4, జూన్ 2021, శుక్రవారం

హనుమంతుడు

 బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకమ్ సుందరం

సుగ్రీవాది సమస్త వానరగణైః సంసేవ్య పాదాంబుజం

నాదేనైవ సమస్త రాక్షసగణాన్ సంత్రాశయంతమ్ ప్రభుమ్ 

శ్రీమద్రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజమ్


హనుమంతుడు ఎంత శక్తిమంతుడో మనందరికీ తెలిసినదే. త్రిభువన ప్రక్షోభకమ్ - మూడు లోకాలను ఒక్కపెట్టున అతలాకుతలం చేయగల శక్తివంతుడైనా మధ్యాహ్న మార్తాండుడిలాగా తన తేజస్సుతో మనలను మండించకుండా - బాలార్కాయుత తేజసం - ఉదయించే సూర్యుడిలాగా మన మనస్సులకు ఆహ్లాదాన్నే కలిగిస్తాడు. ఇక సుందరం - ఒక వానరుడు సుందరంగా ఉండటం ఏమిటని మనం అనుకోవచ్చు. అయితే Beauty is in the eye of the beholder - అందం చూసేవాడి కంటిలో(దృష్టిలో) ఉంటుందని ఆంగ్లంలో సామెత. అందం అంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేది. ఒకసారి హనుమంతుని రూపం తలుచుకోగానే ఎంతటి చికాకులలో, కష్టాలలో ఉన్నవారికైనా ఒక్కసారిగా ఆనందం, ఉత్సాహం కలుగుతాయి. అందుకే ఆయన సుందరుడు. అంతేకాదు మామూలుగా ఎక్కడైనా బలవంతుడైన శత్రువో, పెద్ద ఆపదో పొంచి ఉన్నదంటే ఎవరైనా దూరంగా పారిపోవటానికే ప్రయత్నిస్తారు. కానీ సుందరకాండలో చూస్తే వేలాది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణిస్తున్నా ఇంకా ఇంకా వేలాదిగా ఆయన వద్దకు వస్తూనే ఉంటారు కానీ పారిపోరు. అంటే ఒక మంట మిడుతల దండుని ఎంతగా ఆకర్షిస్తుందో అలాగే ఆ రాక్షసులను కూడా ఆకర్షించేంతటి సుందర రూపం ఆయనది.

ఇక సుగ్రీవుడు మొదలైన సమస్త వానరులతో సేవింపబడే పాదపద్మాలు కలవాడు అంటే మనకి కొంచెం అనుమానం వస్తుంది. మిగతా వానరులు ఆయనను సేవించారంటే నమ్ముతాం కానీ సుగ్రీవుడు రాజు, హనుమంతుడు ఆయనకు మంత్రి కదా! పైగా రామాయణంలో ఎక్కడ చూసినా 'మా ప్రభువైన సుగ్రీవుడు' అనే హనుమంతుడు సంబోధిస్తాడు. మరి సుగ్రీవుడు హనుమంతుని పాదాలను సేవించడం ఏమిటి? అయితే సుగ్రీవుడు అంటే మంచి కంఠం కలవాడు అని అర్థం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని పెద్దలు చెబుతారు కదా. అలా హనుమత్ స్మరణ ద్వారా వాక్పటుత్వాన్ని సాధించిన బుద్ధిమంతులు అందరూ సుగ్రీవులే. మరి వారందరూ నిరంతరం ఆ హనుమంతుని పదపద్మాలను సేవిస్తూనే ఉంటారు కదా. అలా నిరంతరం సేవించుకొంటే ఆ కొమ్మ మీదనుంచి ఈ కొమ్మకు, ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకు వానరంలా దూకుతూ ఉండే మన బుద్ధి స్థిరత్వాన్ని పొంది పద్మంలో మకరందాన్ని గ్రోలుతూ అక్కడే నిలిచిపోయిన భ్రమరంలా ఆ పాదాలయందే నిలిచిపోతుంది.

'నువ్వరిస్తే అరుపులు, అదే నేనరిస్తే మెరుపులే' అని ఏదో ప్రాస కోసం మన సినిమా హీరోలు చెప్తారు కానీ అసలు అరుపులతో మెరుపులేంటి, పిడుగులే సృష్టించినవాడు హనుమంతుడు. ఆయన ఒక్కసారి పెద్దగా నాదం చేస్తే సమస్త రాక్షసగణాలు భయంతో గజగజ వణికిపోతాయి. ఆ బయట ఉన్న రాక్షసులే కాదు, భూత ప్రేత పిశాచాలే కాదు, మనలో ఉన్న దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు, దుష్ట వాసనలు అన్నీ కూడా ఒక్కసారి ఆ హనుమంతుని సింహనాదం వినగానే గజగజ వణుకుతూ తోక ముడుచుకొని పలాయనం చిత్తగిస్తాయి.

అయితే ఇంతటి అమోఘ శక్తివంతుడు, గుణసంపన్నుడు అయినా ఆయన ఎన్నడూ ఇది తన శక్తి అనే భావనే మనసులోకి రానీయక నిరంతరం శ్రీరామచంద్ర పాదాబ్జాల ధ్యానంలోనే రమిస్తూ ఉంటాడు. అటువంటి వాతాత్మజుడైన హనుమంతుని ధ్యానిస్తే మనకు కూడా ఆయనలోని కొన్ని సుగుణాలైనా అలవడతాయి. హనుమంతుడు ఒక్క రామాయణంలోనే ఎన్నెన్ని మహత్తర కార్యాలు నిర్వహించాడో లెక్కపెట్టలేం. అంతేకాక ఆయన చిరంజీవి. ఇప్పటికీ అనేకమందిని అనేకవిధాలుగా సంరక్షిస్తూనే ఉన్నాడు. 

అయినా ఇదంతా ఆ రాముని మహిమ అనే ఆయన చెప్పుకుంటాడు కానీ 'నేను చేస్తున్నాను' అనే కర్తృత్వ భావన కానీ, 'దీని ప్రతిఫలం నాకే దక్కాలి' అనే భోక్తృత్వ భావన కానీ ఆయనకు లేవు. పైగా తాను చేసే మహత్తర కార్యాలతో తనకు ఎటువంటి సంగమూ లేకపోయినా, ఆయా కార్యాల సిద్ధి విషయంలో ఎటువంటి వికారము (కార్యం సిద్ధిస్తే ఆనందము, విఫలమైతే విషాదము) లేకపోయినా  'ఇది నాకెందుకులే' అనే నిరాసక్తత ఏమాత్రం లేకుండా మొక్కవోని దృఢ సంకల్పంతో, తిరుగులేని ఉత్సాహంతో ఆయా కార్యాలను నిర్వహిస్తాడు. అందుకే ముక్తసంగోనహంవాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిధ్యసిధ్యౌ నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే అని గీతాచార్యుడు నిర్వచించిన శుద్ధ సాత్విక కర్త హనుమంతుడు.

సూపర్ మాన్, స్పైడర్ మాన్, ఐరన్ మాన్ ఇలాంటి కల్పిత పాత్రలు ఎన్ని వచ్చినా తరతరాలుగా ఆబాలగోపాలన్నీ అలరిస్తున్న సూపర్ హీరో హనుమాన్. ఇతర దేవతలలో ఎవరైనా కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ హనుమంతుడు నచ్చనివాడు ఎవడూ ఉండడు. అయితే హనుమంతునికి మాత్రం ఆ భేద భావాలు ఏవీ ఉండవు. నువ్వు ఏ దేవతను అర్చించినా హనుమంతుని అనుగ్రహం నీకు చాలా సులభంగా కలుగుతుంది. 'మా దేవుడు గొప్ప' అంటే 'కాదు మా దేవుడే గొప్ప' అని కొట్లాడుకోవటాన్ని ఆయన ఎన్నడూ హర్షించడు. అందుకే తులసీదాసు వారు భక్త్యావేశంలో 'ఔర దేవతా చిత్త న ధరయి, హనుమత్ సేయి సర్వసుఖ కరయి' అని వ్రాస్తే దానిని తెనిగించిన ఎంఎస్ రామారావుగారు ఇతర దేవతలను కించపరచ వలసిన అవసరం ఏముందని 'ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు' అని మార్చి వ్రాసారు.

వీరాంజనేయుడు, భక్తాంజనేయుడు, దాసాంజనేయుడు, అభయాంజనేయుడు ఇలా రకరకాల రూపాలలో ఆంజనేయుడు మనకు దర్శనమిస్తాడు. మరే దేవుడిలో ఇన్ని కోణాలు మనకు కనిపించవు. దేవతలలో, భక్తులలో, దాసులలో, వీరులలో, మహిమాన్వితులలో, పండితులలో, ఇలా ఎందులో చూసినా ఆయనే అగ్రగణ్యుడు. అంతేకాదు, సగుణ నిర్గుణ భక్తులు రెండింటిలోను ఆయనకు ఆయనే సాటి. హనుమంతుడు ఒక్కసారి 'రామ్' అంటే ఆయన శరీరంలోని ముప్పదిమూడు కోట్ల రోమాలూ నిక్కబొడుచుకొని 'రామ్' అని ప్రతిధ్వనిస్తాయని శ్రీగురుదేవులు చెప్పేవారు. అలా తన తనువులోని అణువణువునా నిర్గుణ రూపంలో రామచంద్రుడు నిండి ఉన్నా ఎప్పుడెప్పుడు ఆ స్వామిని సగుణంగా కనులారా దర్శించుకుంటానా, చేతులారా సేవ చేసుకుంటానా అని అని నిరంతరం అశ్రుపూరిత నయనాలతో ఎదురుచూస్తూ ఉంటాడు ఆయన.

అటువంటి హనుమంతుని మన హృదయంలో నిలుపుకుంటే ఆయనతో పాటు ఆయన హృదయంలో సదా నివసించే శ్రీరాముడు, ఆ రాముని హృదయనివాసి అయిన పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని హృదయనివాసి అయిన గురుదేవుడు, ఇలా సకల దేవతలు మన హృదయంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. మనకీ మానవ జన్మ వచ్చినందుకు అంతకంటే సార్థకత ఏముంటుంది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి