అమ్మ "మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా" తన చిరు దరహాస చంద్రికలతో పతిదేవుడైన కామేశ్వరుని మనస్సును ముంచివేస్తుంది. అసలు అలా ముంచివేసే ముందు అమ్మ ఎందుకు చిరునవ్వులు చిందిస్తోందో, ఆ చిరునవ్వుకు కారణమైన ఆ కామేశ్వరుని మనస్సులోని ఆలోచనలు ఏమిటో ఊహించడానికి ప్రయత్నిద్దాం.
బహుశా తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి శాపానికి గురియైన చంద్రుని చేరదీసి శిరస్సున ధరించానని కోపగించదు కదా! అనుకున్నాడేమో ఆ చంద్రశేఖరుడు! మీకంటే ముందే నేను అష్టమీ చంద్రుని నా నుదుటిన ధరించాను(అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థల శోభితా) స్వామీ! అలాగే సూర్యచంద్రులు ఇద్దరినీ నా చెవి కమ్మలుగా కూడా ధరించాను(తాటంక యుగళీభూత తపనోడుప మండలా) అని అమ్మ చిరునవ్వు నవ్వితే అయ్యవారి మనస్సు హమ్మయ్య! అని సమాధాన పడిందేమో!
గంగను సవతిగా తెచ్చి నెత్తిన పెట్టుకున్నానని అలగదు కదా! అని ఆ గంగాధరుడు బిడియ పడుతుంటే బ్రహ్మాండ వ్యాప్తమైన మీ దేహంలో సగం నేనే అయినప్పుడు ఎక్కడో మీ జటాజూటంలో ఒక చిన్న పాయలో ఇమిడిపోయిన గంగ నాకు పోటీయా? అని అమ్మ చిరునవ్వు నవ్వితే స్వామి మనసు కుదుట పడిందేమో!
తనని, నన్ను కలపడానికి ప్రయత్నిస్తున్న మన్మధుని భస్మం చేశానని కినుక వహించదు కదా! పైగా ఆతడు తనకి మేనల్లుడు కూడానూ, అని భయపడుతున్న ముక్కంటిని స్వస్థపరుస్తూ "వాడేదో వెర్రివాడు. తపస్సు ద్వారా ఏకమవ్వవలసిన మనలని వాడికి తెలిసిన కామం ద్వారా ఏకం చేయాలని చూసి పాపం మీ చూపులో భస్మం అయిపోయాడు. ఎవరో మనను కలిపేది ఏమిటి? మీరెప్పుడో నా వారు, ఎందుకంటే నేను స్వాధీన వల్లభను. అయినా ఏం భయం లేదులే. వాడి పాలిట నేను సంజీవనినై మళ్ళీ బ్రతికించాను(హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషాధిః)" అని ఊరడింపుగా నవ్విందేమో!
తాను ముచ్చటపడి ఎంతో అందంగా తయారుచేసుకున్న కుమారుని శిరస్సును నా కోపంతో కత్తిరించి ఏనుగు తల పెట్టానని బాధపడుతోందేమో! అని విచారిస్తున్న ఆ తండ్రికి స్వాంతనగా తల ఎలా ఉన్నా ప్రతి తల్లికీ తన కన్నకొడుకే లోకంలోకెల్లా అందగాడు లెండి(అగజానన పద్మార్కం) అని అనునయింపుగా నవ్విందేమో!
ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకొని ఒక మగవాడు ఆడవేషం ధరిస్తే చూసి మోహంలో పడిపోయానని తనను వెక్కిరిస్తుందేమో అని సిగ్గుపడుతున్న విష్ణుప్రియుని సమాధాన పరుస్తూ ఆ అనంగ జనకుని లావణ్యం అంతా నా అపాంగ విలోకనం నుండి వచ్చిందే లెండి, మీరు మాత్రం మోహంలో పడిపోక ఏం చేస్తారు అని నవ్విందేమో!
తాను సర్వాభరణ భూషితయై సాయంకాలం వేళ నాకోసం ఎదురు చూస్తూ ఉంటే నేను రోజంతా శ్మశానంలో తిరిగి ఒంటినిండా బూడిద పూసుకొని వస్తున్నానని చీదరించుకుంటుందేమో అని సందేహిస్తున్న శంకరుని చూసి ఈ ప్రసూతిశాలలు, శ్మశానలు నాకేమీ కొత్త కాదు. నేను ఒకసారి కనురెప్ప వేసే సమయంలో భువనాలన్నీ పుట్టి, పెరిగి, లయమైపోతూ ఉంటాయి(ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి) అని ఆ లోకజనని స్వాంతనగా నవ్విందేమో!
చెప్పాపెట్టకుండా మాయమైపోయి, తీరా ఇంత విషం తాగి, గొంతంతా నల్లగా చేసుకుని వచ్చానని నిలదీస్తుందేమో అని కంగారు పడుతున్న ఆ నీలకంఠుని ఓదారుస్తూ మీరేం తాగినా నాకేం భయం లేదు. ఎందుకంటే నేను సర్వమంగళని. పైగా మీకేమయినా అయితే దానికి వైద్యం చేయగల శక్తి కూడా నాకు ఉంది (శివా రుద్రస్య భేషజీ) అని ధైర్యంగా నవ్విందేమో అమ్మ!
భస్మాసురునికి ఇవ్వకూడని వరమిచ్చి లయకారకుడనైన నేనే లయమైపోయే స్థితిని తెచ్చుకున్నానని మందలిస్తుందేమో అని మధనపడుతున్న బోళాశంకరుని ఓదారుస్తూ బావ బ్రతుకు కోరే బావమరది మీకుండగా ఇక ఎందుకు చింత అని తన అన్నగారిని తలుచుకుంటూ చిరునవ్వు నవ్విందేమో ఆ పద్మనాభ సహోదరి!
పాపం ఈ నంది ఎప్పటినుండో నా సేవ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈవిడ కొత్తగా సింహ వాహనాన్ని తెచ్చింది. దానిని చూసి నంది ఎక్కడ భయపడతాడో అని సందేహిస్తున్న భర్తకు ధైర్యం చెబుతూ సృష్టిలో ఎంత విభిన్న తత్త్వాలు కలిగివుండి, పరస్పరం శత్రువులైనా ఒక కుటుంబంలోకి వచ్చాక అందరూ పరస్పరానురాగంతో మెలగాలని మన కుటుంబమే లోకానికి చాటుతుంది లెండి, ఏం భయం లేదని ఆ విశ్వమాత నవ్విందేమో!
నాకేమో పులి చర్మం ధరించడం అలవాటు. ఈ దుర్గేమో ఆ పులినే వాహనంగా చేసుకుంది. ఇప్పుడెలా అనుకుంటున్న మృగచర్మాంబర ధారిని చూసి అసలు ఈ సృష్టిలోని చర్మాలన్నీ ధరిస్తూ, ఈ బొమ్మలన్నింటినీ లోపలుండి నడిపేది నేనేనయ్యా అని నవ్విందేమో ఆ క్షేత్ర స్వరూప, క్షేత్రేశి, క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని!
నాకసలే కోపం ఎక్కువ. ఎప్పుడు ప్రళయ తాండవం చేసి ఈ విశ్వాన్నంతటినీ లయం చేసేస్తానో అని ఆందోళన పడుతున్న లయకారకుడికి ఆశ్వాసన కలిగిస్తూ మీ ప్రళయ తాండవాన్ని నియంత్రించి ఆనంద తాండవంగా మార్చడానికి నేను లాస్యనృత్యంతో సిద్ధంగా ఉన్నాను కదా అని నవ్విందేమో, తాను కూడా లయకరినన్న మాట మరచిపోయి!
నేనేమో శుద్ధ స్ఫటిక సంకాశుడనై తెల్లగా మెరిసిపోతుంటే నాకీ నల్లటి భార్య దొరికిందేమిటి అని ఆశ్చర్యపోతున్న కర్పూర గౌరునికి ప్రత్యుత్తరమిస్తూ ఒక్క నలుపేమిటి అన్నీ రంగులు నేనే. కాళిని నేనే, శ్యామలను నేనే, గౌరిని నేనే. త్రిగుణాత్మిక ప్రకృతినైన నానుండి మీ ధవళకాంతి ప్రసరించడం వలననే ఇన్ని రంగులు ఏర్పడుతున్నాయి కదా అని నవ్విందేమో!
నేనేమో ఒంటినిండా పాములు ధరించి ఉంటాను. అవి బుసలు కొడుతూ ఉంటాయి. కొంపదీసి నా భార్య వీటిని చూసి భయపడదు కదా అని కళవళపడుతున్న నాగభూషణుని సముదాయిస్తూ ఈ పాములు నాకు కొత్తేం కాదు. మా అన్నగారు కూడా ఎప్పటినుంచో పాము మీదే పడుకుంటున్నాడు అని నవ్విందేమో!
ఈ కాళీవనాశ్రమంలో భక్తులేమిటి, నీ పేరుతో దేవి నవరాత్రులు అని చెప్పి రోజులో సగం సమయం ఆ రామాలయంలోనే సత్సంగంలో ఉంటారు అని వేళాకోళమాడబోయిన రామలింగేశ్వరునితో ఏ స్త్రీకయినా తన జీవితంలోని ముఖ్య వేడుకలు పుట్టింటివారి సమక్షంలో జరిగితే ఆనందమే కదండీ! అయినా నన్ను అంటున్నారు కానీ ప్రతి శ్రావణ శుక్రవారానికి మీ చెల్లెలు వరలక్ష్మీ దేవి పూజలు శివాలయంలో జరగట్లేదా ఏమిటి? పైగా ఈ సంవత్సరం ఒక శుక్రవారం ఎక్కువే వచ్చింది కూడానూ అని గారంగా నవ్వింది జగన్మాత. ఓ అందుకేనా ఈ సంవత్సరం నవరాత్రులలో కూడా ఒకరోజు ఎక్కువ తెచ్చుకున్నావు అంటూ నవ్వేశాడు పరమేశ్వరుడు.
ఇలా జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరుల సరస సల్లాపాలతో వారి చిరు దరహాస కిరణాల వెన్నెలలో మన జీవితాలు గడిచిపోతే అంతకంటే కావలసింది ఏముంటుంది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి