29, మే 2021, శనివారం

ఆక్సిజన్

    ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆక్సిజన్. ఆక్సిజన్, లేదా ప్రాణవాయువు జీవకోటికి అంతటికీ ఎంత ముఖ్యమైనదో చిన్నప్పుడే మనందరం చదువుకున్నాం. అయితే కొద్దిగా ఆలోచిస్తే ఈ ప్రాణవాయువుకు, భగవంతునికి చాలా దగ్గర సంబంధం ఉన్నదనిపిస్తుంది. ఆక్సిజన్ అనే మూలకంయొక్క రెండు పరమాణువులు కలిస్తే ఒక ఆక్సిజన్ అణువు ఏర్పడుతుంది. ఆ ఆక్సిజన్ మన చుట్టూ ఉన్న వాతావరణం అంతటా వ్యాపించి ఉండి సర్వ జీవకోటి మనుగడకు ఆధారమై ఉంటుంది. అలాగే పరమాత్మ తన రెండు భిన్న రూపాలైన ప్రకృతి, పురుషుల రూపంలో సృష్టి అంతటా నిండివుండి ఈ సృష్టి మనుగడకు కారణం అవుతున్నాడు. 

        ఇదే ఆక్సిజన్ పరమాణువులు మూడు కలిసి ఒక అణువుగా ఏర్పడితే అది ఓజోన్ రూపంలో భూ వాతావరణం పైభాగంలో ఒక గొడుగులా ఏర్పడి సూర్యునినుంచి వచ్చే హానికారక కిరణాలనుండి భూమినంతటినీ రక్షిస్తోంది. పరమాత్మ కూడా అలాగే తన మూడురూపాలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఏర్పడి సృష్టిని నిరంతరంగా నడుపుతూ, కాచి రక్షిస్తూ ఉన్నాడు. మరి అదే ఆక్సిజన్ ఒక పరమాణువు రెండు హైడ్రోజన్ పరమాణువులతో కలిసి నీటి రూపాన్ని సంతరించుకుంటుంది. సృష్టి ఏర్పడాలన్నా ఈ నీరే ఉండాలి, సృష్టి అంతా లయమైపోయినా చివరికి ఈ నీరే మిగులుతుంది. నీరు నారాయణ స్వరూపమని శ్రీ గురుదేవులు ఎప్పుడూ చెబుతుండేవారు. భూమిపై మూడు వంతులు నీరే, మన శరీరంలోనూ మూడు వంతులు నీరే.  అలాగే పురుషోత్తముడైన పరమాత్మ  క్షర పురుషుడు(పాంచబౌతికమైన శరీరాలు), అక్షర పురుషుడు(కూటస్థ చైతన్యమైన ఆత్మ) లతో కలిసి ప్రకృతిలోని ప్రతి ప్రాణియందు నిండి ఉండి వాటిని నడిపిస్తున్నాడు.

        ఇక ఆక్సిజన్ ఒకే పరమాణువు రూపంలో మనకు ప్రకృతిలో ఎక్కడా కనబడదు. అలాగే పరమాత్మ ఒక్కడే ఉన్నప్పుడు నిరాకారుడై, నిర్గుణుడై మనకు అగోచరంగానే ఉంటాడు. ఇక ఇప్పటి ఆక్సిజన్ కొరతను ఉటంకిస్తూ కొంతమంది విషయం తెలియనివారు, "ముందునుంచి చెట్లు పెంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా!" అని సలహాలు ఇస్తున్నారు. అయితే ఎంత చెట్లు పెంచినా, మన చుట్టూ ఆక్సిజన్తో కూడిన ఎంతటి స్వచ్ఛమైన గాలి ఉన్నా, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి, వ్యాధిగ్రస్తులకు ఆ గాలిలోని ప్రాణవాయువును నేరుగా పొందే సామర్థ్యం ఉండదు. అందుకే వారికి ఆ ప్రాణవాయువును ఏకీకృతం చేసి వారి సామర్థ్యానికి తగ్గట్టుగా అందించే ఒక యంత్ర పరికరం (ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్) కావలసి వస్తుంది. అలాగే మన చుట్టూ, మన లోపలా సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని అందుకోవటానికి భవరోగంతో ఉన్న మనకు సామర్థ్యం లేదు కాబట్టే ఆ పరమాత్మ తత్వమే ఘనీభవించి ఒక గురు రూపంలో  మన మధ్యకు వచ్చి ఎవరి సామర్థ్యానికి తగ్గట్లుగా వారికి ఆ పరమాత్మ తత్వాన్ని అందజేస్తారు.

             ఇక మన శరీరంలో కూడా పంచ  ప్రాణవాయువులు, పంచ ఉపవాయువులు ఉండి వివిధ జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడుతున్నాయి. భగవద్గీతలో పరమాత్మ తానే స్వయంగా వైశ్వానరుడి రూపంలో అందరి ప్రాణులలో ఉండి ప్రాణ, అపాన వాయువుల సహాయంతో ఆహారాన్ని అరిగిస్తున్నానని శెలవిచ్చారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, ఇతర ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపమే. అందుకే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం పరోపకారం చేస్తూ ఉంటాయి. "జీవాధారము నీరము జీవాధారంబు గాలి చెలగుచు నుండున్ కావలసిన నవి యొక్కరి ఈవిని కోరకయె చిక్కునిలలో వేమా" అంటాడు వేమన. మరి ఏ ఖర్చూ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా లభించే ఈ ప్రకృతి వనరులను మనం ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి