11, అక్టోబర్ 2021, సోమవారం

గురుశక్తి

అయస్కాంతం, ఇనుపముక్క రెండింటిలోనూ ప్రతి ఒక్క అణువులో అయస్కాంత శక్తి, ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. అయితే అయస్కాంతంలో అణువులన్నీ ఒకే వైపుకి తిరిగి ఉంటాయి. అందుకే దానిలోని ఆకర్షణ శక్తి బహిర్గతమౌతుంది. అదే ఇనుప ముక్కలో అణువులన్నీ తలొక వైపుకి తిరిగి ఉంటాయి. అందుకే దానిలోని అయస్కాంత శక్తి అభివ్యక్తం అవ్వదు. మరి ఆ ఇనుములోని అయస్కాంత శక్తిని వెలికితీసి దానిని ఉపయోగకరంగా చేయాలంటే అందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఆ ఇనుపముక్కను ఒక అయస్కాంతానికి దగ్గరగా చేర్చడం. అప్పుడు ఆ అయస్కాంతంలోని ఆకర్షణ శక్తికి ఆ ఇనుపముక్కలోని అణువులన్నీ ఆకర్షింపబడి ఒకేవైపుకు తిరుగుతాయి. అప్పుడు అది కూడా అయస్కాంతమైపోతుంది. అయితే ఇది తాత్కాలికమే. అయస్కాంతం నుండి దూరం జరుగగానే మళ్ళీ ఇనుప అణువులన్నీ వివిధ దిశలలో తిరిగిపోయి అది తన అయస్కాంత శక్తిని కోల్పోతుంది. శాశ్వతంగా అయస్కాంతత్వాన్ని పొందాలంటే ఆ ఇనుపముక్క దీర్ఘకాలం ఆ అయస్కాంతాన్ని ఆశ్రయించి ఉండాలి

ఇక రెండవ పద్ధతి ఆ ఇనుమును అత్యధిక ఉష్ణోగ్రతకు వేడిచేయడం. అప్పుడు ఆ ఇనుములోని అణువులన్నీ ఒకేవైపుకి తిరిగి వాటిలోని అయస్కాంత శక్తి బహిర్గతమౌతుంది. నిజానికి మన భూగోళానికి ఉన్న అయస్కాంత శక్తి కూడా ఇలా వచ్చినదే. భూగోళం మధ్యభాగంలో ఇనుముతో నిండి, ఒక కొలిమిలా నిరంతరం మండుతూ ఉంటుంది. అక్కడ సూర్యుని ఉపరితలం కంటే అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ వేడికి ఆ ఇనుప ముద్ద అంతా ఒక మహా అయస్కాంతంలా మారి భూమికి అయస్కాంత శక్తిని ఇస్తోంది. నిజానికి భూమి చుట్టూ ఈ అయస్కాంత శక్తి వలయం లేకపోతే సూర్యునినుంచి వచ్చే హానికారక కిరణాలకు భూమిమీద జీవనం మనగలిగేది కాదు.

మన మనస్సు కూడా ఆ ఇనుపముక్క లాంటిదే. అందులో అసంఖ్యాకమైన సంకల్పాలు, ఆలోచనలు నిరంతరంగా అనేక దిక్కులలో ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే మనకు మనోబలం, లేదా సంకల్పబలం లోపించి మనలోనే నిక్షిప్తమై ఉన్న అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని మనం అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. ఇలా అనేకాగ్రమై పలుదిశలలో పరుగులు పెట్టే మనస్సును ఏకాగ్రపరచి నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపటానికి కూడా పైన చెప్పిన రెండు మార్గాలే ఉపయోగపడతాయి.

ఇనుపముక్కను అయస్కాంతం దగ్గరలో ఉంచితే దానిలోని అణువులు ఏకాగ్రమైనట్లే, నిరంతర భగవదాయత్త చిత్తులైన మహాత్ముల, గురువుల సన్నిధిలో మన మనస్సు ఏకాగ్రత చెంది, ప్రాపంచిక విషయాలను, బలహీనతలను అధిగమించి ఆధ్యాత్మిక శక్తిని అందుకోగలుగుతుంది. శ్రీగురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు దసరా మహోత్సవాలలో జరిగే సత్సంగాలలో ఒక్కొక్కసారి ఏడెనిమిది గంటలు నిర్విరామంగా బోధ చేసేవారు. అన్ని గంటలూ సభలోని బాలురనుండి వృద్ధులవరకు ఏ ఒక్కరూ కదలకుండా కూర్చుని శ్రద్ధగా వినేవారు. మరి మామూలుగా ఇంట్లో ఒక గంట ధ్యానమో, పూజో చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుందే? వారి వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మనలో చాలామంది అన్ని గంటలు కదలకుండా, ఏ అవశిష్టాలకీ లేవకుండా కూర్చోలేమే? మరి అంతమందిని అంతసేపు ఏ శక్తి సర్వాన్ని మరిపించి కూర్చోబెట్టింది? అదే గురువుల ఆధ్యాత్మిక శక్తి.

అయస్కాంతానికే కాకుండా సృష్టిలోని ప్రతి వస్తువుకూ ఆకర్షణ శక్తి ఉంటుంది. అదే గురుత్వాకర్షణ శక్తి. ఒక వస్తువు ఎంత పెద్దదైతే దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గురు అంటేనే పెద్ద, లేదా గొప్ప అని అర్థం. అందుకే మన సౌరకుటుంబంలోని నవగ్రహాలలో అన్నిటికంటే పెద్దదాన్ని గురుగ్రహం అని పిలుస్తాం. నిజానికి మన భూగోళంపై ఇంకా జీవనం నిలిచి ఉండటానికి ఈ గురుగ్రహం కూడా ఒక ముఖ్య కారణమే. నిరంతరం అనేక గ్రహశకలాలు, తోకచుక్కలు మన భూమిపైపుగా దూసుకువస్తూనే ఉంటాయి. ఇందులో భూమిపై జీవరాశిని సమూలంగా నాశనం చేయగల పరిమాణంగలవి కూడా ఉంటాయి. అయితే వాటిలో అధికభాగాన్ని గురుగ్రహం తన గురుత్వాకర్షణతో తనలోనికి లాక్కుని మన భూమిని రక్షిస్తూ ఉంటుంది.

ఇక ఆధ్యాత్మిక గురువుల విషయానికి వస్తే, సృష్టిలోని ఏ వస్తువును, లేదా శక్తిని తీసుకున్నా అంతకంటే పెద్దది, గొప్పది గురుశక్తి. ఆ గురువులు మనకోసం దేహధారణ చేసివచ్చి మనకు ప్రసాదించే అమోఘ వరం వారి సన్నిధి. ఆ గురుసన్నిధి మన మనసులలోని సంకల్పాలను, వాసనలను, బలహీనతలను అధిగమించి, ఏకాగ్రతను సాధించి మనలోనే ఉన్న బ్రహ్మామృతాన్ని అందుకొనే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. అలాగే బయటినుండి నిరంతరం మన మనసుమీద దాడిచేసే ప్రాపంచిక విషయాదులనుండి మనను కాచి రక్షిస్తుంది.

మన మనసులను స్థిరపరచి, మన సంకల్పాలన్నింటినీ బ్రహ్మవస్తువునందు ఏకీకృతం చేసి మనకు బ్రహ్మానందాన్ని అందించే మరొక మార్గం ధ్యానాగ్ని. అత్యధిక ఉష్ణోగ్రతకు వేడిచేస్తే ఇనుము అయస్కాంతంగా మారినట్లే, ఈ ధ్యానాగ్ని మనలోని దేహాత్మ భావనను, అహంకార మమకారాలను, పూర్వజన్మ వాసనలను, అన్నింటినీ దహించివేసి, మన నిజతత్వాన్ని ఎరుకపరచి పరమశాంతిని మనకందిస్తుంది. అయితే ఈ ధ్యానం గురువు మార్గదర్శకత్వంలో, వారి సన్నిధిలో చేసినప్పుడు అత్యంత విశేష ఫలితాన్నిస్తుంది. 

ఒక వస్తువుయొక్క గురుత్వాకర్షణ శక్తి అత్యధికమైన ప్రభావాన్ని చూపించాలంటే ఆ వస్తువుచేత ఆకర్శింపబడే రెండవ వస్తువు దానికన్నా చాలా చిన్నదై ఉండాలి. అలాగే గురుశక్తి మనమీద ప్రభావం చూపించాలంటే మనం ముందుగా మన అల్పత్వాన్ని గుర్తించి వారికి సంపూర్ణ శరణాగతి చెందాలి. అంతేకాని గురువుని ఆశ్రయించి కూడా ఇంకా నేనెంతో గొప్పవాడిని, పండితుడిని, మేధావిని అనుకొనేవాడు ఆ గురుశక్తిని అనుభవంలోనికి తెచ్చుకోలేడు. గురువుల సన్నిధిలో జీవించడానికి ముఖ్యంగా మూడు సూత్రాలు చెబుతారు - చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చచ్చినట్టు పడుండాలి.

ఒక్కసారి గురు సమాశ్రయం లభిస్తే ఇక ఆ జీవి తరించినట్లే. శ్రీగురుదేవులు "నేను కామవరపుకోట జీడిని. ఒక్కసారి పట్టుకుంటే విడిచిపెట్టను" అనేవారు. ఒకవేళ బలవత్తరమైన కర్మప్రభావం చేత ఏ శిష్యుడైనా వారికి దూరమైనా, ఈ జన్మలో కాకపోతే మరెన్ని జన్మలకైనా వారికి మళ్ళీ గురుసమాశ్రయం తప్పక లభిస్తుంది. అది గురుదేవులు ఇచ్చే గ్యారంటీ.

ఏనా డేము భవ త్పదాబ్జముల నెంతే బట్టుకొన్నారమో?
ఆనాడే చరితార్థజన్ములము మేమైనార మెట్లేని
బాబూ! నీ దృష్టిబడం ద్యజింప వెటులం బోనీక, ప్రేమించి
సుజ్ఞానం బీగల సత్యమూర్తివి కదా కాళీప్రసాదప్రభూ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి