పరమాత్మయైన శ్రీమన్నారాయణుడు తన అత్యున్నత స్థానం నుంచి దిగివచ్చి, అంటే అవతరించి వరాహరూపుడైనాడు. ఆ వరాహ స్వామి, ప్రకృతి స్వరూపిణియైన భూదేవి కలయిక ద్వారా జన్మించినవాడు నరకాసురుడు. ఇతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. అందరు అసురులలాగే యితడు కూడా అనేక అకృత్యాలు చేసి ఉంటాడు కానీ మనం ముఖ్యంగా చెప్పుకొనేవి రెండు - దేవమాత అదితి కర్ణకుండలాలు అపహరించడం, పదహారు వేలమంది స్త్రీలను బంధించడం. ఇతనికి ఉన్న వరం తన తల్లి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకపోవడం. ఆ వరానికనుగుణంగా మళ్ళీ ఆ భూదేవే సత్యభామగా అవతరించి శ్రీకృష్ణునితో కలిసి యుద్ధభూమికి వెళ్ళి ఆ నరకాసురుని వధించింది. అప్పుడు ప్రజలందరూ ఆనందంతో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇది స్థూలంగా దీపావళి కథ.
అయితే మనం కొంచెం లోతుగా విచారిస్తే ఇదంతా మనలోనే జరుగుతున్న కథే. తన ఉన్నత స్థితినుండి దిగివచ్చిన ఆత్మ ఎప్పుడైతే ప్రకృతిగతమైన దేహత్రయంతో కలిసిందో అప్పుడే మనకు ఈ దేహం నేననే 'దేహాత్మ భావన' జనించింది. అదే నరకాసురుడు. ఇక అంతటితో మన శరీరమే ప్రాగ్జ్యోతిష పురమైపోయింది. 'ప్రాక్' అంటే తూర్పు అని, అప్పటి మన దేశంలో తూర్పున మొదటిగా అస్సాంలో సూర్యుడు ఉదయిస్తాడు కనుక అదే ప్రాగ్జ్యోతిష పురమని చెబుతారు. అయితే 'ప్రాక్' అంటే పూర్వం అనే అర్థం కూడా ఉంది. అంటే ఎప్పుడైతే ఈ దేహాత్మ భావన మనలో ప్రవేశించిందో అప్పుడే మనలోని దివ్యజ్యోతి మసకబారిపోయిందన్నమాట. అందుకే అది 'పూర్వం జ్యోతి ఉన్న పురం' అయ్యింది.
'మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోని దివ్యజ్యోతి మసకేసిపోతున్నది' అని మనం పాడుకుంటాం. అయితే మనస్సుకి, హృదయానికి ఈ శత్రుత్వం ఎందుకు వస్తుంది? హృదయం ఎప్పుడూ సత్యాన్ని పలకమంటుంది. కానీ మనస్సు సత్యాన్ని పలికితే ఈ శరీరానికో, దాని పరువుకో, దానికి సంబంధించిన ఇతర వస్తువులకో హాని కలుగుతుందని అసత్యం చెబుతుంది. హృదయం శాంతిగా ఉండమంటుంది. మనస్సు ఉన్నవీ, లేనివీ ఊహించుకొని ఈ శరీరానికో, దానికి సంబంధించిన వారికో ఏదో హాని జరగబోతోందని అశాంతికి గురవుతూ ఉంటుంది. హృదయం ఎదుటివాడిపై దయ చూపించమంటుంది. మనస్సు కులమో, మతమో, జాతో, భాషో ఇలా ఏదో ఒక సాకు చూపించి, వాడు మనవాడు కాదు పొమ్మంటుంది. హృదయం నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అందరినీ అలాగే ప్రేమించు అంటుంది. మనస్సు నేను వేరు, వాడు వేరు అంటుంది. మనస్సు ఇలా ప్రవర్తించడానికి ముఖ్య కారణం ఈ దేహం నేననే దేహాత్మ భావనే కదా!
ఇక మనలో దైవీగుణాలు పెరిగి మనం దైవత్వాన్ని పొందాలంటే దానికి మూడు మెట్లు ఉన్నాయి - శ్రవణం, మననం, నిదిధ్యాస. ముందుగా గురువుల, పెద్దల ద్వారా వచ్చే మంచి మాటలను వినాలి. ఆ తరువాత వాటిని మాటిమాటికీ గుర్తు తెచ్చుకుంటూ ఆచరణలో పెట్టుకోవటం, అనుభవంలోకి తెచ్చుకోవటం. అయితే మనం సత్సంగంలో కూర్చుంటే మన మనస్సు అవతలివారు చెప్పేది విననివ్వకుండా వారి పూర్వ ప్రవర్తనలో, వారి గురించి మనం విన్న చెడ్డ మాటలో గుర్తుకుతెచ్చి ఇలాంటివాడు చెబితే మనం వినేదేంటి? అంటుంది. లేదా, నా అంతటివాడు ఒకళ్ళ మాట వినేదేంటి అనుకుంటుంది. ఒకవేళ ఇవన్నీ దాటి బుద్ధిగా కూర్చున్నా, ఒకవైపు వింటున్నట్లే నటిస్తూ ఇంకొకవైపు నిన్నటి జ్ఞాపకాలకో, రేపటి వ్యాపకాలకో మనను లాక్కుపోతూ ఉంటుంది. దీనికి కారణం దేహాత్మభావనే కదా! అదే నరకాసురుడు దేవతలకు జననియైన అదితి కర్ణకుండలాలను అపహరించడం - అంటే దేహాత్మభావన మనలోని దైవీగుణాలకు జననియైన శ్రవణాన్ని హరించటం. అందుకే 'సన్యస్య శ్రవణం కుర్యాత్' - సన్యసించి శ్రవణం చేయాలని పెద్దలు చెబుతారు. అంటే శ్రవణం చేయాలంటే ముందుగా సర్వ సంకల్పాలను, వాటికి కారణమైన దేహాత్మభావనను సన్యసించాలి.
ఇక స్త్రీ అనే శబ్దం స,త,ర అనే మూడు అక్షరాలతో కూడినది. అంటే సత్వ, తమో, రజో గుణాలతో కూడిన మనస్సే స్త్రీ అని పెద్దలు చెబుతారు. మన దేహంలో మనస్సు ఎక్కడ ఉంది అంటే ఏం చెబుతాం? శరీరమంతా వ్యాపించి ఉంది. నీ శరీరంలో ఎక్కడ తాకినా, నొప్పి కలిగినా నీ మనస్సుకు తెలుస్తోంది కదా. మన శరీరంలోని నాడీవ్యవస్థ ద్వారా మనస్సు శరీరమంతా వ్యాపించి ఉంది. ఈ నాడులు పదహారు వేలని పెద్దలు చెబుతారు. అవే నరకాసుడు బంధించిన పదహారు వేల స్త్రీలు. అయితే దేహాత్మభావనతో బంధనాన్ని పొందుతున్న ఈ మనస్సుకి విముక్తి కావాలంటే ముందుగా త్రిగుణాలను వదలి, సత్య వస్తువైన పరమాత్మను పట్టుకోవాలి. అదే మనకు పెద్దలు చిన్ముద్ర ద్వారా సూచించారు. అలా త్రిగుణాలను వదలి సత్యాన్ని పట్టుకున్నప్పుడు స్త్రీత్వం నుండి సత్యభామత్వానికి ఎదుగుతాం. అలా ఎదిగిన మనస్సు ద్వారా మాత్రమే దేహాత్మభావన అనే నరకాసురుని సంహారం సాధ్యం.
ఒక్కసారి ఈ దేహాత్మభావన నశిస్తే మనస్సుకు, హృదయానికి శత్రుత్వం అంతరించి మనలోని దివ్యజ్యోతి మళ్ళీ ప్రజ్వలిస్తుంది. అలా ప్రతి మానవుడు ఒక్కొక్క దివ్యజ్యోతిగా ప్రజ్వలించినప్పుడు అదే నిజమైన దీపావళి.
అహం మమోన్మత్త గజాంకుశాభ్యాం
గళత్సుధా సౌరభ సంతతాభ్యాం
నమోనమ శ్రీ గురు పాదుకాభ్యాం||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి