5, ఏప్రిల్ 2026, ఆదివారం

అర్థమనర్థం



అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశస్సత్యమ్ ।
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః 

    డబ్బు యొక్క విలువ ఏమిటో ఈ భజగోవింద శ్లోకంలో జగద్గురువులు వివరిస్తున్నారు. మనందరం మన జీవితాలలో డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. డబ్బు ఉంటే మనం కోరుకున్న అన్ని సుఖాలూ యధేచ్చగా పొందవచ్చు అనుకుంటాం. తగినంత డబ్బు దగ్గర లేకపోతే భయపడతాం. కానీ ఇక్కడ స్వామివారు డబ్బు వలన ఏమీ ప్రయోజనం లేదని చెబుతున్నారు. అలాగే దానివలన లేశమాత్రమైనా సుఖం లేదని కూడా చెబుతున్నారు. ఇంకా డబ్బులున్నవాడు తన సొంత పుత్రునికే భయపడతాడు అని కూడా చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

    డబ్బు బహు చంచలమైనది. లక్ష్మీదేవి నామాలలో కూడా ఓం చంచలాయై నమః అని, ఓం చపలాయై నమః అని నామాలు ఉంటాయి. ఈనాడు నీ చేతిలో ఉన్న డబ్బు మర్నాడు ఎవరి చేతిలోకి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. ప్రతిరోజూ మన షేర్ మార్కెట్ ఉత్థాన పతనాలు చూస్తూనే ఉన్నాం కదా. క్షణాలలో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. అలాగే డబ్బు వలన కలిగే సుఖం కూడా మన భ్రమే. శ్రీ బాబూజీ మహరాజ్ వారు చెప్పేవారు - విమానంలో ఫస్ట్‌క్లాస్‌లో  ప్రయాణిస్తున్న ధనవంతుడికి ఉన్నట్టుండి విపరీతమైన కడుపునొప్పి వస్తే ఆ విలాసవంతమైన సీటు అతనికి ఏమైనా సుఖంగా అనిపిస్తుందా?

    అలాగే డబ్బు లేనివాడు నడిరోడ్డు మీద అయినా సుఖంగా నిద్రపోతాడు. అవసరానికి మించిన డబ్బు దగ్గర పెట్టుకున్నవాడికి నిద్ర ఎక్కడిది. అనుక్షణం ఎవరు ఎటునుంచి వచ్చి తన డబ్బు కొట్టేస్తారో అని భయపడుతూనే ఉంటాడు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఒక సంఘటన చెప్పేవారు. ఒక వ్యాపారస్తునికి తన ధోవతి లోపల గుడ్డ సంచీ కుట్టించుకొని అందులో డబ్బు పెట్టుకోవడం అలవాటు. ఒకసారి రైల్వే ప్లాట్‌ఫారం మీద పడుకోవలసి వచ్చింది. ఇంక అతనికి నిద్ర ఏమి పడుతుంది? రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కూర్చొని అలసటకి రెప్పవాల్చగానే అప్పటిదాకా గమనిస్తూనే ఉన్న దొంగవాడు బ్లేడుతో అతని పంచెను కోయడం, అది తగలరాని చోట తగిలి ఇతను ఆస్పత్రిపాలు కావడం జరిగిపోయాయి.  

    అంతెందుకు 'ఈ డబ్బు నాది, నాది' అనుకునే వాడు సొంత కొడుకుని చూసినా భయపడుతూనే ఉంటాడు. తాను మధ్యవయసులో ఉన్నపుడు యవ్వనుడైన కొడుకు తన డబ్బును ఎక్కడ విలాసాలకు ఖర్చు పెట్టేస్తాడో అని భయం! తాను వృద్ధుడు అయిన తరువాత ఆస్తంతా కొడుకు చేతిలో పెడితే ఎక్కడ తనను కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొడతాడో అని భయం! ప్రశాంతంగా రామా కృష్ణా అనుకోవలసిన వయసులో ఇంకా దస్తావేజులు, ఇన్కమ్‌ట్యాక్స్‌లు అనుకుంటూ శ్రమపడుతూ నిరంతరం చింతిస్తూ ఉంటాడు. వృద్ధస్తావచ్చింతాసక్తః అని మళ్ళీ జగద్గురువులే ఇక్కడ చెబుతున్నారు.

    అంతేకాదు మనలో సరైన జన్మజన్మాంతర సంస్కారం లేకపోతే ఈ డబ్బు మనలో దాగివున్న  దుష్ట గుణాలన్నింటినీ బయటకు తెస్తుంది. ఏనెలకానెల చాలీచాలని జీతంతో బ్రతికినన్నాళ్ళు మనిషి 'అందరూ నావాళ్ళే, మనకున్నది అందరితో పంచుకోవాలి' అనుకుంటాడు. ప్రేమ, అప్యాయతలు కురిపిస్తాడు. తాను వండుకున్న కాస్త అన్నమే మహాప్రసాదంగా మరునాటికి దాచుకొని మరీ తింటాడు. అదే వ్యక్తికి అనుకోకుండా ధనం వచ్చిపడితే ఇక తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులుగానే కనిపించడం మొదలుపెడతారు. ప్రపంచమంతా తనను దోచుకోవడానికే కాచుకొని కూర్చున్నట్లు అనిపిస్తుంది. గొప్పలకోసమో, పుణ్యంకోసమో లక్షలు, కోట్లు అవలీలగా దానం ఇచ్చేసేవాడు కూడా తన ఇంట్లో ఒక చిన్న చెంచానో, ఒక గుడ్డముక్కో కనపడకుండా పోతే సతమతమైపోతాడు. పనిమనుషుల దగ్గరనుంచి కొడుకు, కోడలు వరకు ఎవరినైనా దొంగలని నిందించడానికి వెనుకాడడు.

    సొంత మనుషులంటే కూడా ఎందుకు ఇంత భయం వస్తోంది? అని విచారిస్తే తనలో జవసత్వాలు ఉన్నంతకాలం 'ఇది మనది' అనే భావన ఏమాత్రం లేకుండా 'ఇదంతా నాదే! నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుకుంటాను' అని విచ్చలవిడిగా ప్రవర్తించి చివరికి భార్య, పిల్లలను కూడా సంప్రదించకుండా అహంకారంతో పెత్తనం చలాయిస్తాడు. తీరా వృద్ధాప్యంలో జవసత్వాలు ఉడిగి, జ్ఞాపకశక్తి నశించే సమయంలో తన బిడ్డలు కూడా తనలాగే 'ఇదంతా నాది' అని ఎక్కడ లాక్కుంటారో, తన అధికారం ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడటం మొదలవుతుంది. అదే ముందునుంచి 'ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అలాగే ఈ కుటుంబం కూడా నాకు ఆయన ప్రసాదమే' అని భావిస్తూ 'ఇదంతా మనది' అనే భావన చూపిస్తూ, ప్రతి విషయం భార్య, పిల్లలతో సంప్రదించి చేసే అలవాటు ఉన్నవాడు వాడి పిల్లలలో కూడా అటువంటి సంస్కారాన్నే కలిగిస్తాడు. అప్పుడు వారు తననుంచి లాక్కుంటారనే భయం కలగదు కదా! 'ఇది నాది, దీనిమీద సర్వ హక్కులు నాకే కావాలి' అనుకున్న దుర్యోధనుడు రాజభవనంలో ఉన్నా నిరంతర చింతలోనే బ్రతికాడు. 'ఇది మనది, అందరూ మనవాళ్ళే' అనుకున్న పాండవులు అడవులలో ఉన్నా ప్రశాంతంగా జీవించారు.

    అందుకే జగద్గురువులు మళ్ళీ మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్। యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్॥ అని ధనాన్ని ఎలా చూడాలో నేర్పిస్తున్నారు. ఓ మూఢుడా 'నాకు ఇంకా ఇంకా ధనం కావాలి' అనే దాహాన్ని విడిచిపెట్టు. సద్బుద్ధి కలవాడివై ధనదాహాన్ని వదిలి నీ కర్మ ఫలితంగా ఎంత ధనమైతే వస్తోందో దానితోనే నీ సంసారాన్ని గడుపుకుంటూ హాయిగా, ప్రశాంతంగా జీవించు అని బోధిస్తున్నారు. మరి  ఇక్కడ మనిషికి ఇంకా ఎదగాలి అని ఆశయం ఉండటం తప్పు ఎలా అవుతుంది? అనే ప్రశ్న వస్తుంది. అయితే మనం ఎదుగుదలని డబ్బుతోనే కొలవడం అలవాటు చేసుకున్నాం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని పేరు తెచ్చుకున్నవాడు రేపు కూడా అలాగే ఉంటాడని భరోసా ఎక్కడిది? వీడిని చూసి ఇంకొకడు వీడికన్నా ఎక్కువగా ఎదుగుతాడు. ఇది ఒక అంతులేని పరుగుపందెం. మళ్ళీ ఇక్కడ జగద్గురువులు ఈ పరుగుపందెం గురించి యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః। పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే।। అని చెప్తున్నారు. పైన చెప్పినట్లుగా కుటుంబంలో అప్యాయతలను, సమష్టి భావనను వదిలివేసి 'నా చేతిలో డబ్బు ఉన్నంతకాలం నేనే రాజుని' అని విర్రవీగుతూ డబ్బు వెనుక పరుగెట్టేవాడిని కుటుంబసభ్యులు కూడా అంతవరకే గౌరవిస్తారు. ఒక్కసారి సంపాదన ఆగిపోయిందంటే కనీసం 'బాగున్నావా? తిన్నావా?' అని అడిగేవాడు కూడా ఉండడు. ఇంక వాడు ఏమి సాధించినట్లు?

    ఈ పరుగులలో పడి అసలు మన లక్ష్యం ఏమిటి, మన జీవితం ఎందుకు వచ్చింది అనే విషయాన్నే మర్చిపోతున్నాం. ఎంత సంపాదించినా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే కానీ ఇక్కడినుండి పరలోకానికి ఒక్కపైసా తీసుకెళ్ళినవాడు ఎవడూ లేడు. ఒకవేళ తీసుకెళ్ళినా అది అక్కడ చెల్లదు. అందుకే జగద్గురువులు మళ్ళీ మా కురు ధన-జన-యౌవన-గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్। మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥ అని చెబుతున్నారు. 'నాకు ఇంత ధనం ఉంది. నా వెనకాల ఇంత బలగం ఉంది. నాకు యవ్వనం ఉంది. ఏదైనా అవలీలగా చేసేయగలను' అని విర్రవీగకు. ఇవన్నీ ఒక్కనిమిషంలో కాలం హరించివేస్తుంది. ఇదంతా మాయ అని తెలుసుకొని నీ స్వస్వరూప స్థితి అయిన బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి ప్రయత్నించమని బోధిస్తున్నారు. 

    ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథమ్| ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్|| నేడు నాకు ఇంతటి సంపద లభించింది, నా కోరికలన్నీ ఈరోజే తీర్చుకుంటాను. నా దగ్గర ఈ ధనముంది, అలాగే, భవిష్యత్తులో ఇంకా చాలా ధనం నాకే వస్తుంది అనే ఆలోచనలన్నీ అసుర స్వభావం వలన కలిగేవే అని భగవద్గీతలో 16వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అంతే కాదు ఇలాంటివారు 'ఈ శత్రువు నా చేతిలో చచ్చాడు, మిగిలిన వారిని కూడా చంపుతాను, నేను ప్రభువును, భోగిని, సిద్ధుడిని, బలవంతుణ్ణి, సుఖవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నా కులం గొప్పది, నా వెనుక ఇంత బలగం ఉంది, నాకు సముడెవ్వడు? యజ్ఞం చేస్తాను, దానం ఇస్తాను, ఆనందిస్తాను' ఇలాంటి భావనలతో అవివేకంలో, మోహంలో పడి చివరికి నరకం పాలవుతున్నారు అని కూడా చెప్పారు.

    మరి మన ధనాన్ని ఎలా చూడాలి? ఎలా అనుభవించాలి? అని ప్రశ్న వస్తుంది. దీనికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'ఒక బ్యాంకు ఉద్యోగి చేతులమీదుగా రోజూ అనేక లక్షల రూపాయల వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ అతనికి ఆ రూపాయలపై ఎటువంటి మమకారం ఉండదు. ఒకవేళ అలాంటి మమకారం ఏర్పడిన మరుక్షణం అతను జైలు పాలవుతాడు. అలాగే భక్తుడు తన సంసారం పట్ల శ్రద్ధ, ప్రేమ, బాధ్యతలతో వ్యవహరించాలి కానీ మమకారం పెంచుకోకూడదు. అది బంధనానికి దారి తీస్తుంది' అని, 'నీ ధనానికి నిన్ను నువ్వు ఒక ధర్మకర్తగా భావించుకో కానీ ఒక యజమానిగా కాదు' అని బోధించారు. ధనానికి మూడు గతులు ఉంటాయని భర్తృహరి దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య। యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి॥ దానము, భోగము, నాశము అని ధనానికి మూడు గతులు ఉంటాయి. ఎవరైతే దానమివ్వకుండా, తాము అనుభవించకుండా దాచిపెట్టుకుంటారో అట్టి ధనానికి మూడవదైన నాశం కలుగుతుంది అని చెప్పాడు. ఇందులో ఉత్తమ గతి మనకు ఉన్నంతలో ఎదుటివారికి దానం చేయడం. అది కూడా గొప్పలకోసం, పుణ్యంకోసం, ప్రతిఫలం కోసం కాకుండా దేశ కాల పాత్రతలను ఎరిగి దానం చేయాలని భగవద్గీత బోధిస్తోంది. ఇక తనకు ఉన్నదానిని కనీసం తానైనా అనుభవించడం మధ్యమ గతి. ఈ రెండు చేయనివారి ధనం దొంగలపాలో, రాజులపాలో, అగ్నిపాలో అయిపోతుందని శాస్త్రం చెబుతోంది.   

    మన సంస్కృతి విత్తం కంటే విద్యకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే అన్నాడు భర్తృహరి. డబ్బులున్నవాడు తన ఊరిలోనే గౌరవించబడతాడు. అది కూడా తన అవసరం ఉన్న కొందరిచేతనే! ఎప్పుడైతే వాడితో అవసరం తీరిపోతుందో, లేదా వీడు పిసినారివాడు, ఎలాగూ మనకు సహాయం చేయడు అనుకుంటారో అప్పుడే వాడిని గౌరవించడం మానేస్తారు. కానీ విద్య ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం - మన రూపాయలు వేరే దేశానికి తీసుకెళ్తే ఎందుకూ పనికిరావు. అక్కడి ధనం రూపంలోకి మార్చుకున్నా వాటి విలువ చాలా తగ్గిపోతుంది. అయితే సరైన విద్య ఎక్కడైనా ఒకేరకంగా పనికివస్తుంది.

    మరి నిజమైన ధనం ఏమిటి? దేనిని సంపాదిస్తే అది మనదగ్గర శాశ్వతంగా ఉంటుంది? అని ఆలోచిస్తే శ్రీగురుదేవులు 'నామస్మరణ ధనమే నీ ధనము' అని అందించారు. 'నామ్ ధన్ కా ఖజానా బఢాతే చలో' అని కూడా అందించారు. 'భగవత్స్మరణలో, సత్సంగంలో గడిపిన కాలమంతా నీ నిత్యకాలంలో జమ అవుతుంది' అని కూడా బోధించారు. కలియుగంలో మనం సంపాదించుకోవలసిన, జమ చేసుకోవలసిన ధనం నామస్మరణ ధనం ఒక్కటే. ఈ కలియుగంలో సంసార బంధనాల నుంచి ముక్తిని పొందడానికి అంతకంటే వేరొక ఉపాయం ఏదీ లేదని కలిసంతరణ ఉపనిషత్తు బోధిస్తోంది. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే।

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి