20, ఆగస్టు 2021, శుక్రవారం

లక్ష్మి

        లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అంటే సంపద, లక్ష్మి అంటే సుఖసంతోషాలు, లక్ష్మి అంటే ఆనంద కోలాహలం. క్షీరసాగర మథనంలో అవతరించి, క్షీరసాగరశాయిని వరించి, తనను నమ్ముకొన్న భక్తులను పాడిపంటలలో, సుఖశాంతులలో ఓలలాడించే చల్లని తల్లి లక్ష్మీదేవి. తన సోదరుడైన చంద్రుడు ఎలాగైతే సూర్యకాంతిని ప్రతిబింబిస్తూ లోకానికి చల్లని వెన్నెలను ప్రసాదిస్తాడో అలాగే ఈ తల్లి శ్రీమన్నారాయణుని వైభవాన్ని ప్రతిబింబిస్తూ లోకానికి పోషణను అందిస్తుంది.

        అయితే ఈ లక్ష్మి, లేదా ఐశ్వర్యం నీడలాంటిది. మనం వెలుగువైపుకు ప్రయాణిస్తుంటే నీడ మన వెంటబడి వస్తుంది. అదే మనం వెనక్కి తిరిగి నీడ వెంటబడితే అది మనకన్నా ఎప్పుడూ ముందే ఉంటుంది కానీ మనకు ఎప్పటికీ అందదు. అలాగే లోకానికంతటికీ ప్రకాశాన్నిచ్చే నారాయణుని వైపుకు మనం ప్రయాణిస్తూ ఉంటే ఐశ్వర్యం మనవెంటే ఉంటుంది. అదే మనం నారాయణుని వదలివేసి ఐశ్వర్యం వెంట పరుగులు తీస్తే అది ఎన్నటికీ దక్కదు, దక్కినా నిలవదు. లక్ష్మీదేవి నామాలలో ఓం చంచలాయై నమః, ఓం చపలాయై నమః అనే నామాలు కూడా ఉన్నాయి. అంటే ఆవిడ ఏ ఒక్కరి దగ్గరా స్థిరంగా ఉండదు. 

        కానీ ఆవిడ స్థిరనివాసం చేసే స్థానం ఒకటే ఉంది. అదే శ్రీమన్నారాయణుని హృదయమందిరం - ఓం విష్ణు వక్షస్థల స్థితాయై నమః. మన మనస్సులలోని చాపల్యాన్ని, చంచలత్వాన్ని వీడి ఎప్పుడైతే ఆ నారాయణుని మన హృదయ మందిరంలో స్థిరంగా ప్రతిష్టించుకుంటామో అప్పుడు ఆయన హృదయస్థితయైన లక్ష్మీ కటాక్షం మనకు సుస్థిరమౌతుంది. "లక్ష్మీనారాయణుని చరణాలను నీవు ఆశ్రయిస్తే లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఆ తల్లి నీకు ఇహంలో ఏ లోటూ లేకుండా చూస్తుంది, ఆయన నీకు పరమపదాన్ని ప్రసాదిస్తాడు" అని శ్రీగురుదేవులు చెప్పేవారు.

        అయితే ఇలా మనకు లభించిన సంపదను సరిగ్గా వినియోగించ గలగటం కూడా ఒక వరమే. "దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య| యో న దదాతి న భుఙ్క్తే తస్య తృతీయా గతిర్భవతి||" - విత్తానికి మూడు గతులని భర్తృహరి చెబుతాడు. అవి దానం, భోగం, నాశం. ఇందులో ఉత్తమగతి మనకున్న సంపదను వీలైనంత దానం చేయడం. ఇక మధ్యమ గతి కనీసం నీవైనా అనుభవించడం. ఇక ఈ రెండూ చేయని పిసినారి వాని సంపదకు మూడవగతే శరణ్యమని చెబుతాడు. అంటే ఎవరైతే తమ సంపదని దానం చేయకుండా, తాము అనుభవించకుండా దాచిపెడతారో ఆ సంపద చివరికి అగ్ని వల్లనో, చోరుల వల్లనో, రాజులవల్లనో, ఇంకంటాక్స్ వాళ్ళ వల్లనో నాశనం అయిపోతుంది.

        ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీర్యలక్ష్మి, విద్యాలక్ష్మి - ఇలా ఈ ఐశ్వర్యం వివిధ రూపాలలో ఉంటుంది. అయితే "యద్యత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా| తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవం||" - ఈ లోకంలో ఏదైతే ఐశ్వర్యం, తేజస్సు, బలం, సంపదలతో  ప్రకాశిస్తూ ఉంటుందో అదంతా నా తేజస్సుయొక్క అంశనుండే ఉద్భవించిందని తెలుసుకో అని భగవానుడు గీతలో స్వయంగా ప్రకటించాడు. అంటే లక్ష్మి నారాయణునికి వేరుగా ఎప్పుడూ లేదు. ఆయననుండే ఉద్భవిస్తోంది, ఆయనయందే ప్రకాశిస్తోంది, ఆయనలోనే లయమైపోతోంది. నారాయణుడు స్థితి కారకుడు. అయితే ఆయన ఈ లోకాలను నడపడానికి కావలసిన ముఖ్య ఇంధనం సంపద(లక్ష్మి) - ధనం మూలం ఇదం జగత్. 

    అయితే ఈ సంపదల అన్నిటికంటే ఉత్కృష్టమైనది మోక్షలక్ష్మి - ముకుందా ముక్తినిలయా. ఈవిడ మొక్షాన్నిచ్చే ముకుందుని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది. అసలు వారిద్దరూ ఒకే శక్తియొక్క రెండు రూపాలు. మరిసుస్థిరమైన ఆ మోక్షలక్ష్మిని వదిలేసి మానవులు అస్థిరమైన లౌకిక సంపదల కోసం ప్రాకులాడుతూ, తమ సోదర మానవులపై ఈర్ష్యాద్వేషాలను పెంచుకుంటూ ఉంటారు. రామాయణంలో కథాపరంగా చూస్తే తన కుమారునికి దక్కవలసిన రాజ్యం రామునికి దక్కుతోందని కైకమ్మ ఈర్ష్యపడింది. అలాగే ఒకవేళ భరతుని రాజుని చేసినా, రాముడు ఇక్కడే ఉంటే ఈర్ష్యతో ఆ రాజ్యాన్ని దక్కించుకోవడానికి కుట్రలు పన్నుతాడేమో అని కూడా భయపడి రాముని అడవులకు పంపింది. అయితే లక్ష రూపాయలు పెట్టి ఆటో కొనుక్కున్నవాడు వెనకాల "నన్ను చూసి ఏడువకురా" అని వ్రాసుకుంటే ఆ వెనకాల కోటి రూపాయల కారులో వెళ్ళేవాడు ఎలా నవ్వుకుంటాడో సాక్షాత్తు లక్ష్మీపతియైన రామచంద్రుడు ఈ చిన్న అయోధ్యా నగరానికి రాజైన భరతుని చూసి ఈర్ష్య చెందుతాడనుకోవడం అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే పైన చెప్పినట్లు ఇది కేవలం కథాపరంగా మాత్రమే అనుకోండి. అసలు కైకమ్మకు ఆ బుద్ధి పుట్టడానికి వెనుక గల దేవరహస్యం, రామావతార లక్ష్యం ఆ లోగుట్టు పెరుమాళ్ళకే యెఱుక. 

            లక్ష్మీదేవికి ఒక విశేష లక్షణం ఉంది. "ఆర్ద్రాం జ్వలన్తీ తృప్తాం తర్పయన్తీ" - తడిసిన వాటిని మండిస్తుంది, తృప్తి చెందిన వాడిని మళ్ళీ తృప్తి పరుస్తుంది. అంతులేని సంపదలో తడిసి ముద్దయిన వాడయినా వీడి జేబులో ఐఫోన్ 12 ఉండి పక్కవాడి జేబులో ఐఫోన్ 13 కనిపిస్తే వాడి గుండె భగ్గున మండుతుంది. అలాగే వీడికి రాని కాంట్రాక్టు ఏదో ప్రక్కవాడికి వస్తే అసూయతో రగిలిపోతాడు. ఇక ఎవరైనా కడుపు నిండా తృప్తిగా తిన్నవాడికి మరొక పిండివంట పెడతానంటే "అమ్మో నేను తృప్తిగా తిన్నాను, ఇక తినలేను" అంటాడు. అదే "ఇవాళ జేబులో వంద రూపాయలు వచ్చాయి, నేను తృప్తిగా ఉన్నాను" అనుకున్నవాడికి మరొక పదిరూపాయలు ఇస్తే "ఇప్పుడు మరింత తృప్తిగా ఉన్నాను" అనుకుంటూ తీసుకుంటాడు కానీ భోజనంలాగా "ఇక నావల్ల కాదు" అనడు.

        కాబట్టి లౌకికమైన సంపద ఎంత సంపాదించినా మనకు తృప్తి కలుగదు, మనశ్శాంతి లభించదు. పైగా వీటితో భగవంతుని మెప్పించడం అసాధ్యం. అంతులేని ఐశ్వర్యం ఉన్న సత్యభామ తూచలేని శ్రీకృష్ణుని భక్తితో కూడిన ఒక్క తులసీదళంతో రుక్మిణీదేవి తూచగలిగింది. కాబట్టి భక్తిలేని సంపద వ్యర్థమే. "భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు" అంటాడు వేమన. మిగిలిన లక్ష్ముల అనుగ్రహం పొందటానికి ఎన్ని సాధనాలు ఉన్నా మోక్షలక్ష్మి అనుగ్రహం పొందాలంటే భక్తి ఒక్కటే సాధనం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి