ఈ సమస్త సృష్టికి ఆధారం భగవంతుడే అని మనందరికీ తెలిసిందే కదా. దానినే గీతలో స్వామి మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ| మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ|| - నాకంటే వేరుగా ఏదీ లేదు. ఈ సృష్టి సమస్తం మణిమాలలోని దారానికి మణులు అల్లుకున్నట్లుగా నాతో అల్లుకుని ఉన్నది అని చెప్పారు. అయితే ఈ సృష్టి అనే మణిమాలకు ఆధారమైన దారం ఆ పరమాత్మే అయినా ఈ మాలలోని మణులన్నీ కూడా పరస్పరం ఆధారితమై ఉన్నాయి. చివరికి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న దేవతలు కూడా మనం యజ్ఞాలలో ఇచ్చే హవిస్సులపై ఆధారపడి ఉన్నారు.
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్||
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ||
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః॥
మొదలైన భగవద్గీతా శ్లోకాలలో పరమాత్మ దీనినే వివరిస్తున్నాడు. "బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడే వారితోపాటు యజ్ఞాలను సృష్టించి ఇవి మీ కోరికలన్నీ తీరడానికి ఉపయోగపడతాయి. ఈ యజ్ఞాలతో మీరు దేవతలను తృప్తి పరిస్తే వారు మీరు కోరిన సంపదలన్నీ అనుగ్రహిస్తారు. ఇలా మీరు పరస్పరం ఆధారితులై పరమమైన శ్రేయస్సును పొందండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. దేవతలు మీకు అనుగ్రహించిన భోగాలను ఇతరులతో పంచుకొని అనుభవించండి. లేకపోతే మీరు దొంగలుగా పరిగణించబడతారు" అని చెబుతున్నాడు.
అలాగే మంత్రపుష్పంలో నీటిని వస్తువుగా తీసుకొని సృష్టి అంతా పరస్పరం ఆధారితమై ఎలా ఉందో వివరించారు. అగ్ని, వాయువు, తపస్సు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, ఋతువులు(సంవత్సరం) ఇవన్నీ జలానికి ఆధారమని, అలాగే జలం వీటికి ఆధారమని, ఇలా పరస్పర ఆధారమనే విషయాన్ని గ్రహించినవాడు నిజంగా ఆధారం కలవాడని వివరించారు. అయితే మనలో కొందరు ఈ విషయాన్ని గ్రహించలేక "నేను ఎవరిమీదా ఆధారపడను. నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను కదా. ఇంకెవరిమీద ఆధార పడవలసిన అవసరం నాకేంటి?" అనుకుంటారు. ఇంకొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి "నా జేబు నిండా డబ్బులు ఉన్నాయి. ఏ పనైనా డబ్బులు పడేసి నేను చేయించుకోగలను. కాబట్టి నేను ఎవరిమీదా ఆధారపడటం లేదు" అని భావిస్తారు. ఇటువంటి దంభాన్ని, దర్పాన్ని, అజ్ఞానంతో కూడిన ఆభిజాత్యాన్ని పరమాత్మ గీతలో అసుర సంపదగా నిర్వచించాడు.
నిజానికి సృష్టిలోని ఏ ప్రాణికి ఎవరిమీదా ఆధారపడకుండా జీవించడం సాధ్యం కాదు. మన ఇల్లు అంతా మనం ఒక్కరమే మన చేతులతో నిర్మించుకొని, మన బట్టలు మనమే నేసుకొని, మన పంటలు మనమే పండించుకొని, వండుకొని తినడం సాధ్యమా? ఒకవేళ ఎవరైనా ఈ విద్యలన్నీ నేర్చుకున్నా అన్నీ తానే చేయాలంటే రోజు సరిపోదు, ఒక జీవితం సరిపోదు. ఒకవేళ కష్టపడి చేసుకున్నా, వీటన్నిటికీ కావలసిన ముడిసరుకులు, పనిముట్లు అనేకం ఉంటాయి కదా. వాటినయినా ఇతరుల వద్ద నుండి సేకరించవలసిందే కదా. అయితే మానవుని ఆలోచన ఎలా ఉంటుందంటే దీనిని ఇతరులమీద ఆధారపడటంగా భావించడు. కేవలం డబ్బులు ఇచ్చి సేవలు పొందటం అనే ఒక వ్యాపారంగా చూస్తాడు. ఇది అహంకారానికి దారితీసి సాటి మనిషిని కనీసం మనిషిలా చూసే సంస్కారాన్ని కూడా నశింపజేస్తుంది.
మనిషికి ఆత్మాభిమానం ఉండటం, ఎవరిదగ్గరా ఏమీ తీసుకోకూడదు అనే అపరిగ్రహం ఉండటం మంచిదే. కానీ ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్యలో చాలా సన్నని గీత ఉంటుంది. దానిని గుర్తించడం కష్టం. కేవలం ఆత్మాభిమానం మాత్రమే ఉన్నవాడు తనకు ఎంత అభిమానం ఉంటుందో ఎదుటి వ్యక్తికి కూడా అంతే అభిమానం ఉంటుంది అని గుర్తిస్తాడు. అలాకాక అహంకారం ఉన్నవాడు ఎంతసేపూ "నేనే అందరికీ పెట్టాలి. నేనే అందరినీ పోషించాలి. నేను ఇచ్చినవన్నీ అందరూ నోరు మూసుకుని తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఎవరి దగ్గరా ఏమీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవలసి వస్తే వెంటనే అంతకన్నా విలువైనది వాళ్ళకి ఇచ్చేయాలి" ఇలా ఆలోచిస్తాడు.
మనకి అనేక వ్రతాలు, నోములు, ఇతర పుణ్యకార్యాలు నిర్ణయించిన పెద్దలు వాటిలో భాగంగా సమాజంలోని ఇతరులను ఆహ్వానించి వారికి మన శక్తికొలది వాయనాలు, తాంబూలాలు, వస్త్రాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఇచ్చేవారు, పుచ్చుకొనే వారిని తాము అప్పటిదాకా ఏ దేవతను ఆరాధించారో ఆ దేవతా స్వరూపంగా భావించి భక్తితో ఇవ్వాలి. అలాగే పుచ్చుకొనే వారు కూడా ఆ వస్తువును ఆ దేవత ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించాలి. అలా కాకుండా "ఫలానా వారు నాకు వాళ్ళ ఇంట్లో వ్రతానికి వెయ్యి రూపాయల చీర పెట్టారు. నేను వెంటనే మరొక వ్రతం చేసుకొని వారికి పదిహేను వందలదో రెండు వేలదో చీర పెట్టేయకపోతే నేను వారికి ఋణపడిపోతాను. ఇది నా ఆత్మాభిమానానికే కళంకం" అని భావిస్తే ఇక అక్కడ అహంకారం, వ్యాపారం తప్ప భక్తి ఎక్కడ ఉంది?
చిన్న వయసులో పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడటం ఎంత సహజమో పెద్ద వయసులో అదే తల్లిదండ్రులు ఆ పిల్లలమీద ఆధారపడటం అంతే సహజం. అది ప్రకృతి న్యాయం కూడా. అయితే "నా దగ్గర ఇంత ఆస్తి, ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏ వయసులో అయినా, అటు నా తల్లిదండ్రులయినా, ఇటు నా పిల్లలయినా నా మీదనే ఆధారపడాలి తప్ప నేను ఎవరి మీదా ఆధారపడను" అని అహంకరిస్తే ఎవరికి నష్టం? నిజానికి ఏ కుటుంబంలో సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ఉంటారో ఆ కుటుంబంలోనే ప్రేమ, ఆప్యాయతలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అలా కాకుండా ఏ ఒక్క కుటుంబ సభ్యుడయినా "నేను సర్వస్వతంత్రుడిని, ఎవరిమీదా ఆధారపడను, ఎవరితోనూ సంప్రదించను, ఎవరికీ సమాధానం చెప్పను" అని అహంకరించి ఒంటెత్తు పోకడలతో ప్రవర్తిస్తే ఆ కుటుంబంలో నిరంతరం అశాంతి, అల్లకల్లోలం చెలరేగి చివరికి విచ్ఛిన్నం అయిపోతుంది కదా!
మళ్ళీ మనం మన మొదటి మణిమాల వద్దకే వెళితే అందులోని మణులన్నీ 'మాకందరికీ దారమే ఆధారమై ఉంది కనుక మేము పరస్పరం ఆధారపడం' అని అహంకరించి ఒకదానికొకటి దూరంగా ఉన్నాయనుకోండి ఆ మాల ఏమి అందంగా ఉంటుంది? అదే ఒకదానికొకటి దగ్గరగా అల్లుకొని అన్నీ కలసిమెలసి ఉంటే అది మణిమాల అయినా, పూలమాల అయినా ఎంతో అందంగా ఉంటుంది. నిజానికి భగవంతుడు మనందరికీ ఆధారం మాత్రమే కాదు. మనందరం ఆయన విరాట్ శరీరంలో భాగాలమే. ఒక శరీరంలో భాగాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సహకారంతో ప్రవర్తిస్తే ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? లేక దేనికదే అహంకరించి మిగిలిన వాటితో సంబంధం లేకుండా ప్రవర్తిస్తే ఆరోగ్యంగా ఉంటుందా? అది అనారోగ్యమే కదా!
తమ శిష్యులు ఎవరైనా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చి ఒకరిమీద ఒకరు నెపం మోపుతూ తమ వద్దకు వస్తే వారికి శ్రీగురుదేవులు ఇదే చెప్పేవారు. "నా రెండు చేతులు ఒకదానితో ఒకటి కలహించుకొని తీర్పుకి నా దగ్గరకు వస్తే నేను ఏమి చెయ్యాలి? ఏ చెయ్యి పక్షాన నిలవాలి?" అని ప్రశ్నించేవారు. కాబట్టి మనందరికీ భగవంతుడు ఆధారం అన్నది ఎంత నిజమో మనందరం పరస్పర ఆధారితులమన్నది కూడా అంతే నిజం. దీనిని గ్రహించిననాడు అహంకారం తలెత్తకుండా ప్రతి జీవిలోనూ పరమాత్మను దర్శించి గౌరవించే ఉత్తమ సంస్కారం అలవడుతుంది. ఇటువంటి మంచి సంస్కారాలను చిన్నవయసులోనే అలవరచుకోవాలి కానీ వయసు మళ్ళిన తరువాత సుదీర్ఘ జీవితంలో మనను అంటిపెట్టుకొని ఉన్న కుసంస్కారాలు వదుల్చుకోవాలంటే అంత సులభం కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి