15, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఓం పూష దంతభిదే నమః



    శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఓం పూష దంతభిదే నమః. పూష అనేది సూర్యభగవానుని నామం. లోకానికంతటికీ పోషణనిచ్చేది సూర్యుడే కదా. మరి అటువంటి సూర్యుడికే పోషణకు అవసరమైన దంతాలు లేకుండా పరమేశ్వరుడు ఎందుకు వాటిని భేదనం చేయవలసి వచ్చింది? దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకొన్నప్పుడు పరమేశ్వరుడు ఉగ్రరూపంలో వీరభద్రుడై ఆ యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించిన చరిత్ర మనందరికీ తెలుసు కదా. ఆ సందర్భంలోనే అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా వీరభద్రుడు శిక్షిస్తాడు. తమ కళ్ళముందు అధర్మం, అన్యాయం జరుగుతూ ఉంటే 'పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు' అని మోహమాటానికి పోయినందుకు వారు కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆ శిక్షలో భాగంగానే సూర్యుడికి పళ్ళు ఊడగొట్టబడ్డాయి. అందుకే రథసప్తమి నాడు, లేదా ఇతర మాఘ అదివారాలలో కూడా సూర్యునికి నైవేద్యం పెట్టడానికి పరమాన్నం వండితే అందులో గట్టి పదార్థాలు (కనీసం జీడిపప్పులు కూడా) లేకుండా వండుతారు.

    కర్తా కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారః సమభాగినః అని శాస్త్రం చెబుతోంది. ఒక మంచిపని కానీ చెడ్డపని కానీ జరుగుతున్నప్పుడు ఆ పని చేసినవాడు, చేయించినవాడు, దానికి ప్రేరణ కలిగించినవాడు, చూసి ఆనందించిన వాడు ఈ నలుగురూ ఆ పనియొక్క ఫలితాన్ని సమానంగా అనుభవిస్తారు. అందుకే ఏదైనా పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు మనం ఆ కార్యానికి ఏవిధంగానూ సహకరించలేక పోయినా కనీసం చూసి ఆనందించినా ఆ పుణ్యఫలం మన ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఏదైనా పాపకార్యం జరుగుతున్నప్పుడు దానిని ఆపే సామర్థ్యం మనలో లేనప్పుడు ఆ సామర్థ్యం ఉన్నవారిని పిలవాలి, లేదా కనీసం అక్కడినుంచి దూరంగా అయినా వెళ్ళిపోవాలి. అలా కాకుండా అక్కడే ఉండి చూస్తూ ఉంటే ఆ శిక్షలో మనం కూడా భాగస్వాములం అవుతాం.

సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్ 

    అని మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో పరమాత్మ భీష్మ ద్రోణాదులను హెచ్చరిస్తాడు. ధర్మానికి, సత్యానికి హాని కలిగినప్పుడు దానిని నివారించగల సమర్థులై ఉండి కూడా ఉపేక్ష చేస్తే, మాట్లాడకుండా ఉండిపోతే, అది వారికే చేటు కలిగిస్తుంది కానీ ఆ సత్య ధర్మాలను కాపాడటానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు. మరి కౌరవులు చేసేది అధర్మం అని తెలిసి కూడా వారి పక్షాన నిలబడినందుకు ఆ పెద్దలందరూ శిక్ష అనుభవించారు కదా! ఇక్కడ వారు కేవలం వారి స్వధర్మాన్ని పట్టుకొని విశేష ధర్మమైన లోకహితాన్ని వదిలిపెట్టారు కాబట్టి వారు శిక్షను అనుభవించవలసి వచ్చింది. అదే శ్రీకృష్ణుడు ఆ విశేష ధర్మాన్ని నిలబెట్టడానికి 'ఆయుధం చేబట్టన'ని తాను చేసిన వ్యక్తిగత ప్రతిజ్ఞను ప్రక్కనబెట్టి మరీ భీష్ముని మీద చక్ర ప్రయోగం చేయబోయాడు.

    సత్యం ఎప్పటికీ మారనిది. కానీ ధర్మం మాత్రం దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటుంది. అలాగే ఎవరి ప్రాణాలని, కుటుంబాన్ని కాపాడుకోవడం వారి ధర్మమయినా దేశంహితం కోసం ఒక గ్రామాన్ని, గ్రామహితం కోసం ఒక కుటుంబాన్ని, కుటుంబ హితంకోసం ఒక వ్యక్తిని కూడా వదిలివేయడం  ధర్మసూక్ష్మం. అంతే కానీ మన కళ్ళెదుటే అన్యాయం, అధర్మం జరుగుతూ ఉంటే ఆ చేసేవాడు నా కుటుంబం, నా కులం, నా మతం, నా భాష, లేదా నా రాష్ట్రానికి చెందిన వాడని వాడిని సమర్థించడమో, లేదా కనీసం ఖండించకుండా ఉండిపోవడమో చేస్తే దానికి శిక్షను మనం కూడా అనుభవించవలసి వస్తుంది. ఏ కలి ప్రభావమో కానీ ఈనాడు దేశంలో ఈ సంకుచిత భావనలు పెరిగిపోయి చివరికి మన భావజాలానికి అనుగుణంగా లేని వెనుకటి తరం మహాత్ములను కూడా దూషించే స్థితికి ఈ సమాజం చేరిపోయింది. పులి-మేక కథలో 'నువ్వు కాకపోతే మీ నాన్నో, తాతో నా నీళ్ళు ఎంగిలి చేశారు' అని వంకపెట్టి పులి ఆ మేకపిల్లను తినేసినట్లు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ మతానికి చెందినవాడో, నీ కులానికి చెందినవాడో నా మతానికి, కులానికి చెందిన వారిపై దౌర్జన్యాలు చేశారని వంకపెట్టి ఆ చేసినవారితో ఏ బీరకాయపీచు సంబంధం లేనివారిని కూడా శిక్షించే, వంచించే స్థితికి చేరుకున్నాం.

    అయితే ధర్మానికి ఈ పైకి కనిపించే ఏ భేదాలతోనూ సంబంధం లేదు. మళ్ళీ మనం మహాభారతాన్నే తీసుకుంటే అక్కడ కౌరవ పాండవులు ఇద్దరూ ఒకే దేశానికి, ఒకే మతానికి, ఒకే కులానికి, చివరికి ఒకే కుటుంబానికి చెందినవారే కదా! కానీ ఒకరు ధర్మానికి ప్రతిరూపం అయితే మరొకరు అధర్మానికి ప్రతిరూపమయ్యారు. ఈ సందర్భంలో 'దుర్జనుడి క్రూరత్వం కంటే సజ్జనుడి మౌనం మరింత ప్రమాదకరం' అన్న Martin Luther King Jr. మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ కనీసం మాటమాత్రంగానైనా ఖండించలేకపోతే దానికి ఫలితం మనం కూడా అనుభవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ధర్మం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. హిందీలో అయితే మతం అన్న అర్థంలో కూడా ధర్మం అనే పదాన్ని వాడుతారు. అయితే నిజమైన ధర్మం ఏమిటి అన్న దానికి ఆ మహాభారతమే సమాధానం చెబుతోంది.

ఒరులేయని యొనరించిన 
నరవర! యప్రియము దన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. 

    ఇతరులు ఏమి చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతోందో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలలోకి ఉత్తమమైన ధర్మం అని మహాభారతం చెబుతోంది. చివరికి తన భార్యను అపహరించిన రావణునికి శ్రీరాముడు, తమ రాజ్యాన్ని అపహరించి, భార్యను అవమానించిన కౌరవులకు పాండవులు కూడా సంధికి అనేక అవకాశాలు ఇచ్చి గతిలేని పరిస్థితిలోనే యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కూడా తమ పక్షానికి వస్తానన్న శత్రువులను సాదరంగా ఆహ్వానించారు. అలాగే యుద్ధంలో మరణించిన తరువాత శత్రువులను కూడా గౌరవించారు, వారికి ఉత్తమగతులు కల్పించే క్రతువులను నిర్వహించారు.

    అంతేకానీ కులమత సంకుచిత భావనలతో ఎదుటివారిని నిష్కారణంగా హింసిస్తూ, మహాత్ములను అవమానిస్తూ ఉండేవారికి సర్వజీవ సమభావనకు ఉత్కృష్ట ప్రతీక అయిన పరమేశ్వరుని చేతిలో శిక్ష తప్పదు. అలాగే వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రోత్సహించేవారికి, చూసీ చూడనట్లు ఊరుకొనే వారికి కూడా పళ్ళు రాలడం తప్పదు. అధర్మాన్ని ఖండించని మౌనం కూడా అధర్మంలో భాగస్వామే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి