22, ఫిబ్రవరి 2021, సోమవారం

భీష్మ పితామహుడు

మహాభారతంలో భీష్మ పితామహులవారిది అత్యంత విశిష్టమైన పాత్ర. భీష్ముడు గత జన్మలో అష్ట వసువులలో ఒకడైన ప్రభాసుడు. ఒకనాడు అష్ట వసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠులవారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈ ప్రభాసుని భార్య అక్కడి నందినీ ధేనువుని తరలించుకు పోవాలని కోరుతుంది. భార్యను సంతోషపెట్టడానికై ప్రభాసుడు ఆ ధేనువును దొంగిలిస్తాడు. దానికి మిగిలిన ఏడుగురు వసువులు కూడా సహకరిస్తారు. అప్పుడు మానవ లోకంలో జన్మించమని వశిష్ఠుడు వారందరినీ శపిస్తే వారు తిరిగి వేడుకొనగా అసలు పాపం చేసిన ప్రభాసుడు మాత్రం చిరకాలం మనుష్య జన్మలో గడపవలసి ఉంటుందని, మిగిలినవారు జన్మించగానే శాపవిమోచనమై తిరిగి వసులోకానికి చేరతారని శెలవిస్తారు. ఆ అష్ట వసువులు తమకు తల్లిగా ఉండమని గంగాదేవిని ప్రార్ధించి శంతన మహారాజు ద్వారా ఆవిడకు పుత్రులుగా జన్మిస్తారు. మొదటి ఏడుగురిని పుట్టగానే గంగామాత నదిలో ముంచి శాపవిమోచనం కలిగించడం, ఎనిమిదవవాడైన ప్రభాసుని కూడా ముంచబోతుంటే శంతనుడు అడ్డుపడటంతో అతడు చిరకాలం మానవ రూపంలో జీవించవలసిరావడం మనకు తెలిసిందే. 

పూర్వం జడభరతుడు సర్వసంగ పరిత్యాగం చేసి కూడా ఒక చిన్న లేడిపిల్లమీద జాలితో దగ్గరకు తీసి, దానిమీద మమకారం పెంచుకొని చివరకు దాని ధ్యాసలోనే మరణించి పునర్జన్మను పొందుతాడు. అయితే మరుజన్మలో తన గతజన్మ స్మృతి ఉండటంతో మళ్ళీ అటువంటి వలలో పడకూడదని సర్వ కర్మలను త్యజించి జడుడిగా జీవిస్తూ జడభరతుడనే పేరు తెచ్చుకున్నాడు. అలాగే శాపవశాత్తూ దేవవ్రతునిగా జన్మించిన ఈ ప్రభాసునికి కూడా గత జన్మ స్మృతి ఉన్నదనిపిస్తుంది.  గత జన్మలో భార్య మోహంలో పడి తాను చేసిన కర్మవలన తాను ఈ మానవజన్మ ఎత్తవలసి వచ్చిందనే జ్ఞానం ఎక్కడో బీజరూపంలో ఉన్నదనిపిస్తుంది. తాను ఆ కాలంలో సంపూర్ణ భారతావనిలోనే అత్యంత శక్తివంతుడు, సకల విద్యాపారంగతుడు అయినప్పటికీ తనకోసం ఎట్టి కర్మలూ ఆచరించడు.

చిన్నతనంలో తల్లి ఎలా చెబితే అలా నడుచుకోవటం, ఆ తల్లి తనను తండ్రియైన శంతనునికి అప్పగించిన తరువాత ఆయనకోసమే తన జీవితాన్ని అంకితం చేయడం మనం గమనించవచ్చు. తండ్రి మత్స్యకన్య మోహంలో పడి దుఃఖాతురుడై ఉన్నప్పుడు అదే అదనుగా భావించి తాను రాజ్యాన్ని, సంసార సుఖాలను త్యజించి ఎవరు రాజైనా హస్తినాపుర సింహాసనానికి బద్ధుడనై తన జీవితం గడుపుతానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా వినుతికెక్కుతాడు దేవవ్రతుడు. తండ్రి మరణం తరువాత తాను దక్షుడై ఉండి కూడా అసమర్థుడైన విచిత్రవీర్యుడిని రాజుగా చేస్తాడు. తల్లి ఆజ్ఞమేరకు ఆ విచిత్రవీర్యుని కొరకై అంబ, అంబిక, అంబాలికలను వారి స్వయంవరం భగ్నం చేసి మరీ తీసుకువస్తాడు. తాను చేసిన పనివలన అంబ జీవితం నాశనమైనా తాను మాత్రం తన నిస్సంగత్వానికే కట్టుబడి ఉంటాడు. విచిత్రవీర్యుడు మరణించిన తరువాత కూడా తాను రాజ్యాన్ని స్వీకరించక కర్తవ్యాన్ని సత్యవతికే వదలివేస్తాడు.

భీష్మాచార్యుల వారిని తప్పుపట్టే స్థాయి మనకు ఎవ్వరికీ లేదు కానీ, వారి జీవితాన్ని మరో దృక్కోణంలో చూడటానికి, దానినుంచి కొంతైనా పాఠం నేర్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. ఇక్కడ ప్రతిజ్ఞ గురించి మాట్లాడుకుంటే మరి శ్రీకృష్ణుడు కూడా తాను మహాభారత యుధ్ధంలో కేవలం సలహాలు మాత్రమే ఇస్తాను కానీ ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసాడు. కానీ ధర్మరక్షణ కోసం అర్జునుని కాచుకోవటానికి, అలాగే తనతో ఆయుధం పట్టించాలనే తన భక్తుడైన భీష్ముని కోరిక నెరవేర్చటానికి తన ప్రతిజ్ఞను సైతం పక్కనపెట్టి చక్రాన్ని చేపట్టి భీష్మునిపైకి లంఘించాడు. కానీ భీష్ముడు మాత్రం ఎంతటి ధర్మ సంకటం ఎదురైనా, ధర్మగ్లాని కలిగినా, తన ప్రతిజ్ఞకే కట్టుబడి నిష్క్రియంగానే ఉండిపోయాడు. అలాగే రాజాజ్ఞ మేరకు ఉత్తర గోగ్రహణంలో, మహాభారత యుద్ధంలో కూడా అధర్మ పక్షానే నిలిచాడు. 

ఒకవిధంగా చూస్తే తనకు సమర్థత లేనప్పటికీ విదురుడు తనకు చేతనైనంతలో ఎప్పటికప్పుడు కౌరవుల కుతంత్రాలను కనిపెడుతూ, పాండవులను హెచ్చరిస్తూ వారిని, ధర్మాన్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు విదురుని ఇంటికి వెళ్ళి ఆయనను అనుగ్రహించాడనిపిస్తుంది. భీష్మునికి ధర్మం పాండవుల పక్షానే ఉన్నదని మొదటినుంచీ తెలిసినా, మనసులో పాండవుల క్షేమాన్ని, అభ్యుదయాన్నే కోరుకుంటూ ఉన్నా, అందుకు తగిన కర్మలను మాత్రం చేయలేకపోయాడు. ద్రోణాచార్యులవారు కూడా అన్నీ తెలిసినా గ్రుడ్డిగా భీష్ములవారినే అనుసరించారు. అందుకే రాయబారంలో పరమాత్మ సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ -  సత్యధర్మాలు  పాపము, బొంకు వలన ఎప్పుడైతే  దురవస్థల పాలై తిరిగి వృద్ధిపొందే దారి కానక క్షోభిస్తాయో అప్పుడు తాము దక్షులై ఉండికూడా ఉపేక్ష చేసినవారికి అది తప్పక చేటు చేస్తుంది. అయితే సత్యధర్మాలను ఉద్ధరించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడని వారిరువురినీ హెచ్చరిస్తాడు.

సంసార బంధాలనుండి విడివడి ముక్తిని పొందటానికి కర్మపరిత్యాగం ఎంతమాత్రం మార్గం కాదని, 'నేను చేస్తున్నాను, దీని ఫలితం నాకు కావాలి' అనే కర్తృత్వ, భోక్తృత్వ అహంకారాలను విడిచిపెట్టి నిష్కామంగా తన కర్తవ్యాన్ని ఆచరించడమే ముక్తికి మార్గమని కృష్ణుడు బోధించిన గీతాసారాన్ని ఎట్టకేలకు గ్రహించిన భీష్మాచార్యులవారు, హస్తినాపుర సింహాసనానికి కట్టుబడి ఉంటాననే తన ప్రతిజ్ఞను ప్రక్కనపెట్టి ధర్మవిజయానికై పాండవులకు తనను జయించే మార్గాన్ని ఉపదేశిస్తారు. అలా తన బోధను అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన భీష్మునిపట్ల  భగవానుడు అత్యంత ప్రసన్నుడై ఆయన అంత్యకాలంలో పరమ భాగవతులందరిని వెంటపెట్టుకొని ఆయనకు దర్శనమిచ్చి, ఆయన ముఖస్తుగా విష్ణు సహస్రనామాలను ప్రవహింపచేసి ముక్తిని ప్రసాదించారు.

కర్తా కారయితాచైవ ప్రేక్షకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతంచైవ చత్వారః సమభాగినః అని ఆర్యోక్తి. ఒక మంచి పనికైనా చెడ్డ పనికైనా చేసినవాడు, చేయించినవాడు, చూస్తూ ఊరుకున్నవాడు, దానిని ఆమోదించి ఆనందించినవాడు ఈ నలుగురూ దాని ఫలితాన్ని సమానంగా పొందుతారని దీని భావం. ఈనాడు లోకంలో జరుగుతున్న అనేక అన్యాయాలను చూస్తూ, వాటిని ఆపే సమర్థత, కనీసం అది తప్పని చెప్పే పెద్దరికం ఉండికూడా 'వారి పాపాన వారే పోతారులే, మనకెందుకు?' అని ఊరుకునేవారు ఇది తప్పక తెలుసుకోవలసిన విషయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి