వారి వారి గుణాలకు, కర్మలకు అనుగుణంగా నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని భగవానుడు స్వయంగా సెలవిచ్చాడు. "జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ భవేత్ ద్విజః" అని పెద్దలు చెబుతారు. అంటే జన్మతః అందరూ శూద్రులే. ఆ తరువాత వారి వారి కర్మలు, సంస్కారాలను బట్టి వివిధ వర్ణాలుగా పరిణామం చెందుతారు. సత్వగుణాన్ని అవలంబించి ఇంద్రియ నిగ్రహము, శౌచము, ఓర్పు, నిజాయితీలను కలిగి ఉండి, జ్ఞాన విజ్ఞానాలను సముపార్జించి, తాను చేసే ప్రతి కర్మలో 'భగవంతుడున్నాడు, అన్నీ చూస్తున్నాడు' అనే విశ్వాసాన్ని ప్రదర్శించే వారు బ్రాహ్మణులు అనబడతారు. అలాగే రాజస గుణాన్ని అవలంబించి శౌర్యం, తేజస్సు, ధైర్యం, పరిపాలనా దక్షత కలిగి ఉండి, యుద్ధంలో పలాయనం చిత్తగించకుండా ఉండటం, దానగుణం కలిగి ఉండటం, తాను ప్రభువుననే భావం కలిగి ఉన్నవారు క్షత్రియులనబడతారు. అలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమ, వర్తక వాణిజ్యాది వృత్తులు చేసేవారు వైశ్యులని, మిగిలిన సమాజానికంతటికి పరిచర్యలు, సేవలు చేసేవారు శూద్రులని పిలువబడతారు.
ఇలా వారి వారి వృత్తులు, ప్రవృత్తులను బట్టి ఆయా వర్ణాలు నిర్ణయించబడ్డాయి. శరీరం పనిచేయడానికి ఇంద్రియాలన్నీ ఎలా అవసరమో సమాజం పనిచేయడానికి ఈ వర్ణాల వారందరూ అలాగే అవసరం. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ప్రశ్నే లేదు. అయితే ఈ సత్యాన్ని గుర్తించకుండా కేవలం ఒక వంశంలో పుట్టినంత మాత్రం చేతనే తామేదో అధికులమని, అగ్రవర్ణం వారమని, మిగిలిన వారు అంటరాని వారని తమ చుట్టూ గిరి గీసుకొని కొందరు తమను తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో నిమ్న వర్ణాలని పిలువబడేవారు అవమానాల పాలవుతూ ఉంటారు. అంతెందుకు, శ్రీ గురుదేవుల బాల్యంలో ఒక ప్రక్క వారి మహిమను గుర్తిస్తూనే మరొక ప్రక్క వారి తల్లిదండ్రులెవరో వారిదే కులమో తెలియదనే వంకతో వారిని దూరం పెట్టి, వారు భుజించిన విస్తరిని వారితోనే తీయించి శుద్ధి చేయించినవారు కొందరున్నారు.
అయితే నిజమైన బ్రాహ్మణుడు ఎవరో యోగి వేమనవారు ఇలా వివరిస్తున్నారు -
బమ్మ గుడ్డు యనెడు పట్నంబు లోపల
బమ్మనెరుగలేని బాపడేల?
తన మనంబు దెలియ దానే పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ!
బ్రహ్మాండం అని పిలువబడే ఈ ప్రపంచంలో బ్రహ్మవస్తువును తెలుసుకోలేనివాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? నిజంగా వెదికి చూస్తే, తనలోనూ, సర్వసృష్టిలోనూ నిండియున్నది ఆ బ్రహ్మమే. అట్టి బ్రహ్మవస్తువును తెలుసుకున్నవాడు తానే బ్రహ్మమవుతాడు - "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి". నిజంగా అలా సకల చరాచర విశ్వమంతా నిండి ఉండి అన్నింటినీ ప్రకాశింపచేస్తున్న పరబ్రహ్మ వస్తువును గుర్తించిననాడు ఇక ఈ కులమత భేదాలు ఎక్కడనుంచి వస్తాయి?
అచల సిద్ధాంతంలో నిష్ణాతురాలైన మా మామ్మగారు శ్రీమతి శేషమ్మగారు ఇలాంటిదే ఒక పద్యం చదివేవారు -
ఆకారము శూన్యంబై రాకడ
పోకడలు లేక రంజిలుచుండే
లోకాతీతుని గానక చీకాకు పడేటి
వారు బ్రాహ్మలే చెప్పుమా!
బ్రహ్మ పదార్థమంటే అది కంటికి కనిపించేది కాదు. "యదృశ్యం తన్నశ్యం" అన్నారు. కంటికి కనిపించేవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే. ఈ ఆకారాలన్నీ ఒకప్పటికి వికారాలుగా మారిపోవలసిందే. మరి దేనిని చూసుకొని మనకింత అహంభావం? నేను అగ్రవర్ణం వాడినని విర్రవీగే నీ శరీరమైనా, నీవు అంటరానివాడని చీదరించుకొనే వాని శరీరమైనా చివరికి ఒక చోటికే చేరవలసిందే కదా? ఇక "నేను వేదవేదాంగాలూ చదువుకొని చాలా జ్ఞానం సంపాదించాను, వాడు వట్టి అజ్ఞాని" అంటావా? పిపీలికాది బ్రహ్మపర్యంతం నిండివున్న అసలు తత్వాన్ని తెలిపే వేదాంత సారాన్ని వంటబట్టించుకోకుండా కేవలం శ్లోకాలు, మంత్రాలు వల్లెవేయగలగటం జ్ఞానం ఎలా అవుతుంది? అది కేవలం పాండిత్యమే అవుతుంది.
మనం ఎటువంటి వారమైనా, ఎంతటి అజ్ఞానంలో ఉన్నా, భగవంతుడు ప్రతివారికి వారి వారి జీవితాలలో తమ తప్పును గుర్తించి సరిదిద్దుకునే అవకాశాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందివచ్చిన ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగ పరచుకోకుండా జారవిడుచుకుంటే ఇంక నీవు సంపాదించిన పాండిత్యానికి సార్థకత ఏమున్నది? అయితే అట్టి అవకాశాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నది వారి వారి సంస్కారాన్ని బట్టి, వాసనా పరంపరను బట్టి ఉంటుంది.
శ్రీగురుదేవుల దివ్య చరిత్రలో ఇలా ఒకే పరిస్థితులలో ఒకే రకమైన అవకాశాన్ని పొందిన ఇద్దరిలో ఒకరు దానిని చక్కగా అందిపుచ్చుకొని తమ జన్మను చరితార్థం చేసుకొంటే, ఇంకొకరు దానిని వ్యర్థం చేసుకొని భంగపడ్డారు. అదేమిటో కొంచెం చూద్దాం. కులమతాల పేరుతో తోటి మానవులను నీచంగా చూడడాన్ని శ్రీగురుదేవులు ఎన్నడూ హర్షించేవారు కాదు. వారి సన్నిధిలో అందరూ సమానులే. శ్రీగురుదేవుల భక్తకోటి అంతా అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒకే కుటుంబం. కేవలం తోటి భక్తులనే కాక సృష్టిలోని సకల జీవరాశులను సోదరభావంతో చూడటం వారు నేర్పిన సంస్కారం. ఇక మన రెండు ఉదాహరణలకు వస్తే, ముందుగా శ్రీ లలితానంద సరస్వతీ స్వామినివారు మొదటిసారి శ్రీగురుదేవుల దర్శనార్థం రాజమహేంద్రవరం వచ్చినపుడు అక్కడ భక్తులంతా జాతినీతి కులగోత్రాలకతీతంగా సహపంక్తి భోజనం చేయటం చూడగానే వారికి ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ వెంటనే తమలోని వివేకాన్ని మేల్కొలిపి, ఇదే అసలైన వేదాంత విజ్ఞాన సారానికి ఆచరణాత్మక రూపమని గ్రహించి సర్వభూతాత్మకుడైన పరబ్రహ్మను దర్శించే సాధన చేసి, ఆ తరువాత కాలంలో కూడా తమ విజ్ఞాన సర్వస్వాన్నీ స్త్రీపురుష, వర్ణాశ్రమ భేదాలకతీతంగా సర్వులకు సమానంగా పంచిపెట్టి చరితార్థ జన్ములైనారు.
ఇక రెండవవారు కోనసీమకు చెందిన పెద్ద పండితుడు. శ్రీకాళీ వనాశ్రమం స్థాపించిన తొలినాళ్ళలో ఒకసారి ఆయన శ్రీగురుదేవుల దర్శనార్ధమై వచ్చారు. వారికి ఆశ్రమంలో వాతావరణం, భక్తులు చేసే సాధన అన్నీ నచ్చాయి కానీ అందరూ వర్ణాశ్రమాలకతీతంగా సహపంక్తి భోజనం చేయడం మాత్రం ఆయన తట్టుకోలేకపోయారు. ఆనాటి సత్సంగ సభలో శ్రీగురుదేవులు తమ దివ్య బోధామృతాన్ని ముగిస్తూ ఆ పండితునితో "అయ్యా! ఈ నాడు తమవంటి గొప్ప పండితులు మా ఆశ్రమానికి విచ్చేయటం మా అదృష్టం. మీరిక్కడి వ్యవస్థనంతా క్షుణ్ణంగా పరిశీలించారు కదా! మేము ఆచరించే పద్ధతులలో ఏవైనా లోపాలుంటే తమరు దయతో సెలవిస్తే దిద్దుకునే ప్రయత్నం చేస్తాం" అన్నారు. ఆ పండితుడు మంచి అవకాశం దొరికిందనే ఉత్సాహంతో "స్వామీ! ఇక్కడ ఆచరించే సాధనా పద్ధతులన్నీ నాకెంతగానో నచ్చాయి. అయితే ఒక్కటే లోపం. ఇలా నానా వర్ణాల వారందరూ సహపంక్తి భోజనం చేయటం శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి తమరు బ్రాహ్మణులకు విడిగా భోజనం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది" అన్నారు.
శ్రీగురుదేవులు తమలో తాము నవ్వుకుని "అయ్యా! తమరు మా మీద దయతో అనుగ్రహించిన ఈ సూచన తప్పక ఆచరించవలసిందే. అయితే మా అమ్మ అయిన జగజ్జనని నాకు కలిగిన సందేహాన్ని తమతో విన్నవించుకోమని సూచిస్తోంది. తమరు రోజూ చీకటి పడ్డాక తమ ఇంటికి ఎడమవైపు సందు చివర్లో ఉన్న ఇంటికి వెడతారు కదూ? ఆ ఇంటిలో ఉన్నామెతో తమరు సరస సల్లాపాలు ఆడటం, మీరిద్దరూ ఒకే గ్లాసులోని పాలు త్రాగటం, ఒకే తాంబూలాన్ని కలిసి సేవించటం ఇంకా ఎన్నెన్నో లీలలు తమరి ముఖారవిందంలో నాకు దర్శనమిస్తున్నాయి. 'ఒరేయ్! ఆ ధన్యురాలి కులమేమిటో, గోత్రమేమిటో ఈ మహాత్ములను అడిగి తెలుసుకోరా!' అంటున్నది మా జగన్మాత. దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారా?" అన్నారు.
శ్రీగురుదేవులు మరిన్ని వివరాలు బయట పెడుతుండగానే ఆ పండితుడు క్షమించమని వేడుకుంటూ వారి పాదాలపై పడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో అసలైన బ్రాహ్మణులెవరు? నిత్యం వేదమాతను సేవిస్తూ కూడా కేవలం శబ్దజ్ఞానంతోనే సరిపెట్టుకొని ఆ వేద సారాన్ని గ్రహించక తాము ఆరాధించే పరమాత్మకు ప్రతిరూపాలైన తోటి జీవరాశిని కించపరుస్తూ 'సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగఛ్చతి' అని తెలుసుకోలేక ఆ పరమాత్మనుండి దూరమైపోయే వారిని చూసి జాలిపడటం తప్ప మనమేమి చేయగలం? శ్రీమద్భాగవతంలో కూడా ఇటువంటి సంఘటనలు మనకు గోచరిస్తాయి. ఒకనాడు శ్రీకృష్ణుని సఖులందరూ ఎంతో ఆకలిగా ఉన్నదంటే ఆయన వారిని ఆ దగ్గరలో యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుల వద్దకు పంపుతాడు. అయితే వారు వీరిని గొల్లపిల్లలని అవమానించి తరిమివేస్తారు. ఈ సారి పరమాత్మ వారిని వెనుకగా వంట ఇంటివైపు వెళ్ళి ఆ బ్రాహ్మణ స్త్రీలను అర్థించమని పంపుతాడు. వారందరూ తమ మహద్భాగ్యానికి ఎంతో సంతోషించి వండిన వంటలన్నీ తెచ్చి పరమాత్మను, ఆయన సఖులను చక్కగా సేవించుకుంటారు. అసలు విషయం ఆలస్యంగా గ్రహించిన ఆ పండితులు తాము కోల్పోయిన భాగ్యానికి తలలు పట్టుకుంటారు. వారి పాండిత్యం దేనికి అక్కరకు వచ్చినట్లు?
శ్రీగురుదేవులు మరొక తమాషా అయిన ఘటన చెప్పేవారు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు మానవావతారంలో యశోదమ్మ ఇంట అవతరించాడని విన్న ఒక పండితుడు ఆయనను దర్శించుకోవాలనే కోరికతో వ్రేపల్లెకు వస్తాడు. తీరా అక్కడకు వచ్చాక వారు యాదవులనే సంకోచంతో యశోదమ్మ ఇచ్చిన సంభారాలతో స్వయంపాకం మొదలుపెడతాడు. ఆయన అన్నీ వండుకొని, వడ్డించుకొని 'ఓం కేశవాయ స్వాహా' అనగానే కృష్ణయ్య ఎదురుగా ప్రత్యక్షమౌతాడు. 'అయ్యయ్యో! యశోదమ్మా! ఈ గోపబాలుడెవరో వచ్చి నన్ను మైలపరిచేసాడు' అని ఆక్రోశిస్తాడు. ఆ తల్లి వచ్చి పిల్లవానిని మందలించి మళ్ళీ సంభారాలు సమకూరుస్తుంది. ఈసారి 'ఓం నారాయణాయ స్వాహా' అనేసరికి మళ్ళీ చిన్నారి కన్నయ్య ప్రత్యక్షం. ఇంక లాభంలేదని ఈసారి యశోదమ్మ కృష్ణుని ఒక గదిలో బంధించింది. ఆ పండితుడు కూడా తన గది తలుపుకు తాళంమీద తాళం వేసుకుని భోజనానికి కూర్చున్నాడు.
'ఓం మాధవాయ స్వాహా' అనగానే మళ్ళీ స్వామి ప్రత్యక్షం. ఆ పండితుడు నెత్తీనోరూ బాదుకుని మొత్తుకుంటుంటే యశోదమ్మ వచ్చి కృష్ణుని మందలిస్తుంది. అప్పుడాయన "అయ్యో! అమ్మా! ఈ పండితుని వద్దకు రావటం వలన నేను మైలపడిపోయానా? ఇంతకీ మైల అంటే ఏమిటమ్మా? అసలు ఆయన వద్దకు రావలసిన అవసరం నాకేముంది? ఆయనే కేశవా, నారాయణా, మాధవా అని మాటిమాటికీ నన్ను పిలుస్తున్నాడు" అంటాడు. తన కళ్ళను కప్పిన జాత్యహంకారమనే పొర తొలగిన ఆ పండితుడు "అయ్యో! నేను వచ్చినదే తమరి దర్శనార్థం స్వామీ! తీరా తమను చూసేసరికి అసలు విషయం మరచిపోయి, కేవలం కులగోత్రాలనే పట్టించుకొని అహంకారంతో ప్రవర్తించాను. నన్ను క్షమించండి" అని ఆ చిన్నారి కన్నయ్య పాదాలపై వ్రాలిపోతాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి