తగ్గించాలని తనకు తెలిసిన మందులన్నీ వాడాడు.

    రాత్రి ప్రొద్దు పోయేదాకా ఎన్నెన్నో పుస్తకాలు తిరగేసి, వాటిలో చెప్పిన మందులను తయారుచేసి ఇచ్చేవాడు. ఇంత చేసినా ఏడుకొండలు పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదు. పైగా రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఎంత ఆలోచించినా తన వైద్యంలో ఏమి లోపం ఉందో, ఇంకేమి చేస్తే ఎంఎల్ఏ జబ్బు నయం అవుతుందో అతనికి అర్థం కాలేదు. ఒకరోజు ప్రాతఃకాలంలో తన ఇంటి అరుగుమీద దిగాలుగా కూర్చున్న అశ్వినీ కుమార్ అటుగా వెళ్తున్న ఒక సాధువును చూశాడు. ఎందుకో తనకే తెలియకుండా తనకి ఆ సాధువుపై గౌరవభావం కలిగింది. తనను ఈ పరిస్థితి నుంచి ఈ సాధువే గట్టెక్కించగలడనే చిన్న ఆశ కలిగింది.

    వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సాధువు కాళ్ళపై పడ్డాడు. ఆ సాధువు అశ్వినీ కుమార్‌ను లేవదీసి, "ఏం నాయనా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు?" అని అడిగాడు. "స్వామీ! నేను ఎంతో గొప్ప హస్తవాసిగల వైద్యునిగా పేరు తెచ్చుకున్నాను. కానీ ముప్పై ఏళ్ళుగా తిరుగులేకుండా పనిచేసిన నా మందులు ఈ మధ్యన సరిగ్గా పనిచేయడం లేదు. ఇప్పుడైతే ఎక్కడెక్కడి వైద్యమూ పనిచేయక నేనే దిక్కని వచ్చిన ఎంఎల్ఏగారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. నేను ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం కనబడటం లేదు. మీరే నాకు దారి చూపించాలి" అని వేడుకున్నాడు.

    దానికా సాధువు చిరునవ్వు నవ్వుకొని "చూడు నాయనా! ఒక్కొక్కప్పుడు మనిషి ఎంతగా ప్రయత్నించినా విధి అనుకూలించకపోతే ఆ కార్యం నెరవేరదు. అయితే ఆ విధిని కూడా పురుషప్రయత్నంతో అధిగమించవచ్చు. కానీ ఆ ప్రయత్నం అహంకారాన్ని, స్వార్థాన్ని విడిచి, భగవదనుగ్రహాన్ని కోరుతూ, ఆయనపై భారం వేసి చెయ్యాలి. అప్పుడది తప్పక ఫలిస్తుంది. ఇన్నాళ్ళూ నువ్వు నయం చేసిన రోగాలన్నీ నీ ప్రతిభ అని అహంకరించావు. ఇప్పుడు ఈ ఎంఎల్ఏ రోగాన్ని నయం చేసి మంచిపేరు తెచ్చుకోవాలనే స్వార్థంతో ప్రయత్నిస్తున్నావు. నీ హస్తవాసికి అసలు కారణం నువ్వు రోజూ చేసే శివపూజ.

    'అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః| అయం మే విశ్వ భేషజోయం శివాభిమర్శనః|| - పరమేశ్వరుని తాకిన ఈ నా చెయ్యే భగవంతుడు. ఇది అత్యంత ప్రకాశవంతమైనది. శివుని తాకడం చేత ఈ నా చెయ్యి విశ్వానికంతటికీ వైద్యం చేయగల సామర్థ్యాన్ని పొందింది' అని నువ్వు రోజూ చదివే రుద్ర నమకం చెబుతోంది కదా! అలా ఎందరో మహాత్ములు, ఏ వైద్యమూ నేర్చుకోకపోయినా, తమ పూజాఫలంగా ఎందరికో రోగ నివారణ చేసే శక్తిని పొందారు కదా! ఆ విషయాన్ని గ్రహించక అహంకరించడం వలననే ఈరోజు నీకీ దుస్థితి సంభవించింది. ఇకనైనా అహంకారాన్ని విడిచిపెట్టి ఆ పరమేశ్వరుని భక్తితో పూజించి, 'అంతా నీ దయే స్వామీ, నాదేమీ లేదు. నీ బిడ్డను ఎలా రక్షించుకుంటావో నీ ఇష్టం. నా ఈ చేతితో ఏమి చేయించుకున్నా అది నీ శక్తే' అని ప్రార్థించి అప్పుడు మందు ఇవ్వు. తప్పక నయమవుతుంది" అని దీవించి ముందుకు సాగిపోయాడు.

    అశ్వినీ కుమార్ ఆ సాధువును తన కళ్ళు తెరిపించడానికి వచ్చిన పరమేశ్వరునిగానే భావించి భక్తితో శివుని పూజించి ఆ ఎంఎల్ఏ జబ్బుని నయం చేయడమే కాక, మళ్ళీ పూర్వం లాగానే తన హస్తవాసిని తిరిగి పొంది, నిరహంకారియై, నిస్వార్థంగా, నిష్కామ కర్మగా తన వృత్తి ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు.