ఈ రోజుల్లో కరోనా ప్రతివారినీ భయపెడుతోంది. అయితే మనకు నేర్చుకోవాలనే కోరిక ఉండాలి కానీ ఈ కరోనా మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా నేర్పుతుంది. ఈ కరోనా అన్నది కంటితో చూడలేని చాలా సూక్ష్మ కణం. దానంతట దానికి స్వయంసత్తా లేదు. అయితే అది మన శరీరంలోని జీవకణాలతో కలిసిందంటే ఎన్నో లక్షల కోట్ల రెట్లుగా వృద్ధి చెంది మన జీవవ్యవస్థనే నిర్వీర్యం చేసేంత శక్తిని పొందుతుంది. మన మనస్సులో జనించే సంకల్పాలు, బయటి ప్రపంచం నుండి మనం పోగుచేసుకొనే విషయాదుల వాసనలు కూడా ఇలాంటివే. వాటికి విడిగా ఉనికి లేదు. కానీ ఒక్కసారి మన మనసులో చోటిచ్చామంటే ఇక అవి తామరతంపరగా వృద్ధిచెంది చివరికి మనలను మానసికంగా నిర్వీర్యం చేసేంత శక్తిని కూడా పొందుతాయి.
మరి ఈ కరోనా బారినుంచి తప్పించుకోవాలంటే
మూడు ముఖ్యమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. అందులో మొదటిది భౌతిక దూరం. అంటే సమాజంలోని
ఇతర వ్యక్తులనుంచి వీలైనంత దూరంగా ఉండటం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ‘అరతిర్జన సంసది’ – జన సమూహంలో ఉండాలనే ఆసక్తి లేకపోవడం, ఇంకా లోతుగా
వెళితే ప్రాపంచిక విషయాలయందు ఆసక్తి లేకపోవటం - జ్ఞానం యొక్క లక్షణాలలో ఒకటిగా నిర్వచించారు.
ఊరికే పదిమందితో కలవాలనుకోవటం, పోసుకోలు కబుర్లు చెప్పటం, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చేరవేయటం
– ఇవి అజ్ఞానుల లక్షణాలు. జ్ఞాని ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు కానీ ఈ బయటి విషయాలేవీ
ఆయనకు ఆసక్తిని కలిగించవు. ‘బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని
యస్సుఖం’ – యోగి బాహ్య స్పర్శలయందు నిరాసక్తుడై తనలో తాను నిత్యం
ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడని భగవద్గీత మనకు బోధిస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు మనకు
కరోనా ఆచరణ పూర్వకంగా చూపిస్తోంది.
ఇక
రెండవ నియమం జనసంపర్కం తప్పనప్పుడు మాస్కు ధరించడం. అంటే ఆ జనులనుండి వెలువడిన వైరస్
మనలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారాలైన ముక్కు, మూతి మూసుకుని ఉండటం అన్నమాట.
అలాగే ఆధ్యాత్మికంలో కూడా బయటి విషయాదులు మనలోకి ప్రవేశించే మార్గాలైన మన అయిదు జ్ఞానేంద్రియాలను
ఆయా విషయాలకు వ్యతిరేక దిశలో లోపలికి ముడుచుకోవటం చాలా ముఖ్య కర్తవ్యం. ‘యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీమ్ద్రియార్థేషు తస్య ప్రజ్ఞా
ప్రతిష్టితా’ – తాబేలు ఎలా అయితే శత్రువు అలికిడి వినపడగానే తన
ఇంద్రియాలన్నింటినీ తనలోనికి లాక్కుంటుందో అలా తన జ్ఞానేంద్రియాలను వాటి వాటి ఇంద్రియార్థాలైన
విషయాదులనుండి వెనుకకు ఉపసంహరిచుకో గలిగినవాడే స్థితప్రజ్ఞుడు అని గీతావాక్యం.
ఇక
ఈ రెండు నియమాలను ఎంత జాగ్రత్తగా పాటించినా ఏదో ఒక సందర్భంలో ఆ వైరస్ మన చేతులకు అంటుకునే
ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది కనుకనే మూడవ నియమంగా తరచూ చేతులను శుభ్రం చేసుకోమన్నారు.
అలాగే ఈ ప్రపంచంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఆయా విషయాదులు మన కంటపడక
మానవు. ఇక్కడ కన్ను అంటే కన్ను ఒక్కటే కాదు, ఇది అయిదు జ్ఞానేంద్రియాలకూ వర్తిస్తుంది. అయితే
ఆ విషయాలు మన మనసులో వాసనలలాగా అంటుకు పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన బుద్ధిని
ఉపయోగించి విచారణ ద్వారా వాటిని కడిగివేస్తూ ఉండాలి. కరోనాలాగే విషయాదులు కూడా చాలా
జిడ్డువి. ఒకసారి పట్టుకున్నాయంటే అంత తేలికగా వదిలిపెట్టవు. అందుకే మాటిమాటికి ఎక్కువసేపు
వాటిని విచారణ అనే సబ్బుతోనూ, ధ్యానాగ్ని అనే తీక్షణమైన సానిటైజర్
తోనూ క్షాళన చేసుకుంటూ ఉండవలసిందే.
కరోనా వచ్చిన క్రొత్తలో దాని గురించి
జనాలలో అవగాహన పెంచటానికి, దాని నుండి రక్షణ కొరకు వారు సామగ్రిని సమకూర్చుకోవటానికి
తగిన సమయం పొందటం కొరకు lockdown కొంతవరకు ఉపయోగపడింది. అయితే
అది శాశ్వత పరిష్కారం కాదు. మానవుడు సంఘజీవి. సమాజానికి దూరంగా ఒంటరిగా బ్రతకటం ఎక్కువకాలం
సాధ్యం కాదు. అందుకే ఒక అవగాహన, సాధన సామగ్రి ఏర్పడిన తరువాత
ఇప్పుడు ఆ lockdown ఎత్తివేసి ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తూ
సాధారణ జీవితం గడపమంటున్నారు. శ్రీ కాళీ వనాశ్రమం ఏర్పడిన క్రొత్తలో ఇలాగే ఇంచుమించు
lockdown పరిస్థితే ఉండేది. ఒకసారి ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకున్న
తరువాత ఎవరు ఏ పనిమీద బయటకు వెళ్ళాలన్నా శ్రీ గురుదేవుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి.
తీరా వారి వద్దకు వెళితే ‘ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా? నువ్వు వెళ్ళకపోతే అక్కడ పనులు ఆగిపోతాయా? నువ్వు వెళ్ళి
నీ బంధువులనూ, బిడ్డలనూ ఆపదలనుండి, రోగాలనుండి
రక్షించగలవా? అదే నువ్వు ఇక్కడ ఉండి చక్కగా సాధన చేసుకుంటే వారి
రక్షణ భారం భగవంతుడు తప్పక వహిస్తాడు’ అంటూ శ్రీ గురుబోధ వారిలో
సరియైన విచారణను మేల్కొలిపేది. అలా కొంతకాలం ఆశ్రమవాసులందరికీ శిక్షణ ఇచ్చిన తరువాత
ఇక నిర్ణయాన్ని వారి వారి విచక్షణకే వదిలివేశారు. వరి పంట కోసిన తరువాత ఆ ధాన్యాన్ని
రైతు తూర్పారబడతాడు. అందులో గట్టి గింజలు రైతు పాదాల దగ్గరే పడి ఉంటాయి. తాలు గింజలు
గాలికి కొట్టుకుపోతాయి. అలాగే సాధనలో గట్టి గింజలైనవారు ఎన్ని అవాంతరాలు, ఆకర్షణలు వచ్చినా లొంగక ఆశ్రమాన్నే ఆశ్రయించుకొని గురుపాద సన్నిధిలో తమ జన్మలను
చరితార్థం చేసుకున్నారు.
కరోనా ఇతరులనుండి మనకు అంటుకోకుండా చూసుకోవటం ఎంత ముఖ్యమో మననుండి ఇతరులకు
వ్యాపించకుండా చూసుకోవటమూ అంతే ముఖ్యం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్
వచ్చినా అది వారిపై ఎటువంటి ప్రభావమూ చూపదు. కానీ అది వారినుండి ఇతరులకు వ్యాపించే
అవకాశాలు తప్పక ఉంటాయి. ఇది వారికి తెలియకుండానే జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి
ఎక్కువగా ఉన్నవారిపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపకపోవచ్చు. కానీ వారు కూడా తాము మాట్లాడే
ప్రతి మాటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అవి ఇతరులపై దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి.
ఉదాహరణకు మార్కెట్లో క్రొత్త ఐఫోన్ వచ్చిందనే విషయం మీరు విని దానిని చాలా తేలికగా
తీసుకుని ఉండవచ్చు, కానీ అదే వార్తను మీరు నలుగురితో పంచుకున్నప్పుడు
అందులో ఒకరికి ఆ వార్త ఆ ఫోనును పొందాలనే తీవ్రమైన వాంఛను కలిగించి మానసిక అశాంతతకు
దారి తీయవచ్చు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎంతవరకు అవసరమో, అది అవతలివారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో గమనించుకుంటూ ఉండాలి. రోగం వచ్చినా
రాకున్నా ప్రతివారూ మాస్కులు ధరించాలనే నియమంతో కరోనా మనకు బోధించే పాఠం ఇదే.
కరోనా ఆధ్యాత్మిక ఆటంకాలు పోలికతో మంచి వ్యాసం అందించారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు🙏
తొలగించండి🤔🤔🤔👌👌👌👏👏👏👍👍👍👍
రిప్లయితొలగించండి🙏🙏🙏
తొలగించండిvery enlightening indeed. Jai Jai Gurudev Samarth
రిప్లయితొలగించండి🙏🙏🙏
తొలగించండి