అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి - భగవద్గీత 4-36
నీవు ఎంతటి పాపాత్ముడవైనా, పాపాత్ములందరికంటే అత్యంత అధిక పాపాలు చేసినా ఆ పాపసాగారాన్ని నీవు జ్ఞానమనే ప్లవంతో చక్కగా దాటిపోగలవు అని పరమాత్ముడు అభయమిస్తున్నాడు. 'ప్లవ' అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో గెంతు అనేది ఒక అర్థం. గెంతుతూ వెళ్తాయి కాబట్టి వానరాలను ప్లవగములు అంటారు. మరి అట్టి వానరులలో ప్లవగోత్తముడైన ఆ ఆంజనేయుడు ఒక్క గెంతులో మహా సముద్రాన్ని లంఘించి సీతమ్మను చేరుకున్నాడు. అప్పటివరకు 'నేను చాలా చిన్నవాడిని' అని ఒక మూలన కూర్చున్న ఆంజనేయుడికి అతని స్వస్వరూప జ్ఞానాన్ని జాంబవంతుడు బోధించడంతో మైనాకుడు, సురస, సింహిక అనే త్రిగుణాలతో నిండియున్న సంసార సాగరాన్ని ఒక్క గెంతులో దాటి పంచకోశాంతర స్థితయైన జగన్మాతను చేరుకోగలిగాడు.
అలాగే ఎంతో క్రూరుడైన రత్నాకరుడు నారద మహర్షి ప్రబోధంతో క్షణంలో పరివర్తనం చెంది వాల్మీకియైనాడు. పరమ పాపాత్ముడైన అంగుళీమాలుడు కూడా బుధ్ధ భగవానుని దర్శనంతో సంపూర్ణ పరివర్తనం చెందాడు. గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారి చరిత్రలో కూడా మనకు ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తాయి. భీమవరంలో నాచు వెంకటరత్నంగారనే ప్రఖ్యాత లాయరు ఉండేవారు. వారికి మహాత్ములన్నా, గురువులన్నా ఎటువంటి గౌరవం లేదు. అయినా శ్రీగురుదేవులను దర్శించుకున్న మరుక్షణంలోనే వారి మనస్సు గురుదేవుల అధీనమైపోయింది. లోకాన్ని, తన వృత్తిని అన్నింటినీ మరచిపోయి అలా శ్రీగురుదేవుల సన్నిధిలోనే తిరుగుతూ ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు వచ్చి పిలిచినా, 'నా మనస్సు ఆయన తీసేసుకున్నారు. అది తిరిగి నాకు ఇస్తేగానీ నేను రాలేను' అనేవారు. అలాగే 'ఈ గురువులందరూ వేషగాళ్ళు, మోసగాళ్ళు. ఈయన అంతు తేలుస్తాన'ని వచ్చిన విఠల్ దాసుగారు ఒక్క క్షణంలోనే శ్రీగురు చరణదాసులై భక్తికి శరణాగతికి పరాకాష్ట స్థితిని చేరుకున్నారు.
ఇలా భగవంతునికి పూర్తి వ్యతిరేకులైనవారు ఒక్క క్షణంలో జ్ఞానమనే గెంతుతో సంసార సాగరాన్ని దాటివేయడం చూస్తే మనబోటివారికి అసూయా, నిరుత్సాహమూ కలుగుతాయి. 'చిన్నప్పటినుంచి మంచిచెడుల సమాహారంగా జీవితాన్ని గడుపుతూ, వీలున్నంతవరకు మంచివైపు మనలను మనం మళ్ళించుకుంటూ ఎంతకాలమైనా ఇంకా మనం ఈ సంసార సాగరాన్ని పూర్తిగా దాటలేకపోతున్నామే' అనిపించడం సహజం. ఇక్కడే 'ప్లవ' అనే పదానికి ఉన్న మరొక అర్థం మనం తెలుసుకోవాలి. ప్లవ అంటే చిన్న పడవ. వింధ్యవీధీ ప్లవంగమః - సూర్యభగవానుడు ఆకాశమార్గంలో ఒక చిన్న పడవలాగా ఉదయంనుంచి సాయంత్రం వరకు మెల్లగా సంచరిస్తూ ఉంటాడని ఆదిత్యహృదయం చెబుతోంది.
సముద్రంలో పడవ ప్రయాణాన్ని గమనించండి. తెడ్డువేసి నాలుగడుగులు ముందుకు పోగానే ఒక పెద్ద కెరటమో, లేక గాలో వచ్చి మళ్ళీ రెండడుగులు వెనుకకు నెట్టుతూ ఉంటుంది. అలాగే గాఢమైన భక్తికాని, గాఢమైన వ్యతిరేకత కానీ లేకుండా మధ్యేమార్గంగా ఉండే మనబోటివారి ప్రయాణం కూడా సముద్రంలో పడవ ప్రయాణంలాగే ఉంటుంది. ఖాళీ సమయంలో ధ్యానమో పూజో మరో భగవత్కార్యమో చేస్తాం. ఏదో చిన్న ఆటంకం రాగానే ఆ పూటకి విరమించుకుంటాం. అయితే మన ప్రయత్నాన్ని పూర్తిగా విరమించకుండా మళ్ళీ మళ్ళీ మన పడవను దారిలో పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికైనా గమ్యాన్ని మాత్రం తప్పక చేరుతాం.
ఎంతటి మహా పాపాలైనా దాటాలంటే జ్ఞానమే శరణ్యం. పాపరాశిని దహించాలంటే జ్ఞానాగ్నే శరణ్యం. అందుకే గీతాచార్యుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు. అయితే మన ఇంటిలో దీపం వెలగాలంటే ముందుగా అగ్గిపుల్ల వెలగాలి. అది వెలగాలంటే ముందు ఆ పుల్లని అగ్గిపెట్టెపై రాపిడి పెట్టాలి. అలాగే మనలో జ్ఞానాగ్ని వెలగాలంటే ముందుగా ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం నిలవాలంటే మనస్సును భగవన్నామముతో రాపిడి పెట్టాలి. అందుకే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణి అని శ్రీగురుదేవులు, నామాగ్ని దగ్ధ కర్మాణి అని శ్రీ మాతాజీవారు ఉద్బోధించారు.
కాబట్టి శార్వరి అనే అంధకారం నుంచి జ్ఞానాగ్నిని వెలిగించుకుని ఆ జ్ఞాన 'ప్లవం' లో పాపపంకిలమైన సంసార సాగరాన్ని (ఒక్క గెంతులోగాని, పడవలో నెమ్మదిగాగానీ) దాటి 'శుభకృత్' - సకల శుభాలకు నిలయమైన మోక్ష సామ్రాజ్యాన్ని మనందరం చేరుకుంటామని ఆశిస్తూ శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి