19, ఫిబ్రవరి 2020, బుధవారం

శత్రులు మిత్రులౌట

కమలములు నీట బాసిన 
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ 
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

కమలములు నీళ్లలో ఉన్నంతకాలం సూర్యుడు వాటికి మిత్రుడే. ఆయన ప్రకాశం సోకినకొద్దీ అవి మరింతగా విప్పారుతాయి. కానీ అవే పద్మాలు నీటినుండి బయటకు రాగానే ఆ సూర్యుని వేడికే కమిలిపోతాయి. అలాగే ఎవరు ఉండవలసిన స్థానంలో వారు ఉన్నప్పుడే మిత్రత్వం వర్ధిల్లుతుంది కానీ ఆ నెలవులు తప్పితే మిత్రులే శత్రువులుగా మారిపోతారని బద్దెనవారు వివరిస్తున్నారు. అలాగే మొసలి బలం గురించి చెబుతూ వేమన కూడా 'స్థానబలిమి కాని తన బలిమి కాదయా' అంటాడు. వారి వారి స్థానాలు మారేసరికి మిత్రత్వాలు, బంధుత్వాలూ కూడా ఎలా మారిపోతున్నాయో ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం.

మరి మనకు కూడా ఆరుగురు శత్రువులు ఉన్నారు కదా! వాళ్ళే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటినే అంతశ్శత్రువులు అంటారు. బయటివాళ్ళెవరో మనకు శత్రువులుగా ఉండి మనను నాశనం చేయాలని చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మనలోనే ఉన్న ఈ గుణాలు మనల్ని నాశనం చేయాలని చూడటం కొంచెం విచిత్రమే. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవటంలా అనిపిస్తుంది. అయితే మరి వీటికి మనతో శత్రుత్వం ఎందుకొచ్చింది? అది పోయి మిత్రత్వం కలగాలంటే ఏమి చేయాలో చూద్దాం. 

పైన చెప్పుకున్నట్లుగా మన స్థానాన్ని మనం విడిచిపెట్టడమే మిత్రులుగా ఉండవలసిన వాళ్ళు శత్రువులుగా మారటానికి కారణం. మన అసలు స్థానం ఏది? భగవంతుడే మనందరికీ నెలవు. ఆయనను విడిచిపెట్టడం వల్లనే మన స్థానబలం తగ్గి మనలోనే ఉన్న గుణాలు మనకు శత్రువులుగా మారడం, మనం వాటిని మన బలంతో జయించలేకపోవడం జరుగుతోంది. ఈ శత్రువులు మళ్ళీ మనకు మిత్రులుగా మారాలంటే మన స్థానానికి మనం చేరుకోవాలి, లేదా కనీసం ఆ దిశగా ప్రయాణం అయినా ప్రారంభించాలి. అప్పుడు మెల్లమెల్లగా ఆయా గుణాలు తమ శత్రుత్వాన్ని వదలి మనకు మిత్రులుగా మారిపోతాయి. కామక్రోధాది అరిషడ్వర్గం శమాది షట్కసంపత్తిగా మారిపోతుంది. అదెలాగో చూద్దాం.

కామం - మనకు దేనిమీదైనా కోరిక కలిగిందంటే ఇక అది తీరేవరకూ మనం ఏపని చేస్తున్నా ఆ వస్తువే మన ఆలోచనలలో మెదులుతూ ఉంటుంది. అది ఒక వస్తువైనా, సుఖమైనా, లేదా వ్యక్తి అయినా, మనకు ఆ కోరుకున్నది లభించేవరకు మనఃశాంతి ఉండదు. నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అదే మనం ఈ కామాన్ని భగవంతునివైపు మరల్చుకున్నామనుకోండి, అప్పుడు నిరంతరం ఆయన ధ్యాసే ఉంటుంది. శరీరం ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం నిరంతరంగా ఆ పరమాత్మతోనే రమిస్తూ ఉంటుంది. అదే ఉపరతి

క్రోధం - మనం కోరుకున్నది మనకు దక్కకపోయినా, లేదా మనం అనుకున్నట్లుగా జరగకపోయినా/ఎదుటివాళ్ళు ప్రవర్తించకపోయినా మనకు క్రోధం వస్తుంది. అయితే మనస్సుని భగవంతునివైపు మరల్చినప్పుడు ఈ క్రోధం ఎదుటివారిపై కాక మన ఆధ్యాత్మిక సాధనకు అడ్డువచ్చే మన ఇంద్రియాలు, గుణాలపైకి మరలుతుంది. అప్పుడే ఇంద్రియనిగ్రహం సాధించగలుగుతాం. ఆ బాహ్యేంద్రియ నిగ్రహమే దమము.

లోభం - లోభియైనవాడు తనకున్నదానిని ఎవరికీ పెట్టలేడు, తానూ అనుభవించలేడు. చేసే ప్రతి పనిలోనూ పిసినారితనం చూపిస్తూ ఏదో తప్పనిసరిగా చేస్తాడు తప్పితే అందులో ఆసక్తి  ఉండదు. మరి యితడు తన మనస్సును భగవంతునిపై లగ్నం చేసి ఆయన ప్రేమను కొద్దిగానైనా చూరగొన్ననాడు ఆ భగవంతునికి తాను చేసే సేవలన్నింటిలోనూ ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఇష్టంగా చేయటం తనకు తెలియకుండానే అలవాటు చేసుకుంటాడు.

మోహం  -  మోహమనే శత్రువుకు లోబడినవాడు తన భార్యాపిల్లలు కానీ, లేదా తనకు ఇష్టమైన ఏ వస్తువైనా కానీ ఒక్క క్షణం దూరమైనా తాను బ్రతకలేనట్లు ప్రవర్తిస్తాడు. అలాగే తాను లేకుండా తనవాళ్ళు బ్రతకలేరనీ భావిస్తాడు. అయితే ఈ మోహాన్ని మోహనాకారుడైన పరమాత్మ మీదకు మరల్చుకున్నవాడు చివరకు ఆ పరమాత్మ ఒక్కడే సత్యమని, ఈ జగత్తులో తక్కినవన్నీ జనించి గతించిపోయేవేనన్న నిజాన్ని గుర్తించి ఆ పరమేశ్వర ప్రసాదంగా ఎప్పటికప్పుడు తనకు ఇతర వ్యక్తులతో లేదా వస్తువులతో కలిగిన సంగమాన్ని, వియోగాన్ని కూడా సమదృష్టితో చూస్తూ ఎక్కడికక్కడ సమాధానపడతాడు.

మదం - మదం బాగా తలకెక్కినవాడు నా అంతవాడు లేడని విర్రవీగుతూ, ప్రతివారినీ అవమానిస్తూ, తన బలహీనతల గురించి అవతలివారు నిజం చెప్పినా అది తనకు ఘోర అవమానంగా భావిస్తూ, ప్రతీకారాగ్నిలో రగిలిపోతూ ఉంటాడు. కానీ యితడు పరమాత్మయొక్క అనంత శక్తిని గుర్తించి తననూ, ఈ సమస్త ప్రపంచాన్నీ నడిపించేది ఆ పరమాత్మే అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎఱిగిననాడు ఆ మదమే మానావమానాలను సమదృష్టితో స్వీకరించగలిగే తితీక్షగా మారిపోతుంది.

మాత్సర్యం - మాత్సర్యం అనే దుర్గుణం కలిగినవాడు ఎప్పుడూ ఎదుటివ్యక్తి అభివృద్ధిని చూసి అసూయ చెందుతూ, మనసులో ఆ వ్యక్తి పతనాన్ని కాంక్షిస్తూ, బుద్ధితో అతని నాశనానికి ప్రణాళికలు రచిస్తూ, చిత్తంతో ఆ వ్యక్తి ఇంతకుముందు ఎప్పుడో చేసిన తప్పులన్నింటినీ నెమరువేసుకుంటూ, అహంకారంతో ఆ వ్యక్తికి హానికలిగేలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే వ్యక్తి తన హృదయంలో భగవంతుని నింపుకున్నప్పుడు ఆ భగవంతునే సర్వ జీవకోటిలో దర్శిస్తూ, తన మనో బుద్ధి చిత్త అహంకారాలతో సదా సర్వులయొక్క అభివృద్ధినే కాంక్షిస్తూ తనకై ఏమీ ఆశించకుండా, ఎటువంటి మానసిక ప్రలోభాలకు లొంగకుండా ఉంటాడు. అటువంటి అంతరేంద్రియ నిగ్రహమే శమము.

మనకంటే బలవంతులెవరో మన ఆస్తిని ఆక్రమించారనుకోండి, మనం వారికంటే బలవంతులైనవారిని ఆశ్రయించి మన ఆస్తిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం కదా! అలాగే మన మనస్సును ఆక్రమించిన శత్రువులను చూస్తూ సినిమా పాటలో శాస్త్రిగారు అన్నట్టు 'మనసుమీద వయసుకున్న అదుపు చెప్పతరమా?' అనుకుంటూ ఊరుకోకుండా ఆ మనస్సును అంతకంటే బలవంతుడైన భగవంతుని అదుపులోకి అర్పించగలిగితే ఆ స్థానబలంతో ఆ శత్రువులందరూ మనకు మిత్రులుగా మారిపోయి మన సాధన పురోగతి చెందటానికి ఎంతగానో సహకరిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి