శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్న ఈ చిత్రాన్ని మనం గమనిస్తే ఇక్కడ సత్యభామ నరకాసురునిపై మూడు బాణాలను ప్రయోగిస్తోంది. అందులో మొదటి బాణం నరకాసురుని దేహంలోనికి ప్రవేశించి అతనిని గాయపరచింది. రెండవ బాణం మార్గమధ్యంలో గాలిలో ఉంది. ఇక మూడవ బాణం అమ్మ చేతిలో వింటిపై సంధించి ఉంది. మొదటి బాణం అప్పటికే తన పని తాను చేసేసింది కనుక ఇక దానిని ఎవరూ మార్చలేరు. ఇది జరిగిపోయిన భూతకాలానికి ప్రతీక.
ఇక రెండవ బాణం అప్పటికే ప్రయోగించబడి లక్ష్యం వైపుగా దూసుకుపోతోంది. ఒకవేళ అది మంత్రపూరితమైన అస్త్రమైతే దానిని లక్ష్యం చేరేలోగా ఉపసంహరించడానికి అవకాశం ఉంటుంది. లేదా దైవవశం చేత ఏ బలమైన గాలో మరేదైనా వస్తువో తాకి దారి మళ్ళడానికి అవకాశం ఉంటుందే తప్ప మరొక విధంగా దానిని దారి మళ్ళించడం మానవమాత్రులకు సాధ్యం కాదు కదా. ఇది అప్పటికే పూర్వ నిర్ధారితమైన భవిష్యత్ కాలానికి ప్రతీక. భవిష్యత్తును మార్చడం ఏ మహాత్ములకో సాధ్యం, లేదా భగవత్సంకల్పం చేత మారాలి తప్ప మనం మాత్రం మార్చలేము కదా!
ఇక మూడవ బాణం ఇంకా సత్యభామ చేతిలోనే ఉన్నది కాబట్టి దానిని ఎప్పుడు ఎవరిపై ఎంత బలంగా ప్రయోగించాలో నిర్ణయం పూర్తిగా ఆవిడ ఆధీనంలోనే ఉంది. ఇది వర్తమాన కాలానికి ప్రతీక. మనం మన వర్తమాన కాలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దానిని సద్వినియోగ పరచుకున్నా, దుర్వినియోగ పరచుకున్నా అది మన బాధ్యతే. అయితే మన ఆలోచనలు మాత్రం నిరంతరం ఈ వర్తమానాన్ని వదిలిపెట్టి భూత భవిష్యత్ కాలాల్లో తిరుగుతూ ఉంటాయి. మనం బాహ్యంగా ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం నిన్నటి జ్ఞాపకాలలో, రేపటి వ్యాపకాలలో సంచరిస్తూ ఉంటుంది.
ఎప్పుడో చేసిన, లేదా చేద్దామనుకొని చేయలేకపోయిన విషయాలను గుర్తుచేస్తూ అపరాధ భావనను కలిగిస్తూ ఉంటుంది. భూతకాలాన్ని మనం మార్చలేం కదా! దానిని గురించి ఎంత చింతించినా ఏమి ప్రయోజనం? దీనినే "గతజల సేతు బంధనం" అంటారు. నది మీద ఆనకట్ట కడితే అది భవిష్యత్తులో వచ్చే జల ప్రవాహాన్ని ఆపి మనకు ఎటు కావాలో అటు మళ్ళించుకొనే అవకాశాన్ని, లేదా మరొక రకంగా వినియోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది కానీ అప్పటికే వెళ్ళిపోయిన నీటిని వెనక్కు తేలేదు కదా! జరిగిపోయిన దానిని అక్కడే వదిలేసి దానినుండి గ్రహించిన పాఠాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టుకోవడం నేర్చుకోవాలి.
అలాగే వర్తమానంలో చేస్తున్న పనిమీద ధ్యాస విడిచిపెట్టి భవిష్యత్తు గురించి ఊహలు అల్లుకుంటూ గాలిలో మేడలు కడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు కదా. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి తాను చదువుతున్న పాఠంపై శ్రద్ధ పెట్టి చదివితే పరీక్ష బాగా వ్రాసి ఉత్తీర్ణుడవుతాడు. అతని భవిష్యత్తు దానంతటదే చక్కబడుతుంది. అలా కాకుండా పుస్తకం ముందు పెట్టుకుని కళ్ళు అక్షరాలను చదువుతున్నా మనస్సు మాత్రం ఈ పరీక్షలో మంచి మార్కులు వస్తే ఆ తరువాత తనకు రాబోయే మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, పెద్ద ఇల్లు, కారు ఇలాంటివన్నీ ఊహించుకుంటూ గాలిలో మేడలు కడుతూ ఉంటే వర్తమానం వృధాగా గడిచిపోతుంది. పరీక్ష తప్పుతాడు. తాను కట్టిన గాలిమేడలన్నీ కుప్పకూలిపోయి భవిష్యత్తు అంధకారమవుతుంది.
ఇంకొంతమంది జాతకంలో ఉందనో, లేదా ఎవరైనా పెద్దలు చెప్పారనో భవిష్యత్తులో తమకు రాబోయే మంచిచెడుల గురించి అతిగా ఆలోచిస్తూ వర్తమానాన్ని జారవిడుచుకుంటారు. మబ్బుల్లో నీళ్ళను చూసి తన కాళ్ళ దగ్గర ఉన్న కుండను కాలదన్నుకుంటే ఆ మబ్బులు కురిసేదెన్నడు? తన దాహం తీరేదెన్నడు? "భవిష్యత్తులో నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు" అని ఎవరైనా మహాత్ములు నిన్ను దీవించారనుకో, నువ్వు వర్తమానంలో దానికి తగ్గ కృషి చేసి, పట్టుదలతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వెళితేనే కదా నీవు ఆ ఉన్నత స్థానాన్ని చేరుకొనేది? అలా కాకుండా "నాకు మహాత్ముల ఆశీస్సులు ఉన్నాయి. ఇక నేనేమీ చేయనక్కరలేదు" అని ముసుగుతన్ని పడుకుంటే గొప్పవాడివి ఎలా అవుతావు?
ఇక చిత్రంలో ఈ మూడింటికీ సాక్షిగా, కర్త అయిన సత్యభామకు, ఆమె చేసే కర్మకు తాను విలక్షణంగా, చిద్విలాసుడై ప్రకాశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భూతకాలంలో నరకాసురుడు ఆ సత్యభామ అసలు స్వరూపమైన భూదేవి పుత్రుడనీ, ఇప్పుడు తాను చేస్తున్న పనికి భవిష్యత్తులో సత్యభామ చింతిస్తుందనీ కూడా ఆయనకు తెలుసు. అయినా జరిగేదానిని సాక్షిమాత్రుడై వీక్షిస్తున్నాడు.
త్రికాలజ్ఞులైన మహాత్ముల స్థితి అలాగే ఉంటుంది. జరిగినది, జరుగబోయేది స్పష్టంగా తమకు దృగ్గోచరం అవుతున్నా ఏమాత్రం వికారాన్ని చెందక శ్రద్ధగా వర్తమాన విధులను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి స్థితిని అందుకోవడానికి మన వంతు కృషి మనం చెయ్యాలి. ప్రాపంచిక విషయాలలోనైనా, ఆధ్యాత్మిక విషయాలలోనైనా ప్రతి క్షణం చేసే పనిపై శ్రద్ధపెట్టి వర్తమానంలో జీవిస్తూ, మనస్సును భూత భవిష్యత్ కాలాలలో తిరగకుండా అదుపులో పెట్టుకోగలిగితే భవిష్యత్తు బంగారమవుతుంది. "ఈ క్షణమే నీదనుకో! మరుక్షణమే లేదనుకో! అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో" అని మహాత్ములు మనకు బోధిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి