31, మార్చి 2021, బుధవారం

కాలజ్ఞానం

    గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారి ప్రార్థనా శ్లోకాలలో ముఖ్యమైన మూడింటిలో మనకు ఒక అంశం ప్రముఖంగా కనిపిస్తుంది. ఒక శ్లోకంలో 'కాలజ్ఞాన విదగ్రణిం' అని, మరొక దానిలో 'కాలవేదినం' అని, మూడవదానిలో 'కాలజ్ఞతాది మహితోజ్వల శక్తిమంతం' అని ఉంటుంది. ఇంతకీ ఈ కాలజ్ఞానం అంటే ఏమిటో, అది కలిగి ఉండటం వలన సాధక బాధకాలేమిటో కొంచెం విచారణ చేద్దాం. 

    మామూలుగా మనకి గతంలో మన జీవితంలోనో, మన కళ్లెదుటనో జరిగిన విషయాలు తెలుస్తాయి. అలాగే వర్తమానంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్న, అనుభవిస్తున్న విషయాలు తెలుస్తాయి. అంతేగాని భవిష్యత్తులో మనకుగాని, వేరే వ్యక్తులకు కానీ ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నిజానికి మానవునికి ఇలా భవిష్యత్తు తెలియకపోవటం ఒక పెద్ద వరమనే చెప్పాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడికి రేపు పరీక్షలో మంచి మార్కులు వస్తాయని ముందుగానే తెలిసిందనుకోండి, ఎలాగూ మంచి మార్కులు వస్తాయి కదా అని వాడు ఈరోజు చదవడం మానేస్తాడు. అలాగే పరీక్షలో తప్పుతానని తెలిసినా ఎలాగూ తప్పేదానికి వృథా శ్రమ ఎందుకని చదవడం మానేస్తాడు. అలాగే మనం జీవితంలో చేసే ప్రతి పనిలో దానివలన భవిష్యత్తులో మనకు ఉపయోగం ఉంటుందనో, మంచి జరుగుతుందనో ఆశతోనే ఆయా పనులు చేస్తూ ఉంటాం. అదే నీ శ్రమంతా వృథా అవుతుంది అని ముందుగానే తెలిస్తే ఏ వ్యక్తీ ఆ పని చేయడు.

    ఈ బ్రతుకు శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. మన దగ్గరివారు ఎవరైనా చనిపోగానే 'ఎంతైనా మానవ జీవితం అశాశ్వతం కదా!' అని స్మశాన వైరాగ్యాన్ని తెచ్చిపెట్టుకుంటాం. కానీ మనం మన జీవితానికి వచ్చేసరికి చేసే ప్రతిపనీ, వేసే ప్రతి ప్రణాళికా మన జీవితం ఇంకా సుదీర్ఘ కాలంపాటు నడుస్తుందనే అంచనాతోనే ముడిపడి ఉంటుంది. అంతెందుకు, రేపు ప్రొద్దున్న దూరప్రయాణం చేయాలంటే ఇవాళ రాత్రంతా మనకు నిద్ర పట్టదు. అలాంటిది రేపు తెల్లవారి మనం లేవకుండా శాశ్వతంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి పోతామని ముందే తెలిస్తే అసలు మనం నిద్రపోగలమా? మరి ప్రతిరోజూ నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి కారణం రేపు తప్పకుండా లేస్తామనే ఆశ. 

    మన పిల్లలు ఎంత చెడుగా ప్రవర్తించినా మాటిమాటికీ వారిని క్షమించి మళ్ళీసారి మంచిగా నడుచుకోమని హితబోధ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఎప్పటికైనా వారు మారతారనే ఆశ. అలాగే  అవతలివారు అడిగినా అడగకపోయినా వారు పాటిస్తారనే ఆశతో సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. అదే మనకు భవిష్యత్తు తెలిసి, వీరు ఖచ్చితంగా మారరు, లేదా మన సలహాలు పాటించరు అని తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఎంతమాత్రం ఆసక్తి చూపిస్తాం? 'పోతేపోనీ' అనుకుంటాం కదా! అలాగే కేవలం భవిష్యత్తే కాదు, వర్తమానంలో ఎదుటివారి మనస్సులో కలిగే భావనలు మనకు తెలిసినా మనం వారితో మాములుగా ప్రవర్తించగలమా?

    అదే కాలజ్ఞాన విదగ్రణి అయిన శ్రీ గురుదేవులకు ఎదుటివారి భూత, భవిష్యత్, వర్తమానాలు స్పష్టంగా తెలియటమే కాకుండా వారి వారి మనస్సులు కూడా తెరచిన పుస్తకంలా విస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయినా వారి వాక్కులోగాని, ప్రవర్తనలో గాని ఎటువంటి మార్పు లేకుండా కేవలం అది తమ ధర్మంగా భావిస్తూ నిష్కామంగా ఎదుటివారిపైన తమ నిర్హేతుకమైన కరుణావర్షాన్ని కురిపింపజేస్తూనే ఉంటారు. తమ బోధనలను పెడచెవిని పెడతారని ముందే తెలిసినా, తమ సూచనలను పాటించరని తెలిసినా, వీరు గతంలో ఎంతో దుష్ప్రవర్తన కలిగినవారని తెలిసినా, వీడి బుద్ధి కుక్క తోకలాగా మళ్ళీ మళ్ళీ వంకర తిరుగుతూనే ఉంటుందని తెలిసినా  శ్రీగురుదేవుల కర్తవ్య నిష్టలో కానీ, వారి కరుణా ప్రసారంలో కానీ ఎటువంటి మార్పూ ఉండదు. ఎందుకంటే సర్వ మానవాళిని, సకల జీవకోటిని ఉద్దరించటమే వారి అవతార లక్ష్యం, ఆశయం. అందుకే 'మాములు మానవులు ఆశలకోసం జీవిస్తారు, మహాత్ములు ఆశయాలకై జీవిస్తారు' అని పెద్దలంటారు.

    అంతేకాదు, మనం ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూస్తాం. అంటే ముందు ఒక శరీరాన్ని, దానియొక్క రంగును, రూపురేఖలను, వేషభాషలను చూస్తాం. ఇంకొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళనైతే వాళ్ళ మానసిక స్వభావాన్ని బట్టి చూస్తాం. అంతేగాని ఆయా శరీరాలను, మనసులను దాటి సర్వత్రా ప్రకాశించే ఆత్మవస్తువును చూడటం మనకు చేతకాదు. కానీ గురువుల, మహాత్ముల దృష్టి ఎల్లప్పుడూ ఆత్మవస్తువు మీదనే ఉంటుంది. అటువంటప్పుడు ఈ పైకి కనిపించే భేదాలు కానీ, వారి దివ్యదృష్టికి మాత్రమే కనిపించే త్రికాలాలయందలి చర్యలు, భావనలు కానీ అట్టి మహాత్ములపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. ఆయా దేహాలను, మనసులను వారు ఆ ఆత్మ ధరించే ఆచ్చాదనలగానే చూస్తారుగాని వాటిని ఆ ఆత్మకు ఆపాదించరు. 

    ఉదాహరణకు మీరు ఒక పెళ్ళి బంతిలో పప్పు వడ్డన చేస్తున్నారనుకోండి. ఎవరో మిమ్మల్ని 'ఓయ్ పప్పూ! ఇలా రా!' అంటే మీరు వెంటనే వెళ్ళి వారికి వడ్డిస్తారా? లేకపోతే 'వీడెవడు నన్ను పప్పు అని పిలుస్తాడు?' అని వాళ్ళతో గొడవపడతారా? ఖచ్చితంగా మొదటి మార్గాన్నే  ఎంచుకుంటారు కదా! ఎందుకంటే ఇక్కడ మీకు రెండు విషయాలు స్పష్టంగా తెలుసు. మొదటిది అతడు పప్పూ అని పిలిచింది పప్పు బకెట్టు పట్టుకున్న వ్యక్తి అనే ఉద్దేశ్యంతోనే కానీ మీరేదో తెలివితేటలు లేనివారని కాదు. రెండవది, మీరు కేవలం పప్పును పట్టుకున్నారే కానీ దాని గుణగణాలతో, లక్షణాలతో మీకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ శరీరాన్ని, మనసును ఆత్మ పట్టుకుని నడిపిస్తోందే కానీ వీటి గుణగణాలలో, రూపనామాలతో దానికి ఎటువంటి సంబంధం లేదు. మరి ఈ జ్ఞానాన్ని దృఢంగా నిత్యం అనుభవిస్తూ ఉన్న మహాత్ములకు ఆయా శరీరాల, మనసుల గుణగణాలతో, రూపనామాలతో పని ఏముంది? వారు ఎవరితో ఏమి మాట్లాడినా, ఎవరికి ఏమి చేసినా అక్కడ అంతా ఏకత్వమే కానీ రెండో భావనకు చోటు లేదు.

    ఎదుటివారికి దురద వచ్చి మిమ్మల్ని గోకమంటే అది కాలిమీదా, లేక తలమీదా అని ఉచ్చనీచాలు ఆలోచిస్తారు కానీ మీ కాలికి దురద వస్తే మీ చేయి అలా ఆలోచిస్తోందా? నేను ఉన్నతమైన తలమీద అయితేనే గోకుతాను కానీ నీచమైన ప్రదేశంలో గోకను అంటుందా? ఎందుకు? ఇవన్నీ మీ శరీరంలోని భాగాలే కాబట్టి అక్కడ భేద దృష్టి లేదు. అలాగే ఈ సృష్టిలో కనిపించేదంతా ఆ పరమాత్మలో భాగమే అనే దృఢమైన జ్ఞానం ఉన్నవారే ఎదుటివారిలోని తప్పులు, లేదా వారి భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తున్నా ఎటువంటి భేదదృష్టి లేకుండా అందరితో సమానంగా ప్రవర్తించగలరు. 

22, ఫిబ్రవరి 2021, సోమవారం

భీష్మ పితామహుడు

మహాభారతంలో భీష్మ పితామహులవారిది అత్యంత విశిష్టమైన పాత్ర. భీష్ముడు గత జన్మలో అష్ట వసువులలో ఒకడైన ప్రభాసుడు. ఒకనాడు అష్ట వసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠులవారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈ ప్రభాసుని భార్య అక్కడి నందినీ ధేనువుని తరలించుకు పోవాలని కోరుతుంది. భార్యను సంతోషపెట్టడానికై ప్రభాసుడు ఆ ధేనువును దొంగిలిస్తాడు. దానికి మిగిలిన ఏడుగురు వసువులు కూడా సహకరిస్తారు. అప్పుడు మానవ లోకంలో జన్మించమని వశిష్ఠుడు వారందరినీ శపిస్తే వారు తిరిగి వేడుకొనగా అసలు పాపం చేసిన ప్రభాసుడు మాత్రం చిరకాలం మనుష్య జన్మలో గడపవలసి ఉంటుందని, మిగిలినవారు జన్మించగానే శాపవిమోచనమై తిరిగి వసులోకానికి చేరతారని శెలవిస్తారు. ఆ అష్ట వసువులు తమకు తల్లిగా ఉండమని గంగాదేవిని ప్రార్ధించి శంతన మహారాజు ద్వారా ఆవిడకు పుత్రులుగా జన్మిస్తారు. మొదటి ఏడుగురిని పుట్టగానే గంగామాత నదిలో ముంచి శాపవిమోచనం కలిగించడం, ఎనిమిదవవాడైన ప్రభాసుని కూడా ముంచబోతుంటే శంతనుడు అడ్డుపడటంతో అతడు చిరకాలం మానవ రూపంలో జీవించవలసిరావడం మనకు తెలిసిందే. 

పూర్వం జడభరతుడు సర్వసంగ పరిత్యాగం చేసి కూడా ఒక చిన్న లేడిపిల్లమీద జాలితో దగ్గరకు తీసి, దానిమీద మమకారం పెంచుకొని చివరకు దాని ధ్యాసలోనే మరణించి పునర్జన్మను పొందుతాడు. అయితే మరుజన్మలో తన గతజన్మ స్మృతి ఉండటంతో మళ్ళీ అటువంటి వలలో పడకూడదని సర్వ కర్మలను త్యజించి జడుడిగా జీవిస్తూ జడభరతుడనే పేరు తెచ్చుకున్నాడు. అలాగే శాపవశాత్తూ దేవవ్రతునిగా జన్మించిన ఈ ప్రభాసునికి కూడా గత జన్మ స్మృతి ఉన్నదనిపిస్తుంది.  గత జన్మలో భార్య మోహంలో పడి తాను చేసిన కర్మవలన తాను ఈ మానవజన్మ ఎత్తవలసి వచ్చిందనే జ్ఞానం ఎక్కడో బీజరూపంలో ఉన్నదనిపిస్తుంది. తాను ఆ కాలంలో సంపూర్ణ భారతావనిలోనే అత్యంత శక్తివంతుడు, సకల విద్యాపారంగతుడు అయినప్పటికీ తనకోసం ఎట్టి కర్మలూ ఆచరించడు.

చిన్నతనంలో తల్లి ఎలా చెబితే అలా నడుచుకోవటం, ఆ తల్లి తనను తండ్రియైన శంతనునికి అప్పగించిన తరువాత ఆయనకోసమే తన జీవితాన్ని అంకితం చేయడం మనం గమనించవచ్చు. తండ్రి మత్స్యకన్య మోహంలో పడి దుఃఖాతురుడై ఉన్నప్పుడు అదే అదనుగా భావించి తాను రాజ్యాన్ని, సంసార సుఖాలను త్యజించి ఎవరు రాజైనా హస్తినాపుర సింహాసనానికి బద్ధుడనై తన జీవితం గడుపుతానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా వినుతికెక్కుతాడు దేవవ్రతుడు. తండ్రి మరణం తరువాత తాను దక్షుడై ఉండి కూడా అసమర్థుడైన విచిత్రవీర్యుడిని రాజుగా చేస్తాడు. తల్లి ఆజ్ఞమేరకు ఆ విచిత్రవీర్యుని కొరకై అంబ, అంబిక, అంబాలికలను వారి స్వయంవరం భగ్నం చేసి మరీ తీసుకువస్తాడు. తాను చేసిన పనివలన అంబ జీవితం నాశనమైనా తాను మాత్రం తన నిస్సంగత్వానికే కట్టుబడి ఉంటాడు. విచిత్రవీర్యుడు మరణించిన తరువాత కూడా తాను రాజ్యాన్ని స్వీకరించక కర్తవ్యాన్ని సత్యవతికే వదలివేస్తాడు.

భీష్మాచార్యుల వారిని తప్పుపట్టే స్థాయి మనకు ఎవ్వరికీ లేదు కానీ, వారి జీవితాన్ని మరో దృక్కోణంలో చూడటానికి, దానినుంచి కొంతైనా పాఠం నేర్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. ఇక్కడ ప్రతిజ్ఞ గురించి మాట్లాడుకుంటే మరి శ్రీకృష్ణుడు కూడా తాను మహాభారత యుధ్ధంలో కేవలం సలహాలు మాత్రమే ఇస్తాను కానీ ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసాడు. కానీ ధర్మరక్షణ కోసం అర్జునుని కాచుకోవటానికి, అలాగే తనతో ఆయుధం పట్టించాలనే తన భక్తుడైన భీష్ముని కోరిక నెరవేర్చటానికి తన ప్రతిజ్ఞను సైతం పక్కనపెట్టి చక్రాన్ని చేపట్టి భీష్మునిపైకి లంఘించాడు. కానీ భీష్ముడు మాత్రం ఎంతటి ధర్మ సంకటం ఎదురైనా, ధర్మగ్లాని కలిగినా, తన ప్రతిజ్ఞకే కట్టుబడి నిష్క్రియంగానే ఉండిపోయాడు. అలాగే రాజాజ్ఞ మేరకు ఉత్తర గోగ్రహణంలో, మహాభారత యుద్ధంలో కూడా అధర్మ పక్షానే నిలిచాడు. 

ఒకవిధంగా చూస్తే తనకు సమర్థత లేనప్పటికీ విదురుడు తనకు చేతనైనంతలో ఎప్పటికప్పుడు కౌరవుల కుతంత్రాలను కనిపెడుతూ, పాండవులను హెచ్చరిస్తూ వారిని, ధర్మాన్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళి ఆయనను అనుగ్రహించాడనిపిస్తుంది. భీష్మునికి ధర్మం పాండవుల పక్షానే ఉన్నదని మొదటినుంచీ తెలిసినా, మనసులో పాండవుల క్షేమాన్ని, అభ్యుదయాన్నే కోరుకుంటూ ఉన్నా, అందుకు తగిన కర్మలను మాత్రం చేయలేకపోయాడు. ద్రోణాచార్యులవారు కూడా అన్నీ తెలిసినా గ్రుడ్డిగా భీష్ములవారినే అనుసరించారు. అందుకే రాయబారంలో పరమాత్మ సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ -  సత్యధర్మాలు  పాపము, బొంకు వలన ఎప్పుడైతే  దురవస్థల పాలై తిరిగి వృద్ధిపొందే దారి కానక క్షోభిస్తాయో అప్పుడు తాము దక్షులై ఉండికూడా ఉపేక్ష చేసినవారికి అది తప్పక చేటు చేస్తుంది. అయితే సత్యధర్మాలను ఉద్ధరించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడని వారిరువురినీ హెచ్చరిస్తాడు.

సంసార బంధాలనుండి విడివడి ముక్తిని పొందటానికి కర్మపరిత్యాగం ఎంతమాత్రం మార్గం కాదని, 'నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకు కావాలి' అనే కర్తృత్వ, భోక్తృత్వ అహంకారాలను విడిచిపెట్టి నిష్కామంగా తన కర్తవ్యాన్ని ఆచరించడమే ముక్తికి మార్గమని కృష్ణుడు బోధించిన గీతాసారాన్ని ఎట్టకేలకు గ్రహించిన భీష్మాచార్యులవారు, హస్తినాపుర సింహాసనానికి కట్టుబడి ఉంటాననే తన ప్రతిజ్ఞను ప్రక్కనపెట్టి ధర్మవిజయానికై పాండవులకు తనను జయించే మార్గాన్ని ఉపదేశిస్తారు. అలా తన బోధను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన భీష్మునిపట్ల  భగవానుడు అత్యంత ప్రసన్నుడై ఆయన అంత్యకాలంలో పరమ భాగవతులందరిని వెంటపెట్టుకొని ఆయనకు దర్శనమిచ్చి, ఆయన ముఖస్తుగా విష్ణు సహస్రనామాలను ప్రవహింపచేసి ముక్తిని ప్రసాదించారు.

కర్తా కారయితాచైవ ప్రేక్షకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతంచైవ చత్వారః సమభాగినః అని ఆర్యోక్తి. ఒక మంచి పనికైనా చెడ్డ పనికైనా చేసినవాడు, చేయించినవాడు, చూస్తూ ఊరుకున్నవాడు, దానిని ఆమోదించి ఆనందించినవాడు ఈ నలుగురూ దాని ఫలితాన్ని సమానంగా పొందుతారని దీని భావం. ఈనాడు లోకంలో జరుగుతున్న అనేక అన్యాయాలను చూస్తూ, వాటిని ఆపే సమర్థత, కనీసం అది తప్పని చెప్పే పెద్దరికం ఉండికూడా 'వారి పాపాన వారే పోతారులే, మనకెందుకు?' అని ఊరుకునేవారు ఇది తప్పక తెలుసుకోవలసిన విషయం.

31, జనవరి 2021, ఆదివారం

ఈశ్వరుడు

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః

    ఈశ్వరుడికి, గురువుకు, ఆత్మకు రూపంలో భేదం తప్ప అసలు వస్తువులో భేదం లేదని, ఆకాశం ఎలాగైతే సర్వవ్యాపకమై ఉన్నదో అలాగే ఈశ్వరుడు కూడా సర్వవ్యాపకుడని ఈ దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకం వివరిస్తోంది. ఇలా మూడు రూపాలలో ఉంటూ మనకి బాగా తెలిసిన వస్తువు నీరు. నీటి ఆవిరి, లేదా తేమ రూపంలో మన చుట్టూ ఉన్న గాలి అంతటా వ్యాపించి ఉంటుంది నీరు. దీనికి ఒక రూపం లేదు. అలాగే ద్రవ రూపంలో మనం నిత్యం ఉపయోగించుకునే నీరు ఒక రూపంలో కనిపిస్తుంది కానీ ఒక నిర్దుష్టమైన ఆకారం లేకుండా అది ఏ పాత్రలో ప్రవేశిస్తే ఆ పాత్ర ఆకారాన్ని తాను పొందుతూ ఉంటుంది. అదే నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు తనకంటూ ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

    ఈశ్వరుడు కూడా ఆ నీటి ఆవిరిలాగే సర్వవ్యాపకుడైనప్పటికీ మన కంటికి కనిపించకుండా ఉంటాడు. అదే ఈశ్వరుడు ఆత్మ రూపాన్ని పొందినపుడు ఏ ప్రాణి శరీరంలో ప్రవేశిస్తే ఆ ప్రాణి ఆకారాన్ని పొంది, దానిలో చైతన్యాన్ని నింపి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ రెండు రూపాలూ కూడా ఇంద్రియాలకు అగోచరమైనవే. మరి ఆ ఈశ్వరుని, లేదా ఆత్మను తెలుసుకోవడం ఎలా? నిజంగా అలా తెలుసుకోవాలన్న ఆవేదన తీవ్రతరమైనపుడు ఆ భక్తుని భక్తిని సిద్ధింపచేయటానికై అదే ఈశ్వరుడు ఘనీభవించిన రూపంలో ఒక గురువుగా మనముందు ప్రత్యక్షమవుతాడు. "అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తిసిద్ధయే"

    నీరు వాతావరణంలోని మార్పులకు చాలా త్వరగా వేడెక్కిపోతూ ఉంటుంది. అలాగే మనందరిలో ఉన్న ఆత్మ సంసార తాపత్రయ స్పర్శ చేత ఆవేదనకు గురవుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు వేసవికాలంలో ఏవైనా పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు మంచినీళ్ళ పాత్రలలో మంచుగడ్డలు వేసేవారు. ఆ మంచుగడ్డ తాను ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా తన సాన్నిహిత్యంతో ఆ నీటిని కూడా చల్లగా చేస్తుంది. అలాగే ఆ మంచుగడ్డ త్వరగా కరిగిపోయినా కూడా నీటిలో ఆ చల్లదనం చాలాకాలం నిలిచి ఉంటుంది. అలాగే ఒక మహత్తరమైన ప్రయోజనం కొరకు ఆకారాన్ని ధరించి వచ్చిన గురువులు ఈ సంసార తాపత్రయంలో ఉంటూ కూడా తాము నిశ్చలమైన ప్రశాంతతను అనుభవించడమే కాకుండా తమనాశ్రయించిన వారందరి మనసులనూ అటువంటి ప్రశాంతతతో నింపివేస్తారు. తమ అవతార ప్రయోజనం నెరవేరగానే ఆ గురువుల రూపం కనుమరుగయినా వారి బోధలనుండి ప్రసరించిన ప్రశాంతత చిరకాలం అనేక జీవాత్మలకు శాంతిని ప్రసాదిస్తూనే ఉంటుంది.

    "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి" - "అర్జునా! ఈశ్వరుడు సర్వభూతాల హృదయంలో స్థిర నివాసియై ఉంటాడు" అని గీతాచార్యుడు ప్రవచించాడు. అయితే మనం ఈ హృదయంలోకి చూడటం అలవాటు చేసుకోవాలి. మన మనస్సు నిరంతరం బయటి విషయాల వెంటే పరుగులు పెడుతూ ఉంటుంది. తాను అనుకున్నది పొందటం కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. అది జరిగితే ఆనందిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా కృంగిపోతుంది. దీనికి కారణం కూడా అదే శ్లోకంలో పరమాత్మ చెబుతున్నాడు. "భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా" - "ఆ ఈశ్వరుడు ఊరికే హృదయంలో కూర్చోకుండా ఆయా జీవులను తన మాయ అనే యంత్రంలో వేసి గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు". 

    సాక్షాత్తు ఈశ్వరాంశ అయిన ఆంజనేయ స్వామి కుడా సీతాన్వేషణలో ఇలాగే లంకంతా గాలించినా అమ్మ కనబడక "ఇప్పుడు నేను అమ్మను చూడకుండా తిరిగి వెళితే రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తాడు, సుగ్రీవుడు మరణిస్తాడు, అయోధ్యలో ఇంకా కిష్కింధలో ఉన్న వారందరూ మరణిస్తారు" ఇలా చాలా చాలా దూరాలోచన లోకి వెళ్ళిపోతాడు. మనసు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అయితే ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఒక్కసారి తన మనస్సును కట్టడి చేసి తన హృదయంలోకి చూసుకుంటాడు. అక్కడ ప్రకాశిస్తున్న సీతారాముల దర్శనం కాగానే వారిని ప్రార్థించడం, వెంటనే ఆయనకు అశోకవనం, అందులో సీతాదేవి ప్రత్యక్ష దర్శనం కలగడం జరిగిపోతాయి. 

    గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు కూడా "నేను మీ హృదయ బాబును" అనేవారు. మనం సమస్యలలో చిక్కుకుని, ఎటూ నిర్ణయించుకోలేని ద్వైదీభావంలో మనస్సు అశాంతిని పొందినప్పుడు నిరాకారంగా ఉండే ఈశ్వరుడిని దర్శించలేకపోయినా, సాకారంగా వచ్చిన గురుదేవుల రూపం కనుమరుగయినా, మనసును పక్కనబెట్టి మన హృదయ క్షేత్రంలో నిరంతరం ప్రకాశించే ఈశ్వరుని మాట వినగలిగితే అంతులేని ప్రశాంతత మన సొంతమవుతుంది.