గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారి ప్రార్థనా శ్లోకాలలో ముఖ్యమైన మూడింటిలో మనకు ఒక అంశం ప్రముఖంగా కనిపిస్తుంది. ఒక శ్లోకంలో 'కాలజ్ఞాన విదగ్రణిం' అని, మరొక దానిలో 'కాలవేదినం' అని, మూడవదానిలో 'కాలజ్ఞతాది మహితోజ్వల శక్తిమంతం' అని ఉంటుంది. ఇంతకీ ఈ కాలజ్ఞానం అంటే ఏమిటో, అది కలిగి ఉండటం వలన సాధక బాధకాలేమిటో కొంచెం విచారణ చేద్దాం.
మామూలుగా మనకి గతంలో మన జీవితంలోనో, మన కళ్లెదుటనో జరిగిన విషయాలు తెలుస్తాయి. అలాగే వర్తమానంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్న, అనుభవిస్తున్న విషయాలు తెలుస్తాయి. అంతేగాని భవిష్యత్తులో మనకుగాని, వేరే వ్యక్తులకు కానీ ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నిజానికి మానవునికి ఇలా భవిష్యత్తు తెలియకపోవటం ఒక పెద్ద వరమనే చెప్పాలి. ఉదాహరణకు ఒక పిల్లవాడికి రేపు పరీక్షలో మంచి మార్కులు వస్తాయని ముందుగానే తెలిసిందనుకోండి, ఎలాగూ మంచి మార్కులు వస్తాయి కదా అని వాడు ఈరోజు చదవడం మానేస్తాడు. అలాగే పరీక్షలో తప్పుతానని తెలిసినా ఎలాగూ తప్పేదానికి వృథా శ్రమ ఎందుకని చదవడం మానేస్తాడు. అలాగే మనం జీవితంలో చేసే ప్రతి పనిలో దానివలన భవిష్యత్తులో మనకు ఉపయోగం ఉంటుందనో, మంచి జరుగుతుందనో ఆశతోనే ఆయా పనులు చేస్తూ ఉంటాం. అదే నీ శ్రమంతా వృథా అవుతుంది అని ముందుగానే తెలిస్తే ఏ వ్యక్తీ ఆ పని చేయడు.
ఈ బ్రతుకు శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. మన దగ్గరివారు ఎవరైనా చనిపోగానే 'ఎంతైనా మానవ జీవితం అశాశ్వతం కదా!' అని స్మశాన వైరాగ్యాన్ని తెచ్చిపెట్టుకుంటాం. కానీ మనం మన జీవితానికి వచ్చేసరికి చేసే ప్రతిపనీ, వేసే ప్రతి ప్రణాళికా మన జీవితం ఇంకా సుదీర్ఘ కాలంపాటు నడుస్తుందనే అంచనాతోనే ముడిపడి ఉంటుంది. అంతెందుకు, రేపు ప్రొద్దున్న దూరప్రయాణం చేయాలంటే ఇవాళ రాత్రంతా మనకు నిద్ర పట్టదు. అలాంటిది రేపు తెల్లవారి మనం లేవకుండా శాశ్వతంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి పోతామని ముందే తెలిస్తే అసలు మనం నిద్రపోగలమా? మరి ప్రతిరోజూ నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి కారణం రేపు తప్పకుండా లేస్తామనే ఆశ.
మన పిల్లలు ఎంత చెడుగా ప్రవర్తించినా మాటిమాటికీ వారిని క్షమించి మళ్ళీసారి మంచిగా నడుచుకోమని హితబోధ చేస్తూ ఉంటాం. ఎందుకు? ఎప్పటికైనా వారు మారతారనే ఆశ. అలాగే అవతలివారు అడిగినా అడగకపోయినా వారు పాటిస్తారనే ఆశతో సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. అదే మనకు భవిష్యత్తు తెలిసి, వీరు ఖచ్చితంగా మారరు, లేదా మన సలహాలు పాటించరు అని తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఎంతమాత్రం ఆసక్తి చూపిస్తాం? 'పోతేపోనీ' అనుకుంటాం కదా! అలాగే కేవలం భవిష్యత్తే కాదు, వర్తమానంలో ఎదుటివారి మనస్సులో కలిగే భావనలు మనకు తెలిసినా మనం వారితో మాములుగా ప్రవర్తించగలమా?
అదే కాలజ్ఞాన విదగ్రణి అయిన శ్రీ గురుదేవులకు ఎదుటివారి భూత, భవిష్యత్, వర్తమానాలు స్పష్టంగా తెలియటమే కాకుండా వారి వారి మనస్సులు కూడా తెరచిన పుస్తకంలా విస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయినా వారి వాక్కులోగాని, ప్రవర్తనలో గాని ఎటువంటి మార్పు లేకుండా కేవలం అది తమ ధర్మంగా భావిస్తూ నిష్కామంగా ఎదుటివారిపైన తమ నిర్హేతుకమైన కరుణావర్షాన్ని కురిపింపజేస్తూనే ఉంటారు. తమ బోధనలను పెడచెవిని పెడతారని ముందే తెలిసినా, తమ సూచనలను పాటించరని తెలిసినా, వీరు గతంలో ఎంతో దుష్ప్రవర్తన కలిగినవారని తెలిసినా, వీడి బుద్ధి కుక్క తోకలాగా మళ్ళీ మళ్ళీ వంకర తిరుగుతూనే ఉంటుందని తెలిసినా శ్రీగురుదేవుల కర్తవ్య నిష్టలో కానీ, వారి కరుణా ప్రసారంలో కానీ ఎటువంటి మార్పూ ఉండదు. ఎందుకంటే సర్వ మానవాళిని, సకల జీవకోటిని ఉద్దరించటమే వారి అవతార లక్ష్యం, ఆశయం. అందుకే 'మాములు మానవులు ఆశలకోసం జీవిస్తారు, మహాత్ములు ఆశయాలకై జీవిస్తారు' అని పెద్దలంటారు.
అంతేకాదు, మనం ఒక వ్యక్తిని వ్యక్తిగానే చూస్తాం. అంటే ముందు ఒక శరీరాన్ని, దానియొక్క రంగును, రూపురేఖలను, వేషభాషలను చూస్తాం. ఇంకొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళనైతే వాళ్ళ మానసిక స్వభావాన్ని బట్టి చూస్తాం. అంతేగాని ఆయా శరీరాలను, మనసులను దాటి సర్వత్రా ప్రకాశించే ఆత్మవస్తువును చూడటం మనకు చేతకాదు. కానీ గురువుల, మహాత్ముల దృష్టి ఎల్లప్పుడూ ఆత్మవస్తువు మీదనే ఉంటుంది. అటువంటప్పుడు ఈ పైకి కనిపించే భేదాలు కానీ, వారి దివ్యదృష్టికి మాత్రమే కనిపించే త్రికాలాలయందలి చర్యలు, భావనలు కానీ అట్టి మహాత్ములపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. ఆయా దేహాలను, మనసులను వారు ఆ ఆత్మ ధరించే ఆచ్చాదనలగానే చూస్తారుగాని వాటిని ఆ ఆత్మకు ఆపాదించరు.
ఉదాహరణకు మీరు ఒక పెళ్ళి బంతిలో పప్పు వడ్డన చేస్తున్నారనుకోండి. ఎవరో మిమ్మల్ని 'ఓయ్ పప్పూ! ఇలా రా!' అంటే మీరు వెంటనే వెళ్ళి వారికి వడ్డిస్తారా? లేకపోతే 'వీడెవడు నన్ను పప్పు అని పిలుస్తాడు?' అని వాళ్ళతో గొడవపడతారా? ఖచ్చితంగా మొదటి మార్గాన్నే ఎంచుకుంటారు కదా! ఎందుకంటే ఇక్కడ మీకు రెండు విషయాలు స్పష్టంగా తెలుసు. మొదటిది అతడు పప్పూ అని పిలిచింది పప్పు బకెట్టు పట్టుకున్న వ్యక్తి అనే ఉద్దేశ్యంతోనే కానీ మీరేదో తెలివితేటలు లేనివారని కాదు. రెండవది, మీరు కేవలం పప్పును పట్టుకున్నారే కానీ దాని గుణగణాలతో, లక్షణాలతో మీకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ శరీరాన్ని, మనసును ఆత్మ పట్టుకుని నడిపిస్తోందే కానీ వీటి గుణగణాలలో, రూపనామాలతో దానికి ఎటువంటి సంబంధం లేదు. మరి ఈ జ్ఞానాన్ని దృఢంగా నిత్యం అనుభవిస్తూ ఉన్న మహాత్ములకు ఆయా శరీరాల, మనసుల గుణగణాలతో, రూపనామాలతో పని ఏముంది? వారు ఎవరితో ఏమి మాట్లాడినా, ఎవరికి ఏమి చేసినా అక్కడ అంతా ఏకత్వమే కానీ రెండో భావనకు చోటు లేదు.
ఎదుటివారికి దురద వచ్చి మిమ్మల్ని గోకమంటే అది కాలిమీదా, లేక తలమీదా అని ఉచ్చనీచాలు ఆలోచిస్తారు కానీ మీ కాలికి దురద వస్తే మీ చేయి అలా ఆలోచిస్తోందా? నేను ఉన్నతమైన తలమీద అయితేనే గోకుతాను కానీ నీచమైన ప్రదేశంలో గోకను అంటుందా? ఎందుకు? ఇవన్నీ మీ శరీరంలోని భాగాలే కాబట్టి అక్కడ భేద దృష్టి లేదు. అలాగే ఈ సృష్టిలో కనిపించేదంతా ఆ పరమాత్మలో భాగమే అనే దృఢమైన జ్ఞానం ఉన్నవారే ఎదుటివారిలోని తప్పులు, లేదా వారి భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తున్నా ఎటువంటి భేదదృష్టి లేకుండా అందరితో సమానంగా ప్రవర్తించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి